అమలిన ప్రేమ

Mar 31,2024 10:17 #Poetry

నీ రాక తెలిసీ ఊరి పొలిమేర
ఉత్సాహంతో ఉరకలు వేయలేదు
నీ రాక తెలిసీ ఊరి గట్టుచెరువు
ఆనందంతో గంతులు వేయలేదు
నీ రాక తెలిసీ ఇంటి గేట్లు కిర్రుమంటూ
సంగీతంతో బార్లా తెరుచుకోట్లేదు
నీ రాక తెలిసీ పెరట్లోని గులాబీలు
ఎప్పటిలా గుసగుస లాడట్లేదు
నీ రాక తెలిసీ గుమ్మం ముందు ముగ్గు
సిగ్గుతో ముసిముసిగా నవ్వనూ లేదు
కానీ నేను మాత్రం..
నువ్వొస్తున్నావని తెలిసీ..
నా గుండెను
గులాబీ గుత్తిగా
గుప్పెట్లో పట్టుకొని
ఎదురుచూస్తూనే ఉన్నా..
నిన్ను స్వాగతించాలని, నీ వరకు నువ్వెప్పుడో
‘విడి’ పోయాననుకుంటావు
నా తుది శ్వాస వరకు నాకే సొంతమైన
నా మది నిండా వుండే నువ్వు ..!

– న్యాలకంటి నారాయణ, 9550833490

➡️