పుస్తకం.. మన నేస్తం..

Apr 23,2024 10:25 #Sneha

థీమ్‌..
‘రీడ్‌ యువర్‌ వే (మీ మార్గం చదవడం)’ ఈ సంవత్సరం థీమ్‌. చదవటం ద్వారా ప్రతి ఒక్కరూ ఒత్తిడిని, అధిక ఆలోచనలను విడనాడగలరని.. పిల్లలకు చదవడం.. దానిలో సారాన్ని ఆస్వాదించడం.. పిల్లలు ఇష్టపడిన పుస్తకాలను వారికి అందించటం ద్వారా వారిలో పఠనాసక్తి పెంచవచ్చనేది థీమ్‌ ఉద్దేశ్యం.

బాపూ రమణల బుడుగులు.. చక్రపాణి చందమామ వెలుగులు.. మహిళల ప్రాతినిధ్యంతో సాగిన స్వీట్‌హోమ్‌లు.. మరెన్నో రచనలు.. రామాయణ మహాభారత కావ్యాలు.. తెలుగులోకాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తాయి. మాలపల్లి, కన్యాశుల్కం, అమ్మ లాంటి నవలలు సామాజిక రుగ్మతలను మటుమాయం చేసేంతగా ప్రజలను ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు. చరిత్ర.. జీవిత చరిత్రలు.. శాస్త్రీయ పరిశోధనలు.. మనిషి జీవన గమనానికి సూచికలే మరి. పుస్తకాల ద్వారానే మనిషి భావాలోచనలు భావితరాలకు మార్గనిర్దేశాలవుతాయి. గతానికి, భవిష్యత్తుకి ఒక బంధం.. తరతరాల సంస్కృతులకు వారధి పుస్తకాలే. పూర్వం పుస్తకాలే నిధినిక్షేపాలు. పుస్తకాల దొంతరలే ఆ ఇంటి స్థోమతను తెలిపేవి. పుస్తక విజ్ఞానంతో ఎన్నో ఆరోగ్యకరమైన చర్చలు, గోష్టులు జరిగేవి. అవి విమర్శనాత్మక ఆలోచనలకు ఉద్దీపనలయ్యేవి. ప్రతి రచన ఒక బిడ్డలాంటిది. రచయిత కలం నుండి జాలువారే ప్రతి అక్షరం అపురూపమే. రచయితకు, అక్షరాలతో అనుబంధం అలాంటిది. ఆ అక్షర కుసుమాలను కాపాడుకునేందుకు ఏర్పడినదే కాపీరైట్‌. చరిత్ర గమనంలో తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు వారి జీవితంలో ఒక భాగంగా స్వంత గ్రంథాలయాలను ఏర్పరచుకుని.. ఆకళింపు చేసుకుని.. సామాజిక బాధ్యతతో మెలిగేవారు. ప్రజల్లో పుస్తకాలు, కాపీరైట్‌పై అవగాహన కలిగించే క్రమంలో ఈ నెల 23న ‘రీడ్‌ యువర్‌ వే’ థీమ్‌తో వచ్చిన ప్రపంచ పుస్తక, కాపీరైట్‌ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

ఒక పుస్తకాన్ని చదివితే కొత్త స్నేహాన్ని సంపాదించుకున్నట్టు ఉంటుంది. అదే పుస్తకాన్ని మరోసారి చదివినప్పుడు పాత స్నేహితుల్ని కలసిన ఆనందం కలుగుతుంది. మరి ఆ పుస్తకాల మనుగడ ప్రస్తుతం మృగ్యమైపోతోంది. విజ్ఞాన ప్రస్థానం సమాజాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుంది. అదే సమయంలో.. డిజిటల్‌ టెక్నాలజీ క్రమంగా మనిషి నిత్యజీవితంలో వేళ్ళూనుకుంది. విజ్ఞానం, అభివృద్ధి ఎప్పుడూ ఆహ్వానించదగినవే. కానీ అదే ప్రత్యామ్నాయం కాదు కూడా. అభివృద్ధికి దోహదపడే సాంకేతికతను ఎప్పుడూ ఆహ్వానించాలి. అది జగానికి, జనానికి సానుకూలమైనదై ఉండాలి.

