రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు టీబీ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో, వైరస్, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా శరీరాన్ని బలోపేతం చేయడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టీబీ ఉన్నవారు బరువు తగ్గడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బరువు కోల్పోకుండా టీబీ రోగులు అధిక కేలరీలు, పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ ఎ, సి, ఈ, డి వంటి విటమిన్లు ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థకు కీలకం. ఇవి డ్రైఫ్రూట్స్, నట్స్, పుట్టగొడుగులు, క్యారెట్ వంటి వాటిల్లో సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే టీబీ నుంచి బయట పడొచ్చు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
క్యారెట్ హల్వా
కావాల్సినవి : క్యారెట్ – కిలో, బెల్లం- రెండు కప్పులు, నెయ్యి- కావాల్సినంత, యాలకుల పొడి- స్పూను, డ్రై ఫ్రూట్స్-కప్పు, చిక్కటిపాలు- అర గ్లాసు.
తయారీ : క్యారెట్‌ను చెక్కు తీసి, సన్నగా తురుముకోవాలి. అడుగు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టాలి. మంట సిమ్‌లో ఉంచి, నెయ్యి వేసి, వేడయ్యాక క్యారెట్ తురుము వేసి మూతపెట్టాలి. క్యారెట్ ఓ ఐదు ఆరు నిమిషాలకు మెత్తగా ఉడుకుతుంది. అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలి. బెల్లం వేసి గరిటెతో కలయతిప్పాలి. పాలు కూడా పోసి, దగ్గరకు వచ్చాక నెయ్యి వేసి కలపాలి. చిన్నమంట మీద బాగా ఉడకనివ్వాలి. హల్వా గట్టి పడిన తర్వాత కడాయి దించి, పక్కన పెట్టుకోవాలి. అందులో యాలకులపొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే ఏంతో ఆరోగ్యకరమైన క్యారెట్ హల్వా రెడీ.
పుట్టగొడుగుల బిర్యానీ
కావాల్సినవి : బాస్మతీ బియ్యం – కప్పు, పుట్టగొడుగులు- పావుకిలో, నెయ్యి – రెండు స్పూన్లు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 3, యాలకులు – 3, ఉల్లిపాయ ముక్కలు – కప్పు, పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి ముద్ద – స్పూన్, టమాటా ముక్కలు – కప్పు, కారం – రెండు స్పూన్లు, పసుపు – అరచెంచా, జీలకర్ర పొడి – స్పూన్, ధనియాల పొడి – స్పూను, గరం మసాలా – రెండు స్పూన్లు, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత.
తయారీ : ముందుగా కుక్కర్‌లో నెయ్యి వేసుకోవాలి. కాస్త వేడయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త రంగు మారేంతవరకూ వేగనివ్వాలి. అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి, పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి.
ఇప్పుడు పుట్టగొడుగులు, టమాటా ముక్కలు వేసుకుని మసాలాలన్నీ కలిసేలా కలుపుకోవాలి. పదినిమిషాలు ఉడకనివ్వాలి. వెంటనే పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా పొడి వేసుకోవాలి. రెండు నిమిషాలు సన్న మంట మీద వేగనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర కూడా కలుపుకోవాలి. తర్వాత బాస్మతీ బియ్యం వేసుకుని ఒకసారి కలపాలి. ఒక నిమిషం వేగాక, ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతపెట్టుకుని ఒక విజిల్ వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసేసి, వేరే మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడకనిచ్చి.. దించేయాలి. అంతే పుట్టగొడుగల బిర్యానీ సిద్ధం.
డ్రైఫ్రూట్స్ లడ్డు
కావాల్సినవి : గింజలు లేని ఖర్జూరం – అర కిలో, బాదం పప్పు – అర కేజీ, జీడిపప్పు- పావుకేజీ, పుచ్చ గింజలు- 100గ్రా|| గుమ్మడి గింజలు-100గ్రా||, గసగసాలు – 50 గ్రా||, అంజీర్ – 100 గ్రా||, సన్‌ఫ్లవర్ గింజలు -100 గ్రా||, ఎండుకొబ్బరి – 50 గ్రా||, పిస్తాపప్పు – 100గ్రా||, బెల్లం – 150 గ్రా||, నువ్వులు – 100 గ్రా||, నెయ్యి- లడ్డు చుట్టుకోవడానికి సరిపడినంత, యాలకుల పొడి- టేబుల్ స్పూన్.
తయారీ : ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద బాదంపప్పు, జీడిపప్పు వేసి బాగా వేయించి, తీసి ప్లేట్‌లో వేయాలి. తర్వాత పిస్తా, గుమ్మడి, పుచ్చ, సన్‌ఫ్లవర్ గింజలు ఒకదాని తర్వాత మరొకటి వేయించుకోవాలి. వీటన్నింటినీ తీసుకుని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. అంజీర్ కడాయిలో వేసుకుని కాస్త రోస్ట్ చేసుకుని పక్కనపెట్టాలి. మిక్సీజార్‌లో ఖర్జూరం పండ్లను, అంజీరను వేసుకుని గ్రైండ్ చేసి, ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. వేయించి పెట్టుకున్న అన్ని గింజలను పలుకులుగా మిక్సీ పట్టుకుని, ఖర్జూరం మిశ్రమంలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. లడ్డూలు చేసుకునేందుకు వీలుగా మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఎండుకొబ్బరి తురుము, వేయించిన నువ్వులు వేసుకోవాలి. లడ్డూలను తయారుచేసుకుంటూ పైన గసగసలాను అద్దుకుంటూ పక్కన పెట్టుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ.