పద పదవే గాలిపటమా…!

Jan 13,2025 07:11 #Sneha, #Stories

జనవరి 14న అంతర్జాతీయ గాలిపటాల దినోత్సవం..

పంచవన్నెల పతంగులకు మాంజా దారం కట్టి, ఆకాశంలోకి ఎగరేస్తుంటే.. ఎవరికైనా తామే ఆకాశంలో ఎగురుతున్నంత ఉత్సాహం కలుగుతుంది. ఇంద్రధనుస్సు రంగుల్లా వైవిధ్యంగా రూపుదిద్దుకున్న గాలిపటాలను మనదేశంలో సంక్రాంతి పండగ రోజుల్లో పెద్దలు, పిల్లలతో పోటీ పడుతూ ఎగరేస్తారు. ‘పద పదవే ఒయ్యారి గాలిపటమా!’ అని సముద్రాల వారు చెప్పినట్లు.. ఆకాశంలో పక్షిలాగా ఎగిరే ఈ గాలిపటాల కోసం కొన్ని దేశాల్లో ఉత్సవాలు జరుపుతారు. అలా గాలిపటాలు ఎగరేయడంలో రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మరి కొన్ని దేశాలు దీనిని క్రీడగా ప్రోత్సహిస్తున్నాయి. మనం మాత్రం ప్రతి ఏడాదీ జనవరి 13న భోగిరోజున జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

మొదట్లో ఎండిన ఆకులను పతంగులుగా
ఎగరవేసేవారట. ఆ తర్వాత వార్తాపత్రికలను చింపి కొబ్బరి ఈనెలు, ఉడకబెట్టిన మైదాపిండిని ఉపయోగించి పతంగులు తయారుచేసుకునే వాళ్లు. ఇప్పుడు మార్కెట్లో కొన్ని వేల రకాల గాలిపటాలున్నాయి. వాటికి విభిన్నమైన పేర్లు కూడా ఉన్నాయి. రెండు కళ్లున్న గాలిపటాన్ని ‘గుడ్లందార్‌’ అని, ఒంటికన్ను ఉన్నదాన్ని ‘గుడ్డి లంగోటి’ అని, పెద్ద పతంగిని ‘అద్దా’ అని పిలిచేవారు. ఇవే కాదు.. విభిన్నమైన రకాల్లో, వర్ణాల్లో ఎన్నో గాలిపటాలు మార్కెట్లో కొలువుదీరతాయి. అయితే కాలక్రమేణా ఇలాంటి పతంగులు అరుదుగానే కనిపిస్తున్నాయి. మోడ్రన్‌ గాలిపటాలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. పగలే కాదు.. రాత్రి పూట ఎగరేయడానికి కూడా ప్రత్యేకమైన గాలిపటాలు రూపొందుతున్నాయి. చిన్న చిన్న ఎల్‌ఈడీ లైట్లతో వెలిగిపోతూ ఎగిరే పతంగులు చీకట్లో మిలమిలా మెరిసే నక్షత్రాలను తలపిస్తాయి.

పిల్లలకు ఆరోగ్యం..
సంక్రాంతి చలికాలంలో వస్తుంది. ఆ కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటాయి. సూర్యరశ్మి మన శరీరాన్ని తాకే సమయం కూడా తక్కువే. అందుకే ఉదయం పూట లేలేత సూర్య కిరణాలను ఆస్వాదిస్తూ పతంగులను ఎగరేయడం వల్ల సూర్యరశ్మి నుంచి విటమిన్‌ ‘డి’ ఎక్కువగా అందుతుంది. ఎండ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందచ్చు. ఎగిరే గాలిపటాలను వీక్షించడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. ఏడాది పొడవునా తమ ఆశలూ, ఆశయాలూ కూడా గాలిపటాల్లా ఎత్తుగా ఎగరాలన్నంతగా పిల్లలు సంబరపడిపోతారు. రకరకాల ఆకారాల్లో పతంగులను ఎగరవేస్తూ, ఆకాశంలో అవి చేసే విన్యాసాలు చూస్తూ కేరింతలు కొడతారు. పెద్దలు కూడా పిల్లలతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. పిల్లల కన్నా పెద్దవాళ్లే వీటిని ఎక్కువగా ఎగరవేస్తున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంటే పతంగులంటే ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది.