దీని పుట్టుక ..
ఏదైనా ఒక విషయంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక రోజును నిర్వహించుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం.. ఈ నెల 23న ప్రపంచ పుస్తక, కాపీరైట్‌ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. చదవటం, రాయటం, ప్రచురణ, కాపీరైట్స్‌ను ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్యోద్దేశం. యునెస్కో 1995లో జరిపిన పారిస్‌ సమావేశంలో పుస్తకాలు, రచయితలపై అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రధానంగా పిల్లలు, యువతను చదువువైపు ఆకర్షితులను చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఈ పుస్తక దినోత్సవాన్ని జరుపుతోంది. స్పెయిన్‌కు చెందిన వాలెన్సియన్‌ భాషా రచయిత విసెంటె క్లావెల్‌ ఆండ్రెస్‌ మొదట ఈ పుస్తక దినోత్సవాన్ని జరపాలనే ఆలోచన చేశారు. స్పానిష్‌ రచయితలు మిగ్యుల్‌ డి సర్వెంటస్‌, ఇన్కా గర్సిలాసో వేగా, షేక్స్‌పియర్‌కు నివాళిగా ఈ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

కాపీరైట్‌ అంటే..
కాపీరైట్‌ అంటే రచయిత హక్కు. రచయిత స్పష్టమైన వ్యక్తీకరణకు ఒక రక్షణ. సాహిత్యం, కళాత్మక, తదితర రచనలపై రచయితకు ఉండే చట్టపరమైన హక్కు. అంటే ఒక రచన, రచయిత అనుమతి లేకుండా దొంగిలించడం కానీ, తనదిగా పరిచయం చేయటం కానీ జరగకుండా నిలువరించేదని అర్థం. పుస్తకాలు, సంగీతం, పద్యాలు, పెయింటింగ్‌, శిల్పం, చలనచిత్రం, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు, ప్రకటనలు, మ్యాప్‌లు, టెక్నికల్‌ డ్రాయింగ్‌లు, బ్లాగ్‌పోస్ట్‌లు, ఆర్కిటెక్చరల్‌ వర్క్‌లు, నాటకాలు మరెన్నో రచనలు కాపీరైట్‌ పరిధిలోకి వస్తాయి.
కాపీరైట్‌ అధికారాలు పూర్తిగా పుస్తక రచయితకే చెందుతాయి. 1710లో మొట్ట మొదట ‘అన్నే శాసనం’ అనే కాపీరైట్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట్లో ఈ చట్టం కేవలం పుస్తకాల కాపీకి మాత్రమే వర్తించేది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కాపీరైట్‌ చట్టం ఆధారంగా మనదేశంలోనూ 1847లో మొదటి కాపీరైట్‌ చట్టం ఏర్పడింది.

సమస్యలు..
ప్రస్తుతం డిజిటల్‌ కాపీరైట్‌తో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిలో ముఖ్యమైన సమస్య పైరసీ. రచయిత, సినిమా నిర్మాతల అనుమతి లేకుండా ప్రచురించడం, పంపిణీ చేయడంలాంటివి జరుగుతున్నాయి. సినిమాలు, సంగీతం, సృజనాత్మక రచనలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. దీనివలన రచయిత, సినిమా నిర్మాత.. తదితరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పుస్తక పఠనంతో సామాజికాభివృద్ధి..
తొలినాళ్ళలో తెలుగు సాహిత్యం కుల, మతపరమైన అంశంగా ఉండేది. ఒక వర్గానికి చెందినవారు మాత్రమే చదవటం, రాయటం చేసేవారు. క్రమంగా వారిలోనే అది సరైన పద్ధతి కాదనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత అనేకమంది కవులు, రచయితలు, సామాజిక రచనలు అందించారు. తరాలు మారే కొద్దీ అభివృద్ధి, అభ్యుదయ ఆలోచనలు సాహితీ సమాజంలో నెలకొన్నాయి.
చిన్నయసూరి రచించిన బాల వ్యాకరణం అందరినీ ఆనందడోలికల్లో ముంచింది. ఆయన నీతి చంద్రిక, పంచతంత్రం, మిత్రలాభం, మిత్రభేదం లాంటి నీతి కథలు పిల్లలకు పంచభక్ష్యాలే అయ్యాయి. తర్వాత గురజాడ రచనల్లో ‘దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు’ నినాదం స్వాతంత్య్రోద్యమ కాంక్షతో రగులుతున్న సమాజానికి సూదంటురాయిలా మారింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన గురజాడ ‘కన్యాశుల్కం’ అనే నాటకం.. అంటరానితనానికి వ్యతిరేకంగా ఉన్నవ లక్ష్మీనారాయణ రచన ‘మాలపల్లి’ అప్పటి సాహితీ ప్రపంచంలో పాలకులతో పెద్ద ధర్మ యుద్ధమే చేశాయి. అభ్యుదయం, ఆదర్శం రేకెత్తించే భావజాలం ప్రజలను చైతన్యపరిచింది. ఈ నవలను ఎన్‌.జి.రంగా టాల్‌స్టారు రచించిన ‘వార్‌ అండ్‌ పీస్‌’ తో పోల్చారు. అలాగే గోర్కీ నవల ‘అమ్మ, ‘నైన్టీ త్రీ అండ్‌ మిజరబుల్స్‌’, ఏ టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌, ద ఎటర్నల్‌ సిటీ’ భగత్‌సింగ్‌ను ప్రేరేపించాయి.


