ప్రబీర్‌ పోరాటం

Sep 29,2024 08:43 #book review, #Prabir Purkayastha

ఒక సాధారణ మధ్య తరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించిన ప్రబీర్‌ పుర్కాయస్థ తన జీవితం ఎన్నెన్ని మలుపులు తిరిగిందీ, రాజకీయంగా ఎలా పరిణతి చెందిందీ ఈ ‘అలుపెరుగని పోరాటం’ పుస్తకంలో- తన జ్ఞాపకాలతో ఎంతో ఆకట్టుకునే రీతిలో వివరించారు. దీనికి ప్రబీర్‌ ఒక విశిష్టమైన శైలిని ఎంచుకున్నారు. వర్తమానం నుండి మొదలు పెట్టి గతంలో జరిగిన ఘటనలు చెప్పి- మళ్లీ గతం నుండి వర్తమానంలో జరిగిన సంఘటనలను విశ్లేషించారు.
ఇలా ఆనాటి ఎమర్జెన్సీ కన్నా నేటి మోడీ ప్రభుత్వం సాగిస్తున్న ఎమర్జెన్సీయే మరింత దుర్మార్గమైనదని సూటిగా చెప్పారు. ఆనాటి పత్రికా సెన్సార్‌ షిప్‌ మాదిరి కాకుండా, నేడు మోడీ ప్రభుత్వం మీడియాను భయపెడుతున్న వైనాన్ని వివరించారు. పుస్తకం ఆరంభంలోనే ‘ప్రతి తరం ఎమర్జెన్సీని ఎదుర్కోవలసిందేనా?’ అన్న ప్రశ్న పాఠకులను ఆలోచింపచేస్తుంది. మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్య పునాదులపైన జరుగుతున్న దాడి పట్ల ప్రబీర్‌కున్న ప్రగాఢమైన నిబద్ధ ఆందోళనే తన వ్యక్తిగత జీవనయానాన్ని చెబుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కొన్ని అతి ముఖ్యమైన సమకాలీన సంఘటనలను పాఠకులకు వివరించారు.
1975లో న్యూఢిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎన్నికైన విద్యార్థి యూనియన్‌ కౌన్సిలర్‌ అశోక్‌ లతా జైన్‌ బర్తరఫ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు సమ్మె చేస్తున్నారు. ఇందిరాగాంధీ ఎమరెర్జన్సీ విధించి అప్పటికి మూడు మాసాలయింది. అది సమ్మె రెండవ రోజు, విశ్వవిద్యాలయం అంతా ఉద్రిక్తంగా ఉంది. ఓ విద్యార్థి బృందం ఉన్న దగ్గరికి ఓ ఎంబాసిడర్‌ కారు వచ్చి ఆగింది. దానిలో నుండి మఫ్టీలో ఉన్న కొందరు పోలీసులు ప్రబీర్‌ను (మరొకరునుకొని) అరెస్టు చేసి, జైలులో ఏడాది పాటు ఉంచారు. ఆంతరంగిక భద్రతా చట్టం (మీసా) చట్టం కింద ఆయన నిర్బంధాన్ని కొనసాగించారు.
కట్‌చేస్తే 2021 ఓ ఆన్‌లైన్‌ వార్తా సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపకుని ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు చెందిన అధికారులు దాడి చేశారు. ఆ దాడి 113 గంటలు, ఐదు రోజులకు పైగా కొనసాగింది. ఆ వార్తాసంస్థ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. మళ్లీ కట్‌ చేస్తే 2023, ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌కు చెందిన అధికారులు ఆ వార్తా సంస్థ వ్యవస్థాపకుడ్ని, అతని సహచరుడ్ని భయంకరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) క్రింద అరెస్టు చేశారు.
అలా ప్రబీర్‌ ఇందిరాగాంధీ పాలనలోనూ, ఇప్పుడూ మోడీ హయాంలోనూ జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఈ ‘అలుపెరుగని పోరాటం’ ఏభై ఏళ్ల వ్యవధిలో రెండు నిరంకుశ ప్రభుత్వాలచేత వేధింపులకు గురయిన ప్రబీర్‌ పుర్కాయస్థ జ్ఞాపకాలు. ఓ యువకుడు రాజకీయాల్లో పరిణతి చెందిన పరిణామ క్రమం కూడా.
ప్రబీర్‌ వృత్తిరీత్యా సాంకేతిక నిపుణుడు. ప్రవృత్తి రీత్యా రాజకీయవేత్త. అందుకే ఆయన సైన్సును, రాజకీయాలను అనుసంధానించ గలిగాడు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో నిష్ణాతుడైన ప్రబీర్‌ నేటి మీడియా తీరుతెన్నుల్లో వచ్చిన సమూలమైన మార్పులను తేలిగ్గా అర్థం చేసుకోగలిగారు. ‘న్యూస్‌ క్లిక్‌’ పేరుతో ఆన్‌లైన్‌ వార్తాసంస్థను స్థాపించారు. దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం పరిరరక్షణకు దోహదపడటంతో పాటు, ప్రధానంగా ప్రజా ఉద్యమాలను కవర్‌ చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తున్నది. అలా మహరాష్ట్రలో జరిగిన రైతాంగ లాంగ్‌ మార్చ్‌ సమయంలోనూ, ఢిల్లీనగరంలో ఏడాదికి పైగా కొనసాగిన రైతాంగ ముట్టడిలోనూ ఒక వార్తాసంస్థగా న్యూస్‌క్లిక్‌ అద్వితీయమైన పాత్రను నిర్వహించింది. ఇదే మోడీ ప్రభుత్వానికి కంటగింపు కలిగించింది. ఏ కారణం లేకుండానే అరెస్టు చేసి, జైల్లో పెట్టింది.
75 ఏళ్లు పైబడిన ప్రబీర్‌ విద్యార్థి దశ నుంచి తరచూ సవాళ్లను ఎదుర్కొని, దేశ రాజకీయ పరిణామాల పట్ల అవగాహన పెంచుకున్నారు. వైవిధ్యమైన దేశంలో మెరుగైన ప్రపంచం కోసం పోరాడారు. ప్రజా ఉద్యమాలు ప్రపంచానికి ఆశాకిరణాల్ని సమకూర్చుతాయి, లక్ష్యాలను అందిస్తాయని తెలుసుకున్నారు. అవే తన జీవితంలో ఆచరణలో పెట్టారు. ప్రబీర్‌ నిబద్ధత కలిగిన కామ్రేడ్‌. నిరంతరం ప్రజల్లో ఉండి, వారితో కలిసి జీవించి, వారిని ప్రేమించి, వారి నుండి పాఠాలను నేర్చుకున్నారు. వారందరికీ న్యాయం జరగాలని నిరంతరం ‘అలుపెరగని పోరాటం’ చేశారని ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికీ అర్థంమవుతుంది.

పుస్తకం పేరు : అలుపెరుగని పోరాటం
నాటి ఎమర్జెన్సీ నుండి నేటిదాకా
రచయిత : ప్రబీర్‌ పుర్కాయస్థ
అనువాదం : బోడపట్ల రవీంద్ర
పేజీలు : 192
ధర : 200/-

– పద్మావతి

➡️