కజిన్స్‌తో కలిసికట్టుగా..

Sep 29,2024 08:30 #Parenting, #Sneha

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అందరూ ఒకదగ్గరే కలిసిమెలిసి పెరిగేవారు. ఆ ప్రేమాభిమానాలే వేరు. పెదనాన్న-పెద్దమ్మ, బాబాయి-పిన్ని పిల్లలతో కలిసి ఆడుకోవడం, అందరూ కలిసి తినడం ఒక అపురూపం. అలాగే మేనమామలు, మేనత్తల పిల్లలు కూడా ఏదో ఒక సందర్భంలో కలిసే వాళ్లు.. వాళ్లందరూ ఒకరినొకరు చతుర్లాడుకుంటూ.. సరదాగా ఉండేవారు. ఇలా కజిన్స్‌తో ఉండే మధురానుభూతులు చెప్పనలవి కావు. తోడబుట్టిన వారితో ఎంత ప్రేమాభిమానాలతో ఉంటామో, కజిన్స్‌తోనూ అంతే ప్రేమగా ఉండేవారు. కానీ ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్న కొద్దీ.. ఈ అనుబంధాలూ పలుచనపడిపోతున్నాయి. వాటిని మళ్లీ పునర్నిర్మించుకోవాలంటే కొన్ని మార్గాలు అనుసరించాలని చెప్తున్నారు నిపుణులు.

ప్రస్తుత పరిస్థితుల్లో చదువులు, పెళ్ళిళ్లు, ఉద్యోగాలు తదితర కారణాలతో ఊర్లో ఉండేది తక్కువే. ఇంకా చెప్పాలంటే ఏదో ఒక రాష్ట్రంలోనో, కొందరైతే వేరే దేశాల్లో ఉంటున్నారు. ఇలా తీరిక లేని విధంగా మన జీవనశైలిలో అనేక మార్పులు వచ్చేశాయి. కొందరు ఫోన్లు ద్వారా వీడియో కాల్స్‌ చేసుకుంటున్నా.. అవీ అంతంతమాత్రపు అనుబంధాలే. కనీసం ఫోనుల్లో సైతం పలకరించుకోలేని జీవన వేగంలో కొట్టుకుపోతున్న పరిస్థితులే. కానీ వీటిని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అనుబంధాలు అయినవారి మధ్య కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ ప్రపంచీకరణతో ప్రపంచం అంతా ఒక దగ్గరే ఉన్నట్టు భ్రమలో గడిపేస్తున్నాం. కానీ అదే ప్రపంచీకరణ మన నుంచి నేను వరకూ తెచ్చేసింది. అందుకే మనందరం కలిసి అనుబంధాలను పునర్నిర్మించుకుందాం. అందుకోసం నిపుణులు చెప్తున్న మార్గాల్ని అనుసరిద్దాం.. అప్పుడైనా ఒకరితో మరొకరం కలివిడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందాం.

సమయం కేటాయించడం..
మనం ఎక్కడెక్కడో ఉన్నా, ఫోన్లు మనందర్నీ కలిపి ఉంచుతాయనేది వాస్తవం. అందుకే వారానికో, రెండు రోజులకోసారో ఒక సమయం కేటాయించుకోండి. ఆ సమయంలో ఫోన్‌ చేసి, ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడండి. వీలయితే వీడియో కాల్‌ చేసి, ఒకర్నొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ.. మరింత దగ్గరగా ఉన్న ఫీల్‌ కలుగుతుంది. కజిన్స్‌తో అనుబంధానికి ఇదో మార్గం అంటున్నారు నిపుణులు. వీలైనప్పుడు మాట్లాడుతున్నాం గదా, ఎక్కడైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కలుస్తున్నాం కదా అని కొట్టిపారేయకండి. అలా కలిసినప్పుడు మాట్లాడుకోవడం వేరు. ఇలా తప్పనిసరిగా, ఓ క్రమంలో మాట్లాడుకోవడం వేరు. వీలయితే అందరూ కలిసి కాన్ఫరెన్స్‌ కాల్స్‌ చేసుకుంటే ఇంకా మంచిది. అందరూ కలిసి ఒకచోట ఉన్నట్లు అనిపిస్తుంది. వాట్సాప్‌ కాల్స్‌ అయితే ఎలాగో నెట్‌ సాయంతోనే అందుకే అందరం సరదాగా మాట్లాడుకుంటూ, ఆట పట్టించుకోవచ్చు కూడా. ఇదీ చెప్పాలా అనిపిస్తుంది కదా.. కానీ మనం ఆచరించడం లేదన్నది అంతే వాస్తవం. ఇలా కజిన్స్‌తో కలిసిమెలిసి మాట్లాడుకుని చూడండి.. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఇవే కదా.. తర్వాతర్వాత మనకు మిగిలే మధుర జ్ఞాపకాలు. జరిగిపోయిన కాలం ఎలాగో తిరిగి తేలేము.. ఇప్పుడైనా.. అందరం కలిసిమెలిసి ఉంటే ఆ ఆనందమే వేరు.

