ఈ విషయాలు ఓపెన్‌గానే మాట్లాడాలి !

Feb 2,2025 09:20

పిల్లలు ఎక్కడ వింటారో అని.. వినకుండా కొన్ని విషయాలు తల్లిదండ్రులు మెల్లగా మాట్లాడుకుంటుంటారు. చాలా విషయాలు పిల్లలకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. వాస్తవంగా పిల్లల ముందు పెద్దలు అన్నివిషయాలూ మాట్లాడకూడదు. అంటే కొన్ని విషయాలు మాట్లాడొచ్చనే కదా! అయితే ఆ కొన్ని మాట్లాడేటప్పుడు పిల్లల ముందే కావాలని మాట్లాడమని చెప్తున్నారు నిపుణులు. అవును నిజమే కొన్ని విషయాలు పిల్లల చెవినపడితేనే మంచిదంటున్నారు. అవేంటో నిపుణులు వివరిస్తున్నారు..

ప్రతి తల్లితండ్రీ తమ పిల్లల్ని ఉత్తమంగా, ఉన్నతంగా తీర్చిదిద్దాలనే అనుకుంటారు. పిల్లలకు మంచి విలువలు నేర్పిస్తుంటారు. తాము చేసేదే, మాట్లాడేదే పిల్లలు నేర్చుకుంటారని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ కొన్ని విషయాలు మాత్రం పిల్లలు వింటే ఎలా అర్థం చేసుకుంటారోనని తల్లిదండ్రులు సందేహిస్తుంటారు. పిల్లల్ని పక్కకి వెళ్లి ఆడుకోమని, ఏదో ఒక నెపంతో అక్కడి నుంచి పంపేసి మరీ చాలా మెల్లగా మాట్లాడుకుంటుంటారు. అయితే పిల్లలకు కొన్ని విషయాలు తెలిసేలా మాట్లాడితేనే మంచిదంటున్నారు నిపుణులు.

సమస్య పరిష్కారం..
ఏదైనా సమస్య ముందుకొచ్చినప్పుడు.. దాన్నుంచి బయటపడటానికి తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతుంటారు. ఆందోళన చెందుతుంటారు. అనేకరకాలుగా చర్చిస్తుంటారు. అయితే ఇదంతా తాము మాత్రమే చేస్తుంటారు. అయితే ఇవన్నీ పిల్లల ముందే చర్చించమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సమస్య వచ్చినప్పుడు సంప్రదించాలని, చర్చించుకోవాలని, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందనేది వారికి అవగాహన అవుతుందని అంటున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్లకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు బెంబేలు పడిపోకుండా, ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చర్చిస్తారని చెప్తున్నారు.

మెచ్చుకోవడం..
పిల్లల్ని కొందరు తల్లిదండ్రులు నేరుగా అభినందించరు. వేరే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడుగానీ, లేదా ఏదైనా ఫంక్షన్‌లోగానీ పిల్లల గురించి చాలా మంచిగా చెబుతుంటారు. అయితే ఇవి కూడా పిల్లలు వింటే పాడైపోతారని కొందరు తల్లిదండ్రులు భయపడుతుంటారు. కానీ వాస్తవానికి పిల్లలు వినేలా వేరే వారికి మెచ్చుకుంటూ చెబితే పిల్లల ఆత్మస్థయిర్యం పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. పిల్లలు మానసికంగా బలంగా తయారవుతారని చెప్తున్నారు. పిల్లలకు ఇలా వినేలా వారిని మెచ్చుకుంటే వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదంటున్నారు.

భావోద్వేగాలు..
తల్లిదండ్రులకు కూడా కొన్ని సందర్భాల్లో బాధ కలుగుతుంది. అయితే పిల్లల ముందు అలాంటి విషయాలు వ్యక్తపరచకూడదని అనుకుంటుంటారు. కానీ తల్లిదండ్రులు తమకు కలిగిన బాధల్ని, కష్టాల్ని కూడా పిల్లలకు తెలిసేలా మాట్లాడుకోవాలని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల కష్టాలు ఎవరికైనా వస్తాయని, మనసుకు బాధ కలుగుతుందనే విషయం వారికీ అవగాహన అవుతుందని చెప్తున్నారు. దీనివల్ల వారికేదైనా కష్టమో, బాధో కలిగితే కంగారుపడిపోరు. అలాగే ఆ బాధను తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరుస్తారు. అప్పుడు వారికి ఓదార్పును ఇస్తూనే, ధైర్యం చెప్పాలి. ఇవన్నీ పిల్లలకు ఒకరకంగా జీవనపాఠాలే.

క్షమాపణ కోరడం..
పేరెంట్స్‌ అంటే నూటికి నూరుశాతం కరెక్ట్‌ అనుకుంటారు పిల్లలు. కానీ ఒక్కోసారి పెద్దలైనా పొరపాట్లు, తప్పులు చేయడం సాధారణమే. పిల్లలకు సంబంధించి తప్పులు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఎలాంటి భేషజాలకూ పోకుండా పిల్లలను క్షమాపణ కోరాలని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలనే సుగుణం పిల్లలకు కూడా అలవడుతుందని అంటున్నారు. పొరపాట్లు జరుగుతుంటాయి.. వాటిని సరిదిద్దుకుని, ముందుకు పోవాలని కూడా అర్థంచేయగలగాలి అంటున్నారు.

ధైర్యంగా నిలబడడం..
అనుకోని సంఘటనలు ఇంట్లోగానీ, బయటగానీ జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం పిల్లల ముందే జరిగితే అది వారి మైండ్‌లో నాటుకుపోతుంది. కొందరు ఏదైనా సంఘటన జరగగానే పిల్లల్ని దూరంగా తీసికెళ్లడానికో, ఏదైనా గదిలో ఉంచడానికో చూస్తుంటారు. అలాకాకుండా పిల్లలు ప్రత్యక్షంలోనే ఉండాలంటున్నారు. అలాగనీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో కాదనేది దృష్టిలో ఉంచుకోవాలనీ సూచించారు. ఆయా పరిస్థితులని తల్లిదండ్రులు ఎలా ఎదుర్కొంటున్నారో పిల్లలకు అవగాహన చేసుకోవడానికి వీలవుతుందని చెప్తున్నారు.

➡️