తలుపును ఎవరో దబాదబా బాదుతుంటే ఉన్నట్టుండి మెలుకువ వచ్చింది నాకు. ‘ఈ సమయంలో ఎవరబ్బా..’ అనుకుంటూ ఒంటిపై కప్పుకున్న దుప్పటిని పక్కకి తప్పించి, బద్ధకంగా వెళ్ళి తలుపు తీశాను.
బయట వరండాలో దీనమైన మొహంతో చిట్టెమ్మ కనిపించింది. ఆ సమయంలో ఆమె ఎందుకు వచ్చిందో అర్థంకాలేదు నాకు. ఆమె వైపు చూసాను. ఆ క్షణంలో ఎందుకో తెలియదుగానీ, ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయాందోళన ప్రస్ఫుటంగా కనిపించింది. ఎంతో అర్జెంటు పని పడితేగానీ.. ఇంత పొద్దున్నే హడావుడిగా ఇక్కడకు రాదని తెలుసు నాకు.
ఇంటి దగ్గర్నుంచి ఆదుర్దాగా పరిగెత్తుకుంటూ రావడంవల్లనేమో, ఆమె గుండెలు ఆయాసంతో ఎగసెగసి పడుతున్నాయి. చాలా సేపట్నుంచి ఏకధాటిగా ఏడ్చినట్లు.. కళ్ళ నుండి జారిన కన్నీటి ధారలు ఆమె మొహంపైన చారికలుగా మారి కనిపిస్తున్నాయి.
‘ఏమైంది చిట్టెమ్మా..?’ ఆమెనే చూస్తూ విషయం తెలుసుకుందామని అడిగాను.
‘సారూ.. మీరే మాకు దిక్కు! మేమెలాంటోల్లమో మీకు తెలీదా! లేని తప్పును మా అయ్య మీదికి తోసేసి, ఊరు ఊరంతా ఒక్కటైపోనాది! ఈ గండం నుంచి మీరే గట్టెక్కించాల..’ విషయం చెప్పి బోరుమంది చిట్టెమ్మ.
ఆమెనలా ఆ పరిస్థితిలో చూసి జాలేసింది నాకు. ఒకింత బాధగానూ అనిపించింది. ‘సర్సరే.. నువ్వెళ్ళు! నేను డ్రస్సు మార్చుకుని వస్తాను!’ అని భరోసా చెప్పడంతో, నమ్మకంగా నాకు దండంపెట్టి వెళ్ళిపోయిందామె.
ఆమె ఆలోచనలతో బట్టలు మార్చుకోడానికి ఇంట్లోకి దూరాను. రెండు రోజులుగా ఊరిలో జరుగుతున్న సంఘటనలు నా బుర్రలో గిర్రున తిరిగాయి.
అది చుట్టుపక్కల రెండు చిన్న గ్రామాల్ని కలుపుకుని చిన్న పంచాయతీగా ఉన్న స్వచ్ఛమైన పల్లెటూరు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడినైన నాకు పల్లెటూళ్ళన్నా, పచ్చని పంట పొలాలన్నా, అక్కడి వాతావరణమన్నా చాలా ఇష్టం. అందుకే ఆ ఊరి పీహెచ్‌సీకి డాక్టరుగా బదిలీపై వచ్చినపుడు చెప్పలేని ఆనందం కలిగింది.
పట్టణంలోలా కాకుండా ఇక్కడన్నీ తాజాగా దొరుకుతాయి. పొల్యూషన్ లేని స్వచ్ఛమైన గాలి, కల్మషంలేని ఆత్మీయతానురాగాలు ఈ పల్లె ప్రజలకే సొంతం. ఇక్కడి వేషభాషలు, ఆచార వ్యవహారాలు చూసేవారికి ముచ్చటగొల్పుతాయి. అందుకేనేమో.. దేశాభివృద్ధికి పల్లెసీమలే పట్టుగొమ్మలని అన్నారు. ఎటొచ్చీ ఇక్కడ చిక్కేమిటంటే.. తులసివనంలో గంజాయి మొక్కలా ఇక్కడ ప్రజలకి మూఢనమ్మకాలెక్కువ. అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
నేను ఆ ఊళ్ళోనే ఉంటానంటే.. ఆ ఊరి సర్పంచిగారే ఖాళీగా, అనువుగా ఉన్న ఇల్లుని నేను ఉండటానికి ఏర్పాటు చేశారు. అదిగో అప్పుడే ఇంట్లో పనికి కుదిరింది చిట్టెమ్మ. చాలా మంచి మనిషి. తన పనేదో తాను చేసుకుంటూపోయేది తప్ప, ఇతరత్రా అనవసరమైన విషయాలను పట్టించుకునేది కాదు. ఆమె మొహంలో అమాయకత్వం ఎప్పుడూ గూడు కట్టుకున్నట్లు కనిపించేది.
