సీతాఫలంతో స్వీట్‌గా

Nov 17,2024 10:31 #Custard Apple, #ruchi, #Sneha, #Sweetened

సీతాఫలం ప్రకృతి ప్రసాదించిన వరం. రుచిలో అమృతం. ఈ సీజన్‌లో లభించే మృదు మధుర ఫలం సీతాఫలం. దీనినే కస్టర్డ్‌ ఆపిల్‌, చికుఫల్‌ అని కూడా పిలుస్తారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినే మధుర ఫలం. ఇది సెప్టెంబరు నుంచి జనవరి వరకు లభిస్తుంది. సీతాఫలంలో సూక్ష్మపోషకాలు అధికం. దీనికి వాపును తగ్గించే గుణాలు మెండు. గుండె, క్యాన్సర్‌ వంటి మొండివ్యాధుల కారకాలను నిరోధిస్తుంది. సీతాఫలం గుజ్జుతో తయారైన మిల్క్‌షేక్‌లు, స్మూతీలు, ఐస్‌క్రీమ్‌, ఫిర్నీ, హల్వా, మిఠాయిలు.. ఇలా రకరకాల రూపాల రుచులున్నాయి. వీటిల్లో కొన్నింటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

కేక్‌..

కావలసినవి : గోధుమపిండి బిస్కెట్లు – 6, వెన్న-450 గ్రా, సీతాఫలం గుజ్జు – కప్పు, పంచదార -100 గ్రా, నిమ్మరసం- 2 స్పూన్లు, క్రీమ్‌-750 గ్రా, గుడ్లు- 6, సోర్‌ క్రీం- 200 గ్రా
తయారీ : కేక్‌ ఓవెన్‌ వేడి చేసుకోవాలి. బిస్కెట్లను పొడి చేసి కరిగించిన వెన్నతో కలిపి, ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో సమంగా సర్దాలి. నెయ్యి వేడి తగ్గిన తర్వాత గట్టిగా పేరుకుంటుంది. ఇంకా పలుచగా అనిపిస్తే, ఓ పావుగంట డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాలి. మరో వెన్న రాసిన గిన్నెలో సీతాఫలం గుజ్జు, పంచదార, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో క్రీమ్‌, గుడ్ల సొన, సోర్‌ క్రీం చేర్చి బాగా కలపాలి. దీనిని ముందుగా రెడీగా ఉంచుకున్న బిస్కెట్‌ మిశ్రమం మీద పోయాలి. దీనిని వేడి చేసుకున్న ఓవెన్‌లో దాదాపు 50 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి. కేక్‌ మధ్యలో కొద్దిగా ఉబ్బినట్లు వచ్చినప్పుడు చాకుతో గుచ్చి చూడాలి. చాకుకు ఏమీ అంటకపోతే కేక్‌ రెడీ అయినట్లే. అంతే సీతాఫలం కేక్‌ తయార్‌.

ఐస్‌క్రీమ్‌..

కావలసినవి : సీతాఫలం గుజ్జు – ఒకటిన్నర కప్పు, విప్పింగ్‌ క్రీమ్‌ – కప్పు, పంచదార పొడి – కప్పు. చల్లని పాలు – కప్పు, కండెన్సెడ్‌ మిల్క్‌ – ముప్పావు కప్పు.

