ఒత్తిడి పెరిగితే…

Feb 4,2024 06:50 #left under pressure, #Sneha
story on pressure

ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిఒక్కరూ పరుగులు తీయడమే సరిపోతుంది. పిల్లల్ని స్కూలుకి పంపాలని, ఆఫీసుకు ఆలస్యం అవుతుందని, ఇంట్లో పెద్దవాళ్లకు అవసరమైనవి చూసుకోవడం.. ఇలా ఎన్నో బాధ్యతలతో రోజు మొదలవుతుంది. అయితే ఎక్కువగా ఒత్తిడికి గురైతే చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  • శరీరం ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో కణాలకు ఆక్సిజన్‌ సరిపడినంతా అందదు. దాంతో తలనొప్పి విపరీతంగా పెరుగుతుంది. కుంగుబాటుతో అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. సోరియాసిస్‌ వంటి చర్మ వ్యాధులను మరింత తీవ్రతరం చేస్తుంది. స్ట్రెస్‌ హార్మోన్‌ అయిన కార్టిసాల్‌ హార్మోన్‌ విడుదల ఎక్కువవుతుంది. చర్మ సమస్యలు పెరుగుతాయి. గాయాలు తగిలిన చోట సహజంగా నయం చేసే చర్మ సామర్థ్యానికి ఒత్తిడి ఆటంకం కలిగిస్తుంది.
  • స్ట్రెస్‌ హార్మోన్‌ కార్టిసాల్‌ పెరిగినప్పుడు చర్మంలోని కొల్లాజెన్‌, సాగే ఫైబర్‌ను ప్రభావితం చేస్తోంది. దాంతో చర్మంలో రోగనిరోధక శక్తి తగ్గి చర్మం ముడతలు పడుతుంది. దాంతో చిన్నవయస్సులో ముఖంపై వృద్ధాప్యం కనిపిస్తుంది. ఇంకా మొటిమలు, దద్దుర్లు వచ్చి తగ్గకపోవడం, జట్టు బాగా రాలిపోవడం వంటి ఇతర చర్మ సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
  • ఎక్కువగా ఒత్తిడికి గురైనపుడు డొపమైన్‌, కార్టిసోల్‌ అనే హార్మోన్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఇవి మిగిలిన హార్మోన్స్‌పై ప్రభావం చూపుతాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవచ్చు. బీపీ పెరగడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు.
  • తీవ్రమైన ఒత్తిడితో గుండె స్పందనల్లో తేడాలొస్తాయి. ఒక్కోసారి గుండెపోటు కూడా రావచ్చు. బీపీ పెరిగి పక్షవాతం ముప్పు పొంచివుంటుంది. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేనివారిలో హెమరైజ్డ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది.
  • ఒత్తిడి ఎక్కువైతే కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి మందగించడం, అతిగా తినడం, వికారం లాంటివి కన్పిస్తాయి. కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. జీవక్రియల వేగం మందగిస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తి తగ్గుతుంది.
  • మనకు తెలియకుండానే రోజుల తరబడి ఒత్తిడికి లోనైతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కొనాలి. అందుకే ఒత్తిడి తగ్గించుకునేలా జాగ్రత్తలు పాటించాలి. తగినంత 7-8 గంటలు నిద్రపోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, తాజా ఆకుకూరలు, పండ్ల ఆహారంపై దృష్టి పెట్టడం చాలా కీలకం. రెగ్యులర్‌ వ్యాయామం, మనసుకు ఆహ్లాదం కలిగించే మొక్కల పెంపకం, సంగీతం వినడం, పాడడం.. ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మానికి మేలు చేస్తుంది. తగినంత నీటిని తీసుకోవాలి. కెఫిన్‌, మద్యానికి దూరంగా ఉండాలి.
➡️