మన హక్కులే .. మన భవిష్యత్తు !

Dec 8,2024 11:17

భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు హక్కులుంటాయని రాజ్యాంగం చెబుతుంది. రాజ్యాంగాన్ని, చట్టాలను అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ‘మన పోరాటం డబ్బుకోసం కాదు.. అధికారం కోసం కాదు.. స్వేచ్ఛ, సమానత్వ పునరుద్ధరణలే మన లక్ష్యాలు’ అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చెప్పిన మాట. కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను పాలకులు గౌరవించడం లేదు. సమాజంలో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో, మానవ హక్కుల అభివృద్ధికి కృషి జరుగుతుంది. ఈ ఏడాది ‘మన హక్కులే-మన భవిష్యత్తు’ అనే లక్ష్యంతో ముందుకెళుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం…

మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్క ృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర, రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్‌ 10న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి భావ ప్రకటనా స్వేచ్ఛ లేదంటే- నిజంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందా? లేదా? అని సందేహం రాకమానదు. అందరికీ సమాన హక్కులు కల్పించాలని రాసుకున్న రాజ్యాంగాన్ని పాలకులు అనుసరించడంలేదని స్పష్టమవుతుంది. ఇలా ఎందుకు? ఏంటీ? అని ప్రశ్నించిన సామాన్య పౌరులపై కేసు నమోదు చేసి, జైల్లో పెడుతున్నారు. అందుకు ఉదాహరణ బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టు అయిన ప్రొఫెసర్‌ సాయిబాబా జీవితం. ఉపా చట్టం కింద అరెస్టయిన ఆయన 90 శాతం అంగవైకల్యంతో వీల్‌ఛైర్‌లోనే ఉండే స్థితి. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల కేంద్రం అమానవీయంగా వ్యవహరించింది. ఆయనకి జైలులో ఖైదీలకు కల్పించాల్సిన కనీస హక్కులనూ నిరాకరించింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై, విడుదలైన ఐదు నెలలకే మృతి చెందారు. ఇటువంటి నేపథ్యంలో కనీస హక్కుల కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన బాధ్యత ఉంది.

చరిత్రే స్ఫూర్తి..
ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ ఈ అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన వర్తిస్తుంది. క్రీ.శ. 1215లో ఇంగ్లండ్‌ అప్పటి రాజు జాన్‌ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన చేశారు. ‘న్యాయబద్ధమైన తీర్పు ద్వారా తప్ప, మరేవిధమైన పద్ధతులలోనూ పౌరుల స్వేచ్ఛను బందీ చేయడం-బహిష్కరించడం నిషేధం” అంటూ మాగ్నా కార్టా స్పష్టం చేసింది. ప్రపంచ విప్లవాలకు ఇది నాందీ ప్రస్థావన.
ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్‌ 10వ తేదీన ఏర్పడిన సర్వసభ్య సమావేశంలోనే ”అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం” తీర్మానం రూపొందించింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులన్నీ దీని నుంచి రూపొందినవే. ఈ స్ఫూర్తితోనే వివిధ దేశాలలో ‘మానవ హక్కుల కమిషన్‌’ లు ఏర్పడ్డాయి. వీటికి పౌరుల పట్ల రాజ్యం, వ్యక్తులు సాగిస్తున్న అణచివేతను ప్రశ్నించి, శిక్షించే అధికారం ఉంటుంది. మానవ హక్కుల కమిషన్‌లు ఇచ్చే తీర్పులు, ఆయా ప్రభుత్వాలు పాటించవలసి ఉంది. కానీ ప్రయివేటు వ్యక్తులకు ఒకలా, సామాన్య జనం పట్ల మరోలా అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలే సమానహక్కుల పట్ల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి.

సామాన్యుల హక్కుల అమలేదీ ?
సామాన్య ప్రజలంతా రోజువారీ కూలి పనులకు వెళ్లేవాళ్లే. ఆ వచ్చే డబ్బులతోనే తిండిగింజలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు. అటువంటివారిపై కొత్తగా స్మార్ట్‌మీటర్ల పేరుతో అదనపు విద్యుత్‌ఛార్జీలు మోయలేని భారాలుగా మారాయి. ఈ క్రమంలో ‘ఈ ఛార్జీలు ఏంటీ?.. చెల్లించలేము’ అని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. కానీ కార్పొరేట్ల కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలు నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛను హరిస్తున్నాయి. నేటికీ ఈ నిరంకుశ పాలకులకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం పన్నులు తగ్గిస్తారు. కానీ సామాన్యులపై భారాలు మాత్రం మోపుతున్నారు. అసమానతలు లేకుండా చేయడమనేది మానవ హక్కులను అభివృద్ధి చేయడమే.
దేశంలో 1993లో రూపొందిన మానవహక్కుల పరిరక్షణ చట్టం 1994, జనవరి 8 నుండి అమలులోకి వచ్చింది. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్ర స్థాయిలోనూ మానవ హక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేయాలని సూచించినా, దేశంలో నేటికీ కొన్ని రాష్ట్రాలకు మానవ హక్కుల కమిషన్‌లు లేవు. జాతీయ మానవహక్కుల కమిషన్‌లు స్వయంగా విచారణ జరిపించేందుకు ఓ వ్యవస్థ ఉండాలి. కానీ చాలాచోట్ల ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే అధికారంలో ఉన్న అధికారులతో విచారణ జరిపించడంతో బాధితులకు న్యాయం జరగడంలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
రాజ్యాంగ హక్కులనూ, అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘిస్తూ పోలీసు అధికారులు ప్రజలతో అమానుషంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్‌ కస్టడీలో జరుగుతున్న మరణాల పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చేసిన మార్గదర్శక సూత్రాలను ఏమాత్రం పాటించడంలేదు. అక్రమ కేసులు బనాయించడం, అక్రమంగా నిర్బంధించడం, మానవ హక్కుల ఉల్లంఘనలో భాగమే. అందుకే సామాన్యులకు న్యాయం జరగాలంటే కనీసం అన్ని రాష్ట్రాలకూ మానవహక్కుల కమిషన్‌లు ఏర్పాటు చేయాలి.

