పాఠశాల నుంచే ప్రారంభం కావాలి!

Mar 2,2025 06:31 #Sneha

”దిస్‌ సొసైటీ ఈజ్‌ ఫర్‌ మెన్‌!’ అని నీకు ఎక్కువ సార్లు అనిపించటమే జెండర్‌ ఇనీక్వాలిటీ స్టేటస్‌ను నీకు తెలుపుతుంది. మహిళగా నీకున్న అనుభవాలే నువ్వు మార్పు కోసం ఎక్కడ మొదలుపెట్టాలో నేర్పుతాయి. ఈ రాకెట్‌ యుగంలో కూడా లింగ అసమానత కొనసాగుతుందీ అంటే ఎన్నో కుటుంబాల మహిళల్లో తమను వేరుగానూ, తక్కువగానూ, తేలికగానూ, పురుషుడి హక్కుగానూ మాట్లాడుతుండడాన్ని ‘ఇది సర్వత్రా ఉన్నదే కదా!’ అనే నిర్లిప్తతో కూడిన ఒక సర్దుబాటు కారణం. తమ సంభాషణలలో ‘తాతయ్య ముందు అమ్మమ్మ కూర్చునేది కాదట! మా నాన్న అమ్మ మాట ఏనాడూ విన్నదే లేదు! మామయ్య అత్తని తాగినపుడే కొట్టేవాడట. తాగనపుడు బాగా చూసుకునేవాడట!’ అని ఆయా పురుషులకు అది చాలా హుందాతనం అనే ఒక తప్పుడు భావన కలిగిస్తూ.. ఇక తన భర్త తనకి విలువ ఇవ్వకపోవడంలో వింతేమీ లేదనే అమాయకత్వంలో ఉంటారు. పైగా తమ పిల్లలకూ ఈ రివాజునే పరంపరగా నూరిపోసి పెంచుతారు. ఇక అనంత ధారావాహిక సీరియళ్ళు ఈ విషయాలను గట్టిగా మనసులలో పాతేందుకు ఎంతో శ్రమిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే ప్రారంభమవ్వాలి.

అవిద్య, ఆర్థిక స్వావలంబన లేని స్త్రీలతో పాటు కొందరు పెద్ద సంపాదన, స్థాయి ఉన్న మహిళలు కూడా లింగ అసమానతకు గురవుతూ మౌనంగా భరిస్తున్నారంటే కారణం ఈ ఉగ్గుపాల నూరిపోత. కుటుంబంలో తాను చూస్తూ పెరిగిన పాత్రల ప్రభావమే! దురదృష్టం కొద్దీ కుటుంబంలో పిల్లలు ఆ పాత్రలను చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోకుండా, అదే మూసలోకి వెళిపోతారు. కనుక ‘మార్పు దిశా’ ఆలోచనలు ప్రతి ఒక్కరి జ్ఞాన సాధనా స్థానాలైన పాఠశాలల నుండే మొదలవ్వాలి.

పుస్తకమే సాధనం..

కుటుంబం కంటే పుస్తకమే ఎక్కువ నేర్పిస్తుంది. మార్పు తేవటంలో పుస్తకాన్ని మించిన సాధనం మరొకటి లేదు. ఒక జనరేషన్‌కు ప్రాథమిక విద్య నుండే లింగ వివక్షను అన్ని కోణాలలోనూ పాఠ్యపుస్తకాలు పరిచయం చేయగలిగితే.. ‘వివక్ష తగదనీ, ఇద్దరూ సమానం!’ అని నేర్పించటంలో సఫలీకృతమైతే, అపుడు మాత్రమే మార్పు సాధ్యపడుతుంది. అందుకుగాను పాఠ్యపుస్తకాలలో ఈ కింది మార్పులు చేయాలి.

