కృషితో నాస్తి దుర్భిక్షం… పట్టుదలతో ప్రయత్నం చేస్తే అసాధ్యం ఏమీ లేదు. దానికి కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ జీవితమే ఉదాహరణ. ఓ సాధారణ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘అమరన్’ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయం సాధించింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్, సాయి పల్లవి ఇద్దరూ తమ నటనతో మెప్పించి, ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించారు. ఈ సినిమా కోసం శివ చేసిన హార్డ్‌వర్క్‌కి విమర్శకులు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు…
శివ కార్తికేయన్ తమిళనాడులోని సింగంపునారి అనే గ్రామంలో జన్మించారు. శివ కార్తికేయన్ తండ్రి పేరు జి దాస్. ఆయన జైలు సూపరింటెండెంట్ కాగా తల్లి పేరు రాజి దాస్. చదువుకునే రోజుల్లోనే శివ కార్తికేయన్ నటనపై ఆసక్తి పెంచుకున్నారు. స్కూల్, కాలేజ్‌లో జరిగే సాంస్క ృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఒకపక్క చదువు సాగిస్తూనే మరోపక్క టెలివిజన్ షోలలో పాల్గొనేవారు. తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకునేవారు కాదు. హీరో కాకముందే శివ కార్తికేయన్‌కి వివాహం జరిగింది. బంధువుల అమ్మాయి ఆర్తిని 2010లో ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.
మిమిక్రీ ఆర్టిస్ట్‌గా..
స్నేహితుల ప్రోద్బలంతో ఓ తమిళ షోలో పార్టిసిపేట్ చేశారు. ఆ షోలో విన్నర్‌గా నిలిచిన శివ కార్తికేయన్ మొదటి బ్రేక్ అందుకున్నారు. ఆ షో ద్వారా వచ్చిన పేరుతో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత చాలా టెలివిజన్ షోలలో పాల్గొన్నారు. టెలివిజన్ షోలు చేస్తూనే నటుడిగా మెరుగయ్యేలా ప్రణాళికలు వేసుకున్నారు. దాని కోసం కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో నటించారు. కోలీవుడ్‌లో శివకార్తికేయన్ ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత, ‘మెరీనా’ చిత్రంలో హీరోగా ఛాన్స్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం 2012లో విడుదలైంది. ఆ సినిమా తర్వాత ధనుష్-శృతిహాసన్ జంటగా తెరకెక్కిన ‘3’ సినిమాలో ధనుష్ ఫ్రెండ్ రోల్ చేశారు.
ఆ తర్వాత హీరోగా సినిమాలు చేయడం ప్రారంభించారు. ‘మహావీరుడు’, ‘అయలాన్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించారు. అప్పటి నుంచి ఆయన చేసే చిత్రాలను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ‘ప్రిన్స్’ విడుదల చేశారు. ఈ సినిమాను కార్తికేయన్ తన భుజాలపై వేసుకుని, తానే ఓటీటీ వాళ్లతో మాట్లాడి, మంచి రేటు వచ్చేలా చేశారు. ‘కేడీ బిల్లా కిలాడీ రంగ’ చిత్రంతో హీరోగా శివ కార్తికేయన్‌కి మంచి బ్రేక్ వచ్చింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ‘రెమో’ చిత్రంతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్‌కి టాలీవుడ్‌లో కూడా మార్కెట్ ఏర్పడింది. ఇందులో అమ్మాయి గెటప్‌లో కనిపించి, తనలో ఉన్న ప్రత్యేకనటనా ప్రతిభను చాటుకున్నారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘డాక్టర్’ భారీ సక్సెస్ కొట్టింది. తెలుగు, తమిళ్‌లో 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇలా వరుస అవకాశాలతో కార్తికేయన్ ఇప్పటి వరకు 19 చిత్రాల్లో నటించారు.
మా నాన్నకు నివాళి…
రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్‌గా ‘అమరన్’ లో శివకార్తికేయన్ నటించారు. ‘ఇండియాస్ మోస్ట్’ అనే పుస్తకంలోని మేజర్ ముకుంద్ వరదరాజన్ కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో జీవించారు. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న శివ కార్తికేయన్ చాలా విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
‘మేజర్ ముకుంద్ వరదరాజన్ క్యారెక్టర్ చేయడానికి కారణం మా నాన్న. మా నాన్న ఒక పోలీసాఫీసర్. ఆయన కూడా డ్యూటీలోనే మరణించారు. ఆయనకు, ముకుంద్ గారికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ సినిమా మా నాన్నకు ఒక నివాళి లాంటిది. సరిహద్దుల్లో మన సైనికులు పడుతున్న కష్టంతో పోలిస్తే, ”అమరన్” కోసం నేను పడిన శ్రమ చాలా తక్కువ. నేను కశ్మీర్ వెళ్లి మన సైనికులతో కలిసి మూడు రోజులు గడిపాను. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి పడుకునే వరకూ వాళ్లు నిర్వర్తించే బాధ్యతలేంటో చూశాను. ఆ కష్టం చూసిన తర్వాత సినిమా కోసం, నా పాత్ర కోసం నేను పడిన శ్రమ చాలా తక్కువ అనిపించింది’ అని అన్నారు. యాంకర్ నుంచి హిట్ హీరోగా మారిన శివకార్తికేయన్ జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం.
పేరు : శివ కార్తికేయన్
పుట్టిన తేది : 1985, ఫిబ్రవరి 17
పిల్లలు : ఆరాదన, గుగున్