మెసేజ్‌లు.. లెటర్స్‌..
ఒకప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్లు. ఇప్పుడు ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చాక మెసేజ్‌లు చేస్తున్నారు. కానీ వాట్సప్‌ వంటి వాటిల్లో సుదీర్ఘంగానూ మెసేజ్‌లు పెట్టుకుంటున్నారు. ఏదేమైనా సాంకేతిక అభివృద్ధిలో సోషల్‌ మీడియా అనుబంధాలను పెనవేసుకోవడానికి వీలవుతుంది. అయితే వాటిని సద్వినియోగం చేసుకుంటే సార్థకత. అందుకే కజిన్స్‌తో ఈ వేదికల ద్వారా తరచూ టచ్‌లో ఉంటే.. అనుబంధాల్ని అల్లుకోవచ్చు. మనసుల్లోని భావోద్వేగాల్ని, అభిరుచుల్ని, అనుభూతుల్ని ఆయా సందర్భాల్లో మెసేజ్‌ల రూపంలో పంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఈ మధ్య బోలెడు లెటర్‌ టెంప్లెట్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. మన భావాల్ని అందులో పొందుపరచవచ్చు. లేదంటే సృజనాత్మకంగా చిన్న షార్ట్‌ చేసి పంపుకోవచ్చు. గతంలో లేఖలు రాస్తే అవి చేరడానికి, అవి చదివి వారు రిప్లరు ఇవ్వడానికి కొంత సమయం పట్టేది. ఇప్పుడు ఈ సాంకేతికతతో క్షణాల్లో మన సందేశాలు, అభిమానాలు చేరిపోతున్నాయి. ఇవన్నీ కజిన్స్‌ మరింత దగ్గరవ్వడానికి సోపానాలే అంటున్నారు నిపుణులు.

గేదరింగ్‌ అవసరం..
ఏదో ఒక అకేషన్‌ సందర్భంలో కజిన్స్‌ అందరూ ఒక దగ్గర గేదర్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకుంటే ఆ సందడే వేరు. అలాంటి సందర్భాల్లో అందరూ ఒకచోట కలిసి ఎంజారు చేస్తే ఆ ఆనందమే వేరబ్బా.. ఎవరిదైనా ఫంక్షనో, పెళ్లో జరిగితే కలిసినా అంతగా మాట్లాడుకోవడానికి వీలుకాదు. అదే కజిన్స్‌ మాత్రమే కలిసేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే అందరూ కలిసి అనేక విషయాలు పంచుకోవడానికి వీలవుతుంది. ఆ సందర్భంగా ఒకర్నొకరు టీజ్‌ చేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం భలే బాగుంటుంది. ఒకరి గురించి ఒకరికి దగ్గరగా అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకోవ డానికీ వీలు కుదురుతుంది. అందుకే ఇలాంటి అకేషన్స్‌ అవసరం అంటున్నారు నిపుణులు. ఇలాంటి గేదరింగ్స్‌ అప్పుడప్పుడూ ఏర్పాటు చేసుకోవడం, ఆయా సందర్భాల్లో జరిగిన మధుర జ్ఞాపకాల్ని ఈ లోపు నెమరవేసుకుంటూ ఉంటే ఆ కిక్కే వేరు.

కష్టసుఖాల్లోనూ..
ఇలా ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు కష్టసుఖాలు పంచుకునే ఇంటిమసీ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఒకరికొకరు సహకరించుకోవడానికి, సహాయం చేసుకోవడానికి తోడ్పడుతుంది. కజిన్స్‌ మధ్య తోడబుట్టిన వారికన్నా ఎక్కువ అనుబంధం ఏర్పడితే, అవసరమైన ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమించే అనుబంధాలు ఏర్పడతాయనడంలో సందేహం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అనుబంధాలే ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు నిపుణులు. మనుషుల మధ్య మానవ సంబంధాలు అంతరించిపోతున్న దానికి ఇలాంటి అనుబంధాలను నిర్మించుకోవడం మంచి పరిణామం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కజిన్స్‌తో ఏర్పడిన స్నేహం వల్ల ఓపెన్‌గా చెప్పుకోగలుగుతారు. అలాంటి సమయాల్లో ఒకరికొకరు సహాయం అవసరం. సమస్యల్ని సులువుగా అధిగమించడానికి వీలవుతుంది.

సర్‌ప్రైజెస్‌ చేయండి..
ఈ విధంగా కజిన్స్‌ అనుబంధాల పందిరి వేసుకున్నాక.. అప్పుడప్పుడు ఒకరికొకరు సర్‌ప్రైజెస్‌ చేసుకోండి అంటున్నారు నిపుణులు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు అకేషన్స్‌ గుర్తు పెట్టుకుని ఆయా సందర్భాల్లో వారికి సర్‌ప్రైజ్‌ చేయొచ్చు. వాళ్లు వేరే దేశంలో ఉంటే ఆన్‌లైన్‌లో వారికి అత్యంత ఇష్టమైనవి అందేలా ఏర్పాటు చేయొచ్చు. వేరే రాష్ట్రంలో అయితే వీలుచేసుకుని ఆరోజు వారి దగ్గరకు వెళ్లగలిగితే అదే ఒక సర్‌ప్రైజ్‌గా నిలిచిపోతుంది. ఇక దగ్గర దగ్గర ఊళ్లలో అయితే, చాలా సర్‌ప్రైజెస్‌ చేయొచ్చు. అది ఇక మీకున్న సృజనను బట్టి ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇవన్నీ ఒకరి పట్ల ఒకరి ప్రేమాభిమానాలను వ్యక్తపరచుకునే సందర్భాలుగా కలకాలం నిలిచిపోతాయి. మీ అనుబంధం చిరస్థాయిగా ఉండిపోతుంది.

➡️