హంతకుడు

Apr 13,2025 08:57 #Sneha, #Stories

‘ఎవరో స్కూల్‌ పాప రోడ్డుకి అడ్డంగా పరిగెడుతూ కారుకి అడ్డు వెళ్ళబోతుంటే పాపని కాపాడబోయి బస్సు కింద పడ్డాడంట ఓ ముసలాయన. 108లో తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళాం. రక్తం చాలా పోయింది. కానీ ప్రాణమైతే ఉంది సార్‌!’ అని కంగారుపడుతూ డాక్టర్‌ గారి క్యాబిన్‌కెళ్ళి చెప్పింది హెల్త్‌కేర్‌ ఎమర్జెన్సీ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సు సరళ.
‘ఈజ్‌ ఇట్‌?!’ అంటూ ఆమె వెనకాలే పరుగులాంటి నడకతో ఎమర్జెన్సీ రూమ్‌కి వెళ్ళాడు డాక్టర్‌ అర్జున్‌.
‘పేషెంట్‌ తాలూకా ఎవరైనా ఉన్నారా?’ అనగానే రూమ్‌ బయట బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న ఓ ముసలావిడని చూపించారు. ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. తన భర్తకి ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో ఉంది. అక్కడ వాళ్లంతా ఆమెను ఓదారుస్తున్నారు.
‘మీ ఆయన గారు కాపాడింది మా పాపనే అమ్మా..!’ అంటూ ఆ పాప తాలూకా జనం కూడా కొంతమంది పోగయ్యారు ఆవిడ చుట్టూ ఓ గుంపు.
ఇంతలో నర్సు వచ్చి సంతకాలు పెట్టించుకుంది ఆవిడతో. దానిలోని విషయాలు ఆ పెద్దావిడకి తెలియకపోయినా నర్సు చూపించిన ప్రతిచోటా సంతకాలు పెడుతూ మధ్య మధ్యలో ఆమె కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న కన్నీటిని తన పైట చెంగుతో తుడుచుకుంటూ, ముక్కు చీదుతూ, రెండు చేతులు జోడించి ‘ఎలాగైనా నా భర్తను కాపాడండి, నాకాయన తప్ప ఎవరూ లేరమ్మా’ అంటూ ఆర్ద్రతతో ప్రార్థిస్తోంది వయసు మళ్ళిన గొంతుతో. అది చూసిన అక్కడ వాళ్ళక్కూడా కళ్ళు చెమర్చాయి.
‘మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు పదే పదే ఇలా అడక్కూడదు వెళ్లి కూర్చోండి!’ అంటూ ఆమెను వారిస్తూ ఎమర్జెన్సీ రూమ్‌లోకి వెళ్ళిపోయింది ఆ నర్సు.
‘ఇప్పుడు పిల్లలకి అసలు బొత్తిగా భయాల్లేకుండా పోయాయి. రోడ్డు మీద ఒకటే పరుగులు. వెనకా ముందు కూడా చూసుకోవట్లేదు మాయదారి పిల్లలు!’ అంది ఆ గుంపులో ఒకావిడా. ఆ మాటలకి జత కలిపినట్టుగా ‘ఆ పెద్దాయన చూశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ఘోరం జరిగిపోను. సాయంత్రం స్కూల్‌ అయ్యాక జరిగిందంటమ్మా..!’ అంది మరోకావిడ
‘మావాడు ప్రతిరోజూ సాయంత్రం స్కూల్‌ విడిచి పెట్టగానే ఆఫీసు నుంచి వస్తూ పిల్లని తీసుకొస్తాడు ఇంటికి. అప్పటివరకూ పిల్ల ఆ స్కూలు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటుంది. గేటు కూడా ఎప్పుడూ వేసే ఉంటుంది. వాచ్‌మెన్‌ కూడా ఉంటాడు. మరి ఈ పిల్ల ఆ వాచ్‌మెన్‌ కళ్ళు కప్పి, బయటికి బిస్కెట్‌ ప్యాకెట్టు కొనుక్కుంటానికి ఎలా వెళ్ళిందో..?!’ అంటూ వాళ్ళతో చెప్తున్నాడు పిల్ల తాత.
