ప్రేమ పరీక్ష

Jun 9,2024 08:04 #Sneha, #Stories

ఎప్పుడూ అయిదింటికే వచ్చేవాడు ఈరోజు ఆరవ్వస్తుంది. ఇంకా రాడేంటి అని ఎదురుచూస్తుంది రాజ్యలక్ష్మి. మీది మధ్యతరగతి కుటుంబం అని డొక్కు స్కూటర్‌ శబ్దం చేసుకుంటూ వచ్చాడు హరి. స్నానం చేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. టీ తెచ్చి ఇచ్చింది. కాస్త నీరసంగా ఉన్నాడు హరి, కానీ తను అది గమనించలేదు.
‘మన పక్కింటి లక్ష్మి లేదూ పోయిన నెల పెళ్లిరోజైతే వాళ్ళాయన తనకు బంగారు గొలుసు చేయించాడంట. ఎదురింటి సరస్వతికి పోయినవారం తన పుట్టినరోజని వాళ్ళాయన జుంకాలు చేయించాడు. అంతెందుకు మీ తమ్ముడు ఉమకు టెన్త్‌ యానివర్సరీ అని ఏకంగా డైమండ్‌ రింగ్‌ చేయించాడు’ అన్నది లక్ష్మి.
‘సరే! ఇప్పుడేమంటావు!’ వచ్చే చిరాకుని ఆపుకొని కాస్త నిదానంగా అడగడానికి ప్రయత్నించాడు హరి. తన చిరాకును గమనించి, నేనేమంటాను! ఊరికే అలా కాలక్షేపానికి చెప్తున్న అంటూ మాట మార్చేసింది.
హరి, రాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల ప్రేమని రెండు కుటుంబాలూ ఒప్పుకోలేదు. ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి.. హరి వాళ్ల నాన్న స్టీల్‌, సిమెంటు వ్యాపారం చేస్తాడు. బాగానే సంపాదించాడు. తన తండ్రి తరువాత ఆ వ్యాపారం చూసుకోవాల్సింది తానే అని, లక్ష్మిని నేను బాగా చూసుకుంటానని ఆమె తల్లిదండ్రులకి ఎన్నో విధాల చెప్ప ప్రయత్నించాడు హరి. కానీ వాళ్ళు దేనికీ ఒప్పుకోలేదు. లక్ష్మి వాళ్ల అమ్మకి తన మేనల్లుడిని ఇచ్చి చేయాలని కోరిక ఉండడమే దానికి కారణం. ఈ కాలేజీ ప్రేమలు ఎక్కువ రోజులు నిలవవని అది కేవలం ఆ వయసు లోని ఆకర్షణ మాత్రమే అని కూతురికి చెబుతుండేది. లక్ష్మి ఆ మాటల్ని నమ్మేదికాదు.
తరువాత హరి వాళ్ళ నాన్నను ఒప్పించడానికి ప్రయత్నించాడు. తాను తెచ్చిన సంబంధం చేసుకుంటేనే ఆస్తిలో వాటా ఇస్తానని, లేకుంటే చిన్న వాడికి ఆస్తి మొత్తం రాసిస్తానని తెగేసి చెప్పాడు. ఆ మాటకు పౌరుషంతో ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు హరి.
ఓ ఆఫీసులో అకౌంటెంట్‌గా చేరాడు. నెలకు పదమూడు వేలు జీతం. ఆదాయం విషయం పక్కన పెడితే కొన్ని సార్లు ఉన్న జీతం కూడా ఖర్చులకి సరిపోయేది కాదు. లక్ష్మి కూడా ఉద్యోగం కోసం వెతుకుతుంది. ఇద్దరూ ఒక కొత్త జీవితాన్ని శూన్యం నుండి మొదలు పెట్టారు.
రాత్రి ఎనిమిదయ్యింది. ‘హరి, నేను ఇప్పటికిప్పుడు కొత్త చీర కొంటానంటే నీ రియాక్షన్‌ ఏంటి ?’ అన్నం వడ్డిస్తూ అంది.
‘నా రాజీ అలాంటి పిచ్చి పనులు చేయదు’ అన్నాడు హరి నవ్వుతూ. ఒకవేళ చేస్తే?
