గుడిలొవున్నా విగ్రహమునూ
అడిగినది ముందున్న మెట్లూ
ఓయి మిత్రమా! నీవు నేనూ
ఒకే కొండలొ రాళ్లమేగా!!
”నిన్ను అందరు మొక్కుతారూ
నన్ను అందరు తొక్కుతారూ!
నీవు చేసిన పుణ్యమేమిటి?
నేను చేసిన పాపమేమిటి??”
అందులకు ఆ విగ్రహమ్మూ
అన్నదిట్టుల మెట్టుతోనూ
”కచ్చితముగా ఒకే కొండలొ
తెచ్చినాడూ శిల్పిమనలను!!
మొట్టమొదటగ సుత్తెతోటీ
మొదినాడూ శిల్పినిన్నూ!
మొదటి దెబ్బ సహించలేకా
ముక్కలైతివి చెక్కలైతివి!!
వేల దెబ్బలు శిల్పి నాపై
వేసినాడూ సుత్తె తోటీ!
నిగ్రహమతొ సహించి నేనూ
విగ్రహముగా తాయారైతిని!!
దేవళంలో ప్రతిష్టించగ
దేవతగ మొక్కేరు నన్నూ!
వట్టిరాయని విసిరి వేయగ
మెట్టుగా తొక్కేరు నిన్నూ!!
సహనముంటే ఎవరికైనా
సాధ్యమౌతుందే పనైనా
సహనమన్నది లెకపోతే
సాధ్యపడదది బ్రహ్మరాతే!!
‘బాలబంధు’అలపర్తి వెంకటసుబ్బారావు
కేంద్ర సాహిత్య అకాడమీ
బాలసాహిత్య పురస్కార గ్రహీత
9440805001