‘వాచ్‌మెన్‌ వచ్చేలోపు వచ్చేయాలని కంగారుగా పరిగెత్తి ఉంటుంది. ఆ కంగారులో రోడ్డు మీద వచ్చే బస్సు గమనించుకోలేదు. పైగా పెద్ద రోడ్డు కదా! వచ్చే పోయే బస్సులతో చాలా రద్దీగా ఉంటుంది. అందులోకి స్కూలు విడిచిపెట్టే టైం. అన్నీ కలిసొచ్చాయి’ అన్నాడో కుర్రోడు.
‘ఆ టైంలోనే ఈ పెద్దాయన వస్తున్నాడు కాబట్టి సరిపోయింది. చూసి గబాల్న పరిగెత్తుకుని వెళ్ళి, పిల్లని బస్సు కింద పడకుండా పక్కకి లాగేసాడు. అతను తప్పుకునేలోపే ఈ ఘోరం జరిగిపోయింది’ అంది పిల్ల నానమ్మ.
ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఒకరికొకరు వాళ్లకు తెలిసిన విషయాలు కొన్ని, తెలియనివి కొన్ని చెప్పుకుంటున్నారు. అన్నీ మౌనంగా వింటూ బాధపడ్తోంది ఆ పెద్దావిడ.
‘బాధపడకండమ్మా మీవారికి ఏం కాదు. మీలాంటి మంచివాళ్ళకి మంచే జరుగుతుంది!’ అంటూ ఆ పాప తల్లి ఈ పెద్దావిడ భుజం చుట్టూ తన రెండు చేతులు వేసి, ఓదార్చుతుంది. గుంపులో నుంచి ఓ కుర్రాడు బయటికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ ఓ రస్కుల ప్యాకెట్టు, ఓ సాల్ట్‌ బిస్కెట్‌ ప్యాకెట్‌తో పాటూ ఓ పెద్ద ప్లాస్కులో వేడివేడి టీ పోయించుకుని తెచ్చాడు.
వాళ్ల గుంపులో అందరికీ రస్కులు బిస్కెట్లతో పాటు ‘టీ’ కప్పులో పోసి ఇస్తున్నాడు.
ఆ పెద్దావిడ వద్దంటున్నా బలవంతంగా రెండు రస్కులు, రెండు బిస్కెట్లుతో పాటు టీ పోసిన ఒక కప్పు చేతిలో పెట్టాడు.
ఎమర్జెన్సీ రూమ్‌లోంచి బయటికి వచ్చిన నర్సు ‘ఏబీ నెగటివ్‌ బ్లడ్‌ అర్జెంటుగా కావాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా..?’ అని అడిగింది.
దానికి సమాధానంగా ఆ గుంపులోని మరో కుర్రోడు ‘మా పేటలో కుర్రోడు ఉన్నాడు మేడం. పది నిమిషాల్లో తీసుకొస్తాను’ అంటూ రయ్యని వెళ్లి, సర్ర్‌ మని ప్రత్యక్షమయ్యాడు.
ముడతలు పడిన మొఖం, బాగా మాసిన తెల్లజుట్టు, పెరిగిన గడ్డం, దుమ్ము, ధూళి, రక్తం అంటుకున్న షర్టుతో మంచం మీద అచేతనంగా పడి ఉన్న పెద్దాయన్ని చూడగానే జీవితం మీద విరక్తి కలిగి జీవిస్తున్నట్టు కనిపించాడు. ఆ మొఖం చూడగానే ఎప్పుడో, ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలా కనిపించాడు అర్జున్‌కి.
మరొక్కసారి అతని మొఖంలో మొఖం పెట్టి పరికించి చూశాడు. అతను పదే పదే ‘పండూ! నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లావు రా..? నేను వచ్చేస్తాను రా..!’ అంటూ కలవర పడుతున్నాడు.
