‘చెర’వాణిలో మానవాళి..!

Feb 11,2024 11:37 #Poetry

ఓ చరవాణీ! ఎల్లలు లేని చరవాణి..

ఊసులెన్నో చెప్పే సమాచార వాణి

సరిగమలు పలికే రాగాల వాణి

దూరాన్ని దగ్గర చేసిన తరంగ వాణి..!

చిత్ర విచిత్రాలకు వినోద దర్పణ వాణి

మాయచేసే యంత్రవాణి

జేబులో ఇమిడి.. మన గుప్పెడంత ఉండి..

అందరినీ గుప్పెట్లో పెట్టుకునే ప్రభావిత వాణి..!

ఆగాధంలోకి నెట్టే అంతర్జాల వాణి

ప్రపంచానికి అవసరమని రూపొందిస్తే

తానే ప్రపంచమై ఆడించే క్రీడావాణి

మానవ సౌకర్యం కోసం సృష్టిస్తే

మానవులనే శాసించే నియంత వాణి.!

అవయవాలను స్పందింప చేసే చరవాణి

శరీరంలో భాగమైన కృత్రిమ వాణి

మానవ మేధస్సుకే పని చెప్పిన మేధవాణి

ఊహా ప్రపంచాన్ని సృష్టించే కలలరాణి..!

టాకింగ్లు.. చాటింగ్లు.. మీటింగ్లు.. టీటింగ్లు..

ఆపై పోస్టింగులు.. రీల్స్‌తో ట్రెండింగ్లు

అంటూ యువతను పెడదోవ పట్టించి

విష సంస్కృతిని నాటే అందాల వాణి..!

విలువైన సమయాన్ని హరించి

అయిన వాళ్ళను దూరం చేసే

అజ్ఞాతవాసి ఈ దూరవాణి

మనిషిని పిచ్చివాడిని చేసే వ్యసనాలవాణి

ప్రాణం కన్నా విలువైనదిగా మారిన చరవాణి!

ఇంట.. బయట.. తినేటప్పుడు.. చదివేటప్పుడు..

ప్రయాణాల్లో.. అన్నింటా.. ఇదే రాజ్యమేలే..

ఓ సెల్‌ ఫోన్‌.. జల్సా ఫోను.. సెల్ఫీ ఫోను

ఓ మిత్రమా! ఎన్నని చెప్పను దీని లీలలు

ఎల్లలు లేని దీని పోకడలు..!

నష్టాల వెతలు…లాభం కొసరని తెలుసుకో..

విశ్వ చరవాణిని.. విజ్ఞానం కోసం వాడుకో..

అజ్ఞానంతో వస్తు వినిమయ సంస్కృతికి మారకు

మనిషి విలువ తెలుసుకో.. స్నేహంగా మసలుకో..!

బానిసగా మారకు..జీవితాన్ని వృధా చేయకు

మాయా పాతాళంలోకి జారకు.. తస్మాత్‌ జాగ్రత్త ..!

చరవాణి చెరలో చిక్కుకున్న మానవాళీ..!!

  • ఎస్‌. కె. బాజీ సైదా, 8897282981
➡️