త్యాగమయి అమ్మ

May 12,2024 09:45 #COVER STORY, #Sneha

‘ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మ అను రాగంకన్న తీయని రాగం..’ నిజమే కదా. ఆకాశమంత ప్రేమను పంచే అమ్మ గురించి అక్షరాల్లో వర్ణించలేము. పుట్టే ప్రతి జీవికీ దిక్సూచి తల్లే. ప్రతిజీవికీ తన మొదటి గుండె చప్పుడుతో ప్రారంభమయ్యే బంధం అమ్మ. గడిచిన ప్రతి క్షణంతో మరింత బలంగా పెరుగుతుంది. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. మాటల్లో చెప్పలేని బంధం తల్లీ బిడ్డలది. అందుకే తల్లే బిడ్డకు తొలి గురువు.  ఈ రోజు మదర్స్‌ డే. అయినా నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన తల్లిని ఒక్క రోజు గుర్తు చేసుకుంటే సరిపోతుందా ?.. అమ్మ తన పిల్లల కోసం పడే తపనకు, వారి ఉన్నతి కోసం చేసే కష్టానికి జీవితకాలం అమ్మకు సేవ చేసినా సరిపోదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఆమె మనకు అందించే ప్రేమలో కొంచెం తిరిగిచ్చినా చాలు. ఆ తల్లి గుండె సంతోషంతో నిండిపోతుంది. రెక్కలు ముక్కలు చేసుకుని, పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడకను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి నిత్యం త్యాగం చేస్తూనే ఉంటుంది. ఏ చిన్న తప్పుచేసినా కడుపులో దాచుకుని కాపాడుతుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం. అటువంటి అమ్మ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ‘మదర్స్‌డే’గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ వారం ప్ర్రత్యేక కథనం...

పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదన మరిచిపోయే అమ్మ గురించి చెప్పాలంటే అక్షరాలు సరిపోవు. మాటలకు అందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొమ్మిది నెలలే కాదు.. జీవితాంతం బిడ్డ చెయ్యి పట్టుకుని, పడిపోకుండా చూస్తుంది. పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యడానికి అనుక్షణం పరితపించిన అమ్మలకు పాదాభివందనాలు. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా.. కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా..’ అంటూ మరొకరు అమ్మ గొప్పతనాన్ని పాటల ద్వారా వ్యక్తం చేశారు.
బిడ్డకు బాధ కలిగినా, ఆకలి వేసినా ముందు అమ్మకే తెలుస్తుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది. అందుకే అమ్మ పట్ల ప్రేమానురాగాలతో, గౌరవంతో మసులుకోవాలి. తల్లి ప్రేమ నిస్వార్థమైనది, అచంచలమైనది. అదే బిడ్డకు బలమవుతుంది. జీవితంలో అడ్డంకులను అధిగమించేలా చేస్తుంది. నిద్ర వేళలో పాడే లాలిపాటల్లో, కన్నీళ్లను తుడిచే ఓదార్పు కౌగిలిలో, అల్లరి చేస్తే భరించే సహనంలో, మార్గనిర్దేశంలో, విలువైన పాఠాలను బోధించడంలో అనుక్షణం అమ్మ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. అది బిడ్డలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. తల్లి ప్రేమ త్యాగపూరితమైనది. తన స్వంత అవసరాలను పక్కన పెట్టి, పిల్లల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తుంది. అటువంటి అమ్మలను తిరిగి ప్రేమించడమే పిల్లల కర్తవ్యం. ఇంటి పనంతా మీద వేసుకుని చేసే అమ్మలకు ‘మేమున్నాం..’ అంటూ కుటుంబసభ్యులు ఉండాలి. ప్రతిరోజూ పనిలో సహాయం చేయాలి. అదే ఆమెకు మనమిచ్చే పెద్ద బహుమతి.

