పశ్చాతాపం

Feb 16,2025 09:50 #Sneha, #Stories

బదిలీపై కొత్తగా ఆ ఆఫీసులో అడుగు పెట్టాను. ప్రతి ఉద్యోగికి ఉద్యోగంలో బదిలీలు మామూలే అయినా కొత్తచోటికి వెళ్లేటప్పుడు అక్కడి వాతావరణం.. సహోద్యోగులు ఎలాంటివారు.. అనేదానిపై ఒకింత ఉత్సుకత సహజంగానే ఉంటుంది. పర్వాలేదు ఆఫీసు మెయిన్‌ రోడ్డుకు కొంచెం దగ్గరగానే ఉంది. దారి కూడా మరీ ఇరుకుగా లేదు. కారు తేలిగ్గా వెళ్ళిపోవచ్చు.
ఈ మధ్య పాత ఇల్లు పడగొట్టి, కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు కొందరు రోడ్డును కలిపేసుకోవడం, మెట్లు వీధిలోకి పెట్టడం వల్ల దారులన్నీ ఇరుకుగా అయిపోతున్నాయి. పైగా పూర్వంలా కాదు, ఇప్పుడు అందరికీ కార్లు ఉన్నాయి కూడాను. ‘వెళ్ళేది ఉద్యోగానికా..ఊరేగడానికా..?’ అనుకోకండి. మన ప్రయాణం, పరిసరాలు అన్నీ బాగుంటేనే మనసులో చికాకులు ఏమీ లేకుండా పని హుషారుగా చేయగలుగుతామని నా బలమైన నమ్మకం.
మా ఆఫీసు కూడా చూడడానికి మరీ పురాతన భవనంలా లేదు. చుట్టూ పరిసరాలు అవీ కాస్త బాగానే ఉన్నాయి. అంతేకాదు గేటు లోపల పక్కనే రెండు పెద్ద చెట్లు వాటి కింద రెండు సిమెంట్‌ బెంచీలు కూడా ఉన్నాయి. నిజం చెప్పనా! వాటిని చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. మనం పని చేసేది ఆఫీసులో బల్ల ముందు. కుర్చీలో కూర్చునే అయినా ఏదో మధ్యాహ్నం భోజనాల సమయంలోనైనా కాసేపు నాలుగు అడుగులు నడిచి, అలా బెంచీ మీద కూర్చుంటే అదొక తీరు.
వరండాలో సిమెంట్‌ కుండీలు ఉన్నాయి. వాటిలో క్రోటన్‌ మొక్కలు పెంచుతున్నారు. ఫర్వాలేదు.. మా ఆఫీసరు కూసింత టేస్ట్‌ ఉన్నవాడే సుమా! అనుకున్నాను. నా ముందు అక్కడ పనిచేసిన వాసుగారు నాకు ఛార్జ్‌ అప్పగిస్తూ నా సహోద్యోగులను కూడా పరిచయం చేశారు. అందరూ చిరునవ్వుతో స్వాగతం పలికారు. బయటకు వచ్చిన తర్వాత వాసుగారు వెళుతూ మళ్లీ చెప్పారు. ‘సహోద్యోగులు అందరూ కుటుంబ సభ్యులలాగా కలిసిపోయే మనస్తత్వం ఉన్నవారే. ఎవరి పని వాళ్లు చేసుకుపోతారు. ఇబ్బంది ఏమీ లేదు. హాయిగా మీ పని మీరు చేసుకోవచ్చు. ఎటొచ్చీ యశోద గారు మాత్రం కాస్త రిజర్వుడ్‌గా ఉంటారు. పని విషయంలో వంక పెట్టలేం సుమా!’ అంటూ సెలవు తీసుకున్నారు.
నేను కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నామీద నాకు ఒక గొప్ప నమ్మకం, నా వ్యక్తిత్వం అనుకోవచ్చు, మాట తీరు కావచ్చు నలుగురిని కలుపుకుపోయే తత్వమే కానీ గొడవపడే గుణం కాదు. మనం ఇంటి వద్ద కుటుంబసభ్యులతో కంటే ఆఫీసులో సహోద్యోగులతోనే ఎక్కువసేపు గడపాల్సి ఉంటుంది. కాబట్టి పనిచేసే చోట వాతావరణం హాయిగా ఉండేటట్లు చూసుకోవాలనేది నా అభిప్రాయం.
