ఏనుగులూ సంభాషించుకుంటాయి. వాటి భావాలను శబ్ద తీవ్రత ద్వారా వ్యక్తం చేస్తాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు బందీపూర్, ముదుమలై జాతీయ ఉద్యానవనాల (దక్షిణ భారతదేశం) లోని ఆసియా ఏనుగులపై అధ్యయనం చేశారు. అడవులు, గడ్డి భూములు, నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రదేశాలలో (రెండు సంవత్సరాలపాటు) వివిధ సందర్భాలలో ఏనుగులు చేసే నాలుగు రకాల శబ్దాలను గుర్తించారు. వాటిని రికార్డ్ చేసి పరిశోధించారు. ఏనుగు పిల్లలు పెద్ద ఏనుగులను ఆకర్షించడానికి.. ఆకలి, భయం లాంటి భావోద్వేగాలను తెలియచేయడానికి వాటి శక్తి కొలదీ అరుస్తాయట. ఇతర ఏనుగులను అప్రమత్తం చేయడానికి.. ఆటలాడటం, ఉత్సాహాన్ని వ్యక్తపరచడానికి.. పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచించడానికి.. ఆకర్షించడానికి.. ఇలా అనేక స్పందనలను వాటి ఘీంకారాల ద్వారా వ్యక్తీకరిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏనుగుల్లో రెండు జాతులున్నాయని ప్రతీతి. 1. ఆఫ్రికన్ ఏనుగు, 2. ఆసియా ఏనుగు. వీటిపై 2000 సం.లో పరిశోధనలు జరిగాయి. శాస్త్రవేత్తలు ఆఫ్రికన్ ఏనుగులను రెండు విభిన్న జాతులుగా వర్గీకరించారు. అంటే ఆసియా ఏనుగుతో కలిపి మొత్తం మూడు ఏనుగు జాతులున్నాయి. పెద్దది ఆఫ్రికన్ బుష్ ఏనుగు. దీనినే ఆఫ్రికన్ సవన్నా ఏనుగు అని కూడా పిలుస్తారు. చిన్నది ఆఫ్రికన్ ఫారెస్ట్ ఏనుగు. ఈ రెండు జాతులు జన్యుపరంగా భిన్నంగా ఉన్నప్పటికీ, ఆసియాలోని ఏనుగులతో గాఢమైన సారూప్యతలు కలిగి ఉన్నాయి. వాటి ఆకృతి అంటే చెవులు, తల ఆకారం, దంతాల తీరు చూసి ఆసియా, ఆఫ్రికా ఏనుగులేవో చాలా సులభంగా గుర్తించవచ్చు. చర్మ నిర్మాణం, కాలి గోళ్ల సంఖ్య, మొండెం లక్షణాలు.. ఇవేకాక ఇతర అనేక సూక్ష్మ లక్షణాలు కూడా తేడాలు గుర్తించడానికి ఉపయోగపడతాయి.
అన్నీ కలసి ఆనందంగా ఆడుకునేటప్పుడు ఎలుగెత్తి బిగ్గరగా అరవటం.. బాధ, అభిమానాన్ని చూపెట్టేందుకు పెద్దగానే గంభీరంగా ఘీంకరించటం.. కొత్తవాటితో పరిచయం లేక మామూలు సంభాషణ చిన్నగా శబ్దం చేయటం.. ఆడ, మగ ఏనుగులు పరస్పర ఆకర్షణకు చిన్నగాను, స్నేహాన్ని వ్యక్తీకరించడానికి చిన్నగా కిచకిచలాడినట్లు శబ్దాలు చేస్తున్నట్లు వారు వివరించారు. అన్నీ మందగా ఒక చోట చేరాలన్నా పెద్దగా ఘీంకరిస్తాయని వారంటున్నారు. అంతేకాదు అవి తొండాలతో ఒక్కసారిగా బాకా ఊదినట్టు శబ్దం చేస్తాయి. వీటికి ప్రత్యేకమైన స్వర తంతువులు ఉండవు. ఆఫ్రికా, ఆసియా ఏనుగుల స్వరపేటికలు వేరుగా ఉంటాయి.
ఒకే జాతికి చెందిన ప్రాణుల్లో హార్మోన్లను, ప్రవర్తనను ప్రేరేపించే రసాయన సంకేతాలను ఫెరోమోన్లు అంటారు. ఇవి ఏనుగులు వాసనను పసిగట్టేందుకు, పరిసరాల సమాచారాన్ని గుర్తించేందుకు సహకరిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆసియా ఏనుగుల్లో రెండు ఫెరోమోన్లు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఒకటి ఆడవాటిలో గ్రహణశక్తిని, మరొకటి మగవాటిలో అధిక పునరుత్పత్తి స్థితిని సూచిస్తాయి. వీటి సహాయంతోనే ఏనుగు తొండం గాలిలో వాసనలను గుర్తించడం, ఇంద్రియ వ్యవస్థల ద్వారా శరీరంలో రసాయనాలను రవాణా చేయడం వంటి విధుల నిర్వహణ ఉంటుంది. సువాసనలకు ఏనుగులు ఆకర్షింపబడతాయి. ప్రమాదాలను, ఆహారాన్ని గుర్తించడానికి ఈ ఇంద్రియజ్ఞానాన్ని వినియోగించుకుంటాయి.
ఏనుగులు మందలుగానే సంచరిస్తాయి. ఇవి మాతస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి. వాటిలో పెద్ద వయసు గల ఆడ ఏనుగు మందలో ముందుండి మిగిలిన వాటికి గైడెన్స్ ఇస్తుంది. మందలో అన్ని వయసుల్లోని ఏనుగులు ఉంటాయి. యవ్వన దశలో ఉన్న మగ ఏనుగులు తమ మందను విడిచి కాస్త దూరంగా ఉంటాయి. పెద్దవై పోయిన మగ ఏనుగులు ఒంటరిగానే జీవిస్తాయి.
పర్యావరణ ప్రతికూలతల కారణంగా ఏనుగు జాతులు మూడూ అంతరించిపోయే ప్రమాదంలోనే ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ శతాబ్దంలో వీటి మనుగడలో కొంతవరకు పురోగతి కనిపిస్తున్నప్పటికీ, వాటి ఇంద్రియ వ్యవస్థలపై పరిశోధనలు భవిష్యత్తులోనూ చేయాల్సి ఉంది.