కవిత్వమంతా ‘దాపల’ భావజాలమే!

Apr 27,2025 09:09 #book review

బాగా వాడుకలో వున్న అచ్చమైన పల్లె పదం ‘దాపట’. దాపల, దాపట అనే పదాలకు ఎడమవైపు అని అర్థం. అభ్యుదయవాది అయిన ఈ కవి.. ఎడమవైపు (లెఫ్ట్‌) అర్థంతోనే ఈ కవితా సంపుటికి ‘దాపల’ అనే శీర్షికను ఖాయంచేసి వుండాలి. నాగలి సాలు వంకర లేకుండా చక్కగా ఉండాలంటే ఎడమవైపున ఉండే ఎద్దు హుషారుగా, ఓపికగా తెలివిగా వుండాలి. ఇక అసలు విషయానికొస్తే.. దాపల, దాపట అంటే ‘లోపల’ అని కూడా అర్థముంది. కోసూరి రవికుమార్‌ ‘దాపల’ కవితా సంపుటిలోని కవితలు కూడా లోతైన భావవ్యక్తీకరణ కలిగినవి. కవి ‘లోపలి’ అంతర్మథనమే ఈ పుస్తకం నిండా జాలువారిన కవిత్వం. ఇది కేవలం ఒట్టి కవిత్వం కాదు.. మట్టి కవిత్వం. అంతేకాదు.. బయటి ప్రపంచంలో దృశ్యమానమయ్యే అనేకానేక అంశాలను లోపలికంటా తడిమి చూసిన కవిత్వం ఇది. కవి చూసిన జీవితం. నీకు, నాకు తెలిసిన, మనం గడిపిన జీవితం. బాల్యాన్ని మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకొచ్చి మన ముందు నిలిపిన కవిత్వం. పదాల పుట్టుక, భావాల వ్యక్తీకరణ, హృదయాన్ని గిలిగింతలు పెట్టే పద చిత్రణ, పాఠకుడ్ని రంజింపజేసే సృజన.. ఈ కవి సొంతం. కవిత్వంలోని భిన్న కోణాలు, విభిన్న పార్శ్వాలను శక్తివంతంగా ఆవిష్కరించగలిగారు కోసూరి. కొన్ని పదాలు, కొన్ని పోహళింపులు ఎప్పటికప్పుడు నూత్నత్వం పొందుతుంటాయి ఈ కవి కవిత్వంలో. చాలాచోట్ల స్థానిక పలుకుబళ్లు సహజ వ్యక్తీకరణలో వినసొంపుగా అగుపిస్తాయి.
‘కవులు కాలాన్ని పట్టుకోగలరు. స్థలాన్ని పట్టుకోగలరు. స్థలకాలాల్లో జరిగే మార్పుల్ని విశదీకరించగలరు’ అంటారు పాపినేని శివశంకర్‌ ఇదే సంపుటి ముందుమాటలో. ఈ సంపుటిలో మొట్టమొదటి కవితలోనే ‘మొగ్గ కట్టక ముందే/ చెట్లో దూరిన వ్యాపారి’ అంటూ.. ‘రైతు కేమైందో తెలీదు కానీ/ పురుగు నేమీ చేయలేకపోయానని/ పురుగు మందును జిలేబీలో కలుపుకు తిని/ ఎండిన పెద కాలువ మద్దెన అడ్డంగా పడున్నాడు’ అని ‘పెట్టుబడి’ కవితలో రైతు వేదనకు సాక్షిగా నిలుస్తాడు. రెండో కవిత ‘ఏటొడ్డు’తో పాటు ‘రిషితేశ్వరీ… రిషితేశ్వరీ’, ‘రెండు నమ్మకాల్ని రాయి’ కవితల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను ప్రస్తావిస్తూ… ‘ఇంకా ఆ చిత్తడినేలలో నెత్తురుడికిస్తూనే వున్నాయి’ అంటాడు. ‘నీ అమాయకపు చిరునవ్వూ,/ నీ బేలతనపు సౌందర్యమూ/ గుర్తొచ్చినపుడల్లా/ వాళ్లను చంపేయండీ/ అని అరవాలనిపిస్తుంది/ కానీ గొంతు పెగలదు’ అంటూ రిషితేశ్వరిని తల్చుకుని జ్ఞాపకాల కార్చిచ్చులో కాలిపోతాడు కవి.
‘మనిషితో మనిషిని ముడేసేందుకు పండుగ ఒక ఋతువుల కలనేత’, ‘రంగులు రంగులై/ పరిమళపు పొంగులై/ బస్తాలకొద్దీ పోగులుపడి/ ఊపిరికి తియ్యదనాన్ని అద్దుతై’, ‘చెల్లీ నలమలా బుగులుపడగాక/ నీకోసం నగరం నుంచి/ కొన్ని గొంతులు కదిలొస్తన్నరు..’ వంటి భావుకత నిండిన వాక్యాలు కూడా మనసును హత్తుకుంటాయి. ఏ మనిషైనా… కవిత్వమైనా ఏ ఒడ్డున నిలబడ్డారన్నదాన్ని బట్టి… వారు ఏ ఒడ్డున నిలబడి, ఏ భావజాల కవితాగ్ని రగిలిస్తున్నారో అర్థమౌతుంది. కోసూరిలో అణువణువునా నిండి ‘దాపల’ భావజాలం, ఈయన ఏ ఒడ్డునున్నాడో మనకు చెప్పకనే చెబుతుంది. ‘రాహేలూ, కత్రేణమ్మ’, ‘చెల్లీ నల్లమల’తో పాటూ నింగి, నేల, నీరు, గాలి, వాన, చేను, చెలమ, ఆకలి, వెన్నెల… ఇలా చాలానే కోసూరి కవిత్వంలో పాత్రలుగా మారిపోయాయి. పిల్లగాలిలా హాయిగా వుంటుంది. వడగాలిగా హోరున వీస్తుంది. కొన్నిచోట్ల భావోద్వేగాన్నీ రగిలిస్తుంది. మొత్తంగా కోసూరి రవికుమార్‌ కవిత్వం సమాజాన్ని, మనిషిని మేల్కొలుపుతుంది.

దాపల
రచన : కోసూరి రవి కుమార్‌
పేజీలు :80
ధర : రూ. 120/-
ఫోన్‌ : 9491336488

 

– రాజాబాబు కంచర్ల
9490099231

➡️