వివిధ చోట్ల.. విభిన్నంగా..
పురాతనమైన క్రీడల్లో గాలిపటాలు ఒకటి. మూడు వేల ఏళ్ళ్లుగా మానవులు గాలిపటాలను ఎగరవేస్తున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాడు, రాజస్థాన్‌, గుజరాత్‌లలో కూడా సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగురవేస్తారు. గుజరాత్‌లో ‘ఉత్తరాయణ్‌’ పేరుతో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. తెలంగాణ, రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో గాలిపటాలను ఎగరేయడంలో ఒక వేడుకగా సిద్ధమవుతాయి. అయితే అహ్మదాబాద్‌లో పతంగుల పండగ జనవరి 13న మొదలై మూడు రోజుల పాటు జరుగుతుంది. జనవరి 13న అక్కడ జాతీయ సెలవు రోజుగా ప్రకటించింది. ఇక్కడ 2012లో అత్యధికంగా 42 దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు పతంగుల పండగలో పాల్గొని రికార్డుల కెక్కారు. సబర్మతీ తీరంలో ఎన్నో వేల గాలి పటాలను ఒకేసారి ఎగరేసి- చూపురులను ఆకట్టుకుంటారు. ఇక్కడకు ప్రతిఏడాది ఐదు లక్షల మంది ప్రేక్షకులు గాలిపటాలను చూసేందుకే వస్తుంటారు.

చైనాలో పెద్ద మ్యూజియం..
అంగరంగ వైభవంగా పతంగుల పండగ జరుపుకునే దేశం చైనా. ఏప్రిల్‌లో వారం రోజుల పాటు పండగను ఇంటిల్లిపాదీ ఎంతో వేడుకగా జరుపుకొంటారు. దీనికి సంబంధించి ప్రముఖమైన నగరం వైఫాంగ్‌. పతంగుల ఉత్సవాల సమయానికి దేశవ్యాప్తంగా చాలా మంది టూరిస్టులు ఇక్కడికి చేరుకుంటారు. ఎన్నో రంగుల్లో, సైజుల్లో, ఆకారాలతో గాలిపటాలు కనువిందు చేస్తాయి. వీటిలో ఎక్కువగా కనిపించేవి డ్రాగన్‌ కైట్లే. స్వహస్తాలతో చేసిన గాలిపటాలకు డిమాండ్‌ ఎక్కువ. నగరమంతా దీపాలతో అలంకరిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా ‘వైఫాంగ్‌ కైట్‌ మ్యూజియం’ పేరు తెచ్చుకుంది. ఇక్కడ అనేక రకాల గాలిపటాలను చూడవచ్చు.

అంతర్జాతీయంగా..
నేడు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న క్రీడల్లో ఒకటి గాలిపటాలను ఎగరవేయడం. అయితే జపాన్‌లో బరువుగా ఉండే పతంగులు ఎక్కువ. కొన్ని గాలిపటాలు రెండు టన్నుల బరువుంటాయి కూడా. 600 మీటర్ల పొడవున్న గాలిపటాలను ‘చైనా’ అని పిలుస్తారు. గతంలో జపాన్‌లో ఓ కంపెనీ తయారు చేసిన గాలిపటం గంటకు 193 కిలోమీటర్ల వేగంతో.. సుమారు 180 గంటలపాటు గాల్లో ఎగురవేసి రికార్డు సృష్టించింది. మరో కంపెనీ వరుసలో 11,284 గాలిపటాలను ఎగరేసి రికార్డుల్లోకి ఎక్కింది. థాయిలాండ్‌లో పతంగులను ఎగరేయడంలోనూ 78 నియమాలు ఉన్నాయి. గాలిపటం ఎగరేయడం ఓ సరదానే కానీ జపనీయులకు మాత్రం బిడ్డల ఆరోగ్యం కోసం ప్రార్థించే క్రతువు. గాలిపటం ఎంత పైకి ఎగిరితే బిడ్డడి ఆరోగ్యం అంత బాగుంటుందని వారి నమ్మకం. ప్రత్యేకంగా ‘రొక్కాకు’ అనే పోటీ పతంగులు ఫేమస్‌.

ప్రతి ఏటా ఐదు కోట్ల కైట్స్‌..
అమెరికాలో పతంగుల పండగకు కేరాఫ్‌ అడ్రస్‌గా వాషింగ్టన్‌ నిలుస్తుంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆగస్టు 3వ వారం గాలిపటాల పండగను నిర్వహిస్తారు. దాదాపు 45 కిలోమీటర్ల పొడవున్న ‘లాంగ్‌ బీచ్‌ పెనిన్సులా’ ఈ వేడుక కోసం ముస్తాబవుతుంది. అంతర్జాతీయ కైట్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఓటింగ్‌లో వాషింగ్టన్‌ పతంగుల పండగ గొప్పదిగా మొదటి స్థానాన్ని పొందింది. పిల్లలూ పెద్దలూ రకరకాల గాలిపటాలను ఎగరవేస్తూ సంతోషిస్తుంటారు. పతంగుల చరిత్ర, కళ, శాస్త్రానికి సంబంధించి అనేక అంశాలను తెలియజేసే ‘వరల్డ్‌ కైట్‌ మ్యూజియం’ కూడా ఇక్కడే ఉంది.

