నెలసరి అంటే భయం.. విపరీతమైన కడుపునొప్పి.. తగ్గించుకోవడానికి పెయిన్‌కిల్లర్స్ వేసుకోవటం.. ఆ తర్వాత దాని ఊసే ఉండదు. ఎందుకిలా వస్తుంది అనే ఆలోచన గానీ, దానికి సరైన చికిత్స తీసుకోవాలనే పరిజ్ఞానం కానీ చదువుకున్న మహిళల్లోనూ తక్కువే. ఎందుకంటే.. పీరియడ్స్ సమయంలో అలా రావటానికి కారణం ఫైబ్రాయిడ్స్ అని తెలిసినప్పటికీ అది సహజమేనని భావిస్తారు చాలామంది. అయితే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ వారు ఇటీవల ఈ విషయంపై పరిశోధనలు జరిపారు. దాదాపు డెబ్భై శాతం మంది మహిళలు ఈ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నారు. ఫైబ్రాయిడ్స్ కారణంగా వచ్చే ఇబ్బందులను భరించాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఫైబ్రాయిడ్స్ గర్భాశయంలో ఏర్పడితే అధిక రక్తస్రావం అవుతుంది. వెన్నునొప్పి, తరచుగా మూత్రవిసర్జన, కటిభాగంలో నొప్పి ఉంటాయి. ఈ తీవ్రమైన నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే గర్భసంచిని తొలగించాల్సిన పరిస్థితులూ ఏర్పడతాయి.
ఫైబ్రాయిడ్స్ అంటే..
గర్భాశయంలో పెరిగే గడ్డలు. ఇవి క్యాన్సర్ కణుతుల వలె ప్రమాదకరమైనవి కావు. అయితే వీటి నిర్మాణం కండర, పీచు కణజాలాలతో ఉంటుంది. ఇవి బియ్యపు గింజ అంత సైజ్ నుండి పుచ్చకాయంత పరిమాణం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ఫైబ్రాయిడ్లను గర్భాశయ మయోమాస్ లేదా లియోమియోమాస్ అని కూడా అంటారు. సాధారణంగా ఈ ఫైబ్రాయిడ్లు 30 నుంచి 50 ఏళ్ల మహిళల్లో ఏర్పడతాయి. ఇవి ఒకటి లేదా చాలా కణుతులుగా ఏర్పడే అవకాశం ఉంది. వీటి పరిమాణం, ఆకారం, ఏర్పడే ప్రదేశం అందరిలోనూ ఒకేలా ఉండదు. ఇవి కాన్సర్ కణాలు కానప్పటికీ అనేక ఇబ్బందులకు గురిచేస్తాయి.
ప్రదేశాన్ని బట్టి..
గర్భాశయం అనేక పొరలను కలిగి ఉంటుంది. ఫైబ్రాయిడ్లు గర్భాశయ మృదు కండరాలలో ఏర్పడతాయి. ఫైబ్రాయిడ్స్ గర్భాశయ కండరాల గోడ లోపల ఏర్పడే వాటిని ‘ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్’ అని, గర్భాశయ గోడ వెలుపల, కటిభాగంలో ఏర్పడే వాటిని ‘సబ్‌సెరోసల్ ఫైబ్రాయిడ్స్’ అని, గర్భాశయం మధ్యలో ఏర్పడే వాటిని ‘సబ్‌ముకోసల్ ఫైబ్రాయిడ్స్’ అనివైద్య పరిభాషలో అంటారు. అది శిశువు అభివృద్ధి చెందే ప్రదేశం. ఫైబ్రాయిడ్లు గర్భాశయంలో ఏర్పడే ప్రదేశాన్ని బట్టి బాధించే లక్షణాలూ మారుతుంటాయి.
ఎందుకిలా..
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు స్త్రీ శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గర్భధారణ సమయంలో ఈ రెండు హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. అలా హార్మోన్ల విడుదల ఎక్కువగా ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమయంలో గర్భాశయం ఆకారాన్ని మార్చి, పిండం పెరుగుదలకు అవరోధంగా ఉంటాయి. ఒక్కోసారి గర్భం దాల్చడానికే అడ్డొస్తాయి. అంతేకాదు గర్భస్రావం, అకాల ప్రసవం, సిజేరియన్ అవసరమయ్యే పరిస్థితులను కలిగిస్తాయి.
లక్షణాలు..
వీటివలన పెల్విక్ నొప్పి (పొత్తి కడుపు, కటిభాగంలో నొప్పి), వంధ్యత్వం, అధిక రక్తస్రావం ఉంటాయి. ఫైబ్రాయిడ్లు ఇతర అవయవాలపై ఒత్తిడి తెచ్చేంత పెద్దవిగా ఉంటే, అవి సెక్స్ సమయంలో నొప్పిని కలిగిస్తాయి. తరచుగా మూత్ర విసర్జన, మలబద్ధకం, కడుపుబ్బరం లాంటి ఇబ్బందులకు గురిచేస్తాయి. ఫైబ్రాయిడ్లు ఎక్కడ ఏర్పడినా సాధారణంగానే అధిక రక్తస్రావం ఏర్పడుతుంది.
ఇలా గుర్తించవచ్చు..
ఫైబ్రాయిడ్లు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా నిర్ధారించబడతాయి. గర్భధారణ పరీక్షల సమయంలోనూ కనుగొంటారు. ఈ హార్మోన్లను చికిత్స ద్వారా తగ్గించడం వలన వంధ్యత్వం, శరీరంలో ఆమ్లాలు ఎక్కువగా రిలీజ్ అవటం, వెజైనల్ పొడిబారటం, ఎముకలు బోలుగా తయారై కీళ్ళ వ్యాధికి గురవటం జరుగుతుంది.
హెచ్ ఆర్ టి..
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టి) అనేది మెనోపాజ్ లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగించే చికిత్స. మెనోపాజ్ స్థితిలో తక్కువ స్థాయిలో విడుదలయ్యే స్త్రీ హార్మోన్లను ఇది భర్తీ చేస్తుంది. ఫైబ్రాయిడ్లు ఉన్న స్త్రీలు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను తగ్గించడానికి మందులను అందించవచ్చు. ఈ చికిత్సతో ఫైబ్రాయిడ్స్ పెరుగుదలను ఆపవచ్చు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (జిఎన్‌ఆర్‌హెచ్) వారు హెచ్‌ఆర్‌టి ని సూచిస్తుంది. ఇది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్స్‌ను దుష్ప్రభావాలు లేకుండా సమతుల్యపరుస్తుంది. దీర్ఘకాలికంగా వాడినప్పటికీ అననుకూల ప్రభావాలుండవు.