దుఃఖపడుతున్న నేల

Apr 13,2025 12:54 #Poetry

పుట్టిన జీవి గిట్టక తప్పదని,
చెప్పకనే చెప్పే.. నిర్వేద ప్రకృతి.

తనపై జరిగే, బహుళ అంతస్తుల
భవనాల నిర్మాణమో?
అధిక జనసాంద్రతో!!
ఉన్నట్టుండి హటాత్తుగా,
నేపిడా చిగురుటాకులా వణికింది

భూఫలకాలు కదలి కదలి
ప్రకంపనలై విధ్వంసాన్ని
సృష్టించిన వేళ
భూకంపాలతో మూలాలు పెకిలించి
మాండాలే నగరాన్ని
ఉక్కిరిబిక్కిరి చేసి,
సేస్మో మీటర్లో కొలిచి కొలిచి
వేల సంఖ్యలో జనాల్ని పొట్టనబెట్టుకున్న
భీభత్స విలయ ప్రకృతి.

అదృశ్యం అవుతున్న భవనాల కింద
చిక్కుకున్న బాధితులు
బయటపడుతున్న వేలకొలది
మృత దేహాలు
విలయానికి విగత వస్తువులన్నీ
సాక్ష్యాలుగా మిగులుతూ
గుర్తుపట్టని ముఖాల్ని
ఎరుక చేయమంటున్నాయి..

నేనున్నాయనే పొరుగు దేశాల
ఆపరేషన్‌ బ్రహ్మ, ఆపన్న హస్తాలు
అభాగ్యప్రాణాలను హృదయంలో
పొదువుకొని ఓదార్పు దారంతో
మానవత్వాన్ని అల్లుకుంటున్నాయి..

ప్రకృతి ఇచ్చే మౌన సందేశం..
ఎందరు గ్రహిస్తారో?
ఎన్ని మెరుగులున్నా..
వొదిగి ఉండాలని,
మనం మన ఆధీనంలో కాదు-
తన ఆధీనంలో ఉన్నామని..
గ్రహించే ఎరుకయేమో!
ఈ ప్రకృతి విలయం..

ఇక
శిథిలమైన మయన్మారుకు
చేయూతనివ్వడమే
మన తక్షణ కర్తవ్యం!!
తల్లడిల్లిన సాటి దేశానికి
మానవత్వాన్ని ప్రవహింపచేద్దాం!!

– గండమళ్ల అనితకృష్ణ
9490876621

➡️