ప్లాసెంటాలో ప్లాస్టిక్స్‌..!

ప్రపంచ వ్యాప్తంగా మైక్రో ప్లాస్టిక్స్‌ వలన ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. గర్భంలో రూపుదాల్చుతున్న బిడ్డపైనా వాటి ప్రభావం తీవ్రంగానే ఉంది. నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడానికి ప్రధాన కారణం ఈ మైక్రోప్లాస్టిక్సేనని ఇటీవల పరిశోధనల్లోనూ వెల్లడైంది. అసలు మైక్రోప్లాస్టిక్స్‌ అంటే.. పర్యావరణంలో క్షీణించి పోతున్న ప్లాస్టిక్‌ వస్తువుల (ఐదు మి.మీ. కంటే చిన్న) కణాలు. ఇవి పూర్తిగా మట్టిలో కలిసిపోవు. పర్యావరణంలో కలిసిన మైక్రోప్లాస్టిక్‌లు జీవుల ప్రక్రియలన్నింటిలోనూ చేరిపోతున్నాయి. ఈ అధ్యయనంలో గర్భం దాల్చిన ఆరుగురు మహిళల ప్లాసెంటాలను మైక్రోస్పెక్ట్రోస్కోపీ సహాయంతో పరిశోధించారు. ఆ ప్లాసెంటాల్లో మైక్రోప్లాస్టిక్స్‌ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు.

పరిశోధనలో నలుగురు గర్భిణుల ప్లాసెంటాలను పరిశీలించారు. వాటిలో 12 మైక్రోప్లాస్ట్‌లు కనిపించాయి. కొన్ని గోళాకారంగా, మరికొన్ని క్రమరహితంగా ఉన్నాయి. అవి 5 నుండి 10 మైక్రాన్‌ల పరిమాణంలో ఉన్నాయి. పిండం వైపు 5, తల్లివైపు 4, కోరియో అమ్నియోటిక్‌ పొరలలో 3 ఉన్నాయి. నిర్మాణం, రసాయన కూర్పు ఆధారంగా వాటిని వర్గీకరించారు. అవన్నీ వర్ణద్రవ్యాన్ని కలిగి ఉన్నాయి. మూడు స్టెయిన్డ్‌ పాలీప్రొఫైలిన్స్‌ (బియ్యం, సిమెంట్‌ బస్తాలుగా వాడే ప్లాస్టిక్‌ సంచులు, కవర్లు) గాను, ఒకటి థర్మోప్లాస్టిక్‌ పాలిమర్‌గాను, మిగిలిన తొమ్మిది వర్ణద్రవ్యాలుగాను గుర్తింపబడ్డాయి. ఇవన్నీ మానవ నిర్మితాలే. పూతలు, పెయింట్‌లు, అంటించే ప్లాస్టర్‌లు, పాలిమర్‌లు, సౌందర్య సాధనాలు, ప్లాస్టిక్‌ తయారీ సంరక్షణ ఉత్పత్తుల నుండి ఏర్పడినవే.

ప్లాసెంటా ప్రక్రియలు..
ప్లాసెంటా అంటే గర్భధారణ సమయంలో గర్భాశయంలో ఏర్పడే ఒక తాత్కాలిక అవయవం. ఇది పిండం పెరుగుదలకు అన్నివిధాలా తోడ్పడుతుంది. పిండాన్ని గర్భాశయ గోడకు కలుపుతుంది. తల్లికి, శిశువుకి అనుసంధానంగా పనిచేస్తుంది. ప్లాసెంటా అనుసంధానంతో ఆక్సిజన్‌, పోషకాలు తల్లి రక్తం నుండి బొడ్డు తాడు ద్వారా పిండానికి చేరతాయి. దీనిద్వారా రోగనిరోధక శక్తి సమకూరుతుంది. పిండం నుండి విసర్జింపబడే కార్బన్‌ డై ఆక్సైడ్‌, ఇతర వ్యర్థ పదార్థాలు బయటికి పంపబడతాయి. పిండం పెరుగుదలకు సహాయపడే హార్మోన్లను ప్లాసెంటా ఉత్పత్తి చేస్తుంది. అంటువ్యాధులు, తల్లి నుండి జెనోబయోటిక్‌ అణువుల నుండి వచ్చే వ్యాధులు రాకుండా పిండాన్ని కాపాడుతుంది. జీవక్రియ ఉత్పత్తులను తల్లికి, పిండానికి ప్రసరింపజేస్తుంది. గ్లైకోజెన్‌, ప్రోటీన్‌, కొలెస్ట్రాల్‌, కొవ్వు ఆమ్లాలను సంశ్లేషణ చేస్తుంది. పిండం ఎదుగుదలలో గర్భాశయంలోని వాతావరణాన్ని, బాహ్య వాతావరణాన్ని సమన్వయపరుస్తుంది. కానీ ఈ ప్రక్రియలన్నింటినీ ప్లాస్టిక్‌ నిక్షేపాలు నియంత్రిస్తున్నాయి.

మైక్రోస్‌ శరీరంలోకి ప్రవేశించి..
మైక్రోప్లాసిక్స్‌ తల్లి గర్భాశయంలో కోరియో ఆమ్నియోటిక్‌ (పిండాన్ని అంటిపెట్టుకుని ఉండే) పొరలకు నష్టం కలిగిస్తాయి. మెదడు కింది భాగాన ఉండే పిట్యూటరీ, మిగిలిన ఎండోక్రైన్‌ గ్లాండ్స్‌, హార్మోన్స్‌ను ఉత్పత్తి చేయకుండా అంతరాయం కలిగిస్తాయి. దాంతో పిండం పెరుగుదల మీద, బిడ్డ ఆరోగ్యంపైన దీర్ఘకాలిక ప్రభావాలు కలుగుతాయి. ఇవి సముద్ర ఆహారం, ఉప్పు, తాగునీటి ద్వారా ప్రాణుల శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. సముద్ర జంతువుల, మానవుల పేగులలో, కణజాలాల లోపలికి చేరుతున్నాయి. వీటిని శరీరం పరాన్నజీవిగా భావించి, తిరస్కరిస్తుంది. దాంతో రోగనిరోధక శక్తికి వ్యతిరేక చర్యలను ఇవి ప్రేరేపిస్తాయి. అంతేకాక పర్యావరణ కాలుష్య కారకాలకు, ప్లాస్టిక్‌ రసాయనాలకు వాహకాలుగా పనిచేస్తాయి. పర్యావరణంలోకి విడుదలైన ఈ ప్లాస్టిక్‌ నిక్షేపాలు ఎంతో హానికరంగా పరిణమించాయి.

నివారించాలంటే..
కనీసం ప్రసూతి సమయంలో కొన్ని నివారించవచ్చని అంటున్నారు. ప్రసూతి వైద్యులు, మంత్రసానులు కాటన్‌ చేతి తొడుగులు ఉపయోగించటం.. డెలివరీ గదిలో, రోగుల పడకలపై కాటన్‌ దుప్పట్లు, తువ్వాళ్లను మాత్రమే అనుమతించటం.. ప్రసవానంతరం నష్టపోయిన రక్తాన్ని గుర్తించే బ్యాగులు పర్యావరణ సహితంగా ఉండాలని.. బొడ్డు తాడు మెటల్‌ క్లిప్పర్‌లతో కత్తిరించబడటం.. లాంటి చర్యలు నిర్దిష్ట పరిస్తే మైక్రోప్లాస్టిక్స్‌ సమస్య నుంచి శిశువులను కాపాడవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

➡️