‘ఎస్‌.. అతనే డౌట్‌ లేదు. ప్రవీణ్‌ తండ్రి. ఆ తలంపు మనసులోకి రాగానే తన కాళ్ళ కింద భూమి కంపించినట్టైంది. కళ్ళల్లోంచి కన్నీరు జలజలా తన గుండెల మీద జలపాతాల్లా పడ్తున్నాయి. గతం తాలూకా గాయం ఇంకా మానలేదని చెప్పడానికి ప్రత్యక్షసాక్షుల్లా. ఎవరో తనను ఒక లోయలోకి తోసేసినట్టుగా ఒకటే దిగాలు పడింది మనసు. తన గుండెని ఎవరో మెలిపెడ్తున్నట్టు ఒకటే బాధ ఆవహించింది. జరిగిపోయిన గతం తాలూకు గాయం మరల రేగినట్టు తన మనసు ఏదో తెలియని బాధతో మూలుగుతోంది. ఇరవై సంవత్సరాల క్రితం తన జీవితంలో జరిగిన చేదు సంఘటన తాలూకా నిప్పుల సెగ ఇంకా ఆరలేదు అన్నట్టు పదేపదే గుర్తు చేస్తుంది.
‘ఎస్‌.. ఇతను ఎవరో కాదు తన వల్ల అన్యాయంగా చనిపోయిన ఓ అమాయకుడు ప్రవీణ్‌ అలియాస్‌ పండు తండ్రి!’
‘డాక్టర్‌ బ్లడ్‌ ఎక్కించాం. అర్జెంటుగా ఆపరేషన్‌ చెయ్యాలి డబ్బులు చూసుకోమని వాళ్ళకు చెప్పాను సార్‌! వాళ్ళు కొంచెం అమౌంట్‌ కట్టారు. మిగతా అమౌంట్‌ తేవడానికి వెళ్ళారంట ఇంకా రాలేదు. టైం చూస్తే పది దాటింది. ఆపరేషన్‌ రేపు ఉదయం చేస్తాం అని చెప్పమంటారా..?’ అని అడుగుతున్న నర్సుకి ‘నో.. నో.. నేను ఇప్పుడే ఆపరేషన్‌ పూర్తిచేసి, ఇంటికి వెళ్తాను. ఎంత రాత్రి అయినా పర్వాలేదు. హి ఈజ్‌ ఇన్‌ క్రిటికల్‌ కండిషన్‌. ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు నా శాలరీ నుంచి డెబిట్‌ చెయ్యమని చెప్పు రిసెప్షన్‌లో. పేషెంట్‌ని రెడీ చేసి ఆపరేషన్‌ థియేటర్లోకి తీసుకురండి!’ అంటూ ఆపరేషన్‌ చేయడానికి సిద్ధమయ్యి, ఆపరేషన్‌ థియేటర్లోకి వెళ్తుండగా..
అతని పాదాలు పైన చల్లగా మెత్తగా ఏదో తగిలినట్టై ఒక్కసారి తూలి పడబోయి తమాయించుకున్నాడు. పేషెంట్‌ తాలూకా పెద్దావిడ కాళ్ళు పట్టుకుని ‘బాబూ మేం పేదోళ్ళం. మాకు ఎవరూ లేరు. ఆయన్ని ఎలాగైనా బతికించండి. మీరు కాపాడేది ఆయన ప్రాణం మాత్రమే కాదు, ఆయనతో ముడిపడిన నా ప్రాణాలను కూడా. నా దగ్గర డబ్బులేమీ లేవు. ఇవిగో ఇవి తీసుకొని కాపాడండి’! అంటూ తన చేతిలో ఉన్న మంగళసూత్రాలు, చెవి కమ్మలు డాక్టర్‌ చేతిలో పెట్టి బోరున ఏడ్చింది.
‘ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చదివించాలని ఎంతో తపనపడి ఆస్తంతా అమ్మి, డాక్టర్‌ కోర్సులో జాయిన్‌చేశాం. కానీ మా తలరాత, వాడు జాయిన్‌ అయిన పదిరోజులకే పాడు జ్వరం వచ్చి, బిడ్డను మింగేసిందయ్యా! అప్పటి నుంచి ఆయన పిచ్చోడయ్యాడు. తెలిసినోళ్ల దగ్గర కాస్త కూస్తో అప్పు చేసి, ఇదిగో ఇలా ఆయన జబ్బుని ఈ సిటీలో ఉన్న హాస్పిటల్‌కి తిరిగి, బాగు చేయించాం. మనిషి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకొని బాగున్నాడని అనుకునే లోపే ఈ దెబ్బ తగిలించుకున్నాడు!’ అని వాపోయింది.
