దిక్కులు పిక్కటిల్లే నినాదం

Apr 27,2025 09:52 #Poetry

చింతాకంతైనా చెమట చిందించనోడు
సుఖాల లోయల్లో ఉయ్యాలలూగుతుంటే
వొంచిన నడుం పైకెత్తకుండా
వొళ్ళు పిండుకుంటున్న బతుకులపై
నాలుగు మెచ్చుకోళ్ల చప్పట్లు చల్లి
మేధావి తనానికి మెరుపులు పులుముకునే
మై డియర్‌ మధ్యతరగతి ఫెలో..!

చేతిలో చిల్లి గవ్వను దోచుకుని
నోటికాడ ముద్దను లాక్కుని
పొగ గొట్టాల దగ్గిర మగ్గిపోతున్నోళ్లపై
కేవలం పొగడ్తల పూలు జల్లి
చేతగాని తనాలను
చేవలేని ఆలోచనలను
ముడ్డెనక చేతులుగా కట్టుకోవడం
భలే ముతకగా ఉంది కదా !

బిడ్డలకు పాలు కుడిపేటపుడైనా
గొడ్డులా కష్టపడుతున్న కష్టం గుర్తుకురాదా?
సుఖాల గొడుగులు కింద కులికేటపుడైనా
కంపెనీ సైరన్‌ మోతల్లో కలిసిపోతున్న
కన్నీళ్లు వినిపించవా??

ఎందరి పిడికెళ్లు ఎండల్లో పిండిన పిండో
నీ గిన్నెలో చేరిన రొట్టెల చందమామలు?
ఎందరి కంటిరెప్పల కింద నలుగుతున్న చీకట్లో
నీ తలకింద కుదురుకున్న మెత్తని నిద్రల రాత్రులు?
మైడియర్‌ మిడిల్‌ క్లాస్‌ డ్యూడ్‌..!

వాళ్ళకు జరిగే అన్యాయాలను గురించి
వాళ్ళకు జరిగే అవమానాలు గురించి
వాళ్ళు మాట్లాడడం వెరీ వెరీ కామన్‌ కానీ..
మాటవరసకైనా మనం మాట కలపకపోవడమే
మరీ వింతగా వుంది.

కార్పోరేట్‌ కంపెనీల ఏజెంట్ల వంటి
కుట్రల కుటాలు ఏలుతున్న కాలంలో
కార్మికుల హక్కులు
భంగం కావింపబడుతున్నప్పుడల్లా
దిక్కులు పిక్కటిల్లే నినాదం కాకపోవడం
ఈ శతాబ్దంలో మానవ తప్పిదంగా మిగిలిపోతుంది
ఏమంటావ్‌
మైడియర్‌ వర్కింగ్‌ క్లాస్‌ డ్యూడ్‌..!

– పల్లిపట్టు నాగరాజు
9989400881

➡️