కళ్ల చివరి సముద్రం

Mar 31,2024 08:15 #Sneha, #Stories

మరుసటిరోజు ఆదివారం. వారమంతా పరీక్షలు, ల్యాబులు, వైవాలతో హడావిడిగా గడిచిపోయింది. ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకి గెంతే కోతిలాగా మనసు కూడా ఏదో ఒక ఎంజాయ్మెంట్‌ కోసం ఆరాటపడుతోంది. ఏడున్నరకి హడావిడిగా నిద్ర లేవడం, పళ్ళు కూడా సరిగా తోమకుండా మెస్‌కి పరిగెత్తడం, అటునుంచటే క్లాసుకి వెళ్లడం దినచర్యలో భాగంగా మారిపోయాయి. ఎప్పుడైనా లేట్‌ అయితే మెస్‌లో టిఫిన్‌ దొరకదు. ఖాళీ కడుపుతో ఉండడానికి ఇష్టం లేని కాళ్లు ఫుడ్‌కోర్టు వైపు నడుస్తాయి. మెస్‌ నుంచి కొంచెం ఎగువదారిలో నడిస్తే ఒంటి స్తంభం మేడలాగా ఫుడ్‌కోర్టు కనిపిస్తుంది. నీడనివ్వడానికి బాదం చెట్లు, సేదదీరడానికి సిమెంట్‌ బెంచీలు ‘రా రమ్మన్న’ట్లుగా ఆహ్వానం పలుకుతుంటాయి. ఎంతటి నిద్ర కళ్లతో వచ్చినా అక్కడికి రాగానే కళ్లల్లో ఏవో తెలియని సీతాకోక చిలుకలు ఎగురుతుంటాయి. కళ్ల ముందు చిలుకా గోరింకల ముచ్చట్లు కనిపిస్తుంటాయి.
చేతిలో స్లిప్పులు పట్టుకుని- వినయంగా ఒకరి వెనకాల ఒకరు టిఫిన్‌ కోసం నిలబడి, అవతలి వారివైపు ఆకలిగా చూస్తుంటారు. ఆ వరుసలోనే అటు కళ్లూ, ఇటు కళ్లూ ఏవో తెలియని ఊసుల్ని ఊపిరిలా వదులుతుంటాయి. తడబాటూ, తత్తరపాటూ కానీ కొత్త ఊహలతో ఎగిరిపడుతుంటాయి.
‘ఏరా… రేపు ఎక్కడికెళ్దాం’ అన్నాడు తరుణ్‌ ప్లేటులో ఊరిస్తున్న పూరీ వంక లొట్టలేసుకుంటూ చూస్తూ. ఆశ్చర్యంగా తరుణ్‌ వైపు చూశాడు రాజు. విశాలమైన నుదురు మీద కనబడీ కనబడనట్లుగా ఒక చిన్న బొట్టుబిళ్ళ స్టిక్కర్‌ అంటించినట్లుగా ఉంటాయి తరుణ్‌ కళ్ళు. అయినా ఆ కళ్లల్లో ఏదో చిలిపిదనం, వాడి మాటల్లో అంతులేని
వెటకారం, దేనికీ భయపడని తత్వం, తొందర తొందరగా అన్నింటినీ అనుభవించేయా లనే ఆరాటం వాడి మాటల్లో, కదలికల్లో నిరంతరం తొంగి చూస్తుంటాయి.
‘ఎక్కడికంటే అక్కడికెళ్లడానికి నువ్వేమైనా అత్తారింట్లో ఉన్నావా? హాస్టల్లో ఉన్నావు’ అన్నాడు రాజు నవ్వుతూ. ‘ఆశలు తీరాలంటే ఆత్తారింట్లోనే ఉండాలా? మనసుండాలేగానీ అడవిలో ఉన్నా ఆశలు తీర్చుకోవచ్చు’ అన్నాడు పూరీని బుగ్గల్లో కుక్కుకుంటూ.
‘నీకేరా.. పెట్టి పుట్టావ్‌! ఎంజారు, ఎంజారు అంటూ మమ్మల్ని భ్రమల్లో ముంచి, నువ్వు మాత్రం అన్నింట్లోనూ ఫస్ట్‌ వస్తావు. మేము మాత్రం రెమిడియల్స్‌ రాయలేక చచ్చిపోతున్నాం. మొన్నెవడో దయగల మారాజు ఇన్విజిలేటరుగా వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ సబ్జెక్ట్‌ పాసవ్వలేక ఏ సముద్రంలోనో దూకాల్సి వచ్చేది’ అన్నాడు రాజు నవ్వుతూ.
సముద్రం మాట వినబడగానే తరుణ్‌ మొహం నూతన కాంతితో మెరిసింది. ఆకాశానికి ఎగిసిపడుతున్న అలలు కళ్లల్లో కదలాడాయి. అడుగు వేస్తే లోపలికి దిగిపోయే మెత్తటి ఇసుక మనసులో బొమ్మకట్టింది. ఉప్పూ, కారం దట్టించిన చేపముక్కలు, మామిడి ముక్కలు నోటిలో లాలాజలం ఊరేలా చేశాయి. చేతిలో పట్టుకున్న చెప్పులు, పాదాల్లో గుచ్చుకునే గవ్వలు, మసాలా శనగలు, కెమేరా మెడలో వేలాడదీసుకుని మనుషుల వెంటపడే వ్యక్తులూ గుర్తొచ్చారు. ‘ఒరే రాజుగా… భలే గుర్తు చేశావురా! రేపు ఔటింగ్‌ తీసుకుని సముద్రం చూడ్డానికి వెళ్ళొద్దామా?’ అన్నాడు. తుళ్ళిపడి తరుణ్‌ వంక చూశాడు రాజు. తరుణ్‌ మాత్రం తినడం పూర్తి చేసి పైకి లేచాడు. వాడు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే.. అవతలి వ్యక్తికి ఇష్టం లేకపోయినా ఎలాగోలా కన్విన్స్‌ చేసి, తనతో లాక్కుపోతాడు. ఆర్థికంగా లోటు లేకపోవడం కూడా వాడి నిర్ణయాలకు బలాన్నిస్తుంటాయి.
ఆలోచిస్తూనే ‘సముద్రమేమన్నా నీ రూము వెనకాలున్న బాత్రూం అనుకున్నావా.. ఎప్పుడంటే అప్పుడు వెళ్లడానికి? పర్మిషన్‌ కోసం దొబ్బులు తినాలి. అవసరాల కోసం డబ్బులు చూసుకోవాలి’ అన్నాడు నవ్వుతూ. కన్ను గీటాడు తరుణ్‌. ‘మనసుంటే మార్గం ఉంటుందిలే’ అంటూ ముందుకు నడిచాడు. తరుణ్‌ వెళ్ళినవైపే చూసిన రాజుకి మనసులో దిగులు కమ్ముకుంది. ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటున్న తల్లి గుర్తొచ్చింది. అనారోగ్యం కంటే అవసరాలే ఆమెను రెస్ట్‌ లేకుండా పనివైపు నడిపిస్తుంటాయి. ఎక్కడో ఒకచోట పనిచేసి, కొడుకు అవసరాలు తీర్చడానికి ఎన్నో అవస్థలు పడుతున్న తల్లి శ్రమను తెలుసుకోకుండా చదువులో వెనకబడ్డాడు. ఏ పూటకాపూట అన్నం తింటూనే ఉన్నాడు.. అది అరుగుతూనే ఉంది. మధ్యాహ్నానికో, మాపటికో మళ్ళీ కొత్తగా ఆకలి పుడుతూనే ఉంది. కానీ చదువు మాత్రం చద్దివాసన కొడుతోంది. ఎప్పటి చదువును అప్పుడు చదవకుండా వాయిదాలేసిన దానికి ప్రతిఫలంగా వెక్కిరిస్తున్న బ్యాక్‌లాగ్స్‌ ఒక్కోసారి అంతర్మథనాన్ని, కొన్నిసార్లు నిరాశను కలిగిస్తున్నాయి.
‘ఏరా… రేపు ఓకే కదా’ అన్నాడు తరుణ్‌. వాడి వంక చూస్తూ ‘ఏమోరా.. ఏమీ తేల్చుకోలేకపోతున్నాను. నా దగ్గర డబ్బులు లేవు.. రాలేను’ అన్నాడు రాజు.
‘డబ్బుల సంగతి నీకెందుకు? నువ్వు ఊ అంటే చాలు. ఆ జగదీశ్‌ గాడినీ, రమేష్‌ గాడినీ కూడా అడుగుతాను. నలుగురం కలిసి వెళ్దాం’ అన్నాడు ఉత్సాహంగా తరుణ్‌.
‘ఊ’ అనడం తప్ప ‘ఉహ్హూ’ అనలేకపోయాడు రాజు. సంతోషంగా మిత్రుడి వైపు చూశాడు తరుణ్‌. రాజు భుజం మీద చెయ్యేసి ‘చూడరా.. మన హాస్టలు గదిలో ఆనందం గుప్పెడు మాత్రమే! అదే సముద్రం ఒడ్డున నుంచున్నామనుకో.. గంపెడు ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పరిస్థితులు ఎప్పుడూ ఉండేవే. ఆనందాలు మాత్రం అమావాస్యకో, పున్నమికో పుడుతుంటాయి. వాటిని కూడా వాయిదా వేస్తే ఎలా?’ అంటూ నడిపించుకుంటూ ముందుకెళ్లాడు.
మాట్లాడుకుంటూనే క్లాసుకు వెళ్లారు. పాఠం పాదరసంలా పరిగెడుతున్నా.. మనసు మాత్రం మందకొడిగా వింటోంది. గోళ్లు గిల్లుకుంటూ కొందరు, తలలు బెంచీల్లో దూర్చి మాస్టారికి కనబడకుండా రీల్స్‌ చూస్తూ కొందరు.. ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలయ్యారు స్టూడెంట్లందరూ.
ఎప్పుడెప్పుడు క్లాసవుతుందా, రేపటి ప్రయాణం గురించి మిత్రులతో ఎలా చెప్పాలా అని తరుణ్‌కి ఆరాటంగా ఉంది. వెనుకబెంచీలో ఉన్న రమేష్‌ని చూసి కళ్లెగరేశాడు. ముందు బెంచీలో ఉన్న జగదీష్‌ వైపు చేయిచాపి వీపు గోకాడు. ఎలాగో క్లాసు అయింది. ఇద్దర్నీ కారిడార్లోకి రమ్మని బయటికి నడిచాడు. రాజు కూడా అతన్ని వెంబడించాడు. ఇద్దర్నీ దగ్గరగా నుంచోబెట్టుకుని చిన్నగా విషయం చెప్పాడు తరుణ్‌. వాళ్ళిద్దరూ ఆనందంగానే తలూపారు. తరుణ్‌ దగ్గరుంటే డబ్బులకు లోటుండదు. తిండికి కొదవుండదు. వాడు చెప్పిన ప్రతీ మాటకు ‘ఊ’ అనడం వల్ల ఎన్నో లాభాలున్న సంగతి వాళ్లకు అనుభవమే! ఏమీ మాట్లాడకుండా ‘ఊ’ కొట్టారు. నలుగురూ కలిసి హాస్టలు వైపు బయల్దేరారు.
‘సార్‌… రేపు ఔటింగ్‌ కావాలి’ అన్నాడు తరుణ్‌.
‘ఎక్కడికి’ అడిగాడు వార్డెన్‌.
‘నాకు మాటిమాటికీ తలనొప్పి వస్తోంది. చదవలేకపోతున్నాను. చెక్‌ చేయించుకోవాలి’ చెప్పాడు తరుణ్‌.
ఔటింగ్‌ టైం, ఇన్‌ టైం రాసిన పర్మిషన్‌ స్లిప్పును చూసి గుంభనంగా నవ్వుకున్నాడు. అబద్ధాలు తీయగా ఉంటాయంటే ఏమో అనుకున్నాడు. ఇప్పుడు అనుభవంలోకి వస్తే గానీ మరింతగా అర్థం కాలేదు. అబద్ధాలు అవసరాల్ని సృష్టిస్తాయి. అవసరాలు అబద్ధాల్ని మోసుకుని తిరుగుతాయి. బహుశా అవి కూడా తమలాగే ఏ స్నేహితులో అయ్యుంటాయి అనుకుని, తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు. చేతిలో స్లిప్పును చూసి గర్వంగా బయటికి నడిచి గట్టు మీద కూర్చుని మిగతా స్నేహితుల కోసం చూడసాగాడు.
కాసేపటి తర్వాత మిగతా ముగ్గురు స్నేహితులు వెలుగుతున్న మొహాలతో రావడం కనిపించింది. ఔటింగ్‌ తీసుకోడానికి ఎంత చాకచక్యంగా అబద్ధాలు అల్లారో.. ఒకరికొకరు చెప్పుకుంటూ ముందుకు నడిచారు. హాస్టల్‌ నుంచి సుమారు ఒక అరకిలోమీటర్‌ నడిస్తే మెయిన్‌ గేట్‌, అది దాటి ముందుకెళ్తే మెయిన్‌ రోడ్‌ కనిపిస్తాయి. అక్కడి నుంచి సెంటర్‌ వరకు ఆటోలోనూ, ఆ తర్వాత బస్సులోనూ సముద్రానికి చేరుకోవచ్చు. కబుర్లు చెప్పుకుంటూ ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రాన్ని చూడడానికి బయల్దేరారు. బస్సు దిగి సముద్రం వైపు నడక సాగించారు. సముద్రపు గాలి జోల పాడుతున్నట్లుగా ఉంది. ఎగసి పడుతున్న కెరటాల హోరు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. దూరం నుంచీ చూస్తుంటే సముద్రమూ, ఆకాశమూ అన్నదమ్ముల్లా చెట్టాపట్టాలు వేసుకున్నట్లుగా ఉంది. అక్కడక్కడా అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరిద్దరు చొప్పున కాలేజీ బ్యాగుల్ని పక్కన పెట్టుకుని, చున్నీల్ని తలల మీద కప్పుకుని లోకాన్ని మైమరచిపోయి, సేద దీరుతున్నారు. తెలిసిన వాళ్లెవ్వరూ అక్కడ ఉండరనే ధైర్యం, తెలియని వాళ్లు చూసినా ఏమీ కాదనే ధీమా వాళ్లను ఆ ఇసుకపొరల్లో పొర్లాడేలా చేస్తోంది. వాళ్లందర్నీ చూస్తూ జోకులేసుకుంటూ నడుస్తున్న నలుగురికీ బక్కచిక్కిన తాత ఎదురుగా వచ్చాడు. ఎముకల్ని పోగుపోసినట్లుగా ఉన్నాడు. తిండిలేక కృశించినట్లుగా మొహం పీక్కుపోయింది. మొలకు గోచీ తప్ప మరే ఆచ్ఛాదనా లేదు. నలుగుర్నీ చూస్తూ ‘బాబూ… తానానికొచ్చారా’ అడిగాడు తాత.
‘లేదు తాతా.. గవ్వలేరుకుని మువ్వలు చేయించుకుందామని వచ్చాం’ అన్నాడు తరుణ్‌ తాతవైపు చూసి నవ్వుతూ. తాత కూడా వాళ్లతో పాటు నవ్వాడు. ఆక్సిజన్‌ అందని దీర్ఘరోగిలా ఎగిరెగిరి నవ్వాడు తాత. ‘అయితే అయిందిలే గానీ.. తానం ఇటుపక్క శేయండి. అటుపక్కకి ఎల్లొద్దు’ అంటూ వెళ్లిపోయాడు తాత. నలుగురూ తాత వైపు చూసి నవ్వుకుంటూ ముందుకు సాగారు. ఎదురయ్యే వాళ్లను దాటుకుంటూ, దారిలో కనిపించిన మసాలా శనగలు కొనుక్కుని తింటూ కెరటాలకు దూరంగా కూర్చున్నారు. దూరంగా ఆకాశాన్ని ముద్దాడుతున్న అలల్ని, అలలపైన నాట్యమాడుతున్నట్లుగా ఉన్న పడవల్ని చూశారు. కాసేపయ్యాక నలుగురూ లేచి స్నానానికి బయల్దేరారు. నీలి సముద్రమూ, నీలాకాశము కౌగలించుకున్నట్లుగా కనిపించాయి. స్నానం తర్వాత వేసుకోడానికి తెచ్చిన బట్టల బ్యాగు నీళ్లు తీరాన్ని తాకని చోట పెట్టి, నీళ్లలోకి దిగసాగారు.
