గొంతెండుతున్న నేల

Mar 31,2024 10:19 #Farmer, #Poetry

నాడు ఎద నిండా నీళ్లు దాచుకొని
కర్షకుని కన్నీరు తుడిచిన నేల..
నేడు గొంతెండిపోయి గగ్గోలుపెడుతోంది!
వరిపైర్లతో పచ్చగా పంటలు పండిన నేల..
నెర్రెలు బారి అవస్థలు పడుతోంది!
హాలికుడి దేహం నుండి జారిపడిన
చెమట చుక్కలు..
పంటకు పానం పోస్తున్నయి!
కాలేశ్వరం జలధారలు ఎక్కడని ప్రశ్నిస్తున్నయి!
నేలను దున్నితే ఏరులై పారిన ధాన్యపురాసులు..
రేపు వాటి జాడెక్కడో.. ఎండమావులైనయి!
ఇన్నాళ్ళూ పచ్చని పందిరై
దర్శనమిచ్చిన మాగాణి..
నేడు ఎడారిలా మారి ఏడుస్తోంది!
భూమిని నమ్మి బతుకుగీతాన్ని ఆలపిస్తున్న
భూమిపుత్రుడు.. నీరందక
గుక్కప్పట్టి ఏడుస్తున్న
బువ్వచెట్లను బుజ్జగిస్తున్నడు!
ఇప్పుడిప్పుడే కాంతి నిండుతున్న కళ్లలో
చీకటి మబ్బులు మళ్ళీ మొలుస్తున్నయి!
పాలపొంగులా పొంగిన జలమంతా..
రాజకీయ కక్షలో చిక్కుకొని ఆవిరైపోతోంది!
ప్రకృతమ్మను పచ్చని జాడేదని అడిగితే..
గర్వంగా మాగాణివైపు చూపించేది..
మదిలో మెదిలిన కళల్ని
నేలమీద మొలిపించిన పంటకాపు..
కళ్ళముందే పంట ఎండుతుంటే..
సగం సచ్చిన మనిషై
దారం తెగిన గాలిపటమై సంచరిస్తుండు!
కొత్త కరువు ఋతువొక్కటి వచ్చి
దుఃఖపు జీవితాన్ని..
మోసుకొస్తుందని అనుకోలేదు!
కాలం మనుషుల రూపంలో వచ్చి
కాటేస్తుందని ఊహించలేదు!
ఇపుడు నీళ్ల కోసం..
యుద్ధం పాట పాడాలని ఉంది!
స్వేదాన్ని జలంగా పారిస్తున్న అన్నదాతకు
గొంతుకనై కలిసి పోరాడాలని ఉంది!
మట్టితాలూకు కష్టాన్ని అనుభవిస్తున్న
కర్షకుని కన్నీటిని తుడిచి
కాలికి గజ్జెకట్టి ఆడాలనివుంది!
కక్షల చట్రంలో పడి
కర్షకుని కన్నీరుపెట్టిస్తే…
బాధపడేవి మన హృదయాలే..
ఎండేవి మన గొంతుకలే..
ఆకలితో అల్లాడేది మన కడుపులే..
భూమాత పొరల్లో
నిక్షిప్తమైంది రైతన్న స్వేదం..
అదే అయింది మనకు ప్రాణంపోసే సేద్యం..
అన్నదాతతో ఆటలొద్దు..
ప్రాణదాతతో పరాచికాలొద్దు..!

  • అశోక్‌ గోనె, 9441317361
➡️