ఇక్కడ చేరి వారం రోజులైంది. అందరితో చనువు ఏర్పడింది. టీ బ్రేక్‌లోనూ, ఆఫీసు సమయం కంటే ముందుగానే ఆఫీసుకు చేరినప్పుడు, లేకపోతే ఇంటికి బయలుదేరే ముందు ఏదోలా మొత్తానికి పరిచయాలైతే పెరిగాయి. రమణ, కౌసల్య, శ్రీను, వెంకటలక్ష్మి, రాజారావు, ఇలా ఇంకా మిగతావాళ్లు అందరూ కలివిడిగా కలిసిపోయారు. యశోద గారితోనే కొంచెం ఆటంకం.
ఆవిడ వయసు ఇంచుమించుగా 38..41 మధ్య ఉంటుందేమో. చూడడానికి బాగానే ఉంటారు. చూడగానే ఆకర్షించేలా నుదుటిబొట్టు, పొందికైన మనిషి. ఏ విషయంలోనూ వంక పెట్టడానికి వీలులేని వ్యక్తి. సమయానికి రావడం, నిబద్ధతతో పనిచేయడం, కాకపోతే అందరితో కాస్త దూరం మెయింటెయిన్‌ చేస్తున్నారు అనిపిస్తుంది. అలా అని అహంకారం అని కూడా అనుకోలేము. ఆవిడ గురించి ఇంతలా చెప్తున్నానని నాకు స్త్రీల పట్ల ఆకర్షణ అని మీరు అనుకుంటే పొరపడినట్టే. అందరిలోనూ ఆవిడ కొంచెం వేరుగా అనిపిస్తున్నారని గమనించాను అంతే. టీ టైంలో అందరం మాట్లాడుకుంటుంటే ఆవిడ కాస్త త్వరగా క్యాంటీన్‌ నుంచి తన టేబుల్‌ దగ్గరకు వెళ్ళిపోతారు. లేదా టీ తెచ్చేయమని అటెండర్‌కు చెప్తారు. ఆవిడ కావాలనే గ్రూపులో కలవడానికి ఇష్టపడడం లేదని అర్థమవుతుంది. అలా అని మొహం మాడ్చుకుని ఉండరు. ఎప్పుడూ చిరునవ్వుతో చల్లగా మెల్లగా కనిపిస్తారు.
రోజులు గడుస్తున్నాయి. ఆఫీస్‌ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోయాను. యశోద గారి గురించి మాత్రం మనసులో ఒక ప్రశ్నార్థకం మెదులుతూ ఉంటుంది. పిల్లలు లేరు అని తప్ప ఆవిడి గురించి ఎవరికీ ఏమీ తెలియదు. మొబైల్‌ వాడకం ఇంతలా పెరిగిపోయిన రోజుల్లో కూడా ఆవిడ ఫోను వాడడం చాలా తక్కువ. తను ఫోన్‌ కూడా ఎప్పుడూ సైలెంట్‌లోనే ఉంచుతుంది. అందరం ఎప్పుడైనా గుంపుగా నిలబడి గోలగోలగా క్రికెట్‌ మ్యాచ్‌ గురించో లేదా ఏదైనా తీవ్రమైన బ్రేకింగ్‌ న్యూస్‌ మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ మాతో మాట కలిపినట్టే కలిపి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పకుంటారు. ఆ తప్పుకోవడం కూడా ఏదో వీళ్ళతో నాకేంటి అన్నట్టుగా కాదు, చాలా సహజంగా గలగల పారుతున్న నదిలో నుండి విడివడి చిన్నపాయ మెల్లిగా ప్రవహించినట్లు ఎవరి దృష్టి అటు తిరగదు. కానీ ఎందుకో నా దృష్టి నాకు తెలియకుండానే ఆమెను గమనిస్తూ ఉంటుంది.