విలువ ఇవ్వండి..
బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆమెకు కంటి నిండా నిద్ర ఉండదు. ఆహారం ఉండదు. అయినా బిడ్డ సంరక్షణలో మాత్రం నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. బిడ్డను వదిలి వెళితే ఎక్కడ కిందపడతారో, నోట్లో ఏం పెట్టుకుంటారోనని కంటికి రెప్పలా కాచుకూర్చుంటుంది. బిడ్డ బుడిబుడి అడుగులు వేయడం చూసి మురిసిపోతుంది. ఆడితే ఆనందిస్తుంది. ముద్దు ముద్దు మాటలు విని మైమరచిపోతుంది. పొరపాటు చేస్తే ‘అది తప్పు’ అని సరిచేస్తుంది. భయపడుతున్న వేళల్లో ధైర్యాన్ని నూరిపోస్తుంది. తన జీవితానుభవ పాఠాలు చెబుతుంది. పిల్లల యుక్తవయస్సులో స్నేహితురాలిలా అర్థం చేసుకుంటుంది. ప్రతి నాయకుని వెనుక ఒక తల్లి ఉంటుంది అంటారు.  సర్దార్‌ భగత్‌ సింగ్‌ తల్లి విద్యావతి ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక. దేశ స్వాతంత్య్రం కోసం సంతోషంగా ప్రాణ త్యాగం చేసేంత ధీరత్వం ఆమె నుంచే పుణికి పుచ్చుకున్నారు భగత్‌సింగ్‌.
‘నా జ్ఞాపకశక్తిపై మా అమ్మ ఉంచిన అత్యద్భుతమైన ముద్ర సాధుత్వం’ అంటారు మహాత్మాగాంధీ. తల్లి పుతలీబాయి స్ఫూర్తితోనే జాతిపితగా నిలిచారాయన. ప్రస్తుత సమాజంలో అటువంటి అమ్మలకు కుటుంబంలో ప్రాధాన్యత సమానంగా ఉందా? అంటే ‘లేదు..’ అనే చెప్పాలి. ఒకప్పుడు భారతీయ సమాజంలో స్త్రీ భార్యగా, తల్లిగా ఇంట్లోనే ఉండేవారు. కానీ కాలక్రమేణా మార్పు వచ్చింది. కుటుంబంలో స్థిరమైన అభివృద్ధి కోసం, పిల్లల జీవన నాణ్యతకు తల్లి కీలకంగా వ్యవహరిస్తోంది. బయటకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. కుటుంబం ఆరోగ్యంగా ఉండేలా వంట విషయాల్లో జాగ్రత్తలు వహిస్తున్నారు. నిద్ర లేవగానే ఇంటి పనులు చక్కబెట్టడం, పిల్లల్ని చదివించడం చేస్తున్నారు. కానీ కొన్ని కుటుంబాల్లో నిర్ణయాత్మక విషయాల్లో అమ్మలకు ప్రాధన్యత ఇవ్వడం లేదు. ‘వారికి ఏమీ తెలియదు..’ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ తీరు మారాలి. ఆర్థిక విషయాల్లోనూ ఆమెను భాగస్వామ్యం చేయాలి.

సమయం ఇవ్వండి
అమ్మ… పిల్లలు పుట్టినప్పటి నుంచీ వారే ప్రపంచంగా బతుకుతుంది. బిడ్డ ఆకలి తీర్చిన తర్వాతే తాను తింటుంది. అటువంటి త్యాగమూర్తిని పిల్లలు ఎలా చూసుకోవాలి? రకారకాల పనుల బాధ్యతల్లో కాలం వెంట పరుగులు తీస్తున్న పిల్లలు తమ అమ్మలకు నాణ్యమైన సమయం కేటాయిస్తున్నారా? లేదా? అనేది కూడా ప్రశ్నించుకోవాలి.
ఈ కాలంలో తల్లులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక రకంగా వారిపై ఒత్తిడి పెరుగుతోంది. అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగ బాధ్యతలను చూసుకోవడం ఓ సవాలు. అయినా తమ ప్రయాణం సాగిస్తున్నారు. కార్పొరేట్‌ దోపిడీ విచ్చలవిడి అయిన తర్వాత ముఖ్యంగా మనిషి అంటే మనిషికి పట్టనితనం పెరిగింది. ఈ క్రమంలో కన్నతల్లి కూడా కొందరు పిల్లలకు పనికిరాని మనిషైంది. తల్లిని వృద్ధాప్యంలో చూడటం అనేది ఓ సమస్యగా కొందరు భావిస్తున్నారు. ‘గొడవ చేస్తుంది.. నస పెడుతోంది. తిడుతుంది.. విసిగిస్తుంది..’ అంటూ పిల్లలు దూరం పెడుతున్నారు.

