ఆకాశమే నీ హద్దురా!

Dec 1,2024 08:07 #COVER STORY, #Sneha

ఆధునిక జీవనంపై విమానయాన ప్రభావం ప్రబలంగానే ఉంది. 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో ప్రపంచంలో ఎక్కడికైనా చేరుకోగలగడం ఒకప్పుడు నమ్మశక్యంగానిది. ఒక దేశంలో పడుకుని మరో దేశంలో నిద్ర లేవడం ఊహకందనిది. నింగిలో ఎగరడం.. ప్రపంచాన్ని చాలా చిన్న ప్రదేశంగా మార్చింది. ప్రయాణ సమయాన్ని తగ్గించి… ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆకాశ వారధులు.. నింగిలో ఎగిరే కపోతాలు విమానాలు. విమానాల్లో ప్రయాణం సంపన్నులకే గానీ… సామాన్యులు కలలో కూడా ఊహించలేనిది. విలాసవంతమైన ప్రయాణం విమానయానం. ఒక్కసారైనా విమానంలో పయనించాలన్న కోరిక ప్రతి ఒక్కరిలోనూ వుంటుంది. అలాంటి కోరికను కూడా సాకారం చేసి, తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కెప్టెన్‌ జిఆర్‌ గోపీనాథ్‌ది. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు విమానయానం అందుబాటులోకి వచ్చిందంటే, దానికి కారణం గోపీనాథ్‌ వంటి వారి కృషి. విదేశాలకు, పెద్దపెద్ద నగరాలకే కాదు, చిన్నచిన్న పట్టణాల మధ్య కూడా ఆకాశ విహంగాలై విమానాలు ఎగరాలి. అసాధ్యం సుసాధ్యం కావాలి. దీని కార్యాచరణ రూపమే ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం…

పౌర విమానయానం సాధించిన విజయాలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితిచే 1996లో ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’ రూపొందించారు. ఈ సందర్భంగా విమానంలో ప్రయాణం మాత్రమే కాకుండా, ప్రపంచ వాణిజ్యం, పర్యాటకం, అంతర్జాతీయ వ్యాపారానికి ఇంధనం, మానవతా సహాయక చర్యలు చేపడుతుంది. అత్యవసర ప్రతిస్పందనలో కీలకపాత్ర పోషిస్తుంది.

చరిత్ర ..

అమెరికా ఆహ్వానం మేరకు 1944లో 54 దేశాల ప్రతినిధులు చికాగోలో సమావేశమై.. అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిని ‘చికాగో కన్వెన్షన్‌’ అంటారు. ప్రపంచ విమానయాన వ్యవస్థను శాంతియుతంగా ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా అబివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ‘అంతర్జాతీయ పౌర విమానయానం భవిష్యత్తు, అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య స్నేహ సంబంధాలను, అవగాహనను పెంపొందించుకోడానికి, సంరక్షించుకోడానికి గొప్పగా సహాయపడుతుందని’ కన్వెన్షన్‌ ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు.


ప్రపంచ జనాభాలో 2050 నాటికి మూడింట రెండొంతుల మంది నగరాల్లోనే నివసిస్తారని, తద్వారా విమాన ప్రయాణాలు మరింత విస్తరిస్తాయని ఐక్యరాజ్యసమితి అంచనా. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి అజెండాకు విమానయానం సమర్థవంతంగా తోడ్పడుతుందని ఐరాస భావిస్తోంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జనసాంద్రత అధికంగా వుండే నగరాల్లోనే విమానాశ్రయాలు నిర్మితమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి కూడా కొంతమేరకు ఊపందుకుంది. ప్రపంచ జనాభాలో 51 శాతం మంది అంతర్జాతీయ విమానాశ్రయాలకు 100 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారని ఐసిఎఓ వెల్లడించింది. 2036 కల్లా ప్రయాణీకులు, సరుకుల రవాణాను రెట్టింపు చేయాలని విమానయాన పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పైలెట్లు, ఇంజనీర్లు, విమాన ప్రయాణ నియంత్రణ సిబ్బంది అవసరం పెరిగి, యువతకు ఉపాధి లభిస్తుంది. వాణిజ్య పైలెట్ల శిక్షణ కోసం ఐదు విమానాశ్రయాల సమీపంలో ఎనిమిది శిక్షణా సంస్థలను నెలకొల్పనున్నట్లు గతేడాది భారత ప్రభుత్వం ప్రకటించింది. 2020 లో ప్రపంచవ్యాప్తంగా రోజుకు లక్ష విమాన ప్రయాణాలు జరిగాయని, 2030 కల్లా రెండు లక్షల ప్రయాణాలకు పెరుగుతాయని, 2036 నాటికి విమానయాన రంగంలో 1.55 కోట్ల అదనపు ఉద్యోగాలు లభిస్తాయని ఐసిఏఓ అంచనా వేస్తోంది.

