మంచి జీవనశైలి అలవాటు చేయాలి

Apr 27,2025 08:08 #Parenting, #summer holidays

ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు సవాల్‌తో కూడుకున్నది. మారుతున్న వేగవంతమైన జీవనశైలి, వాతావరణ కాలుష్యం పిల్లలపై ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు వారి ఆహారపు అలవాట్లతో పాటు దినచర్య విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి తల్లితండ్రికీ చాలా అవసరం. బాల్యం అనేది పిల్లలకు చాలా కీలకం. బాల్యం నుంచే తల్లిదండ్రులు వారికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పించాలి. బాల్యం నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడితే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఢోకా ఉండదు. అందుకు ఏం చేయాలో నిపుణులు ఇలా సూచిస్తున్నారు..

పిల్లల దినచర్యలో అత్యంత ముఖ్యమైన సమయం ఉదయం. వాళ్లు నిద్ర లేచిన దగ్గర నుంచి రోజంతా ఎలా ఉండబోతుందన్నది ఉదయమే డిసైడ్‌ చేస్తుంది. ఇందుకోసం పిల్లలకు ఉదయాన్నే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పించాలి. ఈ అలవాట్లు వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచడమే కాకుండా పిల్లలు కెరీర్‌ ఎదగుదలకు సాయపడతాయి. పిల్లలకు కచ్చితంగా తల్లిదండ్రులు ఉదయాన్నే నేర్పించాల్సిన కొన్ని అలవాట్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఉదయం మేల్కొనడం..
రాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. అయితే, వీటితో పాటు ఉదయం నిద్రలేవడానికి ఒక నిర్దిష్ట సమయం ఉండటం కూడా ముఖ్యం. పిల్లలు నిర్ణీత సమయానికి ఉదయం మేల్కొన్నప్పుడు, వారి దినచర్య ఓ ప్లాన్‌ ప్రకారం నడుస్తుంది. రోజూ ఒకే సమయానికి నిద్ర లేవడం వల్ల వాళ్ల శరీరం కూడా ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. అందుకే ఉదయం మేల్కొనే సమయాన్ని సెట్‌ చేయండి. దీంతో.. వారి జీవితం క్రమబద్ధంగా, మెరుగ్గా సాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పేగులు శుభ్రమవుతాయి. పేగుల కదలిక శరీరానికి ఎంతో మంచిది. ఇందుకోసం మీ పిల్లలకు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేయండి. ఈ ఒక్క అలవాటుతో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఫిట్‌గా ఉంటారు. పిల్లలు తమ పనులన్నీ చక్కగా చేసుకోగలుగుతారు. దీనితో పాటు పిల్లలు తరచూ మంచినీళ్లు తాగడం అనేది ఒక అలవాటుగా చేయాలి. నీళ్లు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ పోవడానికి దోహదపడతాయి. ఈ ఆరోగ్యకరమైన అలవాటు పిల్లలకు జీవితాంతం ఉపయోగకరంగా ఉంటుంది.

వ్యాయామం..
ఉదయపు నడక, వ్యాయామం వంటివి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. పిల్లలు చిన్నతనం నుంచే వీటితోపాటు ప్రాణాయామం వంటివి చేయడం మొదలుపెడితే శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా తయారవుతారు. ఉదయం దినచర్యను పూర్తి చేసిన తర్వాత, పిల్లలకు ప్రాణాయామం వంటివి చేయడం నేర్పండి.

ఆరోగ్యకర అల్పాహారం..
పిల్లలు ఉత్సాహంగా ఉండాలంటే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ చాలా కీలకం. అల్పాహారంలో ఆరోగ్యకరమైన వాటిని చేర్చడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది రోజంతా శక్తిని ప్రభావితం చేస్తుంది. పిల్లలకు ఉదయం అల్పాహారం కోసం పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, కూరగాయలు ఇవ్వండి. మీరు కూడా అవే తినండి. ఇలా చేయడం వల్ల పిల్లలు మీతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకుంటారు.

టైమ్‌ టేబుల్‌..
జీవితాన్ని సక్రమంగా నడపాలంటే వ్యవస్థీకృతంగా ఉండడం చాలా ముఖ్యం. రోజును ఎలా ప్లాన్‌ చేసుకోవాలో ముందుగా తెలుసుకుంటే మంచిది. దీంతో.. పిల్లలకు ఓ టైమ్‌టేబుల్‌ సెట్‌ చేయండి. ఇది అలవాటుగా మార్చండి. పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్‌ను ఉదయాన్నే సిద్ధం చేయమని చెప్పండి. ఇలా చేయడం వల్ల పిల్లల నిర్వహణా సామర్థ్యం పెరుగుతుంది. వారి నైపుణ్యాలు మెరగవుతాయి. దీంతో వారి భవిష్యత్తులో ఏదైనా సాధించగలమన్న కాన్ఫిడెన్స్‌ పెంపొందుతుంది.

➡️