తమ ఉన్నతి కోసం అమ్మ జీవితాన్నే త్యాగం చేస్తే, చివరకు తల్లినీ చూడలేని స్థితిలోకి పిల్లలు దిగజారుతున్నారు. తల్లి ఆస్తి కోసం గొడవపడుతున్న బిడ్డలూ లేకపోలేదు. ఇటువంటి ఘటనలు విన్నా.. చూసినా.. మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందేమో అనిపిస్తోంది. ఆస్తిలోనే కాదు.. తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కొడుకులతో పాటు కూతుళ్లకీ ఉంటుంది. అందుకు కూతుళ్లకు వారి భర్తలు సహకరించాలి. అలాగే కూతుళ్లు తమ తల్లిదండ్రులతోపాటు అత్తమామలనూ ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లలు పరిస్థితుల రీత్యా ఇంటికి దూరంగా ఉన్నా.. అమ్మకు దూరమయ్యాము అన్న భావన కలగకుండా ఫోన్‌లో నిత్యం కొంత సమయం కేటాయించాలి. ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వయస్సు పైబడుతున్న కొద్దీ ప్రేమపూర్వక మాటలతో దగ్గరకు తీసుకోవాలి. అప్పుడే అమ్మలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

ఒంటరి తల్లుల కోసం…
‘అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే..’ అని కవి సి.నారాయణరెడ్డి అన్నారు. అలాంటి తల్లులు ఒంటరైనప్పుడు పిల్లల్ని పెంచడం వర్ణనాతీతం. నేటి సమాజంలో ఇంటా, బయటా అన్ని పనులూ ఆడవాళ్లు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన పనుల్లో ‘మగవాళ్లు ఉంటే బాగుండు.., మగవాళ్లు చేత చేయిస్తేనే సరైనది’ అంటూ సమాజం నుంచి ఎదురౌతుంది. మహిళలను పురుషులతో సమానంగా చూడనప్పుడే ఇటువంటి అభిప్రాయాలు వస్తాయి. భర్త హింస పెడుతున్నా.. ఓపికతో సహించాలంటుంది సమాజం. భర్త నుంచి విడిపోతే.. ఆమెనే అనుమానిస్తుంది, అవమానిస్తుంది. ఆమె గుండెచాటు బాధను అర్థంచేసుకునే వారు చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో ఒంటిరిగా పిల్లల్ని పెంచడం అంటే అనుభవించేవారికే ఆ కష్టం తెలుస్తుంది. చుట్టూ ఎన్ని అంటున్నా మౌనంగా భరిస్తూ.. పిల్లల కోసం తాను జీవిస్తుంది. ఈ అవనిలో అరుదైన, అవధులు లేని, అనిర్వచనీయమైనది అమ్మ ప్రేమ. అలాంటి ఒంటరి తల్లులను పిల్లలే అర్థం చేసుకోవాలి. తోడుగా, అండగా నిలబడాలి.

