అమ్మాయి చదువు

Feb 16,2025 11:04 #Child Marriages, #Sneha

నాగారం అనే పల్లెటూరులో ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉండేది. విద్య అనే 10 సంవత్సరాల అమ్మాయి ఆ కుటుంబంలో గారాల బిడ్డ. ఆటపాటలలో, చదువులో చాలా చురుకుగా ఉండేది. ఆ ఊరిలో ప్రభుత్వ పాఠశాల లేనందువలన పక్క ఊరికి వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. ఆ ఊరు మూఢనమ్మకాలకు పెట్టింది పేరు. ‘ఆడపిల్లలు చదువుకోవద్దు, ఆడపిల్లలకు చదువు అవసరం లేదు’ అనేది ఆ ఊరి ప్రజల యొక్క అభిప్రాయం. అందుకే చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేవారు. ఆ ఊరిలో ఉన్నత విద్య చదివిన అమ్మాయిలు ఎవరూ లేరు.
విద్య వాళ్ళ నాన్నకు, నానమ్మ, తాతకు విద్య చదువు కోసం వేరే ఊరికి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ వాళ్ళ అమ్మకు అది నచ్చలేదు. తన కూతుర్ని బాగా చదివించాలని, మంచి ఉద్యోగం చేయించాలని కోరిక. కానీ తన భర్త, అత్తమామలు అందుకు ఒప్పుకోలేదు. విద్యకు కూడా బాగా చదువుకోవాలని కోరిక. మంచి ఉద్యోగం చేయాలని, తన కుటుంబానికి ఆసరాగా ఉండాలని, ఆ ఊరిని మార్చాలని తనకు బలంగా ఉండేది. అందుకే తను చదువుకుంటానని పోరు పెట్టింది. విద్యలో పట్టుదలను చూసి వాళ్లు అభిప్రాయం మార్చుకున్నారు. పదవ తరగతి తర్వాత తప్పకుండా పెళ్లి చేస్తామనే షరతుతో అమ్మాయిని బడికి పంపించారు. అప్పటి నుండి విద్య ఎంతో కష్టపడి శ్రద్ధతో చదువుకున్నది.
ఇంటి పనులు చేస్తూ, చదువులో కూడా మంచి ప్రతిభను కనబరిచేది. పాఠశాలలో కూడా మంచిపేరు తెచ్చుకున్నది. పాఠశాలలో జరిగే అన్ని పోటీలలో అన్ని బహుమతులు విద్యకే వచ్చేవి. ఆ అమ్మాయి పక్క ఊరికి వెళ్లి చదువుకోవడం ఆ ఊర్లో ఉన్న వాళ్లకు అస్సలు నచ్చలేదు. కానీ విద్య ఎవరి మాటలు వినకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేది. ఎన్నో కష్టనష్టాలు వోర్చుకొని, పదవ తరగతి వరకు ఓపికతో చదువుకుంది. పదవ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించి, అందరి మెప్పును పొందింది. ఆ విషయం వార్తాపత్రికలలో విద్య ఫోటోతో సహా ప్రచురించారు. టీవీలలో ఆ అమ్మాయి గొప్పతనం గురించి ప్రచారం చేశారు. ఆ జిల్లా కలెక్టర్‌ విద్యని సన్మానించి, ఎంతగానో మెచ్చుకున్నారు.
బాలికలు చదువు యొక్క గొప్పతనం గురించి, బాలికలు చదువుకుంటే సమాజం ఎలా బాగుపడుతుంది అని తెలియజేస్తూ పేపర్‌ ప్రకటన రావడంతో ఆ అమ్మాయిని అందరూ ప్రశంసించడం, ఆ ఊరి వారందరినీ ఆలోచింపజేసింది. నాగారం గ్రామ ప్రజలు వారి కుమార్తెల జీవితాలను బాల్యవివాహాలతో ఎలా నాశనం చేస్తున్నారో తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యారు. తమ తప్పుని తెలుసుకున్నారు. విద్య సాధించిన ఫలితానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసారు. వారి తప్పును తెలుసుకొని క్షమించమని కోరారు. అప్పటి నుండి మిగతా వారు కూడా అమ్మాయిలను చదువు కోసం వేరే ఊరికి పంపించసాగారు.

నీతి : బాల్య వివాహాలు వద్దు బాలికల చదువు ముద్దు.

తోట కార్తీక
9వ తరగతి,
తెలంగాణ ఆదర్శ పాఠశాల,
లింగాల ఘనపురం మండలం,
జనగామ జిల్లా.

➡️