సాయంత్రం నాలుగయింది. చివరి పీరియడ్ కావడంతో ఒకటవ తరగతి క్లాస్ టీచర్ సుమతి పిల్లలకి హోంవర్క్ బోర్డు మీద రాసి, అందరినీ పుస్తకంలో ఎక్కించుకోమంది. బయట ఆకాశంలో నల్లగా మబ్బులు కమ్ముకున్నాయి. దాంతో బయట చీకటిగా ఉంది. స్కూల్ చుట్టూ ఉన్న చెట్ల నుంచి చల్లటి గాలులు తరగతి గదిలోకి వ్యాపిస్తున్నాయి. మేఘాలు వేగంగా ఏదో పని ఉన్నట్లు హడావిడిగా ఆకాశంలో అటూఇటూ తిరుగుతున్నాయి.
సుమతి టీచర్ తన టీచింగ్ నోట్ బుక్‌ని వేరే తరగతిలో పెట్టివచ్చినట్లు గ్రహించింది. వెంటనే ముందు బెంచిలో ఉన్న లిఖిత దగ్గరకు వచ్చి ‘లిఖితా.. నా టీచింగ్ నోట్స్ రెండవ తరగతిలో పెట్టి మర్చిపోయి వచ్చాను. నువ్వు ఆ క్లాస్ దగ్గరకి వెళ్ళి అక్కడ ఉన్న టీచర్‌ని అడిగి నా పుస్తకం తీసుకురా’ అనింది. లిఖిత వెంటనే ‘ఆమ్మో..నేను వెళ్ళను టీచర్. నాకు భయం’ అంది.
రెండో తరగతి మిగతా క్లాసులకి కాస్త దూరంగా ఉంది. లిఖిత వెళ్ళననేసరికి, రమ్యని వెళ్ళి బుక్ తీసుకురమ్మంది సుమతి టీచర్. రమ్య వెళ్ళి అంబుజా టీచర్‌ని అడిగి బుక్ తెచ్చి, సుమతి టీచర్‌కు ఇచ్చింది.
‘రమ్యా.. రెండవ తరగతి అంత దూరంలో ఉంది కదా. అక్కడకు వెళ్ళడానికి నీకు భయం వేయలేదా?” విస్మయంగా రమ్యని చూస్తూ అనింది లిఖిత. ”భయం ఎందుకు..!” అనింది రమ్య వింతగా లిఖిత ముఖంలోకి చూస్తూ.
”చీకట్లో బూచాడు ఉంటాడు కదా” భయంగా ముఖం పెట్టింది లిఖిత.
”ఏమో. నాకు తెలియదు” అనింది రమ్య. వీళ్ళ సంభాషణ అంతా సుమతి టీచర్ చెవినపడింది. రమ్య ఎందుకో భయపడుతోంది. ఎలాగైనా ఆ పిల్ల భయానికి కారణం ఏమిటో కనుక్కోవాలి అనుకుంది. వారం రోజులు గడిచిపోయాయి. లిఖిత వరుస పెట్టి మూడు రోజులు స్కూలుకి రాలేదు. లిఖిత స్కూలుకి ఎందుకు రాలేదో కనుక్కోవాలని, సుమతి టీచర్ ఆ రోజు సాయంత్రం స్కూలు అవగానే లిఖిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. లిఖితకి జ్వరం వచ్చిందని చెప్పింది వాళ్ళ అమ్మ వసుధ. లోపలి గదిలో మంచం మీద నీరసంగా పడుకుని ఉంది లిఖిత. నిద్రలో మధ్య మధ్యలో ”ఆమ్మో..బూచాడు..పట్టుకుపోతాడు..” అంటూ కలవరిస్తోంది ‘లిఖిత ఎందుకు బూచాడు అంటూ కలవరిస్తోంది. మొన్న స్కూల్లో కూడా ఎదురుగా ఉన్న క్లాసుకి వెళ్ళి రమ్మంటే భయం అనింది. ఎందుకు?’ లిఖిత వాళ్ళ అమ్మని అడిగింది సుమతి టీచర్.
”సారీ మేడం” అనింది వసుధ. ”సారీ ఎందుకండీ. పాప ఎందుకు అంత భయపడుతోంది? దానివల్లనే జ్వరం వచ్చిందేమో. ఏం జరిగింది నాకు చెప్పండి. నా చేతనైన సాయం చేస్తాను” అనింది సుమతి టీచర్. ”లిఖిత సరిగా అన్నం తినడం లేదని, ‘అన్నం సరిగా తినకుంటే బూచాడు వచ్చి పట్టుకుపోతాడు’ అని చెప్పి, బలవంతంగా అన్నం తినిపించాను చాలాసార్లు. అందుకని చీకట్లోకి పోవడానికి భయపడుతోంది. నిద్రలో కూడా బూచాడు అని కలవరిస్తూ భయపడుతోంది” చెప్పి తలదించుకుంది ఆమె.
”అయ్యో..!ఎంత పొరపాటు చేసారండి! అన్నం సరిగా తినకుంటే సరిగా ఎదగరని, బలం ఉండదని, జబ్బులు వస్తాయని పిల్లలకు అర్ధమయ్యేటట్లు చెప్పాలి. ఆకలి బాగా వేయడానికి సాయంత్రం సమయంలో పిల్లలను బాగా ఆడుకోనివ్వాలి. అంతే కానీ, ”బూచాడు పట్టుకుపోతాడు, చీకట్లో దెయ్యాలు ఉంటాయి” అని చెప్పి పిల్లలను భయపెడతారా అండీ. బూచాడు అనే భయంతోనే లిఖితకి జ్వరం వచ్చి ఉంటుంది. పసివయసులో ఇటువంటి భయాలు మనసులో నాటుకుపోయాయంటే వాళ్ళు పెద్ద అయినాక కూడా ఈ భయాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా పిల్లలను భయపెట్టడం చాలా మంది తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు. ఈ భయాలు వయసుపెరిగేకొద్దీ పిల్లల అభివృద్ధికి, వ్యక్తిత్వవికాసానికి ఆటంకాలుగా మారతాయి. దీనివల్ల పిల్లల మానసిక అభివృద్ధి సరిగా జరగదు. ఇంకెప్పుడు ఇలాంటి నెగటివ్ మాటలు చెప్పి పిల్లలకు పిరికి మందు పోసి, భయపెట్టకండి” కాస్త కటువుగా అంది సుమతి టీచర్.
”ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను మేడం. లిఖితకి జ్వరం తగ్గితే చాలు” సంజాయిషీగా అంది వసుధ.
వాళ్ళ సంభాషణలకు మెలకువ వచ్చిన లిఖిత మెల్లగా కళ్ళు తెరచింది. ఎదురుగా సుమతి టీచర్ కనపడేసరికి కాస్త ఆశ్చర్యంగా చూడసాగింది.
లిఖిత పక్కన కూర్చుని తలనిమురుతూ ”లిఖితా.. మొన్న మీ అమ్మ నీకు ఓ అబద్ధ్దం చెప్పింది తెలుసా’ అంది. అవునా అన్నట్లు అమ్మ ముఖంలోకి చూసింది లిఖిత. ”అవును లిఖిత. నువ్వు అన్నం సరిగా తినకుంటే బూచాడు పట్టుకుపోతాడు అని చెప్పింది కదా. అది అబద్ధ్దం. బూచాడు, దెయ్యాలు ఇలాంటివి ఏవీ ఉండవు. చీకట్లో అయినా సరే మనం టార్చి లైట్ వేసుకుని ధైౖర్యంగా వెళ్ళవచ్చు. సరేనా” అంది సుమతి టీచర్. లిఖిత వాళ్ళ అమ్మ ముఖంలోకి చూసింది.
”నిజమే లిఖితా..నేను నీకు అబద్ధ్దం చెప్పాను. అన్నం సరిగా తినకుంటే నీకు బలం రాదు. అంతే కానీ బుచాడు, గీచాడు ఎవరూ లేరు” అందామె. సుమతి టీచర్ తమ ఇంటికి రావడంతో కాస్త ధైర్యం వచ్చింది లిఖితకి. బూచాడు, దెయ్యాలు అలాంటివి ఏవి ఉండవు అని, సుమతి టీచర్, తల్లి వసుధ కూడా చెప్పడంతో లిఖితకి తనని అప్పటిదాకా పీడిస్తున్న భయాలు అన్నీ తొలగిపోయాయి. మెల్లగా కళ్ళు మూసుకుంది. ఆ పిల్ల ముఖంలో ఇంతకు ముందు ఉన్న భయం, ఆందోళన తగ్గి-ప్రశాంతంగా ఉంది. మరో రెండు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గిపోయి, చలాకీగా స్కూలుకి వెళ్ళింది.
– రోహిణి వంజారి
9000594630