భారత్‌లో..

ప్రపంచంలోని 116 దేశాలతో విమాన సేవల ఒప్పందాలున్న భారత్‌.. ప్రస్తుతం విస్తృతశ్రేణిలో అంతర్జాతీయ విమాన సేవలను అందిస్తోంది. అక్టోబర్‌, 2023 నాటికి 24 దేశాలతో సార్వత్రిక గగనతల ఒడంబడిక కుదుర్చుకుంది. దేశంలో 2020 నాటికి 153 విమానాశ్రయాలు వుండగా, 2040 కల్లా వాటి సంఖ్య 190-200 వరకు పెంచాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. దేశంలోని విమానయాన సంస్థల వద్ద 2027 నాటికి 1100 విమానాలు వుంటాయని ఐసిఎఓ అంచనా. 2026 కల్లా విమానాశ్రయాల్లో మౌలిక వసతుల కోసం కేంద్రం రూ.13,500 కోట్ల పెట్టుబడులు సమకూర్చనుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అసోం, అండమాన్‌ నికోబార్‌, గుజరాత్‌, లక్షదీవుల్లో 14 జల విమానాశ్రయాల నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 28 సముద్ర విమాన రూట్లు కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా వున్నాయి. భారత్‌ ఇప్పటికే ప్రపంచ స్వదేశీ విమాన ప్రయాణీకుల్లో ఆమెరికా, చైనా తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. అంతేకాదు, దేశంలో 2038 నాటికి 2,380 వాణిజ్య విమానాలు అవసరమవుతాయని, ఆ మేరకు ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు. 1991లో భారతీయ విమాన రంగంపై ప్రభుత్వం క్రమబద్ధీకరణ తొలగించడంతో ప్రైవేటు రంగంలో విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో అభివృద్ధి చేయడానికి తొలుత అహ్మదాబాద్‌, గువాహటి, జైపూర్‌, లఖ్‌నవూ, మంగళూరు, తిరువనంతపురం.. ఈ ఆరు విమానాశ్రయాలను ఎంపిక చేశారు.

రాష్ట్రంలో..

సంపన్నులకే పరిమితమైన విమానయానం మధ్యతరగతి ప్రజల వరకూ చేరినా.. ఇంకా విస్త ృత జనావళికి అందుబాటులో లేని ప్రయాణమే. విమానయానం ప్రజలకు మరింత చేరువకావాలన్న పేరుతో కొత్తకొత్త విమానాశ్రయాల నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూమిని కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న ఏడు విమానాశ్రయాలకు తోడు కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. సీ ప్లేన్‌ కార్యకలాపాలు కూడా రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు మొట్టమొదటి సీ ప్లేన్‌ డెమోను ఇటీవల కృష్ణానదిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. సీ ప్లేన్‌ లాండింగ్‌, టేకాఫ్‌ రెండూ నీళ్లలోనే జరుగుతాయి. మామూలు విమానాశ్రయాల నిర్మాణానికి వేల ఎకరాల భూమి అవసరం అవుతుంది. కానీ సీప్లేన్‌కు ఒక పెద్ద రిజర్వాయర్‌ వుంటే చాలని కేంద్రం చెబుతోంది.

ఒక్క రూపాయితో..