హరి మొహంలో రంగులు మారాయి. ‘కొంపదీసి కొనేశావా ఏంటి ?ఆతృతగా అడిగాడు హరి. ‘కొత్త చీర కొని చాలా రోజులయ్యింది కదండీ అందుకే..’ అని నసిగింది.
‘సరే ఎంతయ్యింది ?’
‘ఎంతా ఏం లేదండీ జస్ట్‌ పదమూడు వేలు. ఆఫర్‌లో వచ్చింది అని తీసేసుకున్నా.’
‘అంత డబ్బెక్కడిదే?’ దాదాపు అరిచేసాడు హరి.
‘దేవుడి పటాల వెనుక పోయిన వారం ఉంచారు కదా’ అని లక్ష్మి చెప్తుండగానే… చెంప చెళ్లుమన్నది. ‘నాకు ఒక్క మాటైనా చెప్పాలని తెలియదా?’ గట్టిగా అరిచాడు హరి.
లక్ష్మీకి కూడా కోపం వచ్చింది. ‘ఇన్ని రోజులూ అడిగే తీసుకుంటున్నానా?’ అంటూ వడ్డిస్తున్నా గరిటను టేబుల్‌ పైన విసిరేసింది. అది కాస్త సాంబారు పాత్రకు తగిలి వేడివేడి సాంబార్‌ హరి చెయ్యిపై పడ్డాయి. కోపంలో విసిరినందుకు బాధపడుతూనే హరి చేతిని అందుకుంది. చేయి తుడిచి, రాసింది లక్ష్మి. ఇద్దరూ కొద్దిసేపు చిటపటలాడుకున్నారు.
‘కాలేజీలో నా వెంట తిరిగేటప్పుడు ఎన్ని మాయ మాటలు చెప్పావ్‌. ‘నీ కోసం ఆకాశంలో చంద్రుడుని సైతం తీసుకొస్తా, నీ కష్టానికి నేనడ్డు నిలబడతా’.. అంటూ అన్నీ బూటకపు మాటలు నమ్మి చేసుకున్నా నిన్ను. అప్పటికీ మా అమ్మ చెప్పింది.”వద్దే వద్దే” అని నేనే వినిపించుకోలేదు.’
‘నువ్వేమైనా తక్కువ తిన్నావా, అప్పట్లో ఎంత అణకువగా ఉందేదానివి. నోట్లో నాలుకలేని దానిలాగ. రాజీ చాలా అందంగా ఉన్నావు అన్న చిరునవ్వే, లడ్డ్డుముక్కుదానా అని తిట్టినా చిరునవ్వే. ఆ నవ్వు చూసే మోసపోయి చేసుకున్నానే నేను. నువ్వింత గయ్యాళిగా మారుతావని నేనేమైనా కల కన్ననా?’ అంటూ సమర్థించుకున్నాడు హరి. ఆ మాటకు లక్ష్మి పెదవులపై మళ్ళీ చిరునవ్వు మెదిలింది.
కాసేపాగి ‘ఎప్పుడో ఆర్డర్‌ పెట్టాను, రేపే డెలివరీ వస్తుందండి, తీసుకుంటానండి.’
‘ఏం పర్వాలేదు, ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసి తిప్పి పంపించేయి.’
చేతికి రాస్తున్న ఆయింట్మెన్ట్‌ ఒక్కసారిగా పక్కకి విసిరేసి, అటు వైపుకు తిరిగి పడుకుంది. హరి కూడా మళ్ళీ ఏం మాట్లాడలేదు.
రాత్రస్సలు నిద్ర పట్టలేదు. అంత కోపమెందుకో ఒక్క చీరే కదా. పెళ్లికి ముందు నేనేం అడిగినా కాదనేవాడు కాదు. ఇప్పుడేమో ఒక్క చీరకే ఇంతంగా కోప్పడ్డాడు. అమ్మ చెప్పినట్టుగా ఈ కాలేజీ ప్రేమ ఎక్కువ రోజులు నిలవదా ? హరికి నా మీద ప్రేమ తగ్గిపోతుందా? ఛీ ఛీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. హరికి తెలిస్తే బాధపడతాడు. నాతో ప్రతి విషయం పంచుకుంటాడే. మరి ఆ డబ్బు గురించి ఎందుకు చెప్పలేదు? ఎదైనా అవసరం కోసం దాచుంటాడు. ఆఫీస్‌లో ఈ మధ్య పని ఒత్తిడి చాలా పెరిగిందన్నాడు. ఐదుగురి పని తానొక్కడే చేస్తున్నాడు అని చెప్పాడు. బహుశా ఆ ఆలోచనలోనే మర్చిపోయి ఉంటాడు. నేనే ఏం తెలుసుకోకుండా ఖర్చుపెట్టేశాను. అయినా కొనేముందు ఒకసారి తనకు చెప్పి ఉంటే ఈ తగువంతా ఉండేదే కాదు. టిఫిన్‌ చేసేటప్పుడు క్షమించమని అడుగుతా అని వంట చేస్తూ ఆలోచించింది లక్ష్మి.
