జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి. అంటే మన బుర్రలో అంతులేని ఆలోచనలెలా వస్తాయో.. నాలుక కూడా రకరకాల రుచులను కోరుకుంటూ ఉంటుంది. ఆ రుచులకనుగుణంగా పదార్ధాలను వండుకునో కొనుక్కునో జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటాం. పండగలు, ప్రత్యేక కార్యక్రమాలలో తీపి పదార్ధాలు తప్పనిసరి. అయితే పండగలు, పబ్బాలకు కూడా ఏం కొనుక్కుంటాం.. ఇంటిదగ్గరే వండుకుందామనిపిస్తుంది. అదీ ఇంటిల్లిపాదికీ ఇష్టమైనవి చేయాలి. అలా అయితేనే కష్టానికి ఫలితం దక్కిన తృప్తి ఉంటుంది. అందుకని కొద్ది సమయంలో, తక్కువ పదార్థాలతో పిల్లలు ఇష్టంగా తినే స్వీట్స్‌ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
రోల్స్..
కావలసినవి : కాచి చల్లార్చిన పాలు-1/2 కప్పు, పంచదార- 5 స్పూన్లు, బ్రెడ్ స్లైసెస్-6, విప్డ్ క్రీమ్- 1/3 కప్పులు, పంచదార పొడి- 2 స్పూన్లు, వెనీలా ఎసెన్స్-1/2 స్పూను, ఎండుకొబ్బరి పొడి- తగినంత.
తయారీ : ముందుగా విప్డ్ క్రీమ్ (లిక్విడ్ రూపంలో బేకరీల్లో దొరుకుతుంది), పంచదార పొడి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకూ బాగా చిలకాలి. ఎండుకొబ్బరి పొడి ప్లేటులో ఉంచుకోవాలి. ఒక వెడల్పు గిన్నెలోకి పాలు తీసుకుని, బ్రెడ్ స్టైస్‌ని ఆ పాలలో ముంచి తీయాలి. వీటిని చాలా సున్నితంగా ఒత్తుతూ పీల్చుకున్న పాలను తీసివేయాలి. (గట్టిగా ఒత్తితే రోల్స్ చేసేటప్పుడు బ్రెడ్ విరిగిపోతుంది) అలా చేసిన ఒక్కొక్క బ్రెడ్ సైస్‌ని ప్లేటులో ఉంచి, దానిపై ముందుగా రెడీ చేసుకున్న క్రీమ్ మిశ్రమాన్ని కాస్త మందపాటి పొరలా రాయాలి. దీనిని చుట్టుకుంటూ రోల్స్ తయారుచేయాలి. వీటిని కొబ్బరిపొడిలో అద్దుతూ రోల్ చేయాలి. అంతే యమ్మీయమ్మీ బ్రెడ్ రోల్స్ రెడీ. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
ఉక్కరై..
కావలసినవి : పెసరపప్పు-3/4 కప్పు, బొంబాయి రవ్వ-1/4 కప్పు, పచ్చికొబ్బరి తురుము-1/4 కప్పు, బెల్లం తురుము-11/2 కప్పు, నెయ్యి-1/2 కప్పు, జీడిపప్పు- 20, యాలకులపొడి- 1/4 స్పూను
తయారీ : పెసరపప్పుని దోరగా వేయించి, చల్లారిన తర్వాత శుభ్రంగా కడగాలి. దానిలో రెండు కప్పుల నీళ్ళు పోసి, కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి. ఉడికాక వేడి మీదే గరిటెతో మెదిపి పక్కనుంచాలి. వేరే గిన్నెలో బెల్లంలో అరకప్పు నీళ్ళు పోసి కరిగించి, కళపెళ ఉడికేటప్పుడు దించేయాలి. బాండీలో పావు కప్పు నెయ్యి వేడిచేసి జీడిపప్పు వేయించి, గిన్నెలోకి తీసుకోవాలి. అదే నేతిలో బొంబాయి రవ్వ కాస్త రంగుమారే వరకూ వేయించి, పచ్చికొబ్బరి తురుము వేసి నాలుగైదు నిమిషాలు వేయించాలి. ఉడికించిన పెసరపప్పును కూడా దానిలో వేసి అడుగంటకుండా తిప్పుతూ ఉడికించాలి. ముద్దగా అవుతుందనగా కరిగించిన బెల్లాన్ని వడకట్టి పోయాలి. చిందకుండా నెమ్మదిగా కలుపుతూ కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ ఉడికించాలి. చిక్కబడుతుందనగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి. బాండీ నుంచి విడివడుతుందనగా స్టౌ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులోకి తీసుకోవాలి. అంతే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనే ఉక్కిరి రెడీ అయినట్లే. ఇది వారం వరకూ నిల్వ ఉంటుంది.
హల్వా..
కావలసినవి : అరటిపండ్లు-10, బెల్లం తురుము- 1/2 కేజీ, నెయ్యి-1/2 కప్పు, జీడిపప్పు-20, యాలకుల పొడి-1/2 స్పూను
తయారీ : ముందుగా అరటిపండ్లను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో బెల్లంలో పావు కప్పు నీళ్ళు పోసి కరిగించాలి. బాండీలో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. అదే నేతిలో అరటిపండ్ల గుజ్జును వేసి, తిప్పుతూ కాస్త రంగుమారి సిల్కీగా అయ్యేంతవరకూ ఉడికించాలి. దీనిలో కరిగించిన బెల్లం, కొంచెం నెయ్యి వేసి ఉడికించాలి. హల్వా నెయ్యంతా పీల్చుకుని, గట్టిగా అవుతుందని అనుకున్నప్పుడు యాలకుల పొడి, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసి తిప్పాలి. ముద్దగా అయ్యి, బాండీని విడివడుతుందనగా దింపేసుకోవాలి. దీన్ని నెయ్యి రాసిన అంచులున్న పెద్ద పళ్ళెంలో పోసి సమంగా సర్దాలి. మూడు నాలుగ్గంటల తర్వాత చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే ఆహా అనిపించే అరటిపండు హల్వా రెడీ. ఇది రెండు మూడు వారాలు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది.
బర్ఫీ..
కావలసినవి : రాగిపిండి-కప్పు, బొంబాయి రవ్వ- 1/2 కప్పు, బెల్లం- కప్పు, నెయ్యి-1/4 కప్పు, యాలకుల పొడి- 1/2 స్పూను, జీడిపప్పు-20
తయారీ : బాండీలో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు వేసి వేయించాలి. వీటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో ముందు బొంబాయి రవ్వ కాస్త రంగు మారే వరకూ వేయించి, రాగిపిండి కూడా వేసి సువాసన వచ్చేంత వరకూ వేయించాలి. మరో గిన్నెలో బెల్లం, పావు కప్పు నీళ్ళు పోసి వేడి చేసి కరిగించాలి. దీనిలో కొద్ది కొద్దిగా రాగిపిండి పోస్తూ తిప్పుతూ ఉడికించాలి. చిక్కగా అయి బాండీ నుంచి విడివడుతుందనగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి తిప్పి, దింపేసుకోవాలి. దీన్ని నెయ్యిరాసిన ప్లేటులో సమంగా సర్ది, చల్లారాక ముక్కలు చేసుకోవాలి. అంతే రాగిపిండి బర్ఫీ రెడీ. ఇవి నెలరోజులు నిల్వ ఉంటాయి.