‘ఒరేరు తరుణ్‌! అటు లోతెక్కువని తాత చెప్పాడుగా. ఇటు పక్క స్నానం చేద్దాం’ అన్నాడు రాజు. అతని వైపు చూసి తల కొట్టుకుంటూ ‘గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేటట్టున్న తాత మాటలు నమ్ముతున్నావా? అసలు ఆయనతో పాటు నిన్ను కూడా పంపేయాల్సింది. వచ్చీపోయే వాళ్లందరికీ ”స్నానం ఇక్కడొద్దు, అక్కడ చెరు” అని చెప్పుకుంటూ తిరిగేవాళ్లు. నోర్మూసుకుని రా… చెప్పేవాడు వంద చెప్తాడు, వినేవాడికి ఉండాలిగా’ కొంచెం కొంచెంగా ముందుకు జరిగాడు తరుణ్‌.
‘ఏమిటో వీడి మొండి ధైర్యం’ అనుకుంటూ స్నేహితులంతా ఒక్కొక్కళ్లుగా నీళ్లల్లోకి దిగారు. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ జోకులేసుకుంటూ తెలియకుండానే లోపల్లోపలికి వెళ్లసాగారు. కెరటాలకు ఎదురెళ్లడం, అలలు పైకి లేస్తున్నప్పుడు వాటికోసం ఎగిరికింద పడడం, కెరటాల నురుగును, ఇసుకను వొంటికి రాసుకుని వెల్లకిలా పడుకోవడం, తమకు దగ్గరలో స్నానం చేస్తున్నవాళ్లను చూస్తూ కేరింతలు కొట్టడం.. ఆనందమంతా సముద్రంలో వాళ్లతో పాటే మునకలేయసాగింది.
అలలు వచ్చినప్పుడు ఒకరినొకరు ముందుకు తోసుకుంటూ వాళ్ల ఆనందంలో వాళ్లుండగా అనుకోకుండా ఎత్తైన అల ఉవ్వెత్తున లేచి వాళ్లను చుట్టుముట్టింది. అల తమను దాటిపోతుందని భావించి, అలాగే కూర్చున్న రాజు చూస్తుండగానే నీళ్లల్లో అదృశ్యమయ్యాడు. అల ఉధృతి తగ్గాక కనిపిస్తాడేమోనని ఆత్రంగా రాజు కోసం చూసిన తరుణ్‌కి నిరాశే ఎదురైంది.
కళ్ల ముందు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంతెత్తున లేచిన ఆనందం ఆవిరైపోయింది. కళ్ళు మూసుకుని తెరిచేసరికి కటికచీకటి ముసురుకుంది. ఇష్టమైన వస్తువునెవరో పాతాళానికి ఈడ్చుకుపోయి నట్లుగా అనిపించింది. కంగారుపడి ముగ్గురూ ఒకరి చేతులొకరు పట్టుకుని నీళ్లల్లో నుంచి బయటపడి, ఒడ్డుకు వచ్చేశారు. దూరం నుంచి వీళ్లను గమనిస్తున్న వాళ్లంతా చుట్టూ మూగి, ఆరా తీయసాగారు. అదురుతున్న గుండెలతో, తడబడుతున్న మాటలతో వాళ్లకేమి సమాధానం చెప్తున్నాడో అర్థంకావడం లేదు తరుణ్‌కి. ఆశకి – నిరాశకీ మధ్య ఎంత దూరముంటుంది? చావుకీ, బతుక్కీ మధ్య లోతెంతుంటుంది? సముద్రం.. ఇప్పుడు ఎదురుగా కంటికి కనిపిస్తోందా లేక గుండెల్లో ఎగసిపడుతోందా? ఏమీ అర్థం కావడం లేదు తరుణ్‌కి.
