‘ప్రేక్షకుల కోసమే సినిమా తీయండి!’

Apr 13,2025 09:03 #celebrity, #Stories

కోవిడ్‌ తర్వాత బాలీవుడ్‌లో బాగా హిట్‌ అయిన సినిమా నమోదైన దాఖలాలు లేవు. తీసిన హిందీ సినిమాలు ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కలిగించడం లేదు. కొన్ని వరుసగా పరాజయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ స్పందించారు. ‘బాలీవుడ్‌ హీరో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్‌ ఉంటుంది. కానీ కథ మెసేజ్‌ ఓరియంటెడ్‌గా, ఆసక్తిగా లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దర్శక, నిర్మాతలు సినిమాలు తీయాలి!’ అని అన్నారు. ‘సికందర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

సల్మాన్‌ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ స్టార్‌ హీరో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. సల్మాన్‌ సినిమా రిలీజ్‌ అవగానే బాక్సాఫీస్‌ బద్దలయ్యే కలెక్షన్లు కూడా కలెక్ట్‌ చేస్తాయి.
సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీంఖాన్‌. పరిశ్రమలోని అత్యంత ప్రసిద్ధ స్క్రీన్‌ రైటర్లలో ఒకరు. అతని సోదరులు అర్బాజ్‌ఖాన్‌, సోహైల్‌ఖాన్‌ ఇద్దరూ నటులు, నిర్మాతలు. ‘మా అమ్మ సుశీలా చరక్‌ఖాన్‌ హిందూ. తండ్రి ముస్లిం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మతం గురించి, ఆచారాల గురించి ఇంట్లో ప్రస్తావన ఉండదు. ఎందుకంటే ఇద్దరూ వాళ్ల ప్రొఫెషన్స్‌లో ఎదగాలని ఆలోచించారు తప్ప, మతం గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలన్నదే మా ఉద్దేశం!’ అని సల్మాన్‌ఖాన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సల్మాన్‌ నటుడిగా ‘మైనే ప్యార్‌ కియా’ తొలి చిత్రం. అప్పట్లో ఆ చిత్రం భారీ విజయం సాధించింది. అమాయకమైన ప్రేమికుడిగా నటించి, ప్రేక్షకులను దగ్గరయ్యాడు. ఈ సినిమాలో ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్‌ అవార్డు కూడా సల్మాన్‌కు వరించింది.

ముప్పై ఏళ్ల ఇండిస్టీలో..
‘హమ్‌ ఆప్కే హై కౌన్‌..!’ సినిమా 1990లో విడుదలైంది. దీంతో మంచి ప్రేమికుడిగా స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘కరణ్‌ అర్జున్‌’తో యాక్షన్‌ పాత్రలను ఎంచుకున్నారు. ‘జుడ్వా’లో సల్మాన్‌ఖాన్‌ కామెడీ అండ్‌ యాక్షన్‌తో, డబుల్‌ యాక్షన్‌ చేసి, తన నటనలో మెరుగుదల పెంచుకున్నారు. ‘తేరే నామ్‌’ అనే సమస్యాత్మక యువకుడి పాత్రలో నటించి, ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేశారు. ఈ సినిమా సల్మాన్‌ కెరీర్‌ను ఒక కీలకమైన మలుపు తిప్పింది. అప్పటి నుంచి వరుసగా 30 ఏళ్లు పాటు 123 సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. వాటిలో ‘వాంటెడ్‌’, ‘పార్టనర్‌’, ‘బజరంగీ భాయిజాన్‌’, ‘దబాంగ్‌’ ‘ఫ్రాంచైజ్‌’, కిక్‌’ వంటి సినిమాలు కీలకంగా నిలిచాయి. ‘సుల్తాన్‌ (2016), రేస్‌ 3 (2018), టైగర్‌’ ఫ్రాంచైజీ అయినా బాక్సాఫీస్‌ వద్ద విజయాలను అందించాయి. హీరోగా నటిస్తూనే సల్మాన్‌ ‘కిక్‌-2’, ఆదిత్య చోప్రా ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ చిత్రాలను నిర్మించారు. తన బాలీవుడ్‌ కెరీర్‌కు మించి సల్మాన్‌ఖాన్‌ ‘బిగ్‌బాస్‌’ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. దీనికి 2010లో ప్రారంభమైనప్పటి నుండి ఖాన్‌ హోస్ట్‌గా ఉన్నారు. అతని చమత్కారమైన మాటలతో, వీక్షకులను ఆకట్టుకుంటున్నారు.

చెత్త సినిమాలు తీస్తే..
ఓటీటీ రాకతో ప్రేక్షకులకు సినిమా గురించి, కథను అన్నికోణాల్లో నుంచి చూసి, విశ్లేషిస్తున్నారు. సులభంగా అర్థం చేసుకుంటున్నారు. ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన సినిమా సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘సికందర్‌’ మార్చి 30న విడుదల అయ్యింది. ఇందులో రష్మిక, కాజల్‌, సత్యరాజ్‌ కీలకపాత్రలు పోషించారు. బలమైన కథ, కథనాలు లేకపోవడం సినిమా అపజయం పాలైంది.
‘చెత్త సినిమాలు చేస్తే రిజల్ట్‌ చెత్తగానే ఉంటుంది. కథ మంచిగా ఉంటేనే విజయాలు అందుతాయి. నా సొంత చిత్రమే అయినా.. అది సరిగ్గా ఆడలేదంటే కారణం అది మంచి సినిమా కాదనే! దర్శక-నిర్మాతలు ఇండిస్టీలో పోటీ మీదనే దృష్టి పెడుతున్నారు. సినిమా అంటే ప్రదర్శించడం కోసమే వారు సినిమాలు తీస్తున్నారు. అది కరెక్ట్‌ కాదు. ప్రేక్షకుల కోసం మనం సినిమాలు తీయాలి. వాళ్లకు వినోదాన్ని అందించేలా కథ ఉండాలి. ప్రేక్షకులకు ఏమీ తెలియదనుకుంటే అంతకన్నా పిచ్చితనం మరొకటి ఉండదు. దర్శక – నిర్మాతలు కూడా సరైన కథలు లేకపోయినా సినిమాలు చేసేస్తున్నారు. అలా కాకుండా మన వద్ద మంచి కంటెంట్‌ ఉన్నప్పుడే గొప్ప చిత్రాలు తెరకెక్కించాలి!’ అని ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

పుట్టినరోజు : డిసెంబర్‌ 27, 1965
నివాసం : ముంబై
వృత్తి : నటుడు, టెలివిజన్‌ ప్రెజెంటర్‌, మోడల్‌, పెయింటర్‌.
చెల్లెళ్లు : అల్విరాఖాన్‌ అగ్నిహోతి, అర్పితాఖాన్‌

➡️