పరీక్షా కాలం.. తల్లిదండ్రుల పాత్ర..

ఎండాకాలం.. పరీక్షల కాలం ఒకేసారి ప్రారంభమవుతాయి. బోర్డు పరీక్షలు వచ్చే కొద్దీ, మంచి మార్కులతో అర్హత సాధించాలనే అంచనాలను అందుకోవాలనే తీవ్రమైన ఒత్తిడి కారణంగా విద్యార్థులు అధిక ఒత్తిడిని అనుభవించడం అర్థం చేసుకోదగినదే. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి, పిల్లలు తమపై తాము నిర్దేశించుకున్న అవాస్తవిక ప్రమాణాలు, సరిపోని తయారీ, సమయ నిర్వహణ లేకపోవడం వంటి అనేకాంశాలు పరీక్ష ఒత్తిడికి దారితీస్తాయి. ఏడాదంతా చదివింది ఒక ఎత్తు.. ఇక పరీక్షలు దగ్గరకు రాగానే చదవడం మరో ఎత్తు.. టెన్త్‌, ఇంటర్‌ వాళ్ల టెన్షన్‌ అంతాఇంతా కాదు. ఇప్పటికే పరీక్షల ప్రకటన విడుదల చేసింది బోర్డు. ఇంటర్మీడియట్‌ వాళ్లు పరీక్షలు రాసేస్తున్నారు కూడా. కొందరు పరీక్షలను అంత సీరియస్‌గా తీసుకోరు.. ఆడుతూ పాడుతూనే చదివేసి, రాసేద్దాం అనుకుంటారు.. అయితే పేరెంట్స్‌ టెన్షన్‌ మాత్రం పీక్‌లో ఉంటుంది. వాళ్లు కంగారుపడి.. పిల్లలనూ కంగారు పెట్టేస్తారు. వాళ్ల మనసులపై ఒత్తిడి పెంచేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేయాలో.. ఏం చేయకూడదో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

పిల్లలకు మార్కులు బాగా రావాలని.. గొప్ప ర్యాంకులు రావాలని తల్లిదండ్రులు తెగ తపన పడిపోతారు. అన్నేసి ఫీజులు కడుతున్నాం.. పిల్లలకిి మొదటి ర్యాంకు రావాలనే అందరూ కోరుకుంటారు. కోరిక మంచిదే కానీ.. పిల్లల శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగానీ.. ఏడాదంతా వదిలేసి పరీక్షల ముందు అదేపనిగా రుద్దుడు కార్యక్రమం చేస్తే వాళ్లు మరింత ఒత్తిడికి గురవుతారని నిపుణులు చెప్తున్నారు.

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (చీజజు=ు) సర్వే తాజా గణాంకాల ప్రకారం 80% మంది విద్యార్థులు పరీక్ష సంబంధిత ఆందోళనతో బాధపడుతున్నారు. పరీక్ష ఒత్తిడితో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడమంటే ముందు దాని నుంచి వారిని బయటపడేయటమే! ప్రధానంగా సమగ్ర విధానం యొక్క అత్యవసర అవసరాన్ని హైలైట్‌ చేయడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలు వారి ఒత్తిడిని తగ్గించుకోవడంలో తల్లిదండ్రులు కీలకపాత్ర పోషిస్తారు. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో పేరెంట్స్‌ సహాయం చేయాలనుకుంటే, ఒత్తిడిని అధిగమించడానికి నిపుణులు ఐదు మెలకువలు ఉన్నాయంటున్నారు.. అవి..

భావాలను పరిగణించాలి..