మొన్నటికి మొన్న మా సీనియర్‌ ఉద్యోగి ఒకరు రిటైరైన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఏర్పాటులో ఉత్సాహంగా ప్రతి పనిలోనూ పాల్గొన్నారు. పనులన్నీ ఎలా చేసుకోవాలో ఎవరెవరు ఏమి చేయాలో ప్రణాళిక సిద్ధం చేశారు. అంతా పూర్తయ్యి జనం రావడం మొదలైంది. ఈ లోపు మైకులో చిన్నగా పాటలు కూడా పెట్టారు. ఇంతలో ఇంటి నుండి ఎవరికో బాలేదని అర్జెంటు ఫోన్‌ వచ్చిందని ఆవిడ హడావిడిగా వెళ్లిపోయారు. కార్యక్రమం జరుగుతున్న హడావిడిలో నేను పట్టించుకోలేదు. మర్నాడు ఆవిడను ‘ఇంట్లో ఎవరికి బాలేదు?’ అని అడిగే అవకాశం చిక్కలేదు.
అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. నేనేంటి ఈవిడ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని. అలా అని ఆవిడంటే నాకేమీ చిన్నచూపూ లేదు. ఆకర్షణా లేదు. నాకు వ్యక్తులను పరిశీలించడం, వారి వ్యక్తిత్వాలను అంచనా వేయడం ఒక అలవాటు. అంతే తప్ప ఇంకేమీ కాదు. కాలం నడుస్తూ ఉంది. నా మనసు క్రమంగా ఆవిడని గమనించడం తగ్గించింది. లేదా ఆవిడ ప్రవర్తన నాకు అలవాటైపోయి ఉంటుంది. ఆ రోజు నేను ఆఫీసులో పని ఎక్కువగా ఉండి కొంచెం ఆలస్యంగా ఇంటికి బయలుదేరాను. అప్పటికి ఇంకా యశోద గారు బస్టాప్‌లోనే ఉన్నారు.
‘మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా?’
‘లేదండి! దారిలో ఏదో గొడవ జరిగిందట. ట్రాఫిక్‌ జామ్‌ అయిందట. మా వైపు వెళ్లే బస్సులు రాలేదు. ఆటోలు కూడా లేవు.’
‘నేను అటే వెళ్తున్నా.. రండి మిమ్మల్ని దింపేసి వెళ్తాను. చీకటి పడేలా ఉంది కదా!’ అన్నాను.
‘పర్లేదు కాస్సేపటికి వచ్చేస్తాయిలెండి. మీకెందుకు ఇబ్బంది’ అన్నారు.
‘మీకు అభ్యంతరం లేకపోతేనే’ అన్నాను.
‘అలాంటిదేమీ లేదు’. అంటూ కారు తలుపు తెరిచి ఎక్కారు. నగల షాపులు, బట్టలకొట్లు, చారు బడ్డీలు దాటుకుంటూ కారు వెళుతుంది. ఇంటికొచ్చిన కొత్త చుట్టంలా.. చీకటి, సాయంత్రాన్ని ఆక్రమించడానికి మొహమాట పడుతూ ఉంది. దారిలో ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు. మాట కలిపితే ఆవిడ ఎక్కడ ఇబ్బందిపడతారో అని నేను ఏమీ మాట్లాడలేదు. చెప్పిన గుర్తుల ప్రకారం వెళ్ళాము. ‘ఇక్కడ ఆపండి చాలు, అదిగో ఆ వీధిలో కళ్యాణమండపం పక్కనే మా ఇల్లు’. అంటూ ఆవిడ దిగి ‘థ్యాంక్స్‌’ చెప్పి బయలుదేరారు.
కారు స్టార్ట్‌ చేసి ముందుకు వెళ్లబోయి పక్క సీటు వైపు చూశాను. కాళ్ల దగ్గర బ్యాగ్‌ కనిపించింది. పిలుద్దామని అనుకునేటప్పటికే ఆవిడ రోడ్డు దాటేశారు. గట్టిగా పిలవడం సభ్యత కాదు. అలా అని బ్యాగ్‌ ఇంటికి తీసుకెళ్ళి, పొద్దున్నే ఇద్దామంటే అందులో ఆవిడకి అవసరమైనవి ఏమైనా ఉండొచ్చు. ఏదైతే అది అయింది అని కారు పక్కకు ఆపి బ్యాగు తీసుకుని ఆవిడ నడిచిన వైపు అడుగులు వేసాను.