టూరిస్టులతో సందడి..
ఏటా జులై నెలలో ఇండోనేషియాలో అంతర్జాతీయ స్థాయిలో పతంగుల పండగ నిర్వహిస్తారు.. రాజధాని జకార్తాలో రెండు రోజుల పాటు ఈ పండగను జరుపుకొంటారు. ఈ వేడుకలో చైనా, మలేషియా, జపాన్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల నుంచి విదేశీ టూరిస్టులు పాల్గొంటారు. అయితే ప్రతిసారీ అతి పెద్ద డ్రాగన్‌ గాలిపటాన్ని జకార్తా నీలాకాశంలో ఎగరవేయడం ఇక్కడ ఆనవాయితీగా నడుస్తోంది.
ఇండోనేషియాలో భాగమైన బాలి ద్వీపంలో మాత్రం దేవతలకు సందేశం పంపే క్రతువుగా ఈ పండగను భావిస్తారు. ‘లయాంగ్‌- లయాంగ్‌’గా పేర్కొనే ఈ గాలిపటాల పండగను ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తారు. మొదటి వారం స్థానికులకు, రెండో వారం విదేశీ టూరిస్టుల కోసం నిర్వహించడం విశేషం.

సినిమాల్లో పాటలు
గాలిపటం పాటలు సినిమాల్లో చాలా ఉన్నాయి. ‘తోడికోడళ్లు’లో ‘గాలిపటం గాలిపటం రయ్యిన ఎగిరే గాలిపటం’ అనే అక్కినేని పాట, ‘కులదైవం’లో హీరో చలం ‘పద పదవే ఒయ్యారి గాలిపటమా’ పాటలు నేటికీ హిట్‌ సాంగ్సే. ‘చంద్రముఖి’లో ‘చిలుకా పద పద మైనా పద పద’ అని రజనీకాంత్‌ కూడా గాలిపటాలు ఎగురవేస్తారు.

గాలిపటం- జీవిత పాఠం
ఆకాశంలో పక్షిలా విహరించే గాలిపటం మనకు ఎన్నో జీవిత పాఠాలను కూడా నేర్పుతుంటుంది. మన లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని.. గాలిపటం చెబుతుంది.
– గాలిపటం ఎగరేస్తున్నప్పుడు ఎలాగైతే పట్టు బిగిస్తామో.. మన జీవితంపై కూడా అలాగే పట్టు బిగించి ముందుకు సాగాలి.
– జీవితంలో అన్ని విషయాలు మనకు అనుకూలంగా జరగవు. కానీ అన్నింటినీ భరిస్తూ.. ఓపికగా, శ్రద్ధగా పైకి ఎదగడానికి ప్రయత్నించాలని చెబుతుంది గాలిపటం.
– ఇవే కాదు.. పతంగులు ఎగరేయడం బృంద స్ఫూర్తిని కూడా పెంచుతుంది.

జాగ్రత్తలు
వీటిని ఎగరేసే సమయంలో దారం జంతువులకు, మనుషుల మెడకు చుట్టుకుని గాయాలతో పాటు ప్రాణాలు పోయిన ఘటనలు జరిగాయి. కొండలు, డాబాలు ఎక్కి ఎగురవేస్తున్న సందర్భాల్లో జారి కిందపడిన సంఘటనలూ ఉన్నాయి. విద్యుత్‌ తీగలకు, చెట్ల కొమ్మలకు తగిలి ప్రమాదాలు సంభవించవచ్చు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లోనే ఎగరేయాలి. పిల్లలు ఎగురవేస్తున్నప్పుడు పెద్దల పర్యవేక్షణ ఉండాలి.
ఇలా పిల్లల నేస్తాలు అయిన గాలిపటాలను ఇప్పుడు ప్లాస్టిక్‌ షీట్‌తో తయారు చేస్తున్నారు.గానీ ఒకప్పుడు గాలిపటం అంటే రంగు కాగితమే. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, వంకాయ రంగు…. ముదురు రంగు కాగితాలతో తయారుచేసేవారు. వాటికి తోకలు తగిలించి దుకాణాల్లో అమ్మకానికి పెట్టి ఉంటే వాటి అందమే వేరు. పిల్లలు ‘నీది ఎరుపు… నాది పచ్చ’ అని తగాదాలు లేకుండా గుర్తుగా ఇళ్లల్లో దాచుకునేవారు. గాలిపటం, పతంగి, కైట్‌.. పేరు ఏదైనా రయ్యిన ఎగిరే గాలిపటం.. కాగితం పిట్ట అది. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరేద్దాం.

 

  • పద్మావతి
➡️