పోలీసులొచ్చారు. వివరాలు అడుగుతున్నారు. భయం భయంగానే వాళ్లడిగిన వాటికి ముగ్గురూ సమాధానం చెప్పారు. మూడు గంటల తర్వాత దూరం నుంచి ఎవరో అరిస్తే అటువైపు నడిచారందరూ. ఆ దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయాడు తరుణ్‌. నీటిమీద రాతలు ఎక్కువకాలం ఉండవనీ, కంటికి కనిపించే సముద్రం-ఆకాశ కలయికలు నిజం కాదనీ తెలిసొచ్చింది. ఊరికి దూరంగా ఉన్న సముద్రాన్ని చూడాలని తహతహలాడాడు గానీ, తనలోనే ఉన్న సముద్రాన్ని గుర్తించ లేకపోయాడు. ఇప్పుడీ కన్నీటి అలల్ని మోసుకుని వెనక్కి వెళ్లగలడా?
‘నేను శెప్తానే వున్నాను… ఆనందమంటే పేనాలమీదకి తెచ్చుకోడం కాదని! మీ వొయసోల్లకి సముద్రమంటే పైకి ఎగిరిపడే అలలే. కానీ కన్నోల్లకి మాత్రం కంటిచివర చేరి బతుకంతా ఏడిపించే సముద్రం! మీ ఆనందం కరీదు.. ఆల్లకి జీవితకాల దుక్కం, జీవితకాల దుక్కం’ తాత తనలో తనే గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.
గాలేదో సుడులుగా తిరుగుతూ ఓదార్చిపోతోంది. అలలు ఆకాశానికి ఎగరొచ్చు, అమాంతం విరిగి పడిపోవచ్చు, మళ్ళీ సముద్రపు నీటిలో కలిసిపోవచ్చు. కానీ చేజారిన జీవితమెప్పుడూ వెనక్కి తిరిగిరాదు. బరువెక్కిన గుండెతో మళ్లీ సముద్రం వైపు నడుస్తున్న అతని వంక స్నేహితులు వింతగా చూశారు. అతని అడుగుల్లో మునుపటి హుషారు లేదు. కళ్లల్లో కుర్రతనపు కాంతి కనిపించలేదు. గంపెడు ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చి, భరించలేని విషాదాన్ని మూటగట్టుకున్న మిత్రుణ్ణి ఎలా ఓదార్చాలో ఎవరికీ తెలియట్లేదు.
సముద్రపు ఒడ్డుకి కొంచెం దూరంగా కూర్చున్నాడు తరుణ్‌. తమ కలల్ని చిదిమేసిన అలల వంక బాధగా చూస్తూ ‘నిన్ను జీవితాంతం క్షమించలేను. పోయిన నా స్నేహితుణ్ణి తిరిగి తెచ్చుకోలేను. కన్నవాళ్లకు కళ్ల చివర సముద్రాన్ని మిగిల్చావు. కుర్రకారు సరదాలకు జీవితకాల శిక్ష వేశావు. నన్ను నేను క్షమించుకోలేను, నా స్నేహితుణ్ణి తెచ్చుకోలేను’ రెండు చేతుల మధ్యా చేతులు దాచుకుని, కుములిపోసాగాడు. సముద్రం ఎగసిపడుతూనే ఉంది. అలలు నింగికి ఎగురుతూనే ఉన్నాయి. దూరంగా కాలేజీ బ్యాగులతో, కేరింతలతో సముద్రం వైపు వస్తున్న కుర్రకారు గుంపు కనిపించింది.

– డా|| జడా సుబ్బారావు, 98490 31587

➡️