పిల్లల్ని కొట్టకండి..!

Feb 11,2024 06:25 #Children, #Parenting, #Sneha
parenting guidelines dont agree

Pareపిల్లల్ని కొందరు తల్లిదండ్రులు చీటికీమాటికీ చెయ్యి చేసుకుంటుంటారు. ఇది సరైనది కాదంటున్నారు మనస్తత్వ నిపుణులు. అలా చేయడం వల్ల పిల్లల్లో మానసిక కుంగుబాటు వస్తుందని, మరికొందరిలో ప్రవర్తనాపరమైన లోపాలు వస్తాయనీ హెచ్చరిస్తున్నారు. ఇది తల్లిదండ్రుల వైఫల్యమే అంటున్నారు నిపుణులు. అయితే ఒక్క క్షణం ఆలోచించినా, ఒక్కసారి కొట్టిన తర్వాత పునరాలోచన చేసుకున్నా ఇలాంటివి పునరావృతం కావనేది వారి మాట.

పిల్లలన్నాక పేచీలు పెట్టకుండా ఉండరు. అలా పేచీలు పెట్టినప్పుడు ఎక్కువమంది తల్లిదండ్రులు వీపు విమానంమోత మోగించేస్తారు. వాళ్లు ఎందుకు పేచీ పెడుతున్నారో కొంచెం కూడా ఆలోచించరు. వాళ్లని సముదాయించడానికి ప్రయత్నించరు. అలా చేస్తే మరింత మొండికేస్తారని వారి భావన. కానీ పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని, కారణం తెలుసుకోవాలి. వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అలా నచ్చజెప్పలేక చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని విపరీతంగా కొడుతున్నారు. ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లలకు నచ్చజెప్పడం పెద్దలు చేయాల్సిన బాధ్యతాయుతమైన విషయం. అంతేకాకుండా పిల్లల్ని కొట్టడం వల్లే మొండితనం అలవడుతుందంటున్నారు.

ఇంటి సమస్యలు..

కుటుంబం అన్నాక బోలెడు సమస్యలు. సంసారమనేది ఒక సముద్రం లాంటిది. జీవితాన్ని ఈదమనే మాటలు అందుకే అనేది. అయితే కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు బాధితులు పిల్లలే. పెద్దల మధ్య సమస్య పిల్లల మీద ప్రదర్శితమవుతుంది. చిన్న చిన్న విషయాలకే పిల్లల్ని చావబాదేస్తుంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పని అనేది నిపుణులు చెప్తున్న మాట. అమ్మ ఎందుకు కొట్టిందో అర్థంకాని చిన్నారి బిక్కమొఖం వేస్తుంది. నాన్న ఎందుకు కొడుతున్నాడో తెలియక తల్లడిల్లిపోతాడు చింటూగాడు. ఇవన్నీ కొన్ని కుటుంబాల్లో సర్వసాధారణంగా జరిగిపోతుంటాయి. కానీ వీటి ప్రభావం పిల్లల మీద ఎంత ప్రతికూలంగా ఉంటుందనేది అర్థంకాదు. పిల్లల్లో హింసా ప్రవృత్తికి దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు.

చదువు విషయంలో..

తల్లిదండ్రులు పిల్లల్ని బోలెడన్ని డబ్బులు పోసి కార్పొరేట్‌ స్కూల్స్‌లో చదివిస్తుంటారు. అందుకు తగ్గ ర్యాంకు రాకపోతే ఆ పిల్లవాడినో / పిల్లనో గొడ్డును బాదినట్లు బాదేస్తుంటారు. పిల్లలు పోగ్రెస్‌ రిపోర్టు తీసుకుని తల్లిదండ్రుల ముందు నిలుచోవాలంటే భయపడిపోతారు. ఎంతగా అంటే నాన్న ఇంట్లో లేకపోతే బాగుండు. అమ్మతో సంతకం చేయించుకుందామనీ.. లేకపోతే ఫోర్జరీ పోగ్రెస్‌ రిపోర్టులు తయారుచేసేంత ముదుర్లుగా మారిపోతారు. దీనికంతటికీ బాధ్యులు తల్లిదండ్రులే అనేది నిపుణులు చెప్తున్న మాట. పిల్లల్ని చదివిస్తున్నామంటే వాళ్లని విజ్ఞానవంతుల్ని చేయడం. మనం అజ్ఞానంగా వ్యవహరించడం వల్ల వాళ్లు నేరస్థులుగా తయారువుతున్నారు. పిల్లల చదువులో వెనుకబాటుకు అసలు కారణాలు తెలుసుకుని, అవి సరిజేయాల్సింది తల్లిదండ్రులే అంటున్నారు నిపుణులు.

  • తినేటప్పుడు..

పిల్లలు తినే విషయంలో ప్రధానంగా ఎక్కువ పేచీలు పెడుతుంటారు. కూర నచ్చకో, టిఫిన్‌ నచ్చకో.. ఇంకేదో ఇష్టమైన ఐటెమ్‌ కావాలనో వారి పేచీ. సహజంగా పిల్లలకు ఇష్టంగా తినేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాకాకుండా పెట్టింది తినాల్సిందేనని హుకుం జారీ చేస్తారు. అంతేకాదు కొందరు తల్లిదండ్రులు కర్ర చేతిలో పట్టుకుని మరీ తినిపిస్తారు. లేకపోతే ఒకటి పీకి నోట్లో ముద్దలు కుక్కుతారు. ఆ పిల్లాడు / పిల్ల ఆ అన్నం తినలేక.. కొట్టినందుకు వస్తున్న ఏడుపు ఆపుకోలేక.. అపిరితిపిరి అయిపోయి.. ఒక్కోసారి ఊపిరి పట్టేస్తుంది. ఇది ఒక్కోసారి ప్రాణం మీదకు తెస్తుంది. ఇలాంటి పరిణామాలు రాకుండా పిల్లలు ఇష్టంతో తినేలా నచ్చేవి వండి పెట్టాలనేది నిపుణుల సూచన.

పిల్లలు మొగ్గల్లాంటివారు. వారిని వికసింపజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సమాజానిదే. అలాకాకుండా పిల్లల్ని వికసించనివ్వకుండా మొగ్గులుగానే వసివాడే చర్యలకు ఎవరూ పాల్పడకూడదు. పిల్లలు బంకమట్టిలాంటివారు. వారిని ఎటు కావాలంటే అటు మలచడం పెద్దలపనే. అందుకు తగ్గట్టు మారాల్సింది తల్లిదండ్రులే అనేది నిపుణుల సూచన.

➡️