‘మీ బిడ్డను మింగేసింది జ్వరం కాదమ్మా నేనే ఆ రాక్షసుడ్ని, ఆ హంతకుడ్ని నేనే.. ర్యాగింగ్‌ పేరుతో నేనే అతని ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న దుర్మార్గుడ్ని!’ అని గట్టిగా అరిచి చెప్పాలని అనిపించింది. కానీ చెప్పే ధైర్యం లేక నోరు పెగలట్లేదు. నిశ్శబ్దం ఆవహించింది.
ఆవిడ ఇచ్చిన వాటిని ఆవిడ చేతిలోనే పెట్టి ‘మరేం ఫర్వాలేదమ్మ డబ్బులు గురించి ఆలోచించొద్దు. ఆయన్ని బతికించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను’ అని చెప్పాడు. చేసిన పాపం దులుపుకుంటే పోయేది కాదు. కాకపోతే పశ్చాత్తాపం పడితే కొంతైనా బాధ నివృత్తవుతుంది అనుకుని గాఢంగా ఓ నిట్టూర్పు విడిచి, లోపలకి అడుగుపెట్టాడు.
నిజంగా పండు బతికుంటే తను కూడా ఓ పెద్ద డాక్టర్‌ అయ్యుండేవాడు. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఇలా రోడ్డున పడాల్సిన దుస్థితి ఉండేది కాదు. మనసులో రేగిన అలజడి 20 సంవత్సరాలు క్రితం జరిగిన ఆ సంఘటనని కళ్ళ ముందుకి తీసుకొచ్చింది.
ొొొ
ఇంటర్‌ పాస్‌ అయ్యి నీట్‌ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకు సంపాదించి, గొప్ప పేరున్న కాలేజీలో ఫ్రీ సీట్‌ సంపాదించాడు అర్జున్‌. ఎంతో సరదాగా సాగుతున్న తన కాలేజీ లైఫ్‌లో అనుకోని ఓ దుర్ఘటన తనని వెంటాడుతూనే ఉంది.
ఒకసారి ఏమైందంటే తన తర్వాత బ్యాచ్‌ వాళ్లు కాలేజీలోకి ఎంటర్‌ అయ్యాక వాళ్ళందరికీ వెల్కమ్‌ చెప్పడానికి ఫ్రెష్రర్స్‌ పార్టీ అరేంజ్‌ చేయాల్సిందిగా సీనియర్స్‌ చెప్పడంతో ఆ బాధ్యతంతా అర్జున్‌ బ్యాచ్‌ వాళ్ళ మీద పడింది. ఫ్రెషర్స్‌ పార్టీ ఇంకో 15 రోజుల్లో ఉందనగా చిన్నపాటి ర్యాగింగ్‌ సందడి సీనియర్స్‌కి జూనియర్స్‌కి మధ్య మొదలైంది. ప్రతిరోజూ సాయంత్రం క్లాసులన్నీ అయ్యాక జూనియర్స్‌ని పిలిచి, పేర్లు అడగడం, హాబీస్‌ అడగడం సరదాగా పాటలకు డ్యాన్స్‌లు వెయ్యమనడం, అందరూ కలిసి హాయిగా నవ్వుకోవడం ఇదే పరిపాటయ్యింది వాళ్లకి. గర్ల్స్‌ని గర్ల్స్‌, బార్సుని బార్సు రిసీవ్‌ చేసుకునేవాళ్లు. అంతవరకు ఏ ఇబ్బందీ రాలేదు. కానీ అర్జున్‌ బ్యాచ్‌లో కొంతమంది దురుసు స్వభావం ఉన్న వాళ్ళు ఉండేవారు. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే జూనియర్స్‌ని టీజ్‌ చేసేవాళ్ళు. సున్నిత మనస్కుడైన అర్జున్‌కి ఇష్టం లేకపోయినా స్నేహితుల కోసం వాళ్ళతో కలిసి కూర్చునేవాడు.