ఏదో సందర్భంలో ఆమె గురించి అడిగినప్పుడు, తమ ఇంటి గురించి వివరాలు చెప్పింది చిట్టెమ్మ. ‘నేను సదువుకోలేదు సారూ.. నా సిన్నప్పుడే అమ్మ సచ్చిపోతే మా అయ్యే నన్ను పెంచి, పెద్దసేసి పెళ్లి చేసాడు. నా అదురుస్టం బాగోలేకేమో ఆడపిల్ల పుట్టాక పెనిమిటి కూడా పోయాడు. కూతుర్ని తీసుకుని పుట్టింటికి వచ్చేసాను. ఇప్పుడు నేనూ, నా కూతురు మా అయ్యతోపాటే ఊరి చివర పూరిపాకలో ఉంటున్నాం. అయితే పెళ్లాం వదిలేసిన నా మేనత్త కొడుకు సూరిగాడు నన్ను పెళ్లి చేసుకుంటానని పెద్దలతో వచ్చాడు. వాడికిలేని ఎసనమంటూ లేదు. ఆడ్ని నేను సేసుకోనని వచ్చిన పెద్దలముందే సెప్పేసాను. దాంతో మా మేనత్తవాళ్ళు మాతో మాట్లాడ్డం మానేసారు. ఇప్పుడు నేనే బయట పనులకెళ్లి ముసలాడైన మా అయ్యని, నా కూతుర్ని పోషించుకుంటున్నాను!” అని ఆమె చెప్పింది. అది విన్నాక ఆమెపై జాలి కలగడంతోపాటు గౌరవం కూడా పెరిగింది.
ఆమె చెప్పింది కూడా నిజమే.. రెండు మూడుసార్లు ఊరవతల కల్లు దుకాణం దగ్గర స్పృహ లేకుండా సూరిగాడు తాగి పడిపోయి ఉండటం నేనూ చూశాను. గత వారం పదిరోజులుగా కురిసిన వర్షాలకు ఊరంతా బురదతో చిత్తడి చిత్తడిగా మారిపోయింది. మురుగు కాల్వలు పనికిరాని వ్యర్థాలతో నిండిపోయాయి. మురికినీళ్ళతో నిండిన గుంతల్లో దోమలు స్వైరవిహారం చేయసాగాయి. ఈ వారం పదిరోజుల్లోనే అనుకోకుండా ఊరిలో కొన్ని మరణాలు సంభవించాయి. ఇంకా కొంతమంది బాగా నీరసపడి చావుకు సిద్ధంగా ఉండడంతో ఊరంతా భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆ విషయమై ఊరి పెద్దలంతా కలిసి, సర్పంచ్ గారి ఇంటి దగ్గర సమావేశమయ్యారు.
‘మనూరుకేదో గాలి సోకినట్లుంది. ఇలా వరుసగా చావులు మనూళ్ళో ఎప్పుడైనా చూశామా!? ఇలాగే చూస్తూ కూర్చుంటే ఇక ఊళ్ళో ఒక్కడు కూడా మిగలడు! ఈ ఊరికి పట్టిన పీడ పోవాలంటే ఎవర్నైనా మంత్రగాడ్ని తీసుకురావాల్సిందే!’ అన్నాడు అక్కడికొచ్చిన ఓ పెద్ద. అతని మాటలకు అక్కడున్న మిగతావారు ఏకీభవించారు.
అంతే! ఊళ్ళో చందాలు భారీగా పోగయ్యాయి. సర్పంచ్ ఆధ్వర్యంలో ఆఘమేఘాలపై ఆ ఊరికి చుట్టూ పదహారు పరగణాల్లో బాగా పేరొందిన మంత్రగాడు రప్పించబడ్డాడు. అతని కోరికమేరకు ఊరి పొలిమేరలో ఉన్న ఓ చిన్న పాడుబడిన ఇంట్లో ఉండటానికి ఏర్పాట్లు చేశారు ఊరి ప్రజలు.
ఆనోటా ఈనోటా ఈ విషయం నా చెవిన పడింది. ఆ క్షణంలో వాళ్ళ మూర్ఖత్వపు ఆలోచనలకి ఎలా స్పందించాలో అర్థంకాలేదు నాకు. ఎందుకంటే అది చాలా సున్నితమైన అంశం! వాళ్ళ మనోభావాలకు ఎదురుతిరిగి మాట్లాడితే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు!
ఊరిలో అనారోగ్యంతో బాధపడుతున్న మిగతా పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ ఇస్తూ వున్నాను. కానీ వారు నాకంతగా సహకరించడం లేదు. ఊరి ప్రజలు నా మీద కంటే వచ్చిన మంత్రగాడిపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు.
వచ్చిన మొదటిరోజే ఊరు మొత్తం చుట్టొచ్చాడు ఆ మంత్రగాడు. ఆ రాత్రికే ఊరుకి సంబంధించి పూజలు జరపాలని అతను చెప్పినప్పుడు, అందుకు తగు ఏర్పాట్లు ఊరి పొలిమేరలో పాడుబడిన ఇంట్లో అతనికి అనుగుణంగా చేశారు ఊరి పెద్దలు.
అర్ధరాత్రి దాటింది. పాడుబడ్డ ఇంటిముందు ఎర్రని పెద్ద మంట భగ్గుమని ఎగిసిపడడం ఊరి ప్రజలు గమనించారు. ఆ సమయంలో ఆ ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు ఒక్క వ్యక్తి తప్ప!
అంత చీకట్లో ఆ వ్యక్తి మంత్రగాడు ఉంటున్న ఇంటి దిశగా వెళ్ళడం నా కంటపడింది. తన కార్యక్రమం ముగించుకుని, రాత్రి మూడో జాములో సర్పంచ్ ఇంటికి చేరుకున్నాడు మంత్రగాడు. అతని రాకతో అంతవరకు అక్కడే వేచి చూస్తున్న ఊరి ప్రజలు అతనేం చెబుతాడోనని ఉద్విగంగా చూడసాగారు.
‘ఊళ్ళో చావులకి కారణమేమైనా తెలిసిందా..!?’ ఆతృతగా అడిగాడు సర్పంచ్. కాసేపు కళ్ళు మూసుకుని, తెరిచాడు ఆ మంత్రగాడు. ఆ తర్వాత ‘అంతా తెలిసింది. మీ ఊరికి చేతబడి అరిష్టం పట్టింది. మీ ఊరివాడే తన చేతబడి మంత్రంతో మీ ఊరిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అందుకే ఈ చావులన్నీ! నేను రాకపోయి వుంటే ఊళ్ళో ఇంకొన్ని చావులు మీరు చూసేవారు!’ అని చెప్పడంతో- ఊరి ప్రజలంతా ఒక్కసారిగా భయంతో మ్రాన్పడిపోయారు. వాడెవడో తెలిస్తే అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపోద్రిక్తులయ్యారు.
‘ఎవడాడు…?’ ముక్తకంఠంతో అడిగారు అక్కడికొచ్చిన వాళ్ళు. ‘ఊరి చివరన పూరిపాకలో ఉన్నాడు!’ చెప్పాడు మంత్రగాడు. అంతే! అక్కడ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎందుకంటే? ఊరి చివరన పూరిపాకలో ఉన్నదెవరో అందరికీ తెలుసు!
చిట్టెమ్మ వచ్చి వెళ్ళాక హడావుడిగా ఊళ్ళోకి బయలుదేరాను. నేనెళ్ళేసరికి ఊరి మధ్యనున్న రచ్చబండ దగ్గర ఊరి జనం గుమిగూడి ఉన్నారు. ఏం జరిగుంటుందోనని జనం మధ్యలోంచి ముందుకెళ్ళిన నేను స్థాణువైపోయాను. హృదయవిదారకమైన దృశ్యం. అది చూసాక నా గుండె తరుక్కుపోయింది. ఎదురుగా రచ్చబండ మధ్యలోనున్న గుంజకు చిట్టెమ్మ తండ్రి అసిరయ్య కట్టేయబడి వున్నాడు. అతని మొహమంతా చిట్లిన గాయాలతో రక్తమోడుతూ వుంది. వేలాడుతున్న అతని శరీరంపై ఇంకో దెబ్బ పడితే చనిపోయేటట్లు ఉన్నాడతను. అతని పక్కనే శోకదేవతలా ఏడుస్తూ, చేతులతో తలకొట్టుకుంటూ చిట్టెమ్మ కనిపించింది. చుట్టూ చూశాను. కానీ ఆ సమయంలో నాకు అక్కడున్నవారి కళ్ళల్లో కొంచెం కూడా జాలి కనపడలేదు. దాంతో అక్కడ జరుగుతున్న పరిస్థితిని అర్థంచేసుకుని, తదుపరి అక్కడ జరగబోయేదేమిటో ఊహించి, జేబులోంచి మొబైల్ తీసి ఓ నెంబర్‌కి కాల్ చేశాను.
‘మీకేమైనా పిచ్చి పట్టిందా! ఎవడో మంత్రగాడు చెప్పాడని నమ్మి. చేతబడి అనే నెపంతో ఇలా అభం శుభం తెలియనివాళ్ళని అమానుషంగా హింసిస్తే.. మీ అందరిపై కేసు బుక్ చేసి, బొక్కలో వేస్తారు పోలీసోళ్ళు!’ ఉవ్వెత్తున కోపం రావడంతో అక్కడున్నవాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా అన్నాను.
‘ఎల్లెల్లవయ్యా… పెద్ద నీతి కబుర్లు చెప్పొచ్చాడు.. ఇలాంటివాడ్ని బతకనిస్తే ఊరికే అరిష్టం..’ అంటూ చేతిలో ఉన్న దుడ్డుకర్రని పైకెత్తి, తాగిన మైకంలో అసిరయ్యపైకి రాబోతున్న సూరిగాడ్ని వేగంగా ముందుకెళ్ళి వెనక్కి నెట్టేసాను. ఊరి వాళ్ళకి నాపై అభిమానం ఉన్నప్పటికీ, ఆ చర్యకు కోపంతో ఊగిపోయిన కొందరు నాపై దాడికి దిగారు. అయితే నేను కాస్త ఎదిరించడంతో అక్కడ కొంతసేపు తోపులాట జరిగింది. ఈలోగా అక్కడకి పోలీసు జీప్ వచ్చి ఆగింది. అందులోంచి దిగిన పోలీసులు దొమ్మీగా ఉన్న జనాల్ని చెదరగొట్టి, గుంజకు కట్టేసిన అసిరయ్యను ఆ కట్ల నుంచి విడిపించారు. అప్పటికే అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. అది చూసి.. ఏడుస్తూ వెళ్లి తండ్రికి సపోర్టుగా అతని చేతుల్ని తన భుజాలపై వేసుకుని నడిపిస్తూ, రచ్చబండ చివరికి తీసుకొచ్చి, కూర్చోబెట్టి అతనికి నీళ్ళు పట్టించింది చిట్టెమ్మ.
‘ఈ ముసలాయన్ని ఎందుకలా రక్తమోడినట్లు కొడుతున్నారు..? అసలిక్కడ ఏం జరుగుతోంది…?’ అక్కడున్న ఊరి ప్రజలనుద్దేశించి గద్దిస్తున్నట్లు అడిగాడు ఎస్సై. ఎవ్వరూ నోరు మెదపలేదు భయంతో.
నేను మాత్రం ఆ ఊరిలో గత కొద్దిరోజులుగా జరిగిన, జరుగుతున్న పరిణామాల్ని ఎస్సైని కాస్త దూరంగా పిలిచి, కూలంకషంగా వివరించాను.
ఎస్సై పిలుపు మేరకు మరికొన్ని నిమిషాల్లో రచ్చబండ దగ్గరకు ఆ మంత్రగాడు రప్పించబడ్డాడు. అతడ్ని అక్కడలా చూసేసరికి షాక్ తిన్నాడు ఎస్సై. అక్కడ ఎస్సైని చూడగానే మంత్రగాడి ఒంట్లో ఫ్యూజులన్నీ ఎగిరిపోయాయి. ఇలా తను అడ్డంగా దొరికిపోతానని ముందుగా ఊహించలేకపోయాడతను. అయితే రచ్చబండపైకొచ్చిన మంత్రగాడి ఒళ్ళంతా చెమటలు పట్టడం రచ్చబండ ముందున్న ఊరి ప్రజల దృష్టిని దాటిపోలేదు.
‘దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి! మీరు మంత్రగాడిగా ఎంతో నమ్మకం పెట్టుకున్న వీడొక దొంగ నా…! డాకూగాడన్న మాట! దొంగతనం, మోసం, ఆడాళ్ళను లోబర్చుకోవడం ఇలాంటి చాలా నేరాల్లో వీడిపై కేసులున్నాయి. జైల్లో కొన్నాళ్ళు చిప్పకూడు కూడా తినొచ్చాడు. అయినా వీడికి బుద్ధి రాలేదు. కానీ ఆ విషయం మీకు తెలియక, వీడి ట్రాప్‌లో పడ్డారు. అయినా వాడి గురించి వాడు చెబితేనే బావుంటుంది..’ అంటూ ఆ మంత్రగాడివైపు తిరిగాడు ఎస్సై.
అప్పటికే ఆ మంత్రగాడి నోరు తడారిపోయి, నాలుక పిడచకట్టేసింది. అక్కడ తన పరిస్థితేమిటో తనకు అర్థమైపోయింది. ఊరి ప్రజలవైపు భయంభయంగా చూస్తూ.. ‘మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి. బుద్ధి గడ్డి తిని డబ్బు కోసం అందర్నీ మభ్యపెట్టి, మంత్రగానిగా చలామణీ అవుతున్నాను. నిజానికి నాకు ఎటువంటి మంత్రాలూ రావు. మూఢ నమ్మకమనే భయంతో నన్ను నమ్మి వచ్చినందుకు ఏదోటి చెప్పి, మీ నుండి డబ్బులు గుంజాలనుకున్నాను. అంతేగానీ నిజంగా ఆ ముసలాయనెవరో నాకు తెలీదు! రాత్రి పూజలు చేయాలని మీతో చెప్పి, ఆ పాడుబడ్డ ఇంట్లో మందు కొడుతున్నప్పుడు సూరిగాడనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. అప్పుడే నేను మంత్రగాడిని కాదన్న విషయం అతనికి తెలిసిపోయింది. ఆ విషయం బయటకు పొక్కకూడదంటే.. ఊరి చివరన పూరిపాకలో ఉన్న ముసలాడు చేతబడి చేస్తున్నాడని మీ అందరిముందు చెప్పమన్నాడు. తప్పించుకోడానికి నాకు వేరే దారి దొరకలేదు. అయినా ఎవడైతే నాకేంటి, నాక్కావాల్సింది డబ్బు. అందుకే అతను చెప్పినట్లు చేశాను!’ రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడా మంత్రగాడు.
ఆ తర్వాత ఆ ఊరి ప్రజలు దొంగ మంత్రగాడిపై కేసు పెట్టడంతో జీపులో ఎక్కించుకుని, స్టేషన్‌కి తీసుకుపోయాడు ఎస్సై. వాళ్ళలా వెళ్ళిన మరుక్షణమే సూరిగాడ్ని వెదికి పట్టుకుని, ఎముకల్లో సున్నం లేకుండా చేశారు కోపంతో అక్కడున్నవాళ్ళు. ఆ సందర్భంలో చిట్టెమ్మ వచ్చి కృతజ్ఞతగా నా కాళ్ళు తాకబోతుంటే వారించాను. జరిగిన దానికి ఆ పల్లె ప్రజలంతా బాధపడ్డారు. అప్పటిదాకా వారి మనస్సుల్లో అతుక్కుపోయిన మూఢనమ్మకపు మబ్బు ఆ సంఘటనతో కరిగిపోయింది. మూఢ నమ్మకమనే దుర్గంధం తొలగి, ఆ పల్లె మానవత్వపు పరిమళాల్ని వెదజల్లింది.
పూజితా చరణ్
81795 78895