చట్టాలున్నా…
వృద్ధుల భృతి సంరక్షణ చట్టం- 2007 ప్రకారం.. వృద్ధులైన తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి జీవన భృతి, పోషణ, వైద్య సదుపాయాల ఖర్చులను పొందవచ్చు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, వారి పోషణ భారంగా భావించి, ఇంటి నుంచి గెంటేసినా ఆ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందవచ్చునని కోర్డులు స్పష్టం చేశాయి.
పిల్లలు తమ తల్లిదండ్రులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని రుజువైతే మూడు నెలల జైలు, ఐదు వేల రూపాయల వరకు జరిమానా / రెండూ విధించే అవకాశం ఉంది. పోషిస్తామని నమ్మించి, ఆస్తులు తమ పేరు మీద రాయించుకుని, ఆ తర్వాత వారిని విస్మరిస్తే.. ఆ ఆస్తికి సంబంధించిన దస్తావేజులు రద్దవుతాయి. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కేసులను కోర్టులు సుమోటోగానూ స్వీకరించవచ్చు. పోలీసులు, తహసీల్దార్లు, న్యాయవాదులు, సామాన్యపౌరులు బాధితుల తరుపున న్యాయపోరాటం చేయవచ్చు కూడా. ఎన్ని చట్టాలున్నా తల్లిదండ్రులు తమ బిడ్డల మీద ఉన్న నమ్మకం, ప్రేమతో కోర్టులను ఆశ్రయించడం లేదని ఓ సర్వే చెబుతుంది. అందుకే పిల్లల్ని విద్యార్థి దశలో ఉన్నప్పుడే తల్లి విలువ చెప్పాలి. అటువంటి పాఠాలను పుస్తకాల్లో చేర్చాలి. అప్పుడే అమ్మతో ఎలా ఉండాలో వారి మనసుల్లో నాటుకుంటుంది. పాలకులూ పిల్లలు లేని వృద్ధులైన అమ్మల కోసం సౌకర్యాలు కల్పించాలి. మాతృదినోత్సవం నాడే కాదు అమ్మ మీద ప్రేమ నిత్యం ఉండాలి. ఎందుకంటే నిస్వార్థమైన, త్యాగమూర్తి అయిన అమ్మకు ఏదీ ఇచ్చినా తక్కువే. అందుకే తిరిగి అమ్మను ప్రేమిద్దాం.

చరిత్ర
‘జూలియవర్డ్‌ హూవే’ అనే మహిళ ప్రపంచ శాంతి కోసం మదర్స్‌డే నిర్వహించాలని అమెరికాలో 1872లో ప్రతిపాదించింది. ఆ తర్వాత పశ్చిమ వర్జీనియాకు చెందిన అన్నా జార్వీస్‌ అనే మహిళ జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు ఇచ్చే రోజు కావాలని జనంలోకి వచ్చింది. అన్నా జార్విస్‌ తన తల్లిదండ్రుల 13 మంది సంతానంలో ఒకరు. వీరిలో తొమ్మిది మంది టీబీ, ఇతర అనారోగ్యాలతో చిన్నతనంలోనే మరణించారు. అది చూసి ఆమె తల్లి కుంగిపోయేది. తన బిడ్డలను కాపాడుకోలేకపోతున్నానే బాధ వెంటాడుతూ ఉండేది. మిగిలిన బిడ్డలకు రోగాలు, టీబీ రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేది. 1905లో తల్లి మరణించినప్పుడు నలుగురు పిల్లల్లో అన్నా జార్విస్‌ తన తోబుట్టువుల బాధ్యత తీసుకున్నారు. తన తల్లి స్ఫూర్తితో అమ్మ ఆశయాన్ని కొనసాగిస్తానని మాటిచ్చారు. తల్లి చేసిన త్యాగం, పడిన కష్టం చూస్తూ పెరిగిన జార్విస్‌ అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని ప్రతిపాదించారు. ఇదే స్లోగన్‌తో మదర్స్‌ డే ఏర్పాటుకు, ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని 1890లో విస్తృతంగా ప్రచారం చేశారు ఆమె.

