టీ బ్యాగ్‌లతో టేక్‌ కేర్‌!

Jan 12,2025 08:28 #Food Care, #Science, #Sneha

అలసిన శరీరం.. టీ కావాలన్నప్పుడు క్షణాల్లో టీ రెడీ చేసుకునే సౌలభ్యం.. టీ బ్యాగ్‌లతోనే సాధ్యం. పిక్నిక్‌లలో, ప్రయాణాల్లో ఇవి మనకు ఎంతో అనుకూలంగానూ, సౌకర్యవంతంగానూ ఉంటాయి. అయితే ఇటీవల ఈ టీ బ్యాగ్‌లపై పరిశోధనలు జరిగాయి. టీ బ్యాగ్‌ల ద్వారా వందలకోట్ల కొద్దీ మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయని, ఇవి శరీరంలో ప్రవేశించి, హాని కలిగిస్తున్నాయని ఈ కొత్త అధ్యయనం పేర్కొంది. స్పెయిన్‌లోని అటానమస్‌ యూనివర్శిటీ ఆఫ్‌ బార్సిలోనా పరిశోధనా బృందం వివిధ టీ బ్యాగ్‌లను విశ్లేషించి, నిర్ధారించిన విషయం. పేగులలోని శ్లేష్మ కణాలు ఈ మైక్రోప్లాస్టిక్‌ కణాలను శోషిస్తాయని వారు కనుగొన్నారు.

టీ బ్యాగ్‌లనే టీ సాచెట్స్‌ అని కూడా అంటారు. ఇవి అన్ని వేళలా ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. టీ బ్యాగ్‌ను వేడినీటిలో వేయడంతోనే డికాక్షన్‌ తయారవుతుంది. వేడిపాలలో అయితే టీ తయారవుతుంది. ఎండబెట్టిన టీ ఆకులను మెత్తగా పొడి చేసి, ఈ బ్యాగ్‌లలో నింపి ప్యాక్‌ చేస్తారు. మరిగే ఉష్ణోగ్రత ఉన్న నీటిలో దీనిని కొన్నిసార్లు ముంచి తీయడంతోనే టీ డికాక్షన్‌ తయారవుతుంది. అంతవరకు బాగానే ఉంది కానీ, బ్యాగ్‌ బయటి పొరతోనే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు.

మూలం తయారీలోనే..
టీ బ్యాగ్‌ల తయారీలో నైలాన్‌-6, పాలీప్రొపైలిన్‌, పాలిథిలిన్‌ టెరెఫ్తాలేట్‌ (పిఇటి) సెల్యులోజ్‌ అనే పాలీమర్‌లను ఉపయోగిస్తారు. ఇవి బయోడిగ్రేడబుల్‌ (సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం చేయబడి కంపోస్ట్‌గా తయారవటం) కావు. బ్యాగ్‌ను వేడి నీటిలో వేసిన వెంటనే డికాక్షన్‌తో పాటు హానికరమైన మైక్రోప్లాస్టిక్‌ కణాలూ విడుదలవుతాయి. అంటే సాచెట్‌ టీ తాగిన ప్రతిసారీ ఒక మిల్లీలీటర్‌ నీటిలో వందలకోట్ల సూక్ష్మ, నానోప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోకి చేరతాయి. మనిషి ఆరోగ్యంపై వీటి హానికరమైన ప్రభావం ఎంతవరకు ఉంది అనే విషయంపై బర్మింగ్‌హామ్‌ యూనివర్శిటీకి చెందిన మైక్రోబయాలజిస్ట్‌ ఆల్బా గార్సియా-రోడ్రిగ్జ్‌ వివరించారు. ఈ కాలుష్య కారకాలను అత్యాధునిక సాంకేతికతలతో వర్గీకరించామని ఆయన తెలిపారు.

గణాంకాల గమనిక..
మూడు పాలిమర్‌ల గురించి విడివిడిగా ఎంతటి ప్రమాదం పొంచి ఉందో అధ్యయన వివరణ.. టీని తయారుచేసేటప్పుడు ఒక మి.లీ. నీటిలోకి పాలీప్రొఫైలిన్‌ సుమారుగా 1200 కోట్ల కణాలను విడుదల చేస్తుంది. సగటు పరిమాణం 136.7 నానోమీటర్లు. సెల్యులోజ్‌ 13 కోట్ల 50 లక్షల కణాలను విడుదల చేస్తుంది. సగటు పరిమాణం 244 నానోమీటర్లు. నైలాన్‌-6 అనేది 81.8 లక్షల కణాలను విడుదల చేస్తుంది. సగటు పరిమాణం 138.4 నానోమీటర్లు అని నివేదిక తెలుపుతోంది. కెనడాలోని క్యూబెక్‌ మెక్‌గిల్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఒక టీబ్యాగ్‌ ద్వారా 1160 కోట్ల మైక్రోప్లాస్టిక్‌ కణాలు, 310 కోట్ల నానోప్లాస్టిక్‌ కణాలు విడుదలవుతాయని కనుగొన్నారు.

హానితోపాటు..
ఈ నానోప్లాస్టిక్‌, మైక్రోప్లాస్టిక్‌ కణాలను పేగుల్లోని శ్లేష్మ కణాలు పీల్చుకుంటాయి. అవి రక్తంలోకి చేరి శరీరం అంతటా వ్యాపిస్తాయి. రక్తనాళాల్లో పేరుకుని, క్రమంగా అనారోగ్యానికి గురిచేస్తాయి. వీటి ప్రభావం ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జీర్ణవ్యవస్థ, హెమటాలజీలపై ఉంటుందంటున్నారు పరిశోధకులు. పునరుత్పత్తి కణాలను తగ్గించటం.. జీర్ణవ్యవస్థలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదానికి హేతువులుగా ఉన్నాయంటున్నారు. రక్తనాళాల్లో ప్లాస్టిక్‌ రేణువుల రూపంలో పేరుకుపోవటంతో గుండెపోటుకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

డిఎన్‌ఎనూ దెబ్బతీస్తాయి..
మైక్రోప్లాస్టిక్స్‌ జన్యువులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. డిఎన్‌ఎ, దాని అనుబంధ కణాలను జెనోటాక్సిసిటీకి గురిచేస్తాయి. అంటే ఎంజైమ్స్‌ విడుదలను నిర్వీర్యం చేయటం, జన్యు సమాచారాన్ని క్షీణింపజేయటం లాంటి చర్యలకు ఇవి కారణమవుతాయి. ఆక్సిజన్‌ రియాక్టివ్‌ రూపాలను దెబ్బతీస్తాయి. దీనివలన న్యూక్లియో బేస్‌లు (డిఎన్‌ఎ స్టాండులు) విడిపోయి లేదా విరిగిపోయి దెబ్బతింటాయి.

ప్లాస్టిక్‌ రహితాలు..
మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా అంటే.. కచ్చితంగా ఉంది. ఎకో లివింగ్‌, ఆర్గానిక్‌ కాటన్‌ టీ బ్యాగ్‌లు, లావెండర్‌ స్లీపీ ప్లాస్టిక్‌ ఫ్రీ టీ బ్యాగ్‌లు, ప్లాస్టిక్‌ రహిత పిప్పరమింట్‌ టీ బ్యాగులు వినియోగించటం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

➡️