వివక్ష లేకుండా..
సమాజంలోని కొందరి ఆధిక్యతా వాదమే- బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషాపరమైన అమానుషాలకు కారణమవుతోంది. 1857లో ‘డ్రెడ్‌ స్కాట్‌ వర్సెస్‌ శాండ్‌ ఫోర్డ్‌’ కేసులో అమెరికా సుప్రీంకోర్టు అక్కడి నల్లజాతీయులు దేశ పౌరులుకారని తీర్పు చెప్పిందంటే- జాత్యహంకారం ఎంతగా జీర్ణించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. తరవాత 1886లో అదే కోర్టు అమెరికా కంపెనీలకు దేశ పౌరసత్వం కల్పించింది. అమెరికాలో నల్లజాతి వారికన్నా ముందుగా కంపెనీలకు పౌరసత్వ హక్కులు లభించాయి. మనుషుల కన్నా కంపెనీలే ప్రాధాన్యమనే ఆ తీర్పు దారుణమైనది.
ఇటువంటి దురాగతాలను నివారించడానికి ఐరాస మానవహక్కుల ప్రకటన ‘మనుషులంతా సమానులే’నని ఉద్ఘాటించింది. మానవ హక్కులు ప్రాథమిక హక్కులే. వాటిని ఎవరూ హరించలేరు. ఈ ప్రకటన ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవించాలి. ‘జాతి, మత, రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ప్రజలు ఇబ్బందులకు గురి కారాదు’ అని ప్రపంచానికి చాటి చెప్పింది.
మానవహక్కులు ప్రోత్సహించడానికి, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి బలమైన స్వతంత్ర పౌర సమాజాన్ని మనమే తయారుచేసుకోవాలి. అందుకు నిరంతర అప్రమత్తతో మానవహక్కులు, వాటి పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి. మన కనీస అవసరాల కోసం, హక్కుల కోసం భయం వదిలి, భవిష్యత్తు పట్ల ఆశావాదంగా అడుగులు వేయాలి. భవిష్యత్తు బాగుండాలంటే మానవ హక్కుల సాధనే మన ముందున్న కర్తవ్యం. ఇదే 76 సంవత్సరాల అంతర్జాతీయ మానవ హక్కుల లక్ష్యం.

మహిళలపై హింస..

మనదేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులను పొందడం, దానికోసం పోరాడటం అనేది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ఇందులో ‘మానవ హక్కుల’ కోసం పోరాడటం అనేది కీలకమైంది. అయితే మైనారిటీల, మహిళల, పిల్లల ప్రయోజనాలను, సమానత్వాన్ని పొందడం ప్రతి ఒక్కరి హక్కు. ఇందుకోసం అనేక చట్టాలు రూపొందాయి. కానీ పాలకులు వాటిని సరిగ్గా అమలుచేయడం లేదు. ఫలితంగా ప్రతి నిమిషానికి ముగ్గురు మహిళలు వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. స్కూలు, కాలేజీలకు వెళుతున్న విద్యార్థులపై ప్రేమ పేరిట హింస చెలరేగుతోంది. ఒంటరిగా ఉంటున్న మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకు కారణం అమ్మాయిలే అని, వారు వేసుకునే దుస్తులే కారణమని కొంతమంది నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి ఊయ్యాలలో ఊగే పసిబిడ్డని సైతం కామాంధులు వదలడం లేదు. ఈ క్రమంలో మహిళలకు రక్షణ హక్కు చట్టం అమలు చేయాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలదే.

ప్రధాన లక్ష్యాలు..
జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి.
చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడడం.
వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం.
నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి.
స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి.
సురక్షిత ప్రాంతాలలో జీవించే హక్కు ఉండాలి.
బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి.
విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి.
భావప్రకటన, స్వాతంత్య్రపు హక్కు ఉండాలి.
ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి.

ఇలాంటివాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినపుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి.

– పద్మావతి
9490559477

➡️