తొలిసారి మదర్స్‌ డేను 1910లో పశ్చిమ వర్జీనియాలో ఒక చర్చిలో జరుపుకున్నారు. 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో మదర్స్‌డే ఒక సంప్రదాయంగా మారింది. 1914లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ మాతృ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. అన్నా కోరినట్లు జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించడం జరిగింది. కాలక్రమేణా ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం ప్రపంచ వ్యాపితంగా మాతృ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

చైతన్య ప్రతీక గోర్కీ ‘అమ్మ’
ప్రపంచంలోనే తొలి శ్రామికవర్గ నవల ‘అమ్మ’. శ్రామికవర్గం నిర్మాణానికి అమ్మ ఏవిధంగా సహాయపడిందో ఇందులో కళ్లకు కట్టినట్టు చెప్పారు రచయిత మాక్సిం గోర్కీ. రచయిత దృష్టిలో ‘అమ్మ’ అంటే వాస్తవం, సమాజం కాబట్టి. రష్యాలో విప్లవ వాస్తవాలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. నిజ్నినోవా గ్రాడ్‌లో ఫ్యాక్టరీ యాజమాన్యం సాగిస్తున్న శ్రమదోపిడీని, కార్మికుల పట్ల కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుని తల్లి నీలోవ్నా-తన కొడుకు పావెల్‌ విప్లవకారుడిగా తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. కొడుకు కోసం వచ్చే రకరకాల మనుషులూ, వారి మాటలూ చేతలూ చర్చలూ వాదనలూ అన్నీ గమనిస్తూ వారికి అవసరమైనవి అమరుస్తూ ఉంటుంది. వారంతా ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించేందుకు పోరాడుతున్నారని అర్థం చేసుకుని వారికి అండగా నిలుస్తుంది.

కొడుకుని పూర్తిగా నమ్ముతుంది తల్లి నీలోవ్నా. కొడుకు కోసం కార్మికులు, రైతులూ ఉన్నత వర్గీయులూ రకరకాల మనుషులు, స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు వారందరినీ తల్లిలా ఆదరిస్తుంది. అందుకే వారంతా పావెల్‌ తల్లిని ‘అమ్మ’ అని పిలిచేవారు. అందుకే ప్రపంచంలోని కార్మికులంతా ఓ తల్లీబిడ్డల్లా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుంది. ఇలాంటి అమ్మలు ఎందరో విప్లవానికి పునాదులయ్యారు. అమ్మ పుస్తకంలోని ప్రతి పాత్రా, ప్రతి పరిణామమూ గోర్కీ వాస్తవ జీవితంలో పరిశీలించి తెలుసుకున్నదే.

పరీక్షలు రాయించి..
తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. అంతేకాక పిల్లలను పెంచి పెద్ద చేసే క్రమంలో తాను ఇబ్బందులు పడుతుంది. అయినా బిడ్డల సంతోషం కోసం అలాంటి కష్టాలు ఎన్నో అనుభవిస్తుంది. అలానే కొందరు మాతృమూర్తులు తమ బిడ్డ అంగవైకల్యంతో పుట్టినా అల్లారుముద్దుగా పెంచి. పెద్ద చేసుకుంటారు. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ఆ మాటను నిజం చేసింది పద్మ. ఈమె తెలంగాణ రాష్ట్రం, చింబోలి గ్రామానికి చెందింది. ఆమెకు చరణ్‌ అనే కుమారుడు ఉన్నాడు. అతడికి పోలియో కారణంగా చిన్నతనంలోనే కాళ్లు పూర్తిగా పడిపోయాయి. అలానే చరణ్‌ పుట్టిన ఏడాదికే పద్మ భర్తను కోల్పోయింది. ఇలా భర్త మరణం, బిడ్డ అంగవైకల్యంతో పద్మ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, బిడ్డను పెంచింది. స్థానికంగా బీడీలు చుడుతూ ఆ తల్లి.. తన బిడ్డ బాగోగులు చూస్తోంది. అలా చరణ్‌ను చదివిస్తుంది. ఈ సంవత్సరం చరణ్‌ పదో తరగతి పరీక్షలు రాశాడు. చరణ్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి, తీసుకొచ్చింది. పూర్తిగా నడవలేని చరణ్‌ని పద్మ రోజూ తన చేతులపై పసివాడిని మోసినట్లు మోస్తూ ఆటో ఎక్కించి, తీసుకొచ్చి పరీక్షలు రాయించింది. ‘ఇది కదా! అమ్మ ప్రేమంటే’ అంటూ చూపురులు మొచ్చుకున్నారు.

