సాధన

Apr 20,2025 17:28 #kavirha, #Sneha, #sunday book

సాధన వలన పనులు
సమకూరు ధరలోన
అనెడి పెద్దల మాట
అసత్యం అనదగునె?

అతి పిన్న వయసులో
ప్రతిభను ప్రదర్శించు
శక్తి సామర్ధ్య ప్ర
శస్తి సాధనతోనె!!

పళ్లెమ్ముపై నిలిచి
భరత నాట్యం చేయు
పాపలకు సాహస
ప్రాప్తి సాధనతోనె

గడకర్ర చేబూని
గారడీ అమ్మాయి
తడబడక తీగపై
నడక సాధనతోనె!!

ఆశు కవితలు చెప్పి
అలవోకగా చేయు
అష్టావధానమూ
అలరు సాధనతోనె!!

శిలను ఉలితో చెక్కి
శిల్పంగ మలిచేటి
సమర్ధత శిల్పికీ
అమరు సాధనతోనె!!
ప్రతి కళాకారుడూ
ప్రతిభతో రాణించి
నిలిచేది ప్రధమునిగ
నిత్య సాధనతోనె!!

ఊపిరొచ్చిన దాది
ఊపిరొదిలేదాక
సాగించవలె యాత్ర
సాధన సలుపుతూనె!!

– ‘బాలబంధు’అలపర్తి వెంకటసుబ్బారావు
(కేంద్ర సాహిత్య అకాడమీ
బాలసాహిత్య పురస్కార గ్రహీత)
9440805001

➡️