దొంగని పట్టిన చిలుక

Jun 9,2024 11:46 #Sneha

అమరావతిని పాలించే వీరసేన మహారాజు పట్టమహిషి శచీదేవి. అంతఃపురంలో లక్షలాది వరహాలు ఖరీదు చేసే వజ్రాల హారం పోయింది. అంతఃపురంలో వందమందికి పైగా నౌకర్లున్నారు. రాజు గారు అంతఃపురంలోని నౌక ర్లందరినీ పిలిచి, ‘మీలో ఎవరో హారం తీశారు. దాన్ని తెచ్చి నాకు ఇచ్చినట్టయితే నేను శిక్షించబోను’ అన్నాడు.
వారం రోజులు గడిచినా ఎవరూ వచ్చి, పోయిన హారాన్ని రాజుగారికి ఇవ్వలేదు. మహారాణి చాలా బాధ పడుతోంది. దొంగ దొరకలేదు. ఒక రోజు రాజు కొలువులో ఉండగా యువకుడైన ఒక సాధువు రాజదర్శనం కోసం వచ్చాడు. ఆ సాధువు వెంట ఒక చిలుక ఉన్నది.
‘మహరాజా, నేను సాధువుగా కనిపించే మాంత్రికుణ్ణి. రాణిగారి వజ్రాలహారం పోయిందట. నా మంత్రశక్తితో ఈ చిలుక చేత వజ్రాల హారం దొంగిలించిన మనిషి పేరు చెప్పించగలను’ అన్నాడు సాధువు.
ఈ మాట వినగానే సభలో చర్చ మొదలైంది. చిలుక దొంగని ఎలా పట్టుకుంటుందో అని మాట్లాడుకోసాగారు. రాజు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి సాధువుతో, ‘దొంగను తెలుసుకునే ముందు మీ మంత్రశక్తి చూపించి మమ్మల్ని ఆనందింపజేయండి,’ అన్నాడు.
సాధువు చిలుకను రాజుగారికి ఇచ్చి, ‘మహారాజా, చిలుకను మీరు ఏమడుగుతారో అడగండి. తక్షణం జవాబులు యివ్వగలదు’ అన్నాడు.
‘మా అంతఃపురంలో ఎంతమంది సేవకులున్నారు?’ అని రాజు చిలుకను ఆడిగాడు.
‘నూటా పదిమంది’ అన్నది మాంత్రికుడి చిలుక.
‘వారిలో కొందరి పేర్లు చెప్పగలవా?’ అని రాజు మళ్ళీ అడిగాడు..
చిలుక తడుముకోకుండా కొన్ని పేర్లు చెప్పింది.
వెంటనే సభలో హర్షధ్వానాలు చెలరేగాయి.
రాజు సభను ఉద్దేశించి ‘ఇప్పటికైనా హారాన్ని దొంగిలించినవాడు దాన్ని తెచ్చి ఇచ్చినా, లేదా ఎవరికీ తెలియకుండా మళ్ళీ అంత:పురంలో ఉంచివేసినా ఎటువంటి శిక్ష విధించను. ఒకవేళ ఇంకా నిజం దాచిన పక్షంలో అతన్ని జీవితాంతం ఖైదు చేయిస్తాను. రెండ్రోజులు సమయం ఇస్తున్నాను. మూడోరోజు ఈ చిలుక చేత నేరస్తుడిని పట్టిస్తాను. ఈ చిలుక క్షణంలో చెప్పగలను. ఐనా దొంగను శిక్షించే ఉద్దేశం నాకు లేదు. దొంగను తానుగా బయటపడి క్షమాపణ పొందమని కోరుతున్నాను. ఇదే నా శాసనం’ అంటూ సభలో గంభీరంగా ప్రకటించాడు.
సభలో ప్రతి ఒక్కరూ రాజుగారి ఔదార్యాన్ని ప్రశంసించారు. ఆరోజు సాయంత్రం చీకటి పడుతోంది. చల్లటిగాలిలో మహారాజు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక భటుడు తొట్రుపడుతూ వచ్చి, రాజుగారి వజ్రాల హారాన్ని ఇచ్చి, కాళ్ళ మీద పడి, క్షమాపణ చెప్పుకున్నాడు.
హారం దొరకడంతో రాజుగారు సంతోషించి అతడికి దేశబహిష్కరణ విధించాడు. ఎవరికీ తెలియకుండా రాజ్యం విడిచిపొమ్మన్నాడు. అందుకు ఆ భటుడు తన పేరు బయటపెట్టనందుకు రాజుగారిని మరీ మరీ పొగిడి వంగి వంగి సలాములు చేస్తూ వెళ్ళిపోయాడు.
ఆ భటుడు అలా వెళ్ళగానే మాంత్రిక సాధువు సరాసరి అంత:పురంలోకి ప్రవేశించాడు. అతను సాధువు కాదు – రాజుగారి మేనల్లుడే. అంత:పురంలో అన్ని సంగతులు మేనల్లుడికి తెలుస్తాయి కదా, అందుకే చిలుకతో అన్నీ వల్లె వేయించాడు (బట్టీ పట్టించాడు అన్నమాట). మహామంత్రి సలహాతో రాజుగారి ఆజ్ఞతో అలా సభలో పెంపుడు చిలుకతో మాట్లాడించాడు.
దొంగపట్ల రాజు గారి ఔదార్యం, మహామంత్రి తెలివి తేటలు, మేనల్లుడి వేషభాషలు ఇంటిదొంగలకు భయం పుట్టించాయి. మళ్లీ రాజ్యంలో ఎటువంటి దొంగతనాలూ జరగలేదు.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
8008 5 77 834

➡️