సహజత్వంతో ఉండే గ్రామీణ జీవితం, జాతీయవాదం వంటి ఇతివృత్తాలను తన రచనల్లో అందించిన రాయప్రోలు సుబ్బారావు.. శాస్త్రీయ విజ్ఞాన రచనలతో కొడవటిగంటి కుటుంబరావు.. భౌతికవాదం, హేతువాదం, మానవతా వాదం ప్రస్ఫుటించే రచనలు, సినిమాలు మనకందించిన త్రిపురనేని గోపీచంద్‌.. మహాప్రస్థానం లాంటి కవిత(ల)తో ఉర్రూతలూగించిన శ్రామిక యుగకర్త, నిత్య అభ్యుదయ కవి శ్రీశ్రీ.. మరెందరో కవులు, రచయితలు సమాజానికి చేసిన మేలు, తెచ్చిన మార్పు ఎనలేనివి. వాటి నుంచి వస్తున్న గాలులే మనం ఇప్పటికీ పీల్చుకుంటున్నాం. ఆ పుస్తకాలను ఆధునీకరించి భద్రపరుచు కుంటున్నాం.
మరి ఇంతటి విజ్ఞానాన్ని, ఉత్తేజాన్ని అందించిన పుస్తకాలను అనవసరమైన ఆకర్షణలకులోనై వదులుకోవటం వివేకం కాదు కదా! నేటి నుంచే మన పుస్తక భాండాగారాలను పటిష్టం చేసుకుందాం.


భాష, సంస్కృతిపై ప్రభావం..
పుస్తకంలోని ప్రతి పేజీ ఆ రచయిత భావాన్ని అప్పటి సామాజిక పరిస్థితులను వ్యక్తం చేస్తుంది. ‘ఒక పుస్తకం, ఒక పెన్‌, ఒక పిల్లవాడు, ఒక ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని మార్చగల శక్తులు’- అంటారు మలాలా యూసఫ్‌జారు. అక్షరాలా అది నిజం. పుస్తకాలు పిల్లలకు అనేక కొత్త పదాలను నేర్పుతాయి. అధ్యయనం వలన రకరకాల ఆలోచనలు.. కొత్తకొత్త పదాలు.. భావాలు.. రచనా శైలి పరిచయమవుతాయి. ఒకే పదం అనేక భావాలను వ్యక్తం చేస్తుంది. అర్థాన్ని బట్టి, భావాన్ని బట్టి ఎలా, ఎక్కడ, ఏ పదం ఉపయోగించాలనే విషయాలు తెలుస్తాయి. పుస్తక పఠనంతో భాషా పటిమ అలవడుతుంది.సామాజిక విలువలు, ఆయా ప్రాంత సంస్కృతులు రచనల్లో ప్రతిబింబిస్తాయి. పుస్తకాలు సంస్కృతిని రూపొందించి, తరాలకు అందిస్తాయి. మన ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ప్రజలను ప్రభావితం చేస్తాయి. సాహిత్యానికి శాశ్వతత్వాన్నిస్తాయి.

పుస్తక రాజధాని..
యునెస్కో ప్రతి సంవత్సరం ఒక నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంది. దానిలో భాగంగానే ప్రపంచ పుస్తక రాజధాని సలహా కమిటీతో కలసి ‘రీడింగ్‌ ఫర్‌ ది ప్లానెట్‌’ అనే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో పర్యావరణ సమస్యలను ప్రామాణికంగా తీసుకున్న స్పెయిన్‌లోని స్ట్రాస్‌బెర్గ్‌ సిటీ యునెస్కో దృష్టిలో పడింది. పర్యావరణం మీద శాస్త్రీయ పరమైన చర్చలు జరపటం.. ఆయా ఆలోచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం.. వాతావరణంలో వచ్చిన మార్పులను ఎదుర్కొనేందుకు బలమైన నిర్ణయాలు తీసుకోవటం.. దీనికి పుస్తకాలనే సాధనాలుగా ఎంచుకోవటం తదితర పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు స్ట్రాస్‌బెర్గ్‌ను పుస్తక రాజధానిగా ప్రకటించేలా చేశాయి.

– సన్నీ
7095858888

➡️