అనవసరంగా రాజీని కొట్టాను. ఎంత బాధ పడిందో ఏమో. అయినా నాకెందుకంత కోపం, ఈ మధ్య నాకు మరీ చిరాకు పెరిగిపోతుంది. బాగా చూసుకుంటాను అని మాటిచ్చాను. ఇప్పుడేమో ప్రతి విషయానికీ విసుక్కుంటున్నాను. తన మీద నాకు ప్రేమ తగ్గిపోయిందని అనుకుంటుందేమో. లేదు.. లేదు. నా రాజీ ఎన్నటికీ అలా అనుకోదు. తనకు నేనంటే చాలా ప్రేమ. రాత్రి నా చెయ్యి కాలేసరికి, ఎంత కన్నీరు పెట్టుకుంది. పాపం. నిజంగా తను నాకు దొరకడం నా అదృష్టం. వెంటనే వెళ్ళి క్షమించమని అడగాలి అనుకుంటూ లేచి స్నానం చేసాడు. వంట గదిలోకి వెళ్ళాడు హరి.
లక్ష్మీ వంట చేస్తుంది. దగ్గరికి వెళ్లి..’నన్ను క్షమించు రాజీ. రాజీ ఐయాం సారీ. కనీసం నా వైపు చూడనైనా చూడవా?’ అంటూ తన వైపు తిప్పుకున్నాడు.
‘చాలా రోజుల నుండి స్కూటర్‌ బాగా విసిగిస్తుంది. మన రవి లేడూ వాడు ఈ మధ్యే కొత్త బండి కొన్నాడు. వాడి స్కూటర్‌ అమ్ముతానన్నాడు. పదిహేను వేలకే ఇస్తానన్నాడు. దానికోసం వుంచా డబ్బు. తప్పంతా నాదే ఆ డబ్బు గురించి నీకు ముందే చెప్పుంటే నువ్విలా చేసేదానివి కాదని నాకు తెలుసు. అనవసరమైన కోపంతో కొట్టాను. ఇంకెప్పుడై నీపై చేయిచేసుకోను.’ అంటూ గద్గద స్వరముతో కంటతడితో తన చెంపను తాకుతూ అన్నాడు.
‘తప్పంతా నాదే హరి. నీకెన్నెన్నో పనులుంటై అన్నీ నాకు చెప్పాలా ఏంటి. నేనే నిన్ను అడిగి ఉంటే సరిపోయేది. అంటూ హరి కన్నీళ్లు తుడుస్తూ నాకే చీరా వద్దు.ఈ చిన్న చిన్న విషయాలకు మన మధ్య ఇంకెప్పుడూ గొడవలు రాకూడదు’ అంటూ తనను హత్తుకుంది లక్ష్మీ.
‘సాయంత్రం సిధ్ధంగా ఉండు. బయటకెళ్దాం. మనం సరదాగా గడిపి చాలా రోజులవుతుంది. రేపటి మన పెళ్లి రోజుకి ఈరోజు సాయంత్రం నుండే సెలబ్రేషన్స్‌ మొదలుపెడదాం సరేనా.’
‘ఎక్కడికి వెళ్తున్నాం’ ఆతృతగా అడిగింది లక్ష్మి.
‘సర్ప్రైజ్‌.’
‘కనీసం ఎన్నింటికి ?’ అదైనా చెప్పు.
‘అయిదింటికి సిద్ధంగా ఉండు.’
తయారయ్యి ఎప్పుడొస్తాడా! అని వరండాలో అటు ఇటు తిరుగుతూ ఎదురుచూస్తుంది లక్ష్మి. అయిదు దాటి ఆరయ్యింది. ఏడయ్యింది. ఇక రాడు అని విసుక్కుంటూ లోపలికి వచ్చింది.
