ప్రాచీన గ్రీకు పురాణాల ప్రకారం ఫీనిక్స్ అనేది పునర్జీవితాన్ని పొందగలిగే ఒక కాల్పనిక పక్షి. సూర్యునితో సన్నిహిత సంబంధం వున్న ఈ పక్షి.. తన పూర్వీకుల బూడిద నుంచి కొత్త జీవితాన్ని పొందుతుందని చెబుతుంటారు. అదెంత నిజమో తెలియదు కానీ, ఉత్తరప్రదేశ్‌లోని తెరాయ్ ప్రాంతంలోని ఒక మొక్క జాతి నిజ జీవిత ఫీనిక్స్. ఇది అడవి మంటల బూడిద నుంచి ఉద్భవిస్తుంది. ‘కరెంట్ సైన్స్’ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. అడవి మంటలు అన్ని వృక్ష సంపదలను పూర్తిగా కాల్చి వేసిన తర్వాత వికసించే ఎరిథ్రినా రెసుపినాటా అనే మొక్క గురించి వివరించారు. ఎరిథ్రినా రెసుపినాటా అనే పుష్పించే మొక్క.. సాధారణంగా గడ్డిభూముల్లో కనిపిస్తుంది. ఇది హిమాలయాల దిగువనున్న లోతట్టు ప్రాంతమైన తెరారు ప్రాంతంలో అడవి అగ్ని సీజన్ చుట్టూ తిరిగే ఒక ప్రత్యేకమైన జీవిత చక్రాన్ని కలిగి వుంటుంది. అడవుల్లో సంభవించే మంటలు అన్ని వృక్షాలను కాల్చివేసిన తర్వాత, ఆ బూడిద నుంచి ఎరిథ్రినా రెసుపినాటా యొక్క చిన్న ఎరుపు పువ్వులు వికసిస్తాయి.
వాస్తవానికి అడవి మంటలు అన్ని మొక్కలను నాశనం చేస్తాయని అనుకుంటాం. కానీ ఇది వికసించడానికి, పెరగడానికి అగ్ని అవసరమయ్యే ఒక ప్రత్యేకమైన మొక్క. డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్‌కుమార్ వర్మ బృందం ఏప్రిల్, 2023లో ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో వికసించిన ఈ మొక్కను కనుగొన్నట్లు ‘ది ప్రింట్’ కు తెలిపారు. మంటలు ఎల్లప్పుడూ వినాశకరమైనవి కాదని, కొన్ని ప్రాంతాలకు ముఖ్యమైనవని ఇది చూపిస్తున్నదని అన్నారు.
ఎరిథ్రినా రెసుపినాటాను మొదట 1800 ప్రారంభంలో భారతీయ వృక్ష శాస్త్రవేత్త విలియం రాక్స్‌బర్గ్ కనుగొన్నారు. ఇది చాలా కాలం క్రితం కనుగొనబడినప్పటికీ, ఈ మొక్క గురించి చాలా తక్కువగా తెలుసు. పిలిభిత్‌లో మొదటిసారిగా చూసిన వాటిలో ఈ మొక్క ఒకటి. ఇది ప్రపంచ వ్యాప్తంగా 16 ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ మొక్క అరుదుగా కనిపించడానికి కారణం.. ఇది అంతరించిపోతున్న జాతి కావడమే. దీని కథ సహజ పర్యావరణ వ్యవస్థల సంక్లిష్టతలకు, వాటిని నిర్వహించడానికి వివిధ జాతులు ఎలా సంఘర్షణ చెందుతాయో వివరిస్తుంది.
ఉత్తరప్రదేశ్, నేపాల్‌లోని తెరాయి ప్రాంతంలోని గడ్డి మైదానాలు శీతాకాలం ముగిసిన తర్వాత మంటలకు గురవుతాయి. తెరాయి ప్రాంతంలో దాదాపు 99 శాతం మంటలు – సహజమైనవిగాను, మనుషుల వల్ల సంభవించేవిగాను వుంటాయి. సాధారణంగా ఈ మంటలు జనవరి, మే మధ్య సంభవిస్తాయి. ఈ సమయంలో ఎండిపోయిన వృక్షసంపద కాలిపోతుంది.. కొత్త మొక్కల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. అయితే పచ్చిక భూముల భౌగోళిక స్వరూపం పర్యావరణానికి మంటలు అవసరమయ్యే విధంగా వుంటుంది. తద్వారా ఈ మంటలు కొన్ని మొక్కలను నాశనం చేస్తాయి.. కొత్త వాటికి జన్మనిస్తాయి.
ఎరిథ్రినా రెసుపినాటా అనేది దాదాపు 40 లక్షల సంవత్సరాల పాటు సవన్నాలలో జరిగిన అటవీ మంటలను తట్టుకుని, మంటల నుండి ప్రాణం పోసుకునే మొక్క.
