ఆ పాఠశాలలో వార్షికోత్సవం రోజున ఒక వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ‘విద్యార్థులంతా వారికి ఆసక్తి ఉన్న విషయాలపై అయిదు నిమషాలు మించకుండా ప్రసంగించాలి. ఎవరు బాగా ప్రసంగిస్తారో వారికి బహుమతి ఇవ్వబడుతుంది!’ అని ప్రకటన చేశారు. ఒక్కొక్కరే ప్రసంగించడం మొదలు పెట్టారు. ఒక విద్యార్థి పాలపుంత వింతలు, విశేషాలు గురించి మాట్లాడాడు. ఒక విద్యార్థిని ఆహారపు అలవాట్లు గురించి, వివిధ విటమిన్లు, లవణాలు, ఖనిజాల ఆవశ్యకత గురించి వివరించింది.
ఆఖరుగా వచ్చిన ఆయుష్ అనే విద్యార్థి ‘నేను మీకందరికీ ఒక ఆసక్తికరమైన, ముఖ్యమైన విషయం చెపుతాను.’ అన్నాడు. ‘అలగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాట్‌ల్యాండ్‌కి చెందిన డాక్టర్. సూక్ష్మజీవి నిపుణుడు. అయన నిరంతరం పరిశోధనలలో మునిగితేలేవాడు. 1928లో ఒకరోజు ఆయనకి ఆరోగ్యం బాగా లేదు. విపరీతమైన రొంపతో బాధ పడుతున్నాడు. అయినా కూడా తన ప్రయోగశాలలో పనిచేస్తున్నాడు. అయన ముక్కులోని స్రావం విపరీతంగా కారిపోసాగింది. ఆయన దానిని ఒక స్లయిడ్‌పై ఉంచి మైక్రోస్కోప్ కింద పరీక్షించాడు. అయన ఊహించినట్లుగానే అందులో స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియాలు విపరీతంగా ఉన్నాయి. అయన ఆ స్లయిడ్‌ని కిటికిలో పెట్టేసి, తన పరిశోధనలు గావించాడు.ఆరోజు ల్యాబ్ నుంచి వెళ్లేటప్పుడు కిటికీ తలుపు మూయడం మరిచిపోయాడు. మరునాడు ఉదయం వచ్చి చూసేసరికి ఆ స్లయిడ్ పైన, చుట్టుపక్కల ఏదో బూజులాంటిది పడి ఉండడం గమనించాడు.
ఆయన తన స్రావం ఉన్న స్లయిడ్‌ని మైక్రోస్కోప్ కింద ఉంచి పరిశీలించాడు. ఆశ్చర్యంగా అందులో ఉండే బాక్టీరియా కరిగిపోయి, నశించిపోయి ఉన్నాయి. ఆ తరువాత ఆ బూజు బాక్టీరియాని చంపేసింది అని గ్రహించాడు. అదే అయన కనుక్కున్న పెన్సీలియం మందు, మొదటి ఏంటీబయోటిక్ !! ద్వితీయ ప్రపంచ యుద్ధంలో ఎంతో మంది సైనికులు యుద్ధంలో అయిన గాయాలతో చనిపోకుండా ఆ మందు కాపాడింది. అసలు వైద్య శాస్త్రాన్ని పూర్తిగా మార్చేసింది. అలగ్జాండర్ ఫ్లెమింగ్ మానవాళికి గొప్ప మేలు చేసిన మహనీయుడు. అయన పరిశోధనకి 1945లో నోబుల్ బహుమతి లభించింది. అయితే ఏంటీబయోటిక్స్ మనం స్వంతంగా వాడకూడదు. డాక్టర్ చెప్పినట్లే తప్పకుండా వాడాలి’ అంటూ ఉపన్యాసం ముగించాడు. ఆయుష్ చెప్పినంత సేపు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా విన్నారు. చప్పట్లు కొట్టారు. దాంతో అతనికే బహుమతి ఇచ్చారు.