ఆ ఖాళీని భర్తీ చేయాలని ఉంది..!

Oct 6,2024 10:54

ఫరియా అబ్దుల్లా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ‘చిట్టి’ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఐదు అడుగుల, పది అంగుళాల హైట్‌తో టాలీవుడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫరియా మంచి డ్యాన్సర్‌. రితేష్‌ రానా దర్శకత్వంలో సెప్టెంబర్‌ 13న విడుదలైన ‘మత్తు వదలారా 2’ సినిమాలో ఓ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేశారు. అందులో కీలక పాత్రలో నటించి, ప్రేక్షకులకు హాస్యం అందించారు. అంతేకాదు.. లిరిక్స్‌ రాయడంతో పాటు సాంగ్‌ కూడా పాడి ప్రేక్షకులకు వినోదం పంచారు. ఈ సందర్భంగా ఫరియా గురించి కొన్ని విశేషాలు…

పేరు : ఫరియా అబ్దుల్లా.
పుట్టినతేది : మే-28- 1998
తల్లిదండ్రులు : సంజయ్ అబ్దుల్లా (వ్యాపారవేత్త), కౌసర్‌ సుల్తానా (థెరపిస్టు).
వృత్తి : మోడల్‌, డ్యాన్సర్‌, నటి.
చెల్లెలు : ఇనయా అబ్దుల్లా
నివాసం : హైదరాబాద్‌.

ఫరియా అబ్దుల్లా పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో. పదో తరగతి వరకూ ప్రైవేట్‌స్కూల్లో చదివారు. కొన్ని సమస్యల వల్ల ఇంటర్మీడియట్‌ ఇంటి దగ్గరే ఉండి చదివారు. ఈ క్రమంలో పెయింటింగ్‌, సాహిత్యం నేర్చుకున్నారు.

నాటకాల్లో
చదువు కన్నా నటన పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి గమనించి తండ్రి ప్రోత్సహించారు. దాంతో ఆమె నాటక సంస్థలో చేరి శిక్షణ తీసుకున్నారు. ఏడు సంవత్సరాల పాటు అనేక నాటక సంస్థల్లో చేరి నాటకాలు ప్రదర్శించారు. రవీంద్ర భారతితో సహా అనేక కళాక్షేత్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని, నాటకాలు ప్రదర్శించి ఎన్నో పాత్రలు పోషించారు. అప్పుడే ఫరియా అబ్దుల్లా రచయితగా మారి నాటకాలు రాయడం మొదలుపెట్టింది. కొంతమంది రైటర్స్‌ దగ్గర మెలకువలు నేర్చుకున్నారు. కొన్ని నాటకాలకీ దర్శకత్వం వహించారు. నాటకాలు చేస్తూనే లయోలా కాలేజీలో మాస్‌ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తిచేశారు. అప్పుడే సినిమాల్లో నటించాలన్న కోరిక ఆమెకు కలిగింది. డ్యాన్స్‌తో పాటు హిప్‌, హాప్‌, బెల్లి డ్యాన్స్‌ నేర్చుకుంది. చదువుకుంటూనే ‘ది బెస్ట్‌ వరస్ట్‌ డేట్‌’ అలాగే ‘వెన్‌ టూ ఫ్రెండ్స్‌ లైక్‌ దా సేమ్‌ గర్ల్‌’ వంటి షాట్‌ ఫిల్మ్‌ లోనూ, ‘నక్షత్ర’ వంటి వెబ్‌ సిరీస్‌లో ఫరియా అబ్దుల్లా నటించారు.

సినిమాల్లో…
2018లో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఒక కార్యక్రమం కోసం లయోలా కాలేజ్‌ గెస్ట్‌ గా వెళ్లారు. ఆ కార్యక్రమం అయిపోయాక నాగ్‌అశ్విన్‌ కలిసి తన గురించి పరిచయం చేసుకుని ‘మీ సినిమాలో ఏదైనా అవకాశం ఉంటే ఇవండీ సార్‌’ అని అడిగింది ఫరియా. అప్పుడు నాగ్‌ అశ్విన్‌ ‘ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నాం. ఆసక్తి ఉంటే ఆఫీస్‌లో కలువు’ అని చెప్పారు. ఫరియా అబ్దుల్లా చేసిన షార్ట్‌ ఫిల్మ్స్‌, నాటకాలు చూసి ‘జాతిరత్నాలు’ సినిమాకి హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అలా అనుదీప్‌ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో ఫరియా పోషించిన ‘చిట్టి’ పాత్రకు మంచి పేరు వచ్చింది. అప్పటినుంచి సినిమా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచులర్‌’, ‘బంగార్రాజు’ సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించారు. సంతోష్‌ శోభన్‌ హీరోగా చేసిన ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్రైబ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. రవితేజ ‘రావణాసుర’, ‘కల్కి’ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ‘ఆ ఒక్కటి అడక్కు’లో నరేష్‌తో కలిసి నటించి యాక్షన్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు.


ఇండిస్టీలో ‘టిపికల్‌ హీరోయిన్‌గా మాస్‌ మసాలా, హార్రర్‌ థ్రిల్లర్‌, కామెడీ సినిమాలు చేయాలని వుంది. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్‌ సినిమాలు చేసే హీరోయిన్స్‌ తక్కువగా వున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలని వుంది. యాక్షన్‌ సినిమాలు నాకు బాగా నప్పుతాయని భావిస్తున్నాను.’ అని ఓ ఇంటర్వ్యూలో ఫరియా అన్నారు. ఆ దిశగానే ఆమె కథలు వింటూ, తనకు నచ్చితేనే సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గోపి దర్శకత్వంలో ‘భగవంతుడు’ సినిమాలో నటిస్తున్నారు. తాను నటించిన ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఒక వేళ తనకు సినిమా అవకాశాలు రాకపోయినా తనకు నచ్చిన ఎన్నో రంగాలు ఉన్నాయని ఆత్మ విశ్వాసంతో చెపుతున్న ఫరియా మంచి నటిగా సినిమా రంగంలో ఎదగాలి అని కోరుకుందాం.

అది సమస్యే కాదు…
ప్రత్యేకమైన షోస్‌కు హాజరైనప్పుడు ఆమె బెల్లీ డ్యాన్స్‌ ప్రదర్శిస్తూ, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తన హైట్‌ వల్ల సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన పదిహేనేళ్ల వయస్సులో తండ్రి అబ్దుల్లా చెప్పిన మాటలు నిత్యం గుర్తు చేసుకుంటానని చెప్పారు. ”ఫరియా భవిష్యత్తులో నీవు చాలా హైట్‌ పెరుగుతావు. దాని వల్ల ఎదురయ్యే పరిణామాలకు నీవు మానసికంగా సిద్ధంగా ఉండాలి.’ అని ధైర్యం చెప్పారని, హైట్‌ని అడ్వాంటేజ్‌గా ఫీల్‌ అవుతూ ముందుకెళతానన్నారు.

➡️