ఆ రోజు రాత్రి 7 గంటలకు అర్జున్‌ బ్యాచ్‌లోనే ఓ కుర్రాడు ఓ జూనియర్‌ని పిలిచి ‘ఏరా.. నిన్న మీ బ్యాచ్‌లో కొంత మందిని పిలిచాం. మరి మిగతా గ్రూపు వాళ్ళు రావాలి కదా గుర్తుందా..’ అని అడిగాడు. దానికి వాడు సమాధానంగా ‘గుర్తుంది సార్‌. నిన్న వన్‌ టు పిఫ్టీ మెంబర్స్‌లో ఉన్న అబ్బాయిలు వచ్చారు సార్‌. ఈ రోజు 51 నుంచి 100 వరకు ఉన్న అబ్బాయిలు రావాలి సార్‌. వస్తాం సార్‌!’ అంటూ వెళ్తుండగా.. ‘అరె ఈ రోజు మాకు స్వీట్స్‌తో పాటు హాట్‌ కూడా కావాలి!’ అని చెప్పి పక పకా.. నవ్వుతూ ఆర్డర్‌ వేశాడు.
‘అలాగే సార్‌’ అంటూ వినయంగా వెళ్ళిపోయాడు ఆ జూనియర్‌. సాయంత్రం 6 గంటలకి సీనియర్‌ చెప్పిన చోటికి జూనియర్స్‌ అంతా వచ్చి కూర్చున్నారు.
‘అందరూ వచ్చారా..?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. జూనియర్స్‌లో ఒకడు లేచి ‘అందరం వచ్చాం సార్‌! కానీ 73వ నెంబర్‌ అబ్బాయి ”నీరసంగా ఉంది పడుకుంటాను రానన్నాడు” అని చెప్పేసరికి..
అర్జున్‌ బ్యాచ్‌లో ఒకడు కాస్త బెదిరింపు ధోరణిలో ‘ఏంట్రా మమ్మల్నే ఎదురిస్తున్నాడా? ఏం మాయరోగం వచ్చిందంట వాడికి..? నేను రమ్మన్నానని చెప్పు. ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి!’ అని చెప్పాడు.
రయ్యని వెళ్ళి, సర్ర్‌న ఆ కుర్రోడితో ప్రత్యక్షమయ్యాడా జూనియర్‌.
‘నీ పేరేంటి రా..?, నీదే ఊరు..? వచ్చి పది రోజులు కూడా కాలేదు అప్పుడే బద్ధకం వచ్చిందా నీకు? రానన్నావని చెప్పమన్నావంట!’ అన్నాడు సీనియర్స్‌లో ఒకడు.
మరొకడు ‘అప్పుడే అంత ధైర్యం వచ్చేసిందా..?’ అన్నాడు.
దానికి ఆ జూనియర్‌ సమాధానంగా ‘మాది ఆత్రేయపురం సార్‌. నా పేరు ప్రవీణ్‌’ అని గజ గజా వణుకుతూ చెప్పాడు.
‘నీ ముద్దు పేరు ఏంట్రా?’ అని అడిగాడు మరొకడు.
‘పండు సార్‌’ అన్నాడు తలొంచుకుని
‘ఏం పండు రా..? జాం పండా, బత్తాయి పండా హి..హి..హి!’ అంటూ వెటకారంగా మిగతా వాళ్లంతా నవ్వారు.
‘ఒంట్లో బాలేదండీ అందుకే పడుకున్నాను!’ అంటూ కంట్లోంచి వస్తున్న కన్నీరు తడుచుకుంటూ చెప్పాడు.
‘ఏంట్రా మేమైనా కొట్టామా? ఎందుకు ఏడుస్తున్నావ్‌?’ అన్నాడొకడు.
