కమ్మని కల…

Feb 2,2025 10:33 #Sneha, #Sweet dream...

కల కంటున్నాను ప్రియా
నేను నీ కోసం..
ప్రతిరోజూ ఓ అందమైన కల..
ఆ కల నా కోసమే విచ్చుకున్న
ఓ అందమైన వలలా..
నన్ను రంగుల ఇంద్రధనస్సును మరిపిస్తూ..
స్వయం ప్రకాశకులు, సృష్టి చోదకులైన
సూర్యచంద్రులను మరిపిస్తూ..
నీవు నాలో నింపుతున్న ఈ కాంతికి..
నేను ఏ పేరు పెట్టి పిలవాలి..
ప్రేమనా.. ఇష్టమనా.. ఆరాధన అననా..
వాటన్నింటినీ దాటిన మరేదో పదం..
వుందనిపిస్తోంది నేస్తమా..
నన్ను పూర్తిగా నిన్నుగా మార్చిన ఆ పదం.
నీకు తెలుసునా నా హృదయమా..
నారోజువారీ పనులన్నింటికీ ఎసరు పెట్టి..
నా మనసును పూర్తిగా నీ వశం చేసిన..
ఈ సుమధుర తరంగాలను..
ఆపలేని నిస్సహాయతలో నన్ను నెట్టివేసి..
నా ఈ పరిస్థితికి పిచ్చి అనే పిచ్చి పేరు..
తగిలించుట నీకు భావ్యమా ప్రియా..
నీ నెచ్చెలి భావ తరంగాలలో..
ఉదయించిన భానుడువి నీవని..
నీకు తెలియదా ప్రియబాంధవా..
అపురూపమైన నా ప్రణయదాహం..
నీకోసం పుట్టింది కాదా..
ఈ దాహాన్ని దారిలో పెట్టు..
చతురతకు శ్రీకారం చుట్టవా శీఘ్రమే..
నా మది తలుపులు తెరిచిన నీవు..
నీ మది తలుపులు మూసి..
అమావాస్యకో పౌర్ణమికో తొంగిచూస్తూ..
తొండి చేయుట నీకు న్యాయమా జనరంజకా..
నా గుండె గుడిలో నువ్వు ఎగరేసిన
వేకువ పతాక
చెదిరిపోని స్వప్న రాగాలతో..
దేదీప్యతను వెలిగించుకొని..
స్వయంచోదితయై వెలుగొందుట
కనవా ప్రియతమా..
నా ప్రణయ కావ్యంలోని ప్రతి అక్షరంలో..
దాగిన నీ రూపు రేఖలు..
నన్ను నిరంతరం తట్టి లేపు..
నిగూఢ నిస్వార్థ కాంతి కిరణాలు కాదా..
మమతల దారిలో మయూరమై సాగుతున్న..
నీ రేరాణిని నేనని చెప్పకనే చెప్పిన
నీ చతురతకు..
నా హృదయాన్ని నీకు కానుకగా పంపుతున్నాను..
నా ఊపిరితో నీకు ప్రణమిల్లుతున్నాను..

పాటిబండ్ల కవిత
90596 58383

➡️