ప్రాణాలకు తెగించి
బీహార్‌కు చెందిన ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైంది. బార్హ్‌ రైల్వేస్టేషన్‌లో విక్రమశిలా ఎక్స్‌ప్రెస్‌ కోసం వేచి ఉన్నారు. అప్పుడే రైలు వచ్చింది. రైలులోకి ఎక్కేందుకు ప్లాట్‌ఫామ్‌ మీద ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆ గుంపులో ఇరుక్కుపోయింది. అయితే అనుకోకుండా అక్కడి నుంచి జారి, రైలు పట్టాలపై పడిపోయింది. అప్పుడే రైలు కూడా కదలడం ప్రారంభించడంతో.. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా తన బిడ్డలను కాపాడుకోవాలని, వెంటనే పక్కన పడిపోయిన ఇద్దరు బిడ్డలను దగ్గరికి తీసుకుని, వారిని రెండు పట్టాల మధ్యలో ఉంచింది. వారు పైకి లేవకుండా తాను బిడ్డలపై పడుకుంది. రైలు వారిపై నుంచి పూర్తిగా వెళ్లిపోయేవరకూ అలాగే కదలకుండా ఉంది. వారికి అతి దగ్గరగా.. వెంట్రుకవాసిలో రైలు వెళ్లింది. చివరికి రైలు వెళ్లిపోయాక.. అక్కడ ఉన్న ప్రయాణికులు.. ఆ మహిళతోపాటు ఇద్దరు పిల్లలను సురక్షితంగా ప్లాట్‌ఫాంపైకి తీసుకువచ్చారు. ఈ ఘటన చూసిన వారంతా ‘బిడ్డ కోసం తల్లి ప్రాణత్యాగానికైనా వెనకాడదు’ అంటూ కొనియాడారు.

పాటల్లో..
అమ్మని, ఆమె ప్రేమని వర్ణిస్తూ సినీ రచయితలు గొప్ప సాహిత్యాన్ని అందించారు. ప్రతి పాటా హృదయానికి హత్తుకునేదే.. మళ్లీ మళ్లీ వినాలిపిస్తోంది. ఇటువంటి సాహిత్యాన్ని అందించిన గేయ రచయితలకి అభినందనలు.
”పాండురంగ మహాత్యం” సినిమాలో ‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా…ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా ..’, ”20వ శతాబ్దం” సినిమాలో ‘అమ్మను మించి దైవమున్నదా..ఆత్మను మించి అద్దమున్నదా..’ ”ముగ్గురు మొనగాళ్లు”లో ‘అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన.. నాన్నంటే నీలాకాశం తల వంచేనా’, ”అమ్మా, నాన్నా ఓ తమిళ అమ్మాయి” సినిమాలో ‘నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం’, ”రఘువరన్‌ బి.టెక్‌.”లో ‘అమ్మా అమ్మా నీ పసివాడినమ్మా నువ్వే లేక వసివాడానమ్మా..’, ”బిచ్చగాడు” సినిమాలో ‘కోట్ల సంపద అందించినా.. నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మా.. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా.. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా..’, ఈ విధంగా మరెన్నో అద్భుతమైన అమ్మ గొప్పతనాన్ని తెలిపే పాటలు ఉన్నాయి.

పద్మావతి
9490559477

➡️