‘కాళ్లు, చేతులు బాగా లాగుతున్నాయండి. ఒళ్లంతా ఒకటే నొప్పులు. బాగా నీరసంగా ఉంది ..!’ అని చెప్తున్నా ప్రవీణ్‌ మాటను ఎవరు పట్టించుకోలేదు. సరి కదా వాడి మీద తలా ఒకరు జోకులు వేస్తూనే ఉన్నారు.
మరో కుర్రాడు ‘అరేరు బొజ్జ బాగా పెంచాడు రా వీడు. అది కరగాలంటే కాస్త పరిగెత్తించాల్సిందే!’ అని పక పకా నవ్వుతూ విర్రవీగాడు మరొకడు.
‘అరే అర్జున్‌ వీడికి ఏదైనా పనిష్మెంట్‌ చెప్పరా.. అని నవ్వుతూ అర్జున్‌ పక్కనే ఉన్న కుర్రాడు అర్జున్‌ వైపు చూసి కన్ను గీటాడు.
‘బాలేదు అంటున్నాడు కదరా.. వదిలేద్దాం రా!’ అని అన్నా తన మాట ఎవరూ వినిపించుకోలేదు. సరి కదా పనిష్మెంట్‌ ఇవ్వాల్సిందే..! ఇవ్వాల్సిందే!!’ అంటూ మిగతావాళ్ళు పట్టుబట్టారు. దాంతో చేసేదిలేక అర్జున్‌ ‘ఒరేరు ఈ బిల్డింగ్‌ చుట్టూ ఒకసారి పరిగెత్తరా.. చాలు!’ అనగానే..
దానికి వత్తాసు పలుకుతూ మిగతావాళ్లు ‘ఒకసారి కాదు పదిసార్లు, పదిసార్లు..’ అని గట్టిగా అరిచారు.
అప్పటికే జ్వరంతో బాధపడుతున్న ఆ కుర్రాడు మంచులో ఆ చలికి వణుకుతూ వాళ్ళు కూర్చున్న ఆ బిల్డింగ్‌ చుట్టూ మెల్లిగా పరిగెడుతూ పరిగెడుతూ.. రెండో రౌండ్‌కే బిగుసుకు పోయి, అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ విషయం హాస్టల్‌ అంతా దావానలంలా పాకింది. హుటాహుటిన హాస్పటల్‌కి తీసుకెళ్ళినా లాభం లేకపోయింది. గంపెడాశలతో కాలేజీలో అడుగుపెట్టిన ఆ పిల్లాడి జీవితం మొగ్గలోనే నేల కొరిగిపోయింది. మూర్ఖపు ర్యాగింగ్‌ వలనే అని అందరికీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేదు. సమస్య పెద్దది కాకుండా కొన్ని రోజుల్లోనే సమసిపోయింది.
ఆ పిల్లాడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నట్టు అక్కడ డాక్టర్‌ కన్ఫామ్‌ చేయడం, ఇంకా సీనియర్స్‌ కొంతమంది కుర్రాళ్ళు పలుకుబడి, అధికారం ఉన్న కుటుంబాలు చెందినవాళ్ళ కారణంగా కేసు వాళ్ళ మీదకి రాకుండా పూర్తిగా డెంగ్యూ పైకి నెట్టేశారు.
కానీ పండు తల్లిదండ్రులు వాళ్ళ నోటా, వీళ్ళ నోట నిజం తెలుసుకున్నా పోరాడే శక్తి, ధైర్యం లేక జీవచ్ఛవాలయ్యారు. తండ్రికి అయితే పూర్తిగా మతిస్థిమితం పోయి, పిచ్చోడిలా రోడ్డుమీద ”పండూ.. పండూ..” అంటూ తిరిగేవాడు.