విమానయానం అంటేనే ఖరీదైనది. ప్రస్తుతం బోలెడన్ని హంగులతో, ఆఫర్లతో ఖరీదైన ప్రయాణాన్ని అందించే విమానయాన సంస్థలు అనేకం. అయితే, తక్కువ ధరతో విమానంలో ప్రయాణించాలన్న సామాన్యుల కలను సాకారం చేసిన వ్యక్తి డెక్కన్‌ ఎయిర్‌ వేస్‌ జిఆర్‌ గోపీనాథ్‌. విమానయానం కేవలం సంపన్నులకేనా? వారితో సమానంగా సామాన్యులు ప్రయాణించలేరా? అనే ప్రశ్నలతో ఏర్పడిందే ఈ ఒక్కరూపాయితో విమాన ప్రయాణం. 28 ఏళ్ల వయసులో మనసులో తట్టిన ఆలోచనను అమలులోకి తేవడానికి ఆయన ఎంతో శ్రమించారు. చివరికి సాధించారు. చౌకధరకే విమాన ప్రయాణాన్ని అందించారు. సామాన్యులు సైతం విమానం ఎక్కవొచ్చని డెక్కన్‌ ఎయిర్‌వేస్‌ నిరూపించింది. ఈ సంస్థ ఆగస్ట్‌ 23, 2003లో బెంగళూరు నుంచి హుబ్లీకి తన సేవలను ప్రారంభించింది. అయితే, ఒక్క రూపాయికే విమాన టిక్కెట్‌ను అందించాలనే నిర్ణయాన్ని 2006లో అమలు చేశారు. గోపీనాథ్‌ జీవిత కథనే చిన్నచిన్న మార్పులు చేసి ‘ఆకాశమే నీ హద్దురా’ అనే సినిమాగా తెరకెక్కించారు. విమానయానం డబ్బున్నవాళ్లకే కాదు… సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో వుండాలన్న ఆలోచనతో ఒక సాధారణ స్కూల్‌ మాస్టారు కొడుకు కథ ఇది. డెక్కన్‌ ఎయిర్‌ అనే విమానయాన సంస్థను ఎలా స్థాపించాడు, సామాన్యులను కూడా విమానం ఎక్కాలన్న కలను ఎలా సాకారం చేసుకున్నాడన్న రియల్‌ స్టోరీయే ఈ సినిమా కథ.

సామాన్యుల విమానం…

రోడ్డు ప్రయాణం, రైలు ప్రయాణం వారి వారి ఆర్థిక స్థితిని బట్టి ప్రయాణించే అవకాశం వుంది. కానీ విమానం ఎక్కడం అంటే రోడ్డు, రైలు ప్రయాణాలంత ఈజీ కాదు. పేదలకైతే… విమానం సంగతి సరే, కనీసం విమానాశ్రయం దరిదాపులకు కూడా వెళ్లే అవకాశం వుండదు. విమానయానం గురించి సినిమాల్లో చూసి ఆనందించడమే తప్ప ప్రత్యక్ష అనుభవం కానీ, స్వీయానుభవం కానీ వుండదంటే అతిశయోక్తి కాదు. ‘వీరయ్య అనే వికలాంగుడి కొడుకు నెలరోజుల ఎక్కువ బతకడనే చేదు నిజం తెలుస్తుంది. పేదరికంలో మగ్గిపోతున్న వీరయ్య… విమానం ఎక్కాలన్న తన కొడుకు చివరి కోరికను తీర్చడానికి ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో ”విమానం” అనే సినిమాలో చూస్తాం.’ నిజజీవితంలోనూ చాలామంది పేదల పరిస్థితి ఇలాగే వుంటుంది. విమానంలో ప్రయాణం చేయాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వుంటుంది. విమానాశ్రయం లోపలికి ప్రవేశించడం దగ్గర నుంచి ఎదురయ్యే చెకింగ్స్‌, టికెట్‌ తీసుకోవడం, విమానం వరకూ వెళ్లడం వంటివే అగ్నిపరీక్షలా వుంటాయి. భాష దగ్గర నుంచి డబ్బు వరకూ అన్నీ ప్రతిబంధకాలుగానే వుంటాయి. విమాన ప్రయాణం పేద ప్రజలకు అందని మావి పండులాంటిదే.

అయితే, కేంద్రం ఉడాన్‌ (UDAN) అనే స్కీం ద్వారా రూ.150 కే విమాన ప్రయాణం అమలులోకి తెచ్చింది. దాదాపు 50నిమిషాలు ప్రయాణించే దూరానికి రూ.150 అన్నది తక్కువ ఛార్జీనే. అయితే దీనికి జిఎస్టీ, ఇతర టాక్స్‌లు రూ.325 వరకు అవుతాయి. అంటే మొత్తం ఛార్జీ రూ.475 అవుతుంది. ఇది కూడా దేశంలో రెండు మూడు నగరాల మధ్యనే వుంది. ఇదీ సామాన్య జనానికి ఆచరణ సాధ్యం కానిదే.