  • జెండర్‌ ఈక్వాలిటీ: ఇంటిపనులు కేవలం స్త్రీల బాధ్యత కాకుండా, స్త్రీ-పురుషులు ఇద్దరూ పనులు పంచుకుని చేయటంపై పాఠ్యాంశాలు.
  • సమాన గౌరవం: ‘అమ్మ అందరూ తిన్నాక తింటుందిలే! అమ్మకు పనుంటుంది గనుక విహారాలకు మనం వెళ్దాం!!’ అంటూ ప్రకటనలు చేసే ఇతర సభ్యులను ప్రస్తావిస్తూ, ఇది సరికాదని చెప్పే పాఠాలు. పాటలు చేర్చాలి. (ఇటీవలే మహిళా సర్పంచ్‌ల అవమానాల ఉదంతాలు చదివాం.)
  •  సమాన విద్య: అబ్బాయికి పెద్ద చదువులు, ఖర్చు చదువులు; అమ్మాయికి మాత్రం పేరుకి మాత్రమే చదువు. ఉన్నత చదువులూ, ఉద్యోగం విషయాల్లో ఇంటిపెద్దలే నిర్ణయించటం, నిరాకరించటం. వీటిని చర్చిస్తూ పాఠ్యాంశాలు రూపొందించాలి.
  • సమానావకాశాలు.
  • బాడీ షేమింగ్‌ (ఆడ, మగ ఇద్దరికీ)
  •  వివాహ వయస్సు
  •  స్త్రీలింగ పూరితమైన అవమానకర తిట్లు / బూతులు
  • బూజు పట్టిన సామెతలు.ఉదా: ఆడదానిలా ఏడవకు; మగరాయుడిలా ఆడకు; గాజులు తొడిగించుకోలేదు… వంటివి.
    మరి ఆ గాజులకు ప్రతీకగా మన సమాజం గుర్తించే ఓ మహిళే సునీతా విలియమ్స్‌. అంతరిక్షంలో చిక్కుకుని అవాంతరాలను అధిగమిస్తూ జీవిస్తుంది.

ఈ విధంగా ఒకటి నుండి పై అన్ని తరగతులలోనూ ఈ అంశాలను క్రమ పద్ధతిలో పాఠాలుగా పెట్టాలి. మహిళా హక్కులను పరిచయం చేసి, తరగతులను బట్టి చర్చలు, నాటికలూ, పాటలూ వంటి రూపాలలో విద్యార్థుల మెదడులో చైతన్య బీజాలను నాటగలిగితే మంచి మార్పు సాధ్యం. లింగ సమానత్వం అభివృద్ధి జరుగుతుంది. విద్య, ఆరోగ్యంలో పురోగతి వేగవంతమవుతుంది. ఇంకా ఎన్నో అంశాలను ప్రభావితం చేస్తుంది. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తే అందరూ స్వాగతిస్తారు.
అత్యధికులను ప్రభావితం చేయగలిగే సెల్యులాయిడ్‌ కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. సీరియళ్ళు, సినిమాలు ఈ విషయాలను చర్చించటం లేదా అదే ఇతివృత్తంగా చేసుకోవటం విరివిగా జరగాలి. అతి తక్కువ భాషా చిత్రాలు ఈ జెండర్‌ ఈక్వాలిటీని చర్చించాయి. ఇటీవల తెలుగు యాడ్స్‌లో ఈ విషయంలో ప్రగతి కనపడటం చూస్తున్నాం. కానీ మన సినిమాలు ఇంకా ‘ఆడపిల్లను ఇలాగేనా పెంచటం?’ అంటూ భార్య చెంప ఛెళ్ళు మనిపించటం దగ్గరే తిరుగుతున్నాయి. ఈనాటి యువత జెండర్‌ ఈక్వాలిటీని ఆశించటం దగ్గరే నిలబడపోకుండా వారు సునాయాసంగా చేసిపడేస్తున్న రీల్స్‌లో జెండర్‌ ఈక్వాలిటీని ప్రతిఫలిస్తే ఫలితాలకు తావుంటుంది. పొలంలో గింజలు చల్లి ఊరుకుంటే పంట చేతికిరాదు! ఎవరైనా మంచిరోజుల కోసం కేవలం ఆశపడితే అవి వచ్చి పడవు. అందుకు లింగ అసమానతలు పోయేలా ప్రతి వ్యక్తీ ప్రయత్నించాలి. ‘మేము సైతం! మనం సైతం..!!’ అంటూ కార్యాచరణకు పూనుకోవాలి.

మనోజ నంబూరి

➡️