ఈ సమయంలో తల్లిదండ్రుల భావాలు ఎలా ఉంటాయో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు వారి భావోద్వేగాలను పిల్లలు తోసిపుచ్చకూడదని అనుకోవడం సరికాదు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల భావాలకు అనుగుణంగా ఉండడానికి సుముఖంగా ఉండరు. అదేవిధంగా తల్లిదండ్రులూ ఈ విషయంలో పట్టుబట్టకూడదు. అలా చేస్తే పిల్లలు మరింత ఆందోళన చెందుతారు. తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుని, వారితో సామరస్యంగా మాట్లాడాలి. రాబోయే పరీక్షల గురించి వారు ఎలా భావిస్తున్నారో అడిగి తెలుసుకోవాలి. పేరెంట్స్‌ ఓపెన్‌గానే పిల్లలతో మాట్లాడాలి. వారూ అలాగే తమ అభిప్రాయాలను పేరెంట్స్‌ వద్ద వ్యక్తపరచాలి.. ఏదైనా చర్చించేలా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల్లో పరీక్షల వల్ల కలిగే భయాలను పోగొట్టేలా తల్లిదండ్రులు చేసే చర్చలు, మాటలు తోడ్పడాలని చెప్తున్నారు నిపుణులు. అంతేగానీ పేరెంట్స్‌ వల్ల ఒత్తిడి పెరగకూడదు. పిల్లలకు తల్లిదండ్రుల సపోర్టు వారు పరీక్ష ఒత్తిడిని అధిగమించడానికి ఉపయోగపడాలి.

పోలికలు చేయొద్దు..

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను నిరుత్సాహపరిచే పోలికలను తీసుకొస్తుంటారు. ఇది వాళ్లలో తమ అంచనాలను అందుకోలేమనే భయాన్ని మరింత పెంచేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులుగా నిర్మాణాత్మక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పిల్లల పురోగతికి సహాయపడటానికి తోడ్పడుతుంది. అలాగే పిల్లలకు సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకునేలా సహాయపడాలని చెప్తున్నారు. పరీక్షల క్లిష్ట సమయాల్లో పిల్లలు తమ తల్లిదండ్రుల సహకారం తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు.

అనుకూల వాతవరణం..

ఇంట్లో ప్రోత్సాహం కలిగించే, అవగాహన పెంపొందించే సంస్కృతిని తేవడం ముఖ్యం. దీనిద్వారా పిల్లలకు మంచి వాతావరణాన్ని కలిగించినవాళ్లు అవుతారని నిపుణులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో పిల్లలు పరీక్షలకు సంబంధించిన సిలబస్‌పైనే కేంద్రీకరించ గలుగుతారు. ప్రశాంతమైన ప్రదేశాన్ని పిల్లలకు ఏర్పాటు చేయాల్సింది పేరెంట్సే.. పిల్లలకు పరధ్యానాన్ని తగ్గించి, నిర్దిష్ట అధ్యయనాన్ని చేసేందుకు ఈ వాతావరణం వీలవుతుంది. ఈ పరిస్థితి పిల్లలకు అభ్యాసనకు తోడ్పడడమే కాదు తల్లిదండ్రులకు – పిల్లలకు అనుబంధాన్ని పెంపొందేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

ఒత్తిడిని తగ్గించండి ఇలా..

  • మీ పిల్లలతో కలిసి నడక, పరుగులు, మెడిటేషన్‌ వంటివి రోజువారీ జీవితంలో భాగం కావాలి.
  •  సమయ నిర్వహణను కీలకం.
  •  రివిజన్‌ చేయాల్సిన సబ్జెక్టులు నిర్ధారించాలి. అంశాలవారీ టైంటేబుల్‌ వేసుకోవాలి. అప్పుడు చదవడం ప్రారంభిస్తే తేలికవుతుంది.
    చివరిగా వీటన్నింటితో పాటు ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం పిల్లలకు ఇవ్వాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార మాత్రమే తీసుకోవడం మంచిది. బయట ఆహారం ఈ పరీక్షల కాలంలో తీసుకోకపోవడం ఉత్తమం. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు. అలాగే పరీక్షలు అనగానే నిద్ర లేకుండా చదవడం చాలామంది చేసే తప్పు.
    సరిపడా నిద్ర ఉంటే చదివిన విషయాలు జ్ఞాపకం ఉండడానికి, ఆకళింపు చేసుకోవడానికి వీలవుతుంది అంటున్నారు నిపుణులు.
➡️