ప్రపంచ దేశాల్లో పౌర విమానయాన రంగం, విమాన రవాణా, ప్రపంచ అభివృద్ధిలో విమాన రంగం పాత్ర వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలను డిసెంబర్‌ 7న పౌర విమానయాన దినోత్సవంనాడు నిర్వహిస్తారు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ విమాన రంగం, విమాన రవాణా వల్ల కలుగుతున్న సేవల్ని గుర్తుచేసుకుంటాయి. చాలా మందికి ఇలాంటి రోజొకటి ఉంటుందని తెలియదు. ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో పౌర విమానయాన దినోత్సవంపై అవగాహనా కార్యక్రమాలు పెద్దగా జరగట్లేదు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం వుంది. సామాన్యులకు సైతం విమానయానం అందుబాటులోకి తేవాలి. ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చినట్లుగానే.. విమానయానం ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలి. ప్రపంచ దేశాల అభివృద్ధి, సామాజిక మార్పులు, ఆర్థికవృద్ధి వంటి అంశాలలో విమానరంగం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు, పొందుతున్న సేవలు, కలుగుతున్న ఉపయోగాలు ప్రజలందరికీ చేరాలి. అంతేకాదు, విమానయాన నిర్వహణ, నియంత్రణ సంస్థలు, వాటి విధులు, అలాగే.. విమాన రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా ఇలాంటి రోజు పట్ల యువతరానికి, విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అప్పుడే వైమానిక రంగంపై ఆసక్తి కలుగుతుంది. 1903లో మొదటి విమానం ఎగిరినప్పటి నుంచి విమానయాన రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుంది. ఇలాంటి ఒక రోజును గురించి ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక సెమినార్లలో ఈ రంగంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, నిపుణులు ఇచ్చే సందేశాలు సామాన్య విద్యార్థులకు సైతం చేరాలి. ప్రయాణమే కాదు… విద్యార్జన, ఉద్యోగావకాశాలు యువతరానికి చేరినప్పుడే ఈ రంగం అభివృద్ధి చెందుతుంది. ఆకాశమే హద్దుగా దూసుకెళుతుంది. రాబోయే తరాలకు ఆకాశం ఐక్యత, వృద్ధి, స్థిరత్వానికి మార్గంగా నిలవాలి.

కాలక్రమం..

  • సెప్టెంబర్‌ 19, 1783 : జోసెఫ్‌ మైఖేల్‌, జాక్వెస్‌ ఎటియెన్‌ మోంట్‌ గోల్ఫియర్‌ తమ హాట్‌-ఎయిర్‌ బెలూన్‌ మొదటి విమానాన్ని ప్రదర్శించారు. ఇది మొదటి బెలూన్‌ విమానం.
  • డిసెంబర్‌ 17, 1903 : ఓర్విల్లే రైట్‌ తన మొదటి విమానాన్ని నార్త్‌ కరోలినాలోని కిల్‌ డెవిల్‌ హిల్స్‌ సమీపంలో ప్రదర్శించాడు. ఇది మొదటి విమానం ఫ్లైట్‌.
    సెప్టెంబర్‌ 17, 1908 : వర్జీనియాలోని ఫోర్ట్‌ మైయర్‌ వద్ద విమాన ప్రదర్శన సందర్భంగా ప్రయాణీకుడు థామస్‌ ఎథోలెన్‌ సెల్ఫ్రిడ్జ్‌ మరణించాడు. ఇది మొదటి విమాన మరణం.
  • 1924: ఎనిమిది మంది అమెరికా ఆర్మీ ఎయిర్‌ సర్వీస్‌ పైలెట్లు, మెకానిక్‌లు మొదటిసారిగా ప్రపంచ విమానయానం చేశారు. దీనికి 175 రోజులు పట్టింది.

భారత విమాన రంగం

  • ఫిబ్రవరి18, 1911 : భారతదేశంలో వాణిజ్య పౌర విమాన రవాణా మొదట అలహాబాద్‌ నుంచి నైనిటాల్‌ వరకు ప్రారంభమైంది.
  • 1928 : ముంబయి సమీపంలోని జూహు వద్ద వైల్‌పార్లే ఫ్లైయింగ్‌ క్లబ్‌ మొదటి విమానాశ్రయంగా ప్రసిద్ధి.
  • 1910 : పాటియాల మహారాజు భూపేందర్‌ సింగ్‌ సొంత విమానం కొనుగోలు.
  • 1912 : మొదటి దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసును కరాచీ – ఢిల్లీ మధ్య బ్రిటిష్‌ ఇంపీరియల్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ అందించింది.
  • 1915 : కరాచీ – మద్రాసు మధ్య జంతువులను రవాణా చేసిన మొదటి భారతీయ విమాన సంస్థ టాటా సన్స్‌ లిమిటెడ్‌.
  • 1920 : రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ సంస్థ కరాచీ-ముంబయిల వద్ద పౌర విమానాశ్రయాలను నిర్మించింది.
  • 1927 : ప్రభుత్వ పౌర విమానయాన శాఖ ఏర్పాటైంది.
  • 1932 : టాటా సన్స్‌ లిమిటెడ్‌ సంస్థ శాఖగా ప్రారంభమైన టాటా ఎయిర్‌లైన్స్‌… 1946లో ఎయిర్‌ ఇండియాగా మారింది.
  • 1940 : హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు (హెచ్‌.ఎ.ఎల్‌.)
  • 1945 : నిజాం నవాబు, టాటాల సంయుక్త దక్కన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభమైంది.
  • 1953 : భారతదేశంలో ఎనిమిది దేశీయ విమాన ప్రయాణ సంస్థలు ప్రారంభం.
  • 1953 : భారత పార్లమెంటులో ఎయిర్‌ కార్పొరేషన్‌ చట్టం ఆమోదం పొందింది.
  • 1972 : అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఎఎఐ) స్థాపన.
  • 1986 : నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎఎఐ) ఏర్పాటు.
  • 1995 : ఐఎఎఐ, ఎన్‌ఎఎఐ.. ఈ రెండిటినీ విలీనం చేసి ‘ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ గా ఏర్పాటు చేశారు.
  • 1987 : బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఏర్పాటు.
  • 1991 : భారతీయ విమాన రంగంపై ప్రభుత్వం క్రమబద్ధీకరణ తొలగించి, ప్రైవేటు రంగంలో విమాన ప్రయాణాలు ప్రారంభించారు.

థీమ్‌ : ప్రతి ఐదేళ్లకోసారి ఐసిఎఓ దీనికి సంబంధించిన ప్రత్యేక థీమ్‌ని ప్రకటిస్తుంది. దీనిని వార్షిక మండలి ప్రతినిధులు నిర్ణయిస్తారు. 2020లో ‘అడ్వాన్సింగ్‌ ఇన్నోవేషన్‌ ఫర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ డెవలప్‌మెంట్‌’ అనే థీమ్‌ని ఎంచుకున్నారు. ఈ థీమ్‌ 2024వరకు అమల్లో వుంటుంది.
ఒక చారిత్రాత్మక వేడుకగా మొదలైన అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని ప్రతియేటా డిసెంబర్‌ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుపుకునే ఉత్సవం. ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి విమానయానం, ముఖ్యంగా అంతర్జాతీయ విమానయానం ప్రాముఖ్యతను గుర్తించడం ఈ రోజు లక్ష్యం. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఓ) 50వ వార్షికోత్సవంలో భాగంగా… 1994లో తొలిసారిగా అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం నిర్వహించారు. ఈ రోజున ప్రపంచ దేశాల్లో పౌర విమానయాన రంగం, విమాన రవాణా, ప్రపంచ దేశాల అభివృద్ధి, సామాజిక మార్పులు, ఆర్థికవృద్ధి వంటి అంశాల్లో విమానరంగం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు, పొందుతున్న సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే, చాలామందికి ఇలాంటి రోజు ఒకటుందని తెలియదు. ముఖ్యంగా భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పౌర విమానయాన దినంపై పెద్దగా అవగాహనా కార్యక్రమాలు జరగట్లేదు.
అందువల్ల విద్యార్థులు, ప్రజలకు ఈ రోజు ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. విమాన ప్రయాణంలో భద్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు ప్రయాణీకుల్లో విశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతాయి.

కంచర్ల రాజాబాబు
94900 99231

➡️