ఏడున్నరకు ఇంటికొచ్చాడు హరి. ‘కనీసం ఈ రోజు కూడా త్వరగా రాలేవా? నీ కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా’ అంటూ కోప్పడింది లక్ష్మి. కాని అతను చాలా అలిసిపోయినట్లు కనిపించాడు. వచ్చి మంచంపై కూర్చున్నాడు. వెంటనే తనూ పక్కకెళ్లి కూర్చుంది. తన భుజంపై వాలి కునుకు తీశాడు. లక్ష్మి ఇంకేం మాట్లాడలేదు. హరిని తన ఒళ్ళో పడుకోపెట్టుకున్నది. తనకూ నిద్రపట్టేసింది.
రాత్రి పది.. మెలుకువ వచ్చింది హరికి. అలసట తగ్గినట్టనిపించింది. లక్ష్మి నిద్రపోతుంది. డిన్నర్‌కి తీసుకెళ్తా అని చెప్పా ఇప్పుడేమో ఇలా ఖాళీ కడుపుతో నిద్రపోయేట్లు చేశాను అనుకుంటూ కిచెన్లోకెళ్లాడు. రాజీకి ఎంతో ఇష్టమైన చైనీస్‌ రామెన్‌ నూడుల్స్‌, వైట్‌ సాస్‌ పాస్తా అరగంటలో తయారు చేశాడు. ఫ్రిజ్లో ఉన్న ఐస్క్రీం పైన దానిమ్మ ద్రాక్ష పండ్లను కోసి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ స్టైల్లో మూడింటిని సిద్ధం చేశాడు.
‘రాజీ లే డిన్నర్‌ చేద్దాం’ అంటూ తట్టి లేపాడు. ‘నన్ను క్షమించు రాజీ , ఈ రోజు త్వరగానే వద్దాం అనుకున్నా. కానీ రాలేకపోయను. రేపు కచ్చితంగా వెళ్దాం’ అంటూ తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్‌తో నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. టేబుల్‌పై అన్నింటినీ సర్దాడు. ఇద్దరూ కూర్చున్నారు. సడెన్‌గా కరెంట్‌ పోయింది. టేబుల్‌ పైన కొవ్వొత్తి వెలుగులో లక్ష్మి నవ్వుకుంటూ కనిపించింది. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ అంటూ నవ్వుతూ చూసింది లక్ష్మి. హరి కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి.
‘నిన్ను సరిగ్గా చూసుకోలేకపోతున్నానా రాజీ?’ అని అడిగాడు హరి.
‘నాకోసం నువ్వు కష్టపడి చేసిన వంటల కంటే స్టార్‌ హోటల్లోవి కూడా అంత రుచిగా ఉండవు. నువ్వు నాకోసం ఈ రాత్రి మేలుకొని ఇంత చేయడమే నాకు చాలు. నువ్వు నాతో గడిపే ఈ సమయమే నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. యూ ఆర్‌ ది బెస్ట్‌ హస్బెండ్‌.’ అన్నది.
‘కనీసం నీకొక చీరకూడా కొనలేక పోయనే నేనెలా..?
‘అబ్బబ్బా అసలిదంతా ఆ దిక్కుమాలిన చీర వల్లే వచ్చింది. నాకిప్పట్లో ఏ చీర వద్దు. ఇక దాని విషయం మర్చిపో.’
హరి నవ్వుతూ చూశాడు. తను తెచ్చిన కవర్లో నుండి చీర తీసి లక్ష్మి చేతికిచ్చాడు. లక్ష్మి కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి.
‘మరి ఆ డబ్బు ?’ అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. ‘స్కూటర్‌కి ఎప్పుడిచ్చినా తొందరేం లేదులే. ఇంకో అయిదారు నెలలు అయ్యాక తీసుకుందాం’ అని అన్నాడు. హరి తనపై చూపించిన ప్రేమకు తన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ మాత్రపు కన్నీటిని కూడా మోయలేక హరి గుండెలపై వాలి పోయింది. గడియారం పన్నెండు కొట్టింది. ఈ ప్రేమ పరీక్షకు మూడేళ్ల ప్రాయం నిండింది.

 

  • డి. శరత్‌ చంద్ర
    97012 18065
➡️