ప్రసవమయిన తర్వాత కొన్ని రోజులపాటు తేలికగా జీర్ణమయ్యే, బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. అలాంటప్పుడే తల్లిపాలు బిడ్డకు సరిపోతాయి. పాలు, నెయ్యి, బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్, బీట్‌రూట్, బెండ లాంటి పదార్థాలు తేలికగా జీర్ణమవుతాయి. పళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. కారం, మసాలాలు తగ్గించడం అనేకంటే లేకపోతేనే మంచిది. అవే కాక బాలింతలకు సహజంగా వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలగడానికి.. బిడ్డకు పాలు పడడానికి.. శారీరక ఇబ్బందులు తొలిగేందుకు తోడ్పడేలా ఆహారం ఉండాలి. అందుకోసం కొన్నింటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా!
గోంద్ లడ్డు..
కావలసినవి : గోంద్- 1/4 కప్పు, బాదం పప్పు- కప్పు, జీడిపప్పు- కప్పు, బెల్లం పొడి- 2 కప్పులు, నెయ్యి- కప్పు, గోధుమ పిండి- 2 కప్పులు, యాలుకల పొడి- 1/2 స్పూను
తయారీ : ముందుగా బాండీలో రెండు స్పూన్ల నెయ్యి వేడి చేసి, గోంద్‌ను కొంచెం కొంచెం వేయించుకుని (సగ్గుబియ్యం వేగినట్లు పువ్వుల్లా తెల్లగా వస్తాయి) గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని పప్పుగుత్తితో మెదిపి పక్కనుంచాలి. తర్వాత బాదం, జీడిపప్పు విడివిడిగా వేయించుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. బాండీలో ఇంకొంచెం నెయ్యి వేడి చేసి, గోధుమ పిండి రంగుమారి, సువాసన వచ్చే వరకూ వేయించాలి. చల్లారిన బాదం, జీడిపప్పులను కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పుల పొడిని, మెదిపిన గోంద్‌ను, బెల్లం పొడిని గోధుమపిండిలో వేసి, బాగా కలపాలి. ఈ మిశ్రమంలో సరిపోను కాచిన నెయ్యి పోసి, ఉండలుగా చుట్టుకోవాలి. ఈ పోషకాల లడ్డూతో బాలింతలకు రోజుకు ఒకటి పెట్టాలి.
లడ్డూ..
కావలసినవి : రాగులు- 5 స్పూన్లు, సోంపు- 4 స్పూన్లు, మెంతులు-5 స్పూన్లు, శొంఠి పొడి- స్పూను, గసగసాలు- 2 స్పూన్లు, బాదం- 20, పిస్తా- 20, కిస్‌మిస్- 20, ఎండుకొబ్బరి పొడి- 4 స్పూన్లు, గోధుమపిండి- 6 స్పూన్లు, బెల్లం పొడి- 1/4 కేజీ, యాలకుల పొడి- 1/2 స్పూను
తయారీ : రాగులు, సోంపు, మెంతులు, శొంఠి పొడి, గసగసాలు విడివిడిగా దోరగా వేయించి, పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. బాండీలో రెండు స్పూన్ల నెయ్యి వేడి చేసి బాదం, పిస్తా, కిస్‌మిస్, ఎండుకొబ్బరి పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి, దోరగా వేయించుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా తయారుచేసుకున్న పొడిలో కలపాలి. అదే బాండీలో గోధుమపిండిని కూడా దోరగా వేయించాలి. ఈ గోధుమ పిండి, బెల్లం పొడి (ఇష్టాన్ని బట్టి మోతాదు వేసుకోవచ్చు), యాలకుల పొడిని కూడా ఈ మిశ్రమానికి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. దీనిలో కాచిన నెయ్యి వేసి, లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటివల్ల బాలింతలకు పాలు సమృద్ధిగా పడతాయి.
బాలింత కాయం..
కావలసినవి : శొంఠి-అంగుళం, మిరియాలు-15, వాయు విడంగాలు-15, కరక్కాయలు-5, లవంగములు-6, జాజికాయలు-5, జాపత్రి-15 పువ్వులు, యాలకులు-15, పిప్పళ్ళు-15, తానికాయ-5, వాము-స్పూను, తాళిసపత్రి-స్పూను, అతిమధురం-అంగుళం పొడవువి 15 , తోక మిరియాలు-15
తయారీ : పైన చెప్పిన శొంఠి, మిరియాలు, వాయు విడంగాలు, కరక్కాయలు, లవంగాలు, జాజికాయలు, జాపత్రి, యాలకులు, పిప్పళ్లు, తానికాయ, వాము, తాళిసపత్రి, అతిమధురం, తోక మిరియాలు విడివిడిగా దోరగా వేయించుకోవాలి. వీటిని సరిపడా నీళ్లు పోసి, ముద్దగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ముద్దను కుంకుడు గింజంత ఉండలుగా చేసి ఆరబెట్టాలి. చెమ్మ పూర్తిగా పోయిన తర్వాత సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి. వీటినే బాలింత కాయం అంటారు.
వెల్లుల్లి కారం..
కావలసినవి : వెల్లుల్లి రెబ్బలు-20, ఎండుమిర్చి-8, కరివేపాకు-6 రెమ్మలు, ధనియాలు-కప్పు, జీలకర్ర-2 స్పూన్లు, చింతపండు, ఉప్పు- తగినంత
తయారీ : ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దోరగా వేయించుకోవాలి. జార్‌లో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు, ఉప్పు, వేయించుకున్న దినుసులు వేసి మిక్సీ పట్టుకోవాలి. రోట్లో దంచుకునే సదుపాయం ఉంటే మరీ మంచిది. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ వెల్లుల్లి కారం వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసి రెండు ముద్దలు రోజూ తింటే, నోటికి అరుచి పోతుంది.