ఇప్పటి జనరేషన్ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన కీర్తిప్రతిష్టలతో ఇండిస్టీలోకి రావడంలేదు. తమకంటూ ఓ టాలెంట్‌ని ఇముడ్చుకుని అడుగుపెడుతున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కెరియర్‌పై దృష్టి పెడుతున్నారు. అందులో ముందుభాగంలో సుకృతి ఉంటుంది. తన వయస్సు13 ఏళ్లు. ఏదో ఒక సినిమాలో చెల్లెలిగానో, కూతురుగానో నటించలేదు. శాంతి సందేశాత్మకంగా, ప్రకృతి ప్రేమికురాలిగా కీలకంగా నటించింది. ఆమె నటనకు ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలూ ప్రసంశలు కురిపించారు. సుకృతి నటనకుగానూ, ఉత్తమ బాలనటిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. అసలు ఆ సినిమా ఏంటి? సుకృతి ఎవరు? ఏంటో తెలుసుకుందాం. దర్శకురాలు పద్మావతి తీసిన చిత్రం ‘గాంధీతాత చెట్టు’. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24న ఈ సినిమా విడుదల చేశారు. ఇందులో సుకృతి ‘గాంధీ’ అనే పాత్రలో నటించింది. తనకిది మొదటి సినిమా. అయినా ఎక్కడా తడబడకుండా అద్భుతంగా నటించింది. ఇప్పుడు ఇండిస్టీలోకి వస్తున్న పిల్లలకు – వయస్సుకు మించిన డైలాగ్స్ ఇస్తున్నారు. వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందో దర్శకులు, తల్లిదండ్రులు ఆలోచన చేయడం లేదు. అరదుకు భిన్నంగా సుకృతి ఈ పాత్రను ఎంచుకున్నారు. అంతేకాదు.. తన పాత్ర రియాల్టీగా ఉండాలని జుట్టు లేకుండా గుండు చేయించుకుంది. ప్రస్తుతం సుకృతి ‘వేణి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్’లో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఆ వయస్సులో ఏ ఆడపిల్ల అయినా జట్టు పెరగాలని ఆలోచన చేయడం సహజం. కానీ తాను చేస్తున్న సినిమా హిట్టు అవుతుందో, లేదో కూడా తెలియదు. అయినా మరో ఆలోచన చేయకుండా స్వయంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు సుకృతి ధైర్యాన్ని, నటనను మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీలు ఆమెను కలిసి అభినందించారు.
ఇక అహింస అనగానే జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలను అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం శాంతియుతంగా చేసిన పోరాటం ఆసక్తికరంగా సాగింది. పర్యావరణ పరిరక్షణ ముఖ్యోద్దేశంగా కథ నడుస్తుంది. బిల్డింగ్‌లు, పెద్ద పెద్ద భవంతులు నిర్మాణంలో అడ్డువచ్చిన ప్రతిచెట్టునూ నరికేస్తున్న ప్రస్తుత నేపథ్యంలో.. ఓ చెట్టు బతకాలి అని ఆ అమ్మాయి బలంగా కోరుకుంటుంది. ప్రతి తల్లిదండ్రీ తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు సుకృతి కలిగించింది. నటనే కాదు.. తను పాటలూ పాడగలదు. మల్టీ టాలెంటెడ్ కిడ్‌గా సుకృతి ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చింది.
అవార్డులకు ఎంపిక
ప్రస్తుతం ప్రపంచంలో రెండు దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతోమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో, మంచానికి పరిమితి అవుతున్నారు. దేశాల మధ్య యుద్ధం కన్నా.. శాంతి చాలా ముఖ్యం. మహాత్మాగాంధీ అదే కోరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రావడం, అందులోనూ ఆడపిల్ల నటించడం మంచి పరిణామం. గాంధీజీ సారథ్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలాగే.. తన ఊరి కోసం, తన తాత నాటిన ఓ చెట్టు కోసం ‘గాంధీ’ మరో సత్యాగ్రహమే చేసింది. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారనడంలో సందేహం లేదు.
అందుకే సినిమా విడుదల కాకముందే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించింది చిత్రబృందం. దుబారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతవేణిని అవార్డులు వరించాయి. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా, న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ బెస్ట్ ఫిలింగా, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డులు వచ్చాయి. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా అవార్డులు అందుకోవడం విశేషం. ఇవి కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుండి ఈ చిత్రానికి ఆహ్వానాలు అందుతున్నాయి.
టాలెంట్ ముఖ్యం..
దర్శకుడు సుకుమార్ కూతురు సుకృత వేణి. తల్లి తబిత. సినిమా ఇండిస్టీలో వారసులు రావడం సాధారణం. హీరోలు, నిర్మాతలు, దర్శకులు వాళ్లలాగే వాళ్ల పిల్లలు కూడా సినిమా ఇండిస్టీలో రాణించాలని కోరుకుంటారు. కానీ దర్శకుడు సుకుమార్ తన కూతుర్నీ, తన సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వలేదు. పైగా ‘ఆడిషన్స్‌కి వచ్చి నీ టాలెంట్ చూపించు’ అని ఆదేశించారట! పైగా ఈ సినిమాలో ఆమె నటనను చూసి- తన కూతురిలో ఇంత టాలెంట్ ఉందా?! అని తల్లిదండ్రులు ఆశ్చర్యపోతూ ఎమోషనల్ అయ్యారు. చదువుకుంటూనే మరో పక్క ఇలా నటన, దర్శకత్వం నేర్చుకుంటున్న సుకృతి ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంటుంది.