తెలుగుదనం

Feb 2,2025 09:31 #Sneha, #Telugu Language

నిన్నటి వారపత్రికలో ప్రముఖ రచయిత మహర్షి రాసిన తెలుగు కథ ‘నిరీక్షణ’ చాలా బాగున్నదని చెప్పాను కదా! ఇవ్వాళ ఆ కథ గురించి ఎఫ్బీలో మరో ప్రముఖ రచయిత, ఒక ఇరవై ఇంగ్లీషు వాక్యాలలో తన అభిప్రాయం రాశాడు. సదరు రచయిత కూడా ఇంగ్లీషులోనే స్పందించాడు. ఇక క్రింద బోలెడంతమంది అమోఘమైన ఇంగ్లీషులో తమ ప్రతిస్పందనలు రాశారు. ఈ మొత్తంలో వాళ్ళందరికీ తెలుగు వచ్చన్న ఇంగితాన్ని మరచిపోయారు.

‘అన్నయ్యగారూ! మీ మిత్రుని పరిస్థితి ఏమీ బాగుండలేదు. మళ్ళీ అదోలా ప్రవర్తిస్తున్నారు. సుబ్బారావుగారి మనవడి పుట్టినరోజు ఫంక్షన్‌కి వెళ్తున్నాము. అక్కడికి మీరోసారి రావాలి’ అని భీమేశ్వర్రావుకి ఫోన్‌ చేసింది ప్రసన్న. ‘అలాగేనమ్మా!’ అంటూ అరగంటలో వచ్చి, మిత్రుని సరసన నిలబడ్డాడు.
అద్దం పట్టుకుని అందరి మధ్య తిరుగుతూ.. ఉండుండి ఓ మూలకెళ్ళి కళ్ళు తుడుచుకుంటున్న భర్తను చూపించి, తాను కళ్ళూ, ముక్కూ కూడా తుడుచుకున్నదామె. అక్కడికీ.. ‘చూడండీ! మనం వెళ్ళేది ఒక ప్రెస్టేజియస్‌ పార్టీకి. అక్కడ మాటిమాటికి మీరు ఆ అద్దం తీయకండి’ అని రామలింగానికి ముందే గట్టిగా చెప్పి తీసుకువచ్చింది. అయినా పార్టీకి వెళ్ళగానే ‘హారు.. గుడ్‌ ఈవెనింగ్‌. హౌ ఆర్‌ యు?’ అన్న పలకరింపులకు పులకరించిపోయి, ఒకరికొకరు వాటేసుకుంటుంటే అడుగడుగునా అద్దం పెట్టి చూస్తూ.. ‘ఏది తెలుగు పలకరింపు? ఏది తెలుగు ఆదరింపు?’ అంటూ కంటతడి పెడుతున్న రామలింగాన్ని చూసి కంగారు పడుతుండగా.. సమయానికి వచ్చిన భీమేశ్వర్రావుని చూసి ప్రసన్న మనసు కుదుటపడింది. భీమేశ్వర్రావు స్నేహితుణ్ణి దగ్గరికి తీసుకొని ఓదార్చాడు.
‘నీ కథల పిచ్చి కూల! తెలుగువారి జీవితాలకు అద్దంపట్టే కథలు రాయాలన్న తాపత్రయం మానుకోరా పిచ్చి నాయనా!’ అని అనునయించాడు.
‘ఎలా మానుకోవాలిరా? అసలెందుకు మానుకోవాలిరా? ఏ కథల పోటీ చూసినా తెలుగువారి జీవితానికి అద్దంపట్టే కథలు రాయమని ప్రకటనలు ఇస్తున్నారు. వాళ్ళేమన్నా మనల్ని మణులడిగారా? మాణిక్యాలడిగారా? తెలుగువారి జీవితాల గురించి, తెలుగులో రాయమనేగా అడిగింది. వారి ఆశలను వమ్ము చేయమని నువ్వు చెప్పడం ఎందుకు? నేనేం బెంజ్‌ కార్‌ కోరుకున్నానా? బ్రెజిల్‌కి వెళ్తానన్నానా? తెలుగుదనం ఉట్టిపడే మంచి కథ రాద్దామనే కదా! తెలుగుదనం కోసం వెతుకుతున్నా!” అంటూ రామలింగం దుఃఖపడడంలో అర్థంవున్నా.. అతణ్ణి ఎలా సముదాయించాలో మింగుడుపడడం లేదతనికి.
‘చూశావా.. చూశావా! ఆ దీపాలార్పటం, కేకులను కోయడం, హ్యాపీ బర్త్‌డే అంటూ ఇంగ్లీషులో పాడుతూ, ఇంగ్లీషులో శుభాకాంక్షలు చెప్పుకోవడం!’ కుతకుత ఉడికిపోతున్న రామలింగాన్ని చూసి..
‘ఒరేరు మనం వచ్చింది గుడికి కాదు.. సుప్రభాతాలు వినడానికి. సంగీత కచేరీకేం రాలేదు.. త్యాగరాయ కీర్తనలు వినడానికి. వచ్చింది బర్త్‌ డే పార్టీకి. మొదటి పుట్టినరోజు నుంచే పిల్లలకు దీపాలు ఆర్పుళ్ళు, కేకు కోతలు నేర్పుతారు తల్లిదండ్రులు. దగ్గరి వారంతా ఒకరి తరువాత ఒకరు వెళ్ళి కెమెరామెన్‌ సాక్షిగా కేకు ముక్కను పుట్టినరోజోళ్ళ నోట్లోకి తోయ్యడమే వేడుక. ఇప్పుడు నిశ్చితార్థాలలో, పెళ్ళిళ్ళలో.. బంధుమిత్రులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురి చుట్టూ చేరి, కత్తట్టుకుని వారిచేత చేయించే పని కేకు కోతలే. పెళ్ళిరోజు, షష్టిపూర్తి కార్యక్రమాలలోనూ నలుగురు కూచుని నవ్వుకునే ఏ వేళలోనైనా.. కేకు కోతలే. ఇక్కడ సున్నుండలు, అరిసెలు, గారెలు, పులిహోర, చక్కర పొంగలి, పరమాన్నం, పప్పు భోజనాలుండవు. నీవెంత అద్దం పెట్టి వెతికినా తెలుగుదనం కనపడదుగాక కనపడదు. కాబట్టి నువ్వు ముందు ఆ అద్దం దాచుకో. ముక్కలవ్వగలదు’ అద్దాన్ని తీసి రామలింగం జేబులో పెట్టేసాడు భీమేశ్వర్రావు.
అందరూ భోజనానంతరం ఐస్‌ క్రీములు లాగించాక వీడ్కోలు సమయంలో మళ్ళీ అద్దం తీశాడు రామలింగం. ‘వస్తామండి, వెళ్ళొస్తామండి’ అంటూ వెళ్ళే వాళ్ళుగానీ.. ‘క్షేమంగా వెళ్ళిరండి, అప్పుడప్పుడూ వస్తుండండీ’ అన్నమాటలు వీళ్ళుగానీ అనడంలేదు. ‘బారు బారు! టాటా! సి యూ!’ అన్న మాటలు కీచురాళ్ళ రొదలా వినపడుతున్న పలుకులు విని, ‘ఏవీ తెలుగు వీడ్కోలు పలుకులు?’ అని బావురుమనబోయి.. భీమేశ్వర్రావు ఉరిమి చూడడంతో మళ్ళీ అద్దం జేబులో పెట్టేసుకున్నాడు.
‘ఇంటికి వెళ్ళాక నువ్వు దిండు తడిపెయ్యకు. ప్రస్తుతానికి ఈ రుమాలు చాలు. పరిస్థితులకు రాజీపడడం నేర్చుకో!’ అంటూ ఓదార్చి మిత్రుడు ఇచ్చిన రుమాలును తీసుకున్నాడు. దారి పొడుగునా కిల్లర్‌, జెంటిల్మెన్‌, టైగర్‌, లిటిల్‌ రాస్కెల్‌, హ్యాపీడేస్‌, క్లాస్‌మేట్‌, డాన్‌, ఫస్ట్‌లవ్‌’ లాంటి తెలుగు సినిమాల పేర్లు చూస్తూ వెళ్తున్నప్పుడు భీమేశ్వర్రావు ఇచ్చిన రుమాలు చాలా ఉపయోగపడింది రామలింగానికి.
                                                                                       

                                                                                     ***

ఆ సాయంత్రం యాంకరమ్మ గారాబపు తెలుగును చూసి ‘ఏమిటా తెలుగు ప్రసన్నా?’ అంటూ మూర్చపోతున్న రామలింగంపై నీళ్ళు చల్లింది. పాపిష్టిదాన్ని అద్దం తీసి దాచనన్నా దాచాను కాను. ముందు జాగ్రత్తగా మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకుంది. ‘గుండె రాయి చేసుకోండి. వీళ్ళిలాగే మాట్లాడతారు. మనం విని తీరాల్సిందే!’ అంటూ ఛానల్‌ మార్చి వార్తలు పెట్టింది.
‘ఏమిటిది ప్రసన్నా! వీళ్ళకీ కోట్లు, సూట్లు.. అవసరమా అసలు. ఏది తెలుగుతనం? ఏది బొట్టు, చీరకట్టు, ఏవి పరికిణీలూ, పావడాలూ, పల్లెవాట్లు..? ఏవి లాగూ చొక్కాలు? ఏవి పంచలు, కండువాలు? అసలే మనది ఉష్ణ ప్రాంతం వదులుగా వున్న నూలు బట్టలు వాళ్ళకు ఎంత సౌకర్యం.. కానీ ఎందుకిలా?’ తల పట్టుకున్న రామలింగాన్ని చూసి..
‘చిలిపి ప్రశ్నలూ మీరూనూ! మనది ఉష్ణ ప్రాంతమైన మనకు సరిపడినా, సరిపడకున్నా, నప్పినా, నప్పకున్నా, బ్రిటిష్‌ వాళ్ళు నేర్పిపోయిన దుస్తులంటూ బడిపిల్లలు, అధికారులు, పెళ్ళికొడుకులు, న్యూస్‌ రీడర్లూ, అందరూ సూటు బూటు వేసుకోవాల్సిందే. అతిగా ఆశలు పెట్టుకోకండి. న్యూస్‌ రీడర్‌ అంటే ముఖాన బొట్టు తీసేసి, జుట్టు తప్పనిసరిగా కత్తిరించుకోవాలి. చదివే వార్తలకు, ఈ జుట్టు కత్తిరింపులకు, బొట్టు తీతలకు, కోటు వేతలకు సంబంధం ఏమిటో అని అస్సలు అడగకూడదంటే అడగకూడదు తెలుసా? మీరు ఇక ఇవ్వాళ్టికి తెలుగుదనం, తెలుగుదనం అంటూ అద్దం తీయకూడదు సుమా!’ ప్రసన్న కాస్త గట్టిగానే సర్ది చెప్పింది.

                                                                                                ***

మర్నాడు మధ్యాహ్నం వేళ జామకాయ ముక్కలు తింటూ, టీవీలో ‘అభిమాన నటునితో టాక్‌ షో’ చూడసాగింది ప్రసన్న.
కాస్సేపటికి ఎవరివో వెక్కిళ్ళు వినపడి పక్కకు తిరిగి చూసి అవాక్కయింది.
‘పాపిష్టిదాన్ని.. పక్కనే వున్నారు కదా అనుకున్నానే గానీ, ఆయన తెలుగు స్ట్రోక్‌ గురించి మర్చిపోయాను. ఇప్పుడాయన కన్ను ఏ తెలుగు లేమిపై పడిందో!’ అనుకుంటూ గబగబా దగ్గరకెళ్ళింది.
‘ఏమయ్యిందండీ?’ చిన్నపిల్లాణ్ణి తల్లి అడిగినట్టు అడిగింది.
‘అదికాదు ప్రసన్నా! రాసింది తెలుగు కథ! రాసినవారు తెలుగువారు! అచ్చు వేసుకున్నది తెలుగు పత్రికలవాళ్ళు! చదువుతున్నది తెలుగు పాఠకులు కదా..!’
‘అయితే ఇప్పుడేమంటారండీ?’ దెబ్బ ఎక్కడ తగిలిందోనని ఆరాటపడుతున్న తల్లిలా ఆమె కంగారుగా అడిగింది.
‘నిన్నటి వారపత్రికలో ప్రముఖ రచయిత మహర్షి రాసిన తెలుగు కథ ‘నిరీక్షణ’ చాలా బాగున్నదని చెప్పాను కదా! ఇవ్వాళ ఆ కథ గురించి ఎఫ్బీలో మరో ప్రముఖ రచయిత, ఒక ఇరవై ఇంగ్లీషు వాక్యాలలో తన అభిప్రాయం రాశాడు. సదరు రచయిత కూడా ఇంగ్లీషులోనే స్పందించాడు. ఇక క్రింద బోలెడంతమంది అమోఘమైన ఇంగ్లీషులో తమ ప్రతిస్పందనలు రాశారు. ఈ మొత్తంలో వాళ్ళందరికీ తెలుగు వచ్చన్న ఇంగితాన్ని మరచిపోయారు. తెలుగు కథ గురించి.. తెలుగు వారు, తెలుగులో స్పందించ వచ్చు కదా..!’ అని నేను తెలుగులో అడిగాను. ‘కథ అందరికీ చేరాలంటే, ఇంత చాదస్తం వుండకూడదని బదులిచ్చారు వాళ్ళు’ తెలుగు సాహిత్యం ఎక్కడికో ఎవరికో చేరాలన్న తపనతో తెలుగు వాళ్ళు, తెలుగువాళ్ళను చేరుకోలేకపోతున్నారు ప్రసన్నా!’ కళ్ళు తుడుచుకున్నాడు రామలింగం.
‘మీరు మరీ అలా ఆవేశపడకండి.. కొన్నింటికి సమర్థింపులు తప్ప, సరైన సమాధానాలుండవు..’ అంటూ లోనికి వెళ్ళింది. చల్ల చిలుకుతూ రామనాథాన్ని చల్లగా చూడమని దేవదేవుణ్ణి ప్రార్థించి.. గ్లాసుడు చల్ల తాగించి, అతన్ని శాంతింపజేయ చూసింది.

                                                                                              ***

తెలుగుదనం ఉట్టి పడే కథలు రాయమన్న పోటీ ప్రకటన పడ్డ ప్రతిసారీ, తెలుగుపై విపరీతమైన మమకారంతో ఒక పది పదిహేనురోజులు రామలింగం గొప్ప సంఘర్షణను అనుభవిస్తూ ఇలాగే ప్రవర్తిస్తుంటాడు. ఆ సమయంలో అతనికి వచ్చేది తెలుగు స్ట్రోక్‌ అని, అతని మనసును గాయపరిస్తే చాలా ప్రమాదమని, ఇలాంటి సమయాల్లో పదిపదిహేను రోజులు అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అతన్ని దృష్టి మరలుస్తుంటే చాలు, తరువాత అతను తెలుగులో కలిసిపోయిన ఇంగ్లీషులా.. మామూలుగా అయిపోతాడని డాక్టర్లు చెప్పారు. అక్కడికీ ఎందుకైనా మంచిదని, వీలైనంత వరకు అతను ఏ తెలుగు కథల పోటీ ప్రకటనలూ చూడకుండా జాగ్రత్త పడ్తూనే వుంటుంది ప్రసన్న. ఎప్పుడన్నా ఆమె కన్నుగప్పి అతను పోటీల ప్రకటన చూశాడో, ఇక అతనిలో తెలుగు స్పృహ మరీ ఎక్కువైపోయి, ప్రతిదానిలో తెలుగుదనం కోసం వెంపర్లాట మొదలై.. ఇటు భార్య ప్రసన్నను, అటు మిత్రుడు భీమేశ్వర్రావును తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాడు. అతను దేనికీ ఆవేశపడకుండా, ఆందోళనపడకుండా చూసుకుంటూ ఆ ఇద్దరూ అతన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

                                                                                              ***

ఆ రోజు మధ్యాహ్నం ‘తెలుగుదనం.. తెలుగుదనం..!’ అంటూ తెగ కలవరిస్తూ మంచంపై పొర్లతున్న రామలింగాన్ని చూసి.. ‘ఏమిటండీి ఈ తాపత్రయం. తెలుగుదనం! తెలుగుదనం అంటూ మీవన్నీ వట్టి పగటి కలలూ!’ అప్రయత్నంగా విసుక్కున్నది.
అంతే అతని కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. ఆమె తల్లడిల్లిపోయింది. ‘అయ్యయ్యో ఏదో కోపాన్ని ఆపుకోలేకపోయి, పిచ్చిమాటలు మాట్లాడాను. ఏమీ అనుకోకండి’ ప్రసన్న కలవరపడిపోయింది.
‘పిచ్చి మాటలు కాదు ప్రసన్నా! నువ్వన్నదే నిజమనిపిస్తున్నది. నాకేమో తెలుగు భాషంటే అమితమైన ప్రేమ. కానీ పరిస్థితులు చూస్తుంటే నేను కోరుకున్న తెలుగుదనం నిజంగానే పగటికలగానే మిగిలిపోతుందేమో అనిపిస్తున్నది. రామలింగం అలా ఆందోళన పడుతుండడం అతని ఆరోగ్యానికి మంచిది కాదని ఆమె ఒకటే కంగారుపడసాగింది. అంతలో ఆపద్బాంధవునిలా భీమేశ్వర్రావు రానే వచ్చాడు. విషయం తెలుసుకొని, ఆ మాట ఈ మాట చెప్పి.. రామలింగాన్ని ‘బయటికెళ్దాం రావోరు!’ అని పిలిచాడు..
‘అమ్మో! నేను కథ రాసుకోవాలి, నే రాను’ చిన్నపిల్లడిలా అన్నాడు.
‘ఎక్కడికో కాదోరు మా ఇంటికి వెళ్దాము పదా!’ అంటూ బయల్దేరదీశాడు. వీళ్ళు వెళ్ళేసరికి భీమేశ్వర్రావు కోడలు అనిత ఎదురు వచ్చి..
‘హారు అంకుల్‌. హౌ ఆర్‌ యు?’ అంటూ ఆహ్వానించగానే ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
‘ఏదో ఈ కాలపు పిల్ల. నువ్విప్పుడు అద్దం తీయకు. మన హాయే.. హారు అయింది’ అని సర్ది చెప్పాడు.
‘మిల్లీ.. కం హియర్‌! గ్రాండ్‌ పాకి హలో చెప్పు.’ అంటూ నాలుగేళ్ళ కూతురిని పిలిచింది. కంగారుపడిపోతూ ఏదో సైగ చేయాలని చూస్తున్న భీమేశ్వర్రావు వంక అనిత అస్సలు చూడడం లేదు.
‘అంకుల్‌! మిల్లిని కాన్వెంట్లో వేసాం కదా! ఎంత బాగా రైమ్స్‌ చెబుతుందో చూడండి!’ ఆమె మురిపెంగా అనడమే తడవుగా, కీ ఇచ్చిన మాటల బొమ్మలా ఆ పాప.. ‘హాట్‌ క్రాస్‌ బన్స్‌! జానీ జానీ ఎస్‌ పాపా!’ అంటూ బోల్డన్ని రైమ్స్‌ వల్లెవేసింది.
అవి వింటున్న రామలింగం కనుగుడ్లు రానురాను పెద్దవవుతూ.. అవి పగలడానికి సిద్ధంగా వున్నట్లు తోచి.. భార్య సుగుణ ‘టీ పెట్టాను వుండండి’ అంటున్నా వినకుండా,
‘మాకు బయట పని వుంది’ అంటూ మిత్రుణ్ణి అక్కడి నుంచి తీసుకొచ్చేసాడు భీమేశ్వర్రావు.
దారి పొడుగునా ఏ కాన్సెప్టో తెలియదు కానీ, బోలెడన్ని కాన్సెప్ట్‌ స్కూళ్ళ బోర్డులు, దుకాణాల పేర్లు, సినిమా టాకీసుల పేర్లు, అపార్ట్మెంట్ల పేర్లు, అన్ని ఇంగ్లీషులో రాసి వుండడం చూసి, భీమేశ్వర్రావుని ఇంకో కర్చీఫ్‌ అడిగి తీసుకున్నాడు రామలింగం.

                                                                                             ***

ఇంటికి వెళ్ళేసరికి ప్రసన్న వీరికోసమే ఎదురు చూస్తున్నది.
‘ఏమండీ త్వరగా బయలుదేరండి. మీ తాతగారికి సీరియస్‌గా వుందట. మనం త్వరగా వెళ్ళాలి” అంటూ తమ పల్లెకు బయలుదేర తీసింది. తాము వెళ్ళేసరికి తాతగారికి ఎలా వుంటుందో అన్న బాధ.. తెలుగుదనం ఉట్టిపడే కథ రాయలేకపోతున్న దిగులు.. ఏకకాలంలో కలిగాయతనికి. తెలుగు కథ మీద ఆశ వదులుకొని, ఎనిమిది గంటలు ప్రయాణం చేసి, తెల్లారే తమ ఊరు చేరుకున్నాడు రామలింగం.
బస్సు దిగి ఊర్లోకి వెళ్తుంటే.. ప్రతి ఇంటిముంగిటా వేసి వున్న అందమైన ముగ్గులు అతని మనసును రంజింపజేసాయి.. చల్లగా వీస్తున్న పచ్చని చేల గాలులు శరీరానికి తాకి, ప్రాణం లేచి వచ్చింది రామలింగానికి.
‘బాగున్నావా అన్నా?’ ‘చాలా రోజులకు వచ్చావురా రామలింగం!’ అంటూ తననూ.. ‘పిల్లలు బాగున్నారా తల్లీ!’ అని ప్రసన్ననూ పలకరించిన పలకరింపులు అతని మనసును తాకాయి.
‘నీ కోసమే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాను రా నాయనా!’ అంటూ తనని దగ్గరకు తీసుకున్న తాతయ్యను చూసుకున్నాక అతని మనస్సెంతో నెమ్మదించింది. మనవణ్ణి చూసుకున్నాక కొత్త ఊపిరి పోసుకున్నారు రామలింగం తాతగారు. ఇక రాఘవరావుగారి సంతానం, మనవళ్ళూ, మనవరాళ్ళూ ఒక్కొక్కరుగా ఆ గూటికి చేరుకుంటున్నారు. తనకోసం వచ్చిన తన వాళ్ళందరినీ చూసిన ఆనందంలో నాలుగురోజుల్లో కొద్ది కొద్దిగా కోలుకోసాగారు రాఘవరావు గారు.
‘రాఘవరావు గారు లేవడం లేదంటగా! ఎలా వున్నారు? అంటూ ఊర్లోని వాళ్ళంతా ఒక్కొక్కరుగా అతని తాతగారిని అప్యాయంగా పలుకరించి వెళ్తుంటే, రామలింగం మనసు గాలిలో తేలిపోయింది.
పల్లెలో కనిపించిన ప్రేమలూ, ఒకరినొకరు వరుసపెట్టి పిలుచుకునే పిలుపులు.. రామలింగాన్ని పరవశింపజేశాయి. తన పల్లెలో కనిపించిన తెలుగింటి ఆహార్యం చూసి, తెలుగింటి ఆహారం తినీ.. స్వచ్ఛమైన అమ్మభాష చెవిని సోకి.. ప్రాణం లేచి వచ్చింది రామలింగానికి.
ఇక ఆ మర్నాడే సంక్రాంతి. ఇంటి ముంగిట ముగ్గులు, దారి పొడుగునా ఒకరినొకరు పలకరించుకుంటూ, కవ్వించుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటున్న.. ఊరి వారి బాంధవ్యాలు కన్నుల పండుగలా అనిపిస్తుంటే రామలింగానికి అక్కడ స్వర్గం కనపడింది. అమ్మ చేసిన పరవన్నం, సుబ్బమ్మత్త తెచ్చిన జున్ను, నానమ్మ చేసినా అరిసెలు.. రకరకాల పిండివంటలు తింటూ.. పల్లె జనం ప్రేమను జుర్రుకుంటూ.. ‘ఇక్కడ.. ఇక్కడ.. ఇంకా తెలుగు పలుకు, తెలుగు పండుగలు, తెలుగు బువ్వ, తెలుగుదనం వున్నాయి!’ అనుకుంటూ అద్దం సంచిలో పెట్టేసుకుని, రామలింగం తెలుగు కథను రాయడం మొదలుపెట్టాడు.

సమ్మెట ఉమాదేవి
9849406722

➡️