చవులూరించే చింత రుచులు

Sep 29,2024 10:55 #ruchi, #Sneha

చింతకాయలు.. చూడగానే నోట్లో లాలాజలం చిప్పిల్లుతుంది. అంతేనా.. వెంటనే ఉప్పు, కారం నంజుకుని చప్పరించి అబ్బ అనాల్సిందే. ఈ చింతకాయ పండు రూపం దాల్చినప్పుడు పులుపు తీపి కలగలిసిన గుజ్జు తయారవుతుంది. అదే చింతపండు. చింత లెగుమినేసి కుటుంబానికి చెందినది. అందుకే దీని కాయలు వరుస కణుపు గింజలతో ఉంటాయి. పచ్చి కాయ గుజ్జు ఆకుపచ్చని రంగులో ఉండి పుల్లగా ఉంటుంది. పిందెలయితే పులుపు తక్కువగా ఉంటాయి. వాటినే వామన చింత కాయలంటారు. చింతలో విటమిన్‌ సి, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మంచి జీర్ణకారి. డయాస్టొలిక్‌ రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. పక్వానికి రాని కాయలను కూడా పుల్లని పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. పిందె దశలోనూ రకరకాల పదార్ధాలు తయారు చేసుకునే ప్రత్యేకత చింతకాయలకుంది. మరి ఆ చవులూరించే చింత రుచులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బచ్చలితో కూర..
కావలసినవి : బచ్చలి కూర- 2 కట్టలు, వామన చింతకాయలు- 10, పచ్చిమిర్చి- 12, ఉప్పు- తగినంత, పసుపు- 1/4 స్పూను, నూనె- 4స్పూన్లు, తాలింపు దినుసులు- 2 స్పూన్లు, ఎండుమిర్చి- 2, కరివేపాకు- 2 రెబ్బలు, ఉల్లిపాయ- ఒకటి
తయారీ : బాండీలో నూనె వేడి చేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. దీనిలో ముందుగానే కడిగి తరిగి ఉంచుకున్న బచ్చటి కూర వేసి మధ్యమధ్యలో కలియతిప్పుతూ మూతపెట్టి ఉడికించాలి. ఈలోపల చింతకాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు మెత్తగా మిక్సీపట్టి పక్కనుంచాలి. కూర నీరు లేకుండా మగ్గిన తర్వాత ఈ చింతకాయల గుజ్జును వేసి బాగా కలిపి మూతపెట్టాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకున్న తర్వాత కూర చిక్కబడి అంచుల వెంబడి నూనె కనిపించినప్పుడు కొత్తిమీర తరుగు చల్లి స్టౌ మీది నుంచి దింపేయాలి. అంతే బచ్చలి ఆకుతో వామన చింతకాయల కమ్మని కూర రెడీ.

తుమ్మి ఆకుతో పచ్చడి..
కావలసినవి : తుమ్మికూర- గుప్పెడు, వామన చింతకాయలు- 10, పచ్చిమిర్చి- 12, ఉప్పు- తగినంత, వెల్లుల్లి- 10, జీలకర్ర- 1/2 స్పూను, పసుపు- 1/4 స్పూను, నూనె- 4స్పూన్లు, తాలింపు దినుసులు- 2స్పూన్లు, ఎండుమిర్చి- 2, కరివేపాకు- 2 రెబ్బలు
తయారీ : ముందుగా తుమ్మికూర, వామన చింతకాయలు, పచ్చిమిర్చి చిన్నగ్లాసు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి. జార్‌లో పొట్టుతీసిన వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పసుపు ఉడికించిన చింతకాయల మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. ఉప్పు సరిపోయిందేమో చూసుకుని తాలింపు పెట్టుకోవాలి. అంతే ఘుమఘుమలాడే తుమ్మిఆకు, వామన చింతకాయల పచ్చడి రెడీ. (కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే రుచిగా ఉంటుంది.)

కారంతో..
కావలసినవి : వామన చింతకాయలు-10, కారం-4 స్పూన్లు, ఉప్పు- తగినంత, పసుపు-1/4 స్పూను, తాలింపు దినుసులు- స్పూను
తయారీ : చింతకాయలు, కారం, ఉప్పు, పసుపు అన్నీ పచ్చివే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి తాలింపు దినుసులు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు వేయించాలి. దీనిలో మిక్సీ పట్టిన పచ్చడిని కూడా వేసి రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. నూనె తేలినట్లు కనిపించిన వెంటనే దింపేయాలి. వేడివేడి అన్నంలో నేతితో ఈ వామన చింతకాయలు, కారంతో చేసిన పచ్చడి కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

నిల్వ పచ్చడి..
కావలసినవి : వామన చింతకాయ ముక్కలు-కప్పు, ఎండుమిర్చి- 20, తాలింపు దినుసులు- స్పూను, ఉప్పు- తగినంత, పసుపు-1/4 స్పూను, నూనె- 4 స్పూన్లు
తయారీ : బాండీలో నూనె వేడిచేసి ఎండుమిర్చి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో తాలింపు దినుసులు దోరగా వేయించి పక్కనుంచుకోవాలి. వేయించిన ఎండుమిర్చి, అరంగుళం సైజులో కట్‌చేసుకున్న చింతకాయ ముక్కలు, ఉప్పు, పసుపు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ముందుగా పెట్టుకున్న తాలింపు కలిపి చల్లారిన తర్వాత సీసాలో పెట్టుకోవాలి. అంతే వామన చింతకాయల నిల్వ పచ్చడి రెడీ. దీనిని కావాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా మరల తాజాగా తాలింపు పెట్టుకుని, దానిలో వెల్లుల్లి చితక్కొట్టి వేసుకుంటే అమోఘమైన రుచి. ఈ పచ్చడిని తడి తగలనివ్వకుండా జాగ్రత్తపరుచుకుంటే పెద్ద చింతకాయల తొక్కు పచ్చడి పెట్టుకునేంత వరకూ వాడుకోవచ్చు.

➡️