తయారీ : ముందుగా సీతాఫలాల నుంచి గుజ్జును సపరేట్‌ చేసుకోవాలి. ఇలా మొత్తంగా ఒకటిన్నర కప్పు పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో బౌల్‌లో విప్పింగ్‌ క్రీమ్‌ తీసుకోవాలి. దీనికి బదులు ఫ్రెష్‌ క్రీమ్‌ కూడా వాడొచ్చు. ఇప్పుడు హ్యాండ్‌ బ్లెండర్‌ సాయంతో గట్టిగా అయ్యేవరకూ బ్లెండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు చల్లని పాలు, పంచదార పొడి, కండెన్సడ్‌ మిల్క్‌ వేసి బ్లెండర్‌తో బాగా కలుపుకోవాలి. ఇలా ఓ నాలుగు నిమిషాలు ఆగకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత సీతాఫలం గుజ్జు వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి.
ఇలా మిక్స్‌ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్‌తో సహా ఫ్రీజర్‌లో మూడు గంటల పాటు పెట్టాలి. తర్వాత తీసి మరోసారి కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని మరో ఐదు గంటలు ఫ్రీజర్‌లో స్టోర్‌ చేసుకోవాలి. వీలేతై రాత్రంతా ఉంచుకోవచ్చు. అంతే ఆ తర్వాత తీస్తే ఐస్‌క్రీమ్‌ రెడీ. దీన్ని స్కూప్‌ చేసుకుని తింటే టేస్ట్‌ అదిరిపోతుంది.

హల్వా..

కావలసినవి : సీతాఫలం గుజ్జు – కప్పు, నెయ్యి – 120 గ్రా, బొంబాయి రవ్వ – 120 గ్రా, పంచదార- 40 గ్రా, పాలు – గ్లాసు, జాజికాయ పొడి – 1/2 స్పూను, జీడిపప్పు -10, బాదం – 15, కిస్‌మిస్‌ -15
తయారీ : ముందుగా బాగా పండిన సీతాఫలం గుజ్జు తీసి, పక్కన ఉంచుకోవాలి. బాండీలో నెయ్యి వేడి చేసి డ్రైఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌, ఇంకేమైనా..) ను వేయించి, గిన్నెలోకి తీసుకోవాలి. ఆ నేతిలోనే బొంబాయి రవ్వను దోరగా వేయించి, దానిలో పంచదార వేసి నిమిషం కలపాలి. కొంచెం ముద్దగా రాగానే, పాలు పోసి తిప్పుతూ ఉడికించాలి. మూడు నిమిషాలు ఉడికిన తర్వాత సీతాఫలం గుజ్జు, జాజికాయ పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్‌ వేసి, బాగా కలపాలి. మరో మూడు నిమిషాలు అలా తిప్పుతూ ఉడికించిన తర్వాత స్టౌ మీద నుంచి దింపి, సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే సీతాఫలంతో హల్వా రెడీ!

కలాకండ్‌..

కావలసినవి : సీతాఫలం గుజ్జు – కప్పు, పాలు- 2 లీటర్లు, నిమ్మరసం- 3 స్పూన్లు, చక్కెర-1/4 కప్పు, యాలకుల పొడి- స్పూను, జాజికాయ పొడి- చిటికెడు, పాల పొడి-1/4 కప్పు, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు -2 స్పూన్లు

తయారీ : మందపాటి గిన్నెలో లీటరు పాలను బాగా మరిగించాలి. పాలు మరిగేటప్పుడు మంటను ఆపి, పాలను నిమిషం పాటు తిప్పాలి. కాస్త వేడి తగ్గిన పాలల్లో నిమ్మరసం వేసి తిప్పితే విరిగిపోతాయి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన వస్త్రంలో వేసి వడకట్టాలి. ఈ పదార్థాన్ని దానిలోనే ఉంచి, స్పూనుతో తిప్పుతూ మంచినీళ్లు పోస్తూ కడగాలి. దానిని మూటలా కట్టి, పూర్తిగా నీరు పోయేలా బరువు ఉంచాలి. మరో లీటరు పాలను గిన్నెలో పోసి స్టౌ సిమ్‌లో పెట్టి, పావు లీటరు అయ్యేంత వరకూ మరిగించాలి. దానిలో పంచదార, పాల విరుగు, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి, కలపాలి. దీనిని తిప్పుతూ రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత సీతాఫలం గుజ్జును వేసి, నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత పాలపొడి కలపి మరో నిమిషం తిప్పాలి. ఇలా తయారైన కలాకండ్‌ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పోసి అన్నివైపులా సర్దాలి. పైన డ్రైఫ్రూట్స్‌ పలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి. నోరూరించే సీతాఫలం కలాకండ్‌ రెడీ.

➡️