ఆ సంఘటన అందరి మనసుల్ని కలచివేసింది. ‘పండూ ఒంట్లో బాగోలేదు అని చెప్పినప్పుడు తన ఫ్రెండ్స్‌ అందర్నీ ఎలాగోలా ఒప్పించి, హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఈ ఘోరం జరిగుండేది కాదు’ అనుకుంటూ అర్జున్‌ బాధపడని రోజు లేదు. ఒక మనిషి అంటే ఒక కుటుంబం. ఇప్పుడు జరిగిన అన్యాయం ఒక కుర్రాడికి మాత్రమే కాదు. వాళ్ళ కుటుంబానికీ ఇంకా సమాజానికి క్కూడా. కుటుంబం మంచివ్యక్తిని కోల్పోయింది. సమాజం ఓ మంచి డాక్టర్ని కోల్పోయింది. అప్పటి నుంచి అర్జున్‌ తన వలన జరిగిన తప్పుకి తను బాధ్యత వహిస్తూ.. పండూకి జరిగిన అన్యాయం ఇంకా జీవితంలో ఏ కుర్రాడికి జరగకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. దానిలోని భాగంగానే ప్రతి కాలేజీలో జరిగే ఫ్రెషర్స్‌ పార్టీకి తప్పనిసరిగా హాజరై, పిల్లల్లో ర్యాగింగ్‌ వలన జరిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ.. న్యూస్‌ పేపర్లలో ర్యాగింగ్‌ పైన ఆర్టికల్స్‌, కథలు రాయడం, యువతలో చైతన్యం తేవడం, తద్వారా జీవితం చాలా విలువైనది అని చెప్పడం ఇవన్నీ చేస్తూ కాస్త ఊరట చెందేవాడు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంలాగా. ఓసారి తను చదివిన కాలేజీలోనే సెమినార్‌ ఇవ్వాల్సి వచ్చింది పర్సనాలిటీ డెవలప్మెంట్‌పై.
పర్సనాలిటీ అంటే వివరిస్తూ.. ‘ఒకానొక సమయంలో సీనియర్స్‌ కాలేజీలో జాయిన్‌ అయిన జూనియర్స్‌ని పరిచయం చేసుకొని కాలేజీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వాళ్ళకి చక్కని సలహాలు ఇస్తూ ఎలా చదువుకోవాలో చెప్పడమే కాకుండా వాళ్ళ హోమ్‌సిక్‌ని కూడా పోగొట్టేవారు. వాళ్ళ చదువు పూర్తయ్యేసరికి సీనియర్స్‌కి, జూనియర్స్‌కి మధ్య ఎంతో విడదీయరాని సంబంధం ఏర్పడేది. వాళ్ళు జాయిన్‌ అయిన కోర్సుని చదివేలా ప్రోత్సహించడమే ఇంట్రడక్షన్‌ యొక్క ఉద్దేశం.
కానీ రాను రాను అది తన స్వరూపం మార్చుకుని, ర్యాగింగ్‌గా మారి, అదో భూతంలా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఈ కల్చర్‌ ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో, పీజీల్లో సీనియర్స్‌, జూనియర్స్‌కి మధ్య జరుగుతూ ఉండడం మనం చూస్తూ, వింటూ ఉంటాం. కానీ రాను రాను ఆ సంస్క ృతి కాస్త దారితప్పింది. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యం వారు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా అక్కడక్కడా దాని కోరలు చాస్తూనే ఉంది. గడిచిన రోజుల్లో ఎంతోమంది అమాయకులు ఈ ర్యాగింగ్‌ కోరలకి బలయ్యారో లెక్కలేదు. ఇప్పటికీ ఈ ర్యాగింగ్‌ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. దీనిని అరికట్టాలంటే చట్టాలు చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ర్యాగింగ్‌ జరగకుండా చూడడంతో పాటు వాటి వల్ల వచ్చే అనర్థాలని స్టూడెంట్స్‌ అందరికీ చెప్పాలి. విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తేనే గానీ ఇది సమూలంగా పోదు. పర్సనాలిటీ అంటే మనం అద్భుతంగా ఎదుగుతూ మన చుట్టూ ఉన్న జనాన్నీ ఎదిగేలా చేయడమే!’ అని చెప్పగానే సభంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఆ కరతాళ ధ్వనుల మధ్య ప్రవీణ్‌ బోసినవ్వుల మొఖం కనిపించింది ప్రసన్న వదనంతో. చెమరించిన కళ్ళతో అలా చూస్తూ ఉండిపోయాడు అర్జున్‌.

– పేలూరి వెంకట మీనాక్షి
9912601765

➡️