‘గడ్డి మైదానాల్లో మంటలు సంభవించినప్పుడు, చాలా మొక్కలు చనిపోతాయి. ఆగస్టులో రుతుపవనాలు తిరిగి మొక్కలకు జీవం పోస్తుంది. అప్పటి వరకు మొక్కలు లేకుండా ఇతర జీవులు ఎలా మనుగడ సాగిస్తాయి? ఇతర ఏ గడ్డి మొక్కలు లేనప్పుడు ఈ ఎరిథ్రినా రెసుపినాటా వంటి మొక్కలు వికసిస్తాయి. తద్వారా జరిగే పరాగ సంపర్కాలు చిన్న చిన్న కీటకాలకు ఆహారం అందిస్తాయి’ అంటారు శాస్త్రవేత్త వర్మ.
ఈ మొక్క మందంగా వుండటంతో వేర్లు భూమి లోపలికి లోతుగా చొచ్చుకుని వుంటాయి. ఈ వేరుల వ్యవస్థ మంటలను తట్టుకుని, నిలబడటానికి సహాయపడుతుంది. అడవి మంటలు సంభవించినప్పుడు కాండం కాలిపోతుంది. కానీ వేర్లు అలాగే ఉంటాయి. మంటల తర్వాత, భూమిలోని వేర్ల నుంచి లేత కాండం మళ్లీ మొలకెత్తుతుంది.. చిగురిస్తుంది.. ఎర్రటి పూలను పుష్పిస్తుంది.
ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని సవన్నాలలో ఎరిథ్రినా రెసుపినాటా లాంటి అగ్ని నిరోధక మొక్కలు పుష్కలంగా ఉన్నాయని వర్మ చెబుతున్నారు. కాలిట్రిస్ ఇంట్రాట్రోపికా, క్రాసోప్టెరిక్స్ ఫెబ్రిఫ్యూగా, పిలియోస్టిగ్మా థోనింగి వంటి మొక్కలు కొన్ని ఉదాహరణలు. అటవీ మంటలను తట్టుకునే మొక్కల లక్షణాలను శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నప్పటికీ, తెరాయి ప్రాంతంలో అగ్ని నిరోధక మొక్కలపై చాలా తక్కువ పరిశోధనలు జరిగాయి.
మొక్క జీవిత చక్రం
ఏప్రిల్, 2023లో ఫీల్డ్‌వర్క్ చేస్తున్న వర్మ బృందం ఒక ప్రకాశవంతమైన ఎరుపు పువ్వును కనుగొన్నారు. మొదట సాధారణ ఎరిథ్రినా మొక్క వంటిదని భావించారు. ఈ జాతి మొక్కలు నారింజ-ఎరుపు రంగు పువ్వులకు ప్రసిద్ధి. వాస్తవానికి ఎరిథ్రినా రెసుపినాటా అనే చిన్న మొక్క అని మాత్రమే వారు గ్రహించాము. వృక్షశాస్త్రజ్ఞుడు పిసి కాంజిలాల్ 1933లో రాసిన ”ఎ ఫారెస్ట్ ఫ్లోరా ఆఫ్ పిలిభిత్, ఔధ్, గోరఖ్‌పూర్, బుందేల్‌ఖండ్” పుస్తకం నుంచే వర్మ బృందం ఎరిథ్రినా రెసుపినాటా లక్షణాల గురించి ప్రాథమిక అవగాహన పొందారు. ఇది ఒక చిన్న పొదలా వుంటుంది. బాగా ఎదిగిన దశలో కేవలం రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. అందువల్ల, తెరాయి ప్రాంతంలో ఇతర మొక్కలు పెరిగే వర్షాకాలం ఈ మొక్కలకు ప్రతికూలంగా ఉంటుంది. వర్షాకాలం, శీతాకాలంలో ఈ ప్రాంతంలో పొడవైన గడ్డితో కప్పబడి వుంటుంది. దీంతో ఈ మొక్కలపై చాలా తక్కువ సూర్యరశ్మి పడుతుంది. అందువల్ల ఇవి దాదాపు నిద్రాణ దశలో వుంటాయి. శీతాకాలం అనంతరం, ఈ గడ్డి మైదానాల్లోని గడ్డి, మొక్కలు కాలిపోయిన అనంతరం ఆ బూడిద నుంచి ఎరిథ్రినా రెసుపినాటా మొక్కలు వేగంగా పెరుగుతాయి. పువ్వులు, కాయలు వస్తాయి. రెండు నెలల్లో ఈ మొక్క మొత్తం జీవితచక్రం ముగుస్తుంది. రుతుపవనాలు ప్రారంభం కాగానే నిద్రాణ స్థితిలోకి వెళుతుంది.
‘ఈ మొక్కలు అడవి మంటలకు అలవాటుపడిన మొక్కలు. వీటి ఆవాసం లేకుండాపోతే.. ఈ మొక్కలు కూడా లేకుండా పోతాయి’ అని శాస్త్రవేత్త వర్మ తన అధ్యయనంలో వెల్లడించారు.
– రాజాబాబు కంచర్ల