వీధిలో అడుగుపెట్టగానే ఒక వెల్డింగ్‌ షాప్‌ ఉంది. విపరీతమైన శబ్దాలు. ఒక ప్రక్క చిన్న కళ్యాణమండపం ఎవరిదో పెళ్లి వేడుక జరుగుతుంది. పెద్ద పెద్ద సౌండ్‌ బాక్స్‌లతో బ్యాండ్‌ మేళం. గాయనీ గాయకులు మైక్‌లో పాటలు పాడుతున్నారు. దాని ఎదురుగా చిన్న పండ్ల దుకాణం కనిపించింది. ‘కేజీ 100 కమలాకాయలు… ద్రాక్ష పండ్లు రండి రండి!’ అంటూ స్పీకర్లు, కళ్యాణమండపానికి వెల్డింగ్‌ షాప్‌కి మధ్యలో యశోదగారి ఇల్లు. ఎదురుగా పండ్ల దుకాణం. ఆవిడ తమ ఇంటి గేటు దాటి మెట్లెక్కి, లోపలికెళ్ళి తలుపు వేసుకున్నారు. గేటు తీసుకుని గుమ్మం వరకూ వెళ్లి, తలుపు తట్టబోయిన నాకు లోపల నుండి గట్టిగా కేకలు.. ”ఇప్పటివరకు ఏమైపోయారు మహారాణి గారు! ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వచ్చేటప్పుడు వాళ్లకి ఏదైనా తెచ్చి పెట్టాలి.. త్వరగా రెండు మెతుకులు వండి పెట్టాలి అని లెక్క ఉంటేగా’ అంటూ అత్తగారు అనుకుంటాను.
వెంటనే ఇంకొక యువతి గొంతు ఆడపడుచు అనుకుంటాను, ఆవిడ కూడా ఏదో సాధింపు. నాకేం చేయాలో పాలు పోలేదు. ఇటువంటి సమయంలో లోపలికి వెళ్లడం ఆమెను మరింత ఇబ్బందుల్లోకిి నెట్టడమే అవుతుందని అనిపించి వెనుతిరిగాను.
ఇంతలో పక్క పోర్షన్‌ నుండి వాళ్ళ పనిమనిషి నడుస్తూ.. ‘మహాతల్లి.. ఎలా భరిస్తుందో గానీ రాత్రి పడుకునేంత వరకూ వాళ్లు అలా గట్టిగా అరుస్తూ సాధిస్తూనే ఉంటారు. అయ్యగారు దుబారు నుంచి వచ్చేంతవరకూ ఆవిడకిలా ఒంటరి పోరాటం తప్పదు.’ తనలో తను గొణుక్కుంటూ వెళుతుంది.
తిరిగి వచ్చి కార్లో కూర్చున్న నాకు మనసంతా ఒక్కసారిగా బాధతోనూ పశ్చాత్తాపంతోనూ నిండిపోయింది. ఒక్కసారిగా నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికి, అవి నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. ఇంటా బయట ఏ సమస్య లేని నేను, వెళ్లే దారి, తెరిచే గేటు, కూర్చునే చోటు కూడా నాకు నచ్చినట్టు ఉండాలి, అనుకుంటాను నేను. తల పగిలిపోయే ఇన్ని వేధింపుల మధ్య ఉంటూ ఆమె ఉదయాన్నే వికసించిన పద్మంలా, చల్లని చిరునవ్వుతో ఆఫీసులో ప్రత్యక్షమవడం నాకు ఆశ్చర్యం కాదు.. ఒక అద్భుతంగా అనిపించింది. ఆవిడ గంభీరత వెనుక దాచి ఉంచిన సుడిగుండాలను, నిశ్శబ్దం వెనుక ఎగసిపడుతున్న అలజడిని ఎవరు అంచనా వేయగలరు. యశోద గారు ఎక్కువగా నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని కోరుకోవడానికి కారణం అర్థంచేసుకున్న నేను ఆవిడ ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు చాలా చిన్నవాడిగా అనిపించాను. ఆవిడ మీద పెరిగిన గౌరవంతో మనసులోనే నమస్కరించాను.

– చిరిగిన మంజుల
8500448513

➡️