ప్రశ్న ?..!

Feb 11,2024 11:42 #Poetry

ప్రశ్న అంటే కేవలం

రెండక్షరాల పదం కాదు

ఆషామాషీ పలుకు కాదు

అది శక్తి సంపన్నం

అత్యంత ప్రభావితం

మహాశక్తి ఉత్ప్రేరకం

మహౌన్నత ఉద్దీపనం

ప్రజల పక్షాన నిలబడి

రాజ్యంతో కలబడ్తుంది

పౌర హక్కుల కొరకు

గొంతెత్తి నినదిస్తుంది

శ్రామిక కార్మిక గళాల్లో

రణ నాదమై ధ్వనిస్తుంది

కర్మ వీరుల గుండెల్లో

రగల్‌ జెండై ఎగురుతుంది

మోడువారిన మెదళ్లలో

చైతన్య దీపమై జ్వలిస్తుంది

కష్ట జీవుల నాడుల్లో

శౌర్య నదమై ప్రవహిస్తుంది

నిరాశా నిస్పృహ జీవుల్లో

భరోసా హస్తమై కదిలిస్తుంది

నిగ్గదీసి అడిగేది..

నిజాన్ని ఆవిష్కరించేది..

సమాజాన్ని ఎరుపెక్కించేది

సరికొత్త చరిత్రను లిఖించేది

ఒక్క ప్రశ్న మాత్రమే సుమీ..!

అందుకే ప్రశ్నలను

దివ్యాస్త్రంగా సంధించాలి

అనుకున్నది సాధించాలి

ప్రశ్నను సంధించు..!

 

  • కోడిగూటి తిరుపతి, 957392949
➡️