ప్రశ్న మంచిదే

Apr 27,2025 08:41 #children stories

ఒక అడవిలో జింకలమంద వుండేది. ఆ మందలోని అందమైన మోతి అనే జింక పిల్ల ప్రశ్నల పోగుగా ఉండేది. ఎప్పుడూ హుషారుగా గెంతుతూ తుళ్ళుతూ ఉండటమే కాకుండా, ఎన్నో కొత్తకొత్త విషయాలు తెలుసుకోవటంలో కుతూహలం చూపిస్తూ ఉండేది. అయితే, మోతి ప్రశ్నలకు కొన్ని జింకలు సమాధానమిస్తే మరికొన్ని విసుక్కునేవి.
ఒకరోజు ‘అమ్మా.. ఇవాళ నా ఈ సందేహం తీరలేదు. పైగా అడిగినందుకు మన మందలోని కృష్ణ మామ విసుక్కున్నాడు’ అంటూ ముభావంగా కూర్చుంది.
అది విన్న ముసలి మామ్మ హీరా నవ్వుతూ ‘ఏమిటా సందేహం?’ అంటూ అడిగింది. ‘కౄర మృగాలు వేటకు ఏ సమయంలో వస్తాయి? వాటి ఉనికి ఎలా తెలుస్తుంది?’ అని అంది మోతి.
‘ఆకలివేసినప్పుడు వేటకు వస్తాయి. వాటి అడుగుజాడల్ను పసికట్టి అప్రమత్తంగా ఉండాలి’ అంటూ సందేహం తీర్చిన హీరా మర్నాడు మందలోని అందర్నీ ఉద్దేశించి ఇలా చెప్పింది.
‘మనవాళ్ళను కాపాడుకోవటం మనందరి బాధ్యత. వీలైతే మనకు తెలిసిన విషయాలు అందరితో పంచుకోవాలి లేదా అడిగినప్పుడైనా చెప్పాలి. మోతీలాగా తెలివైన పిల్లలు తమకు తెలియని విషయాలు ప్రశ్నలుగా అడిగితే తెలియజేయటం వల్ల మన భవిష్యత్‌ తరాల అభివృద్ధికి కారణం అవుతాం. అలాగే పిల్లలు ఎవరినైనా మీ సందేహం నిర్భయంగా అడిగి, నివృత్తి చేసుకోవచ్చు. అన్నివేళలా పెద్దలే దగ్గర ఉండకపోవచ్చు కదా’ అంటూ చెప్పింది.
అది విన్న కృష్ణ సిగ్గుపడుతూ ‘క్షమించు హీరా.. నేను అలా విసుక్కోవలసిందికాదు. ప్రమాదం నుంచి మన పిల్లలు జాగ్రత్తపడటానికి ఇకపైన వాళ్ళు ఎంత ప్రశ్నించినా వివరిస్తాను’ అన్నాడు నొచ్చుకుంటూ.
‘మోతీ అల్లరిదైనా చలాకీ పిల్ల. తెలివైన మంచిప్రశ్నలే వేస్తుంది. పిల్లలు ఎప్పుడూ సందేహ నివృత్తితోనే జీవితపాఠాలు నేర్చుకుంటారు. కాబట్టి మన మందలోని అందరు పిల్లలూ కూడా బద్ధకంగా తిని తిరగటం మాత్రమే కాకుండా, మోతీలా తెలివిగా ఉండండి’ చెప్పింది హీరా.
మందలోని పిల్లలు ఆ తర్వాత ఎప్పుడూ అజాగ్రత్తతో తెలివితక్కువతో కౄరమృగాల నోటికి చిక్కకుండా మసలుకోవటంతో ఆ ప్రాంతంలో ఉండే అవి మరోచోటు వెదుక్కుంటూ వెళ్ళిపోయాయి.

– డేగల అనితాసూరి
92475 00819

➡️