పిల్లల్ని పెంచడం నేటి పరిస్థితుల్లో సవాలుతో కూడుకున్నదే అంటున్నారు నిపుణులు. ప్రతి తల్లిదండ్రీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనే కోరుకుంటారు. అందుకోసం అహర్నిశలు పాటుపడతారు కూడా. అయితే పేరెంటింగ్‌లో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని నిపుణుల అధ్యయనంలో తేలింది. ఈ పొరపాట్లు పిల్లల్లో పేరెంట్స్ పట్ల వ్యతిరేకత పెంపొందుతుందని చెప్తున్నారు. పిల్లలు పెరిగే కొద్దీ వారి ఆలోచనల్లో, ప్రవర్తనలో అనేక మార్పులు రావడం సహజం. అలాంటి మార్పులకు అనుగుణంగా పేరెంట్స్ వ్యవహరించాలనేది నిపుణుల మాట. అలా చేయకపోగా, తల్లిదండ్రులు ప్రవర్తించే తీరు పిల్లలకు వారి పట్ల శత్రుత్వం పెంచేలా చేస్తుందని చెప్తున్నారు. అవేంటో.. వాటిని ఎలా అధిగమించాలో నిపుణులు సూచిస్తున్నారు.
వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో అనేక మార్పులు వస్తుంటాయి. చాలాసార్లు తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు పిల్లల దృష్టిలో శత్రువులుగా మార్చివేస్తుంటాయి. ముఖ్యంగా పిల్లల వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రులు వారితో ప్రవర్తించే తీరు సరిదిద్దుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
భావోద్వేగాలు అర్థం చేసుకోవాలి..
పిల్లలు పెరిగే క్రమంలో వారిలో శారీరకంగానే కాకుండా మానసికంగా అనేక మార్పులు వస్తుంటాయి. పిల్లలే వీటిని ఆకళింపు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆ టీనేజ్ వయస్సులో ప్రేమ, ఆకర్షణ, మమకారం, అసూయ, ఎవరిపైనైనా తీవ్రంగా స్పందించడం వంటి భావోద్వేగాలు ప్రస్ఫుటంగా వెల్లడవుతాయి. ఆ తరుణంలో ఈ పరిస్థితిని విస్మరించి, తల్లిదండ్రులు తమదైన తీరులోనే వ్యవహరిస్తుంటారు. అలాంటప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో దూరంగా ఉండటం ప్రారంభిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో వారి అవస్థలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలని, ఆ చికాకు నుంచి బయటపడటానికి సహకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అడ్డుకోవడమే పనిగా..
పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలనే ఆలోచనతో తల్లిదండ్రులు వాళ్లు చేసే ప్రతిదాన్నీ అడ్డుకోవడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేసేకన్నా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని సూచిస్త్తున్నారు. ముఖ్యంగా పిల్లలు పెరిగే క్రమంలో వారు కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ అడ్డుకుంటుంటారు కొందరు తల్లిదండ్రులు. ‘ఎక్కడికి వెళ్తున్నావ్.. ఏం చేస్తున్నావ్.. ఏం తింటున్నావ్..’ ఇలా ప్రతిసారీ ప్రతి సందర్భంలోనూ పిల్లల్ని పదే పదే ప్రశ్నించకూడదని నిపుణులు చెప్తున్నారు. ప్రతిదీ తల్లిదండ్రులకు చెప్పే చేయాలని, వారి కనుసన్నల్లోనే మెలగాలని ఆంక్షలు పెట్టొద్దని చెప్తున్నారు. పిల్లలు సొంతగా తీసుకున్న నిర్ణయాలు మీతో పంచుకునే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు. వాళ్లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలని పేరెంట్స్ వద్ద వెల్లడించగలగాలి. వాళ్లు తీసుకున్న నిర్ణయాలు సహేతుకంగా ఉన్నాయో లేదో చూసి, సరిగ్గా ఉంటే అభినందించాలి. లేకపోతే సరిజేసుకోవాల్సిన అంశాలుంటే తెలియజేయాలి అంటున్నారు నిపుణులు. అలా చేయకపోతే పేరెంట్స్ అతి జోక్యానికి పిల్లలు చికాకు పడిపోతారని చెప్తున్నారు.
ఇష్టాల్ని రుద్దొద్దు..
మన ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దడం ప్రారంభిస్తే వాళ్లు సానుకూలంగా ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు. పిల్లలు పెరిగే క్రమంలో కొన్ని అభిరుచులు అలవర్చుకుంటారు. ఆ క్రమంలో స్వంత గుర్తింపు కోసం వాళ్లు తపన పడుతుంటారు. తమ ఇష్టాయిష్టాలకే అధిక ప్రాధాన్యత
ఇస్తూంటారు. ఆ సమయంలో పేరెంట్స్ పిల్లల ఆలోచనలను, అభిప్రాయాలను, అభిరుచులను విస్మరించకూడదని చెప్తున్నారు. తల్లిదండ్రులకు నచ్చినట్లే పిల్లలు ఉండాలనే ధోరణి ప్రదర్శించడం వల్ల.. వారిలో వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.
పిల్లల వయస్సు పెరిగే క్రమంలో వారి ప్రవర్తనపై దృష్టి పెట్టాలని నిపుణులు చెప్తున్నారు. అయితే అది నిఘా వేసినట్లు ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు ఆ క్రమంలో అనేక సందేహాలు, గజిబిజిగా, చికాకుగా ఉంటారని అర్థంచేసుకోవాలని చెప్తున్నారు. పేరెంట్స్ పిల్లల్ని పర్యవేక్షిస్తూ ఉండాలని అంటున్నారు. ఆ సమయంలో వారి ఆత్మగౌరవాన్ని గౌరవించాలి. అలాగే వారిపై చీటికీమాటికీ అరవడం, అందరి ముందూ కోప్పడ్డం చేయకూడదని చెప్తున్నారు. అలా ప్రవర్తిస్తే తల్లిదండ్రులకు వారు గౌరవం ఇవ్వకపోగా, విలన్స్‌లా చూస్తారని హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులుగా పిల్లలకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం వారి బాధ్యత. అయితే పిల్లల అభిప్రాయాలు కూడా అడగాలి. అలాగే తల్లిదండ్రులు తాము తీసుకున్న నిర్ణయానికి పిల్లలు ఆమోదయోగ్యంగా ఉన్నారో తెలుసు కోవాలి. తమ నిర్ణయాన్ని పిల్లలతో ఒప్పించే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు నిపుణులు. పిల్లలకు నచ్చే పనులను అడ్డుకోకుండా, పేరెంట్స్ ఇష్టాల్ని రుద్దకుండా వారితో సున్నితంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నారు. అప్పుడే వారి మధ్య అనుబంధం పెరుగుతుందని అంటున్నారు.