గురువు సలహా

Apr 13,2025 09:17 #children stories, #Sneha

కౌశాంబీ రాజ్యాన్ని పరిపాలించే విక్రమవర్మకు ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవాలన్న కోరిక ఎక్కువ. అతడు ఎన్నో చిన్నచిన్న రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. వారినందరినీ తన సామంతులుగా చేసుకున్నాడు. ఒకసారి అతని ఆస్థానంలోకి అతని గురువైన సదానందుడు వచ్చాడు.
అతడు రాజుతో ‘మహారాజా! మీరు శాలినీ రాజ్యం పైన యుద్ధాన్ని ప్రకటించారట! యుద్ధం ఎవరికీ మంచిది కాదు. నా మాట విని యుద్ధం మానండి!’ అని సలహా ఇచ్చాడు.
అప్పుడు విక్రమవర్మ ‘గురువర్యా! మీరు ఏది కోరినా ఇస్తాను. ప్రస్తుతం మీ సలహాను నేను ధిక్కరిస్తున్నందుకు నన్ను క్షమించండి. నాకు ఆ శాలినీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఎన్నాళ్ళ నుండో కోరికగా ఉంది. నా కోరికను కాదనడం మీకు భావ్యం కాదు’ అని అన్నాడు.
చేసేదేమీ లేక సదానందుడు తిరిగి వచ్చాడు.
తర్వాత విక్రమవర్మ తన సైన్యానికి యుద్ధానికి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు. వారు రాజాజ్ఞను అనుసరించి, శాలినీ రాజ్యంపై దండయాత్ర చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు.
ఒకరోజు కౌశాంబీ సైన్యం శాలినీ రాజ్యం పైన దండెత్తింది. కానీ శాలినీ రాజుకు తోడుగా కుంతల రాజు, అలాగే వంగ రాజు తమ సైన్యాలతో వచ్చారు. వారిని చూసిన విక్రమవర్మ ఖంగుతిన్నాడు. ఆ మూడు రాజ్యాల సైన్యాలను కలిపితే తన రాజ్య సైన్యానికన్నా చాలా పెద్దగా ఉంటాయి. చేసేది లేక విక్రమవర్మ వారితో యుద్ధం చేసి, ఓడిపోయి వారికి పట్టుబడ్డాడు. వారు విక్రమవర్మను బంధించి, పట్టుకొనిపోయారు.
ఒకరోజు బందీగా ఉన్న విక్రమవర్మ వద్దకు సదానందుడు వచ్చి ‘మహారాజా! నేను చెప్పిన సలహాను నీవు పాటిస్తే, నీకు ఈ దుర్గతి పట్టేదే కాదు. గురువు గారి మాటనే ధిక్కరించావు. నీవు నా శిష్యుడవనీ నా సలహాను వింటావనీ నేను అనుకున్నాను. ఈ మూడు రాజ్యాల ప్రభువులు కూడా నా శిష్యులే! వారు ఆత్మరక్షణకే యుద్ధం చేశారు తప్పా, వారు యుద్ధానికి విముఖులే! ఇప్పటికైనా నీ రాజ్యకాంక్ష వదిలిపెట్టు. ఇప్పుడే నిన్ను బంధ విముక్తుడిని చేయమని చెబుతాను.
యుద్ధానికి పెట్టే ఖర్చు నిరుపయోగమైనది. ఆ ఖర్చునూ నీ రాజ్యాలలో ఉన్న పేదవారికి, ఆకలిగొన్నవారికి, అనాథలకు ఖర్చు పెట్టడం మంచిది. ప్రజోపయోగ పనులైన చెరువులు తవ్వించుట, ధర్మసత్రాలు కట్టించుట వంటి వాటికి నీవు ఖర్చుపెడితే నీకు చాలా కీర్తి వచ్చేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీవు వాటికి ఖర్చు పెట్టు. యుద్ధకాంక్ష నీకే కాదు.. ఎవరికీ మంచిది కాదు. అది ఇసుకలో పోసిన పన్నీరు వంటిది. అందువల్ల ఇకనైనా ప్రజలను చక్కగా పాలించు!’ అని అన్నాడు.
అందుకు విక్రమవర్మ ‘గురువర్యా! నన్ను మన్నించండి. మీ మాటను ధిక్కరించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నేను కూడా ఇక నుండి మీరు చెప్పిన విధంగానే చేస్తాను. మీ శిష్యులైన శాలినీ, కుంతల, వంగ రాజ్యాల రాజులతో స్నేహంగా ఉంటాను. ప్రపంచ శాంతికి మేమందరం కలిసి కృషి చేస్తాం!’ అని అన్నాడు.
అప్పుడే అక్కడికివచ్చిన శాలినీ, కుంతల, వంగ రాజ్యాల రాజులు విక్రమవర్మతో ‘మహారాజా! మీ మాటను మేము కూడా శిరసావహిస్తాము. మన గురువు గారి సలహా ప్రకారం మనందరం కలిసి ప్రజల కష్టాలను తీర్చడానికి కృషి చేసి, వారిలో అక్షరాస్యతను పెంచుదాం. ప్రపంచశాంతికి ఐక్యంగా పనిచేద్దాం’ అని అన్నారు. వెంటనే వారు విక్రమవర్మను బంధ విముక్తుడిని చేశారు.
విక్రమవర్మ వారితో ‘మీలాగా నేను సంపూర్ణ విద్యను గురువుగారి వద్ద నేర్చుకొని ఉంటే ఈ యుద్ధాన్ని చేసేవాడినే కాదు. అసంపూర్తి విద్య వల్లనే నాలో ఈ అహంకారం పెరిగింది. గురువుగారి సలహా ధిక్కరించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. మీ గురుభక్తి ఎంతో శ్లాఘనీయమైనది. ఇకనుండి మనం నలుగురం మిత్రులం. మీకు ఏ సాయం కావలసి వచ్చినా నేను చేస్తాను’ అని అన్నాడు.
అప్పుడు సదానందుడు సంతోషించి ‘విక్రమవర్మా! ఇప్పుడు నీవు నా శిష్యుడవని అనిపించుకున్నావు. మీరు మీ మీ రాజ్యాలలో గల ప్రజల ఇబ్బందులను తొలగించి, మంచి రాజులుగా పేరుతెచ్చుకొండి. అదే నా సలహా! సూచన కూడా!’ అని అన్నాడు.
‘అలాగే గురువర్యా !’ అన్నారు